260
0

స్నేహం విలువ  

260

రాకేష్ రాకేష్ పొద్దున్నే అమ్మపిలుపు నిద్రలో ఉన్న నాకు ఎక్కడో వినిపిస్తోంది. రేయ్ రాకేష్ ఏంట్రా ఇంకా నిద్ర లేవకుండా , ఇవాళ ఏంటో మర్చిపోయావ. లే నాన్న లేచి రెడీ అవ్వు నువ్వు ఆశ్రమం వెళ్ళాలి. ఇవాళ నీ స్నేహితుడు శ్రీను , అమ్మ మాట పూర్తి కాక ముందే ఒక్కసారిగా నిద్రలో నుండి మెలకువలోకి వచ్చాను. వెంటనే బాత్రూంకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకున్నాక స్నానం చేసి నా రూమ్ లోకి వచ్చాను. రాకేష్ రెడీ అయ్యవా అన్న అమ్మ పిలుపుకు అయ్యాను అమ్మ వస్తున్నాను అనిచెప్పి బయటకు వెళ్లి అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయటకు వచ్చి కారు తీసాను. కారును నేరుగా ఆశ్రమం వైపుకి మళ్లించాను. కారు అలా వెళ్తుండగా నా ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. మాది నెల్లూరు జిల్లా లోని బుచ్చిరెడ్డిపాలెం . నాన్న ప్రభాకర్ ప్రైవేట్ ఉద్యోగి. అమ్మ లత గృహిణి. నేను ఒక్కడినే సంతానం. ఒక్కగానొక్క బిడ్డను అయ్యేసరికి చాలా గారభంగా చూసుకునేవారు అమ్మ నాన్న. నాన్న గారు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని పైకి వచ్చిన వ్యక్తి. కష్టం విలువ తెలిసిన
వ్యక్తి ఐనందు వలన గారాభం చేసిన కష్టసుఖాల విలువ తెలిసేలా పెంచారు నన్ను. చిన్నతనం నుండి చదువులో ముందు ఉండేవాడిని. అన్నింటా మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకునేవాడిని.నా తల్లితండ్రులు కూడా చదువు విషయం లో ఏనాడు నాకు అడ్డుచెప్పలేదు. నాకు నచ్చిన విధంగానే ఉండేలా చూసుకునేవారు. ఇదిలా ఉండగా నా ఇంటర్మీడియట్ పూర్తి ఐనది . తరువాత ఇంజనీరింగ్ చేరడమే ఆలస్యం. నాకు ఇంజినీరింగ్ లో సివిల్ చేయాలన్నది కోరిక . నా అభిప్రాయం ఇంట్లో చెప్పాను . అమ్మ నాన్న ఒప్పుకున్నారు. తరువాత ఇంజినీరింగ్ చేరడం దిగ్విజయంగా పూర్తి చేయడం అన్ని చాలా త్వరగా జరిగిపోయాయి. ఇంజనీరింగ్ పూర్తి అయిన 6 నెలలకు గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న నాకు ఆ ప్రకటన చాలా సంతోషాన్ని ఇచ్చింది. అనుకున్నదే విధిగా నేను ఆ పరీక్ష రాయడం అందులో ఉత్తీర్ణత సాధించడం జరిగింది, నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మ నాన్న కూడా చాలా సంతోషించారు. ఇక నేను ఉద్యోగం ఎక్కడ చెయ్యాలో ఎంచుకోవలసిన సమయం వచ్చింది. మాది ఏమో నెల్లూరు జిల్లా , కానీ ఇక్కడే ఉద్యోగం దొరకాలి అంటే అది చాలా కష్టంగా మారింది. ఎట్టకేలకు నాకు ఉద్యోగంలో పోస్టింగ్ విజయవాడలో ఇచ్చారు. చిన్నతనం నుండి ఎప్పుడు అమ్మనాన్నను విడిచి ఉండని నాకు ఇప్పుడు వాళ్ళని వదిలి వెళ్లడం చాలా బాధగా అనిపించింది . ఇక తప్పక వెళ్లి నా డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిన సమయం వచ్చింది. అమ్మనాన్న తోడుగా వచ్చి నన్ను ఒక బాయ్స్ హాస్టల్లో జాయిన్ చేసి వెళ్లారు. నేను హాస్టల్లో జాయిన్ అయిన మరుసటిరోజే నేను విధులకు హాజరు అయ్యాను. ఆఫీసు బిల్డింగ్ బాగుంది కానీ లోపలకు అడుగు పెట్టిన తర్వాత నాకు కొంచెం బెరుకుగా అనిపించింది. ఎట్టకేలకు లోపలకు అడుగుపెట్టి నా పై అధికారి వుండే రూంకి వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకున్నాను ఆయన నన్ను ఆహ్వానించి ఒక 3 నెలలు ఒక సీనియర్ స్టాఫ్ కింద డైరెక్షన్స్ తీస్కోవలసినదిగా సూచించి నన్ను శ్రీనివాసులు అనే వ్యక్తితో కలసి 3 నెలలు పని చేయవలసినదిగా సూచించారు. తరువాత అటెండరు వచ్చి నన్ను నా సహోద్యోగులు వుండే గదికి తీసుకెళ్లారు , అక్కడ వారందరితో పరిచయం అయ్యాక నన్ను వాళ్ళు ఎవరితో వర్క్ షేరింగ్ ఇచ్చారు అని అడిగారు. నేను వెంటనే శ్రీనివాసులు గారితో అనగానే అందరూ ఫక్కున నవ్వి ఇక నువ్వు ఈ ఉద్యోగం చేసినట్టే అని అన్నారు, వారు ఆ మాట ఎందుకు అన్నారో నాకు అర్థంకాలేదు. నేను వెళ్లి నా సీట్లో కూర్చున్నాను. కాసేపటికి ఆ శ్రీనివాసులు అనే వ్యక్తి రానే వచ్చారు. ఆయన చూడడానికి నాకన్నా వయసులో ఒక 5 ఏళ్ళు పెద్దగా ఉండి వుంటారు. ఆయన వచ్చిన వెంటనే వెళ్లి నేను అతన్ని కలిసి నేను తనతో 3 నెలలు కలిసి పని చేయాలి అని చెప్పాను. అతను సరే అని సీరియస్ గా చెప్పి రేపటి నుండి నాతో వచ్చెయ్యండి అనిచెప్పి వెళ్లిపోయారు. తరువాత రోజు నుండి నేను అతనితో కలసి వెళ్లడం అతని వద్ద పని తెలుకోవాలి అని అనుకున్నాను. పని బాగా తెలిసినప్పటికీ అతను చాలా మితభాషి. ఎప్పుడు సీరియస్ గా ఉండేవారు. నాకు అప్పుడు అర్థం అయ్యింది వీళ్లంతా ఎందుకు ఆరోజు నవ్వారు అని. అయిన నేను ఎన్నిసార్లు ప్రయత్నించిన ఆయన పని గురించి తప్ప ఇంక ఏది నాతో మాట్లాడేవారు కాదు, నాకు అతని ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపించేది. ఇలా ఒక నెల పూర్తి అయ్యింది. ఒకరోజు హడావుడిలో ఆయన తనకు సంబంధించిన ఫైల్ ఒకటి మర్చిపోయి వెళ్లారు, నేను అతని అడ్రెస్ కనుక్కుని నేరుగా వాళ్ల ఇంటికి చేరుకున్నాను. అది ఒక రెంటెడ్ హౌస్ , కానీ సింపుల్ గా బాగుంది చూడడానికి. వెళ్లి బెల్ కొట్టాను శ్రీనివాసులు వచ్చి డోర్ తీశారు , నన్ను చూసి ఏంటి ఇలా వచ్చారు అని అడిగారు. నేను మాట కలుపుతూ మీరు ఈ ఫైల్ మర్చిపోయారు ఇచ్చి వెళ్దాం అని వచ్చాను అని ఫైల్ అతని చేతికి అందించాను. అతను ఫైల్ తీసుకొని థాంక్స్ చెప్తూ లోపలికి రమ్మని ఆహ్వానించారు. లోపల విశాలంగా నిశ్శబ్దంగా ఉంది తను వెళ్ళి ఒక గ్లాస్ లో జ్యూస్ తీసుకొని వచ్చి నాకు అందించారు. ఇల్లంతా పరిశీలించాక నేను ఇంట్లో ఎవరెవరు వుంటారు అని అడిగాను దానికి అతను బదులుగా ఒక్కడినే అని సమాధానం చెప్పి, నేను ఒక అనాథను కష్టపడి చదివి ఈ ఉద్యోగం సమపాదించాను అని చెప్పుకుంటూ వెళ్తున్నారు, నాకు ఒక్కసారిగా అలా వినేసరికి చాలా బాధగా అనిపించింది. తరువాత సెలవు తీసుకొని అక్కడి నుండి బయటకు వచ్చేసాను. తరువాత రోజు నుండి శ్రీనివాసులు నాతో కొంచెం మాట్లాడటం ప్రారంభించారు . అలా మా స్నేహానికి పునాది అక్కడ పడింది. ఒకరోజు మాటల్లో మీరు ఎక్కడుంటారు అని అతను నన్ను ప్రశ్నించగా నేను హాస్టల్ లో ఉన్న సంగతి అతనికి వివరించాను. అతను నాతో నీకు ఇబ్బంది లేకుంటే వచ్చి నాతో రూమ్ షేర్ చేస్కోవచ్చు అని అన్నారు. నాకు ఈ హాస్టల్ లో ఉన్నడటం ఎమ్ అంత బాలేదు నేను వెంటనే ఒప్పుకున్నాను. కానీ ఆరోజు ఊహించలేకపోయాను అలా నేను తనతో ఉండటం నా జీవితాన్ని మార్చుతుంది అని. ఇదిలా ఉండగా నేను అతని రూమ్ కి వెళ్లడం అన్ని జరిగిపోయాయి. నేను తన రూం లో చేరినట్లు మా అమ్మ వాళ్ళతో చెప్పాను వాళ్ళు కూడా సంతోషపడ్డారు. కాలం అలా జరిగిపోతూ ఉంది. రోజు రోజుకి మా స్నేహం పెరుగుతూవుంది. నేను అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళను కలవడానికి పండుగలకు ఊరేళ్ళేవాడిని నాతో శ్రీను (శ్రీనివాసులు) ని రమ్మంటే ఏనాడు వచ్చేవాడు కాదు. అప్పుడప్పుడు అమ్మ వాళ్ళు నన్ను కలవడానికి విజయవాడ వస్తే అతను వాళ్ళు వచ్చి వెళ్లే వరకు ఇంటికి వచ్చేవాడు కాదు. అతనిలో ఈ ప్రవర్తన నాకు విచిత్రంగా అనిపించేది. ఒకనాడు నేను అతన్ని దీని గురించి ప్రశ్నించగా అతని నుండి వచ్చిన సమాధానానికి విస్తుపోయాను. తన తల్లిదండ్రులు అతనికి ఎవరో తెలీదని తనని ఒక చెత్త కుప్పలో పడేసి వెళ్లారని చిన్నప్పటి నుండి ఎక్కువ ఒంటరిగా పెరిగిన అతనికి ఫ్యామిలీ మీద ఇంటరెస్ట్ లేదని చెప్పాడు. నేను తనని మార్చడానికి ఎంతో ప్రయత్నించాను కానీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదు , కానీ ఏదో ఓరోజు అతను మారుతాడు అని చాలా నమ్మేవాడిని. అతనికి కుటుంబం గురించి ఎంతగానో చెప్పేవాడిని , ఈ క్రమంలో నేను నా కుటుంబాన్ని కొంచెం ఆశ్రద్ద చేయడం జరిగింది. ఎంతలా అంటే నేను ఊరికి చాలా తక్కువ వెళ్ళేవాడిని ఇలా నెలలు గడిచాయి మా అమ్మ వాళ్ళు నేను రావట్లేదు అని చాలా బాధపడేవారు కానీ నేను శ్రీను ని మార్చి ఇంటికి తీస్కెళ్లాలని చాలా తాపత్రయపడేవాడిని. ఇదిలా ఉండగా నా స్నేహితుడు రఘు ఒకరోజు విజయవాడ వచ్చి నన్ను కలవడానికి నా రూమ్ కి వచ్చాడు. ఆ సమయం లో శ్రీను ఇంట్లో లేడు. రఘు మాటల్లో నాతో రాకేష్ ఏంట్రా నువ్వు బొత్తిగా ఇంటికి రావడం మనేశావ్ ఇంట్లో అమ్మ వాళ్ళు నీకోసం చాలా బాధపడుతున్నారు అని చెప్పాడు. నేను అతనితో రేయ్ నాకు రావాలనే ఉందిరా కానీ నా స్నేహితుడు శ్రీను తన జీవితంలో చాలా కోల్పోయాడు తనని ఎలాగయినా మార్చి నేను తనతో ఊరికి వస్తాను రా అని చెప్పి అతన్ని పంపించివేశాను. ఈ సంభాషణ అంత బయట నుండి శ్రీను వింటున్న సంగతి నేను గమనించలేదు. తర్వాత 2 రోజులకి శ్రీను కొంచెం పర్సనల్ పని ఉందని వారం రోజులు సెలవు తీసుకున్నాడు, నేను ఎందుకు అని అడిగినప్పటకి పని ఉంది పూర్తి అయ్యాక చెప్తాలే అని చెప్పి ఊరుకున్నాడు. నేను కూడా ఫోర్స్ చెయ్యక సైలెంట్గా వున్నాను. రోజు ఏవో పేపర్స్ తీసుకొని బయటకు వెళ్తుండేవాడు శ్రీను. ఇలా 7 రోజులు పూర్తి అయ్యాయి. నేను ఆ రోజు వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యం అయ్యింది . ఇంటికి వెళ్ళేసరికి డోర్ ఓపెన్ లో ఉంది. అంటే శ్రీను లోపలే వున్నాడని లోపలకి వెళ్ళాను. బెడ్రూం డోర్ కొంచెం దగ్గరగా వేసి ఉంది , డోర్ తెరిచి చూసిన నేను ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని చూసి విస్తుపోతూ పెద్ద కేక వేసాను. నా అరుపులకి చుట్టూ పక్కల వాళ్ళు వచ్చేసారు ఇంట్లోకి, శ్రీను ఫ్యాన్ కి ఉరి వేసుకుని వేలాడుతూ వున్నాడు. నాకు కన్నీళ్లు ఆగట్లేదు. శ్రీను శ్రీను అంటూ రోధిస్తున్నాను. అమ్మ నాన్న అందరూ విజయవాడ చేరుకున్నారు విషయం తెలుసుకుని. నాన్న దగ్గర ఉండి శ్రీను దహన సంస్కారాలన్ని పూర్తి చేశారు. నేను ఇంకా ఆ షాక్ లొనే వున్నాను . శ్రీను టేబుల్ మీద ఒక లెటర్ రాసిపెట్టి వున్నాడు అందులో ఇలా వుంది ” ప్రియమైన నా మిత్రుడు రాకేష్ కి, రాకేష్ నువ్వు చాలా మంచివాడివి నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం . మన స్నేహాన్ని నేను ఎప్పటికి మర్చిపోను మర్చిపోలేను కూడా . నువ్వు నాకోసం చాలా చేసావు , నన్ను మార్చాలి అని చాలా ప్రయత్నించావు కానీ మిత్రమా నేను ఎందుకో కుటుంబం విషయం లో ఇంకో అడుగు ముందుకు వెయ్యలేకున్నాను . నువ్వు నీ స్నేహితుడు రఘు తో మాట్లాడిన మాటలను విన్నాను నన్ను మార్చడం కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం , దానికోసం నువ్వు నీ కుటుంబానికి దూరం అవుతుందడటం నన్ను చాలా బాధించాయి. నేను మారాలని ప్రయత్నిస్తున్న ఎందుకో మరలేకున్నాను. అందుకే చివరిగా బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఇన్నాళ్లలో ఎదో కొంత సంపాదించుకున్నాను , నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. నేను మారలేకున్నాను అది నీకు ఇబ్బంది కాకూడదు అనే కారణంతోనే వెళ్లిపోతున్నాను. మిత్రమా ఈ వారం రోజులుగా నేను నా ఆస్థి మొత్తాన్ని నీ పేరుమీదుగా మార్చడానికి తిరిగాను. ఆ పని పూర్తి అయినది. దానికి సంబంధించిన పేపర్లు డెస్క్ లో ఉన్నాయి. తప్పు చేసి ఉంటే మన్నించు నా నేస్తం. ఇట్లు ని శ్రీను” అని రాసి ఉంది . అది చదివిన నాకు మా అమ్మ వాళ్లకు కన్నీరు ఆగలేదు. తరువాత నాకు మళ్ళీ మనిషిగా మారడానికి చాలా సమయం పట్టింది ఈలోపు నాన్న గారు శ్రీను ఆస్థితో ఒక ఆశ్రమం స్థాపించారు. దానికి శ్రీను అనాధ ఆశ్రమం గా పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ ఆశ్రమం ఎందరో శ్రీను లాంటి అనాధాలకు ఒక ఇంటిలా మారింది . చాలా మంది అనాధాలకు శ్రీను ఒక స్ఫూర్తిగా మిగిలాడు. ప్రతి సంవత్సరం శ్రీను వర్ధంతిని ఆ ఆశ్రమంలో జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఇలా ఆలోచనలతో నా కళ్ళు నీళ్లతో నిండాయి. కారుకు బ్రేక్ వేసి దిగి ఆశ్రమం లోకి వెళ్ళాను శ్రీనుని తలుచుకుంటూ” ఈ స్నేహ బంధం ఎప్పటికి విడదీయలేనిది శ్రీను”….

Leave a Reply

Your email address will not be published.