393
0

సముద్ర కెరటం

393

“హఆ..హఆ..హఆ..(అలసట కేకలు) ఈరోజు ఎలగైనా ఆ అంచుదాటెత్తను,ఎలగ ఆపుతావో నేను సూత్తా,బేగి బేగి దగ్గర పరోస్తన్నని బెంబేలు అయిపోయి పెద్దపెద్ద కెరటాలు ఎదురు తొలేస్తనవ్ కదా? తొయ్యి తొయ్యి ఎంత ఎనక్కి తోసిన ఈరోజు ఆ అంచు దాటిసి మా అయ్యను ఇంటికి పట్టికెళ్లిపోతను” అంటూ ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు గజయీతగడిలా సముద్రంలో అరుస్తూ ఈదుతున్నాడు.


ఆవైపున తిరిగి నౌకతో ఒడ్డుకు వెళ్తున్న ఈరయ్య ఆ పిల్లోడిని చూసి,ఒడ్డుకి చేరాక
“ఓలప్పా ఏమే నీ కొడుకుని అలాగ ఆ నీట్ల వదిలెనవు,ఆడు అంచుదాటేత్తానని అరస్తనడు సముద్రం లోనికెలిపోయి” అని గంగడు అమ్మతో చెప్పాడు.


ఏటిసెయ్యడమో ఏటో గుంటడు అస్సలు ఎన్ని సార్లు సెప్పినా సెవులెట్టడు,నిన్నే గుండగ రేవుఎట్టినను మళ్ళీ ఈపొద్దు ఎలిపొనాడు అయ్యకి ఎదుక్కోని.
అమ్మ ఇలాగ ఎన్ని రోజులు కాపు కాస్తామే,సాయంకాలం తమ్ముడు వచ్చింతరువాత నిజం సెప్పిద్దమే.అని తల్లి కూతుర్లు మాట్లాడుకుంటుండగా ఈరయ్య విషయం ఎంటో తెలుసుకుందాం అని

‘అప్పా అసలేటయ్యిందే,గంగడు ఎందుకు రోజు సముద్రం లోకి ఎలిపోతనడు’

… కొన్ని సంవత్సరాల క్రితం …

“బంగాళాఖాతంలో వాయుగుండం,రాబోయే 48 గంటలు భారీ వర్షలు,ఈదురు గాల్లుతో తూఫాన్ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని కేంద్ర వాతావరణ శేఖ వెల్లడించింది,ముందస్తు జాగ్రత్త చర్యలుగా జాలర్లు ఎవ్వరిని వేటకు వెళ్లొద్దు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
తీరప్రాంతాల ప్ర..జ.జ..లు అ..అప్ర..మత్తం జ్….జ్…..జ్….”
అమ్మ బొమ్మ మళ్ళీ ఆగిపెందే వెళ్లి ఆ టి.వి పుల్ల తిప్పే.నేను తమ్ముడికి పాలు పడతనను దేవి నువ్వెల్లి మీ నానకి సెప్పు.
నాన…నాన… టి.వి లో బొమ్మ ఆగిపోయింది వచ్చి సూడు నాన.
పెద్ద గాలేస్తంది కదా దేవి మరి ఈరోజు బొమ్మ రాదు టి.వి లో,
హ అదే నాన టి.వి లో సెప్పారు పెద్ద తూఫాన్ వస్తాదట నువ్వు కూడా యాటకి ఎల్లకూడదట.
సరే నేను యల్లను గాని నువ్వెల్లి పడుకో.

నిద్రపోతున్న తీరాన్ని సముద్ర గాలి తట్టిలేపుతుంది,మబ్బుల దుప్పటి కింద ఆ చంద్రుడు కునుకుతీయగా నింగి నిండా కాటుక చీకటి అల్లుకుంది.

పార్వతి పిల్లలు పడుకున్నారా?
హ అయ్యా ఇప్పుడే పడుకున్నారు.
నాకు కూడా కాస్త కూడెట్టు తినేసి నావకెల్లాల,
వాన పడేలా ఉంది ఈ పొద్దు ఎల్లడం ఎందుకయ్యా?
ఎంకాదులెయే బేగెల్లి వచ్చెత్తను,నెలాకరి కదా దేవి కాన్మెంట్ ఫీజ్ కట్టాల,గంగడికి ఆసుపత్రికి తీసుకెల్లాలి, యాటకెల్లకపొతే ఎలగవుతాది సెప్పు?
సరే అయ్యా జాగత్త ఎక్కువ లోపుకెలిపోకు.

నారయ్య పడవ తీసి బయలుదేరాడు.గుడిసె తట్ట మూసి రవనమ్మ ఇద్దరి పిల్లల మధ్యలో మెల్లగా కునుకుతీస్తుంది.నిదుర బరువుతో మూతపడ్డ కళ్ళ వెనుక ఎంతో అందమైన స్వప్నం.దేవి సిరినవ్వులతో అత్తోరింటికి వెళ్తున్నట్లు, గంగడు ఖరీదైన నావకి యజమాని అయినట్టు.
గడియలు గడవగా గుడిసె మెల్లగా సల్లపడింది. ఒల్లోనికె గాలితో,తొలి వాన బొట్టు  మట్టి వాసన తగిలి రవనమ్మకి కెవొచ్చింది.బుడ్డోడు నిద్రలేచిపోతాడు ఏమో అని మెల్లగా చప్పుడు కాకుండా లేచి కిటికి బయటకు చూసింది.కారుచికట్ల నిశబ్ధం,వెన్నెల కరువులో చిరుజల్లులు నేలను తాకుతున్నాయి.చదువురాని రవనమ్మ తెలివితో అది తూఫాను ముందు సంకేతం అని సందేహపడింది.
సముద్రం వాడిలో నారయ్య వలకట్టి విసిరాడు,గట్టి వాయి పడితే సరి త్వరగా ఇంటికెళ్లిపోతా అనుకుంటున్నాడు.వలతాడు చేతికి బిగించి లాగబోగ ఒక పెద్ద కెరటం వచ్చి తాడు చెయ్యి జారింది.ఈసారి పట్టు  జారకూడదు అని తాడు నడుముకి బిగించాడు.

ఏమి కాదులే అని అనుకుంటూనే తెలియని భయంతో రవనమ్మ గంగడికి జోకొడుతుంది.
ఓ పెద్ద వెలుగు,రవనమ్మ కళ్ళు మసకబోయాయి అరసెకను ఆగి కొండ పగిలినంత పెద్ద శబ్దం.ఊరంతా నిద్ర లేచారు.ఏమైందో తెలియక గుడిసెలు బయటకి వచ్చి అయోమయం గా చూస్తున్నారు.ఒక్కసారిగా మైళ్ళ వేగంతో గాలి,దుమ్ము ధూళి కళ్ళపడి ఎవరికి ఏమి కనపడటం లేదు.ఊరి చివర గుడిసె గాలికి కొన్ని అడుగుల ఎత్తు లేచి పడింది.
ఇది చూసిన జనం రెండు గుటకలు మింగి ఒక్కసారిగా
‘అమ్మో తూఫాను,అమ్మో తూఫాను..గంగాధర కపాడయ్యా రక్షించయ్యా..’ అని అరుపులు మొదలు పెట్టారు.


సముద్రం మధ్యలో ఉన్న నారయ్యకి చుట్టూ గాలికి చెమటలు పట్టాయి.వెనక్కి వెళ్లిపోదాం అని పడవ తిప్పగానే,శరవేగంతో వీస్తున్న గాలికి నౌక ఒక్కసారిగా తిరగబడింది,కెరటాలు ఉధృతకి నడుముకి చుట్టిన వలతాడే తనని లోపలికి లాగి ఉరితాడుగా మారింది.

రవనమ్మ వెంటనే దేవి,గంగయ్యలను నిద్రమత్తులోనే ఇరు వైపులు ఎత్తుకొని గుడిసె బయటకి వచ్చింది.అందరూ పరుగులు తీస్తున్నారు ఏమైంది అని వెన్నక్కి తిరిగి చూడగా అరవై అడుగుల కెరటం దారితప్పి ఒక్కసారిగా గుడిసెలను ముంచింది.
అంతే కనురెప్ప కాలంలో ఆ వరద నీటికి,తోళ్లు చీల్చే గాలికి ఊరు వల్లకాడయింది.రక్తం కక్కిన సేవాలు ఎండు ఆకుల్లా తెలుతున్నాయి.ఆడా,మగా,ముసలి,ముతక తేడా లేకుండా ఆ అల అందరిని నెలకేసికొట్టింది.

దేవి..దేవి….గంగడు….గంగడూ….అని గుండెలుబాదుకొని రవనమ్మ పీకల్లోతు నీలల్లో అరుస్తూ వెతుకుతుంది.
అమ్మా..అమ్మా..ఊరిపిరాడట్లేదమ్మ రా అమ్మ అని ఒక పసిగొంతు కేకాలేస్తుంది.
ఈ దృశ్యాలు చూసి యముడి సైతం జాలి కలిగిందేమో ఆ పసికూనల్ని ఊపిరితో వదిలేసాడు.ఎదురుగాలి    ఒల్లుగుళ్ల చేస్తున్న రవనమ్మ ఎదురెళ్లి గంగడు,దేవిలను భుజానెట్టుకొని ఈదుతుంది.

అమ్మా..అమ్మా..
గంగడూ ఆగురా అయ్యా నీకెటవ్వదు అదిగో అలాగ ఆకొండ ఎక్కిస్తే సలి కూడా ఉండదు.
అమ్మా..అమ్మా..అది కాదే నాన ఏడి!
కన్నీళ్లు వాన చుక్కల్లో దాచి రవనమ్మ ‘నాన వచ్చేస్తాడు అయ్యా అదిగో ఆ సముద్రం అంచు అవతలకి ఎల్లాడు,ఈ వాన తగ్గగానే పెద్ద పొలుసు సేప పట్టొకి వచ్చెత్తడు’
సముద్రం అంచు దాటితే నింగి చేరుకుంటారు అని తెలిసిన దేవి వెక్కి వెక్కి ఏడ్చింది.

……  ప్రస్తుతం ……

ఆపొద్దు నుంచి ప్రతిరోజు ఆ అంచుదాటెల్లి ఆలయ్యని ఎదికి తెచ్చెత్తానని సముద్రంలోకి ఎల్లిపోతనడు.

అదిగో అమ్మ తమ్ముడు వచ్చాడు,
ఒరేయ్ గంగా ఎన్ని సార్లు సెప్పాలిరా ఆ సముద్రంలోకి ఎల్లోద్దని!
అయ్యకి ఎదుక్కోని ఎల్లినను తప్పేటి.
ఐదు ఏళ్లుగా ఎదుకుతున్నావ్ దొరికాడా నీ అయ్య!
లేదు నేనింకా అంచు దాటలేదు దాటితే దొరికెస్తడు.
అయ్యో దేవుడా ఎన్ని సార్లు సెప్పాలిరా మీ అయ్య దొరకదు ఏతకొద్దు అని,
ఏ ఎందుకు దొరకడు నువ్వేయ్ సెప్పావ్ గా ఆ అంచుదాటి ఎల్లినాడని.
సెప్తె అర్ధంకాదా!ఎంత ఎదికినా మీ అయ్య దొరకదు,ఆ అంచుదాటెల్తే సచ్చినట్టే,మళ్ళీ తిరిగిరారు.
“సముద్రం లోపలికి ఎల్లే దారే మనకి తెలుసు,తిరిగి ఒడ్డుకి ఆ కెరటం తోస్తే వస్తాం,అది కాదని లాగెత్తే దాని ఒడిలోనే శాశ్వతంగా నిద్రపోవాల”

….. కొన్ని సంవత్సరాలు తరువాత …..

“బంగాళాఖాతంలో వాయుగుండం,రాబోయే 48 గంటలు భారీ వర్షలు,ఈదురు గాల్లుతో తూఫాన్ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని కేంద్ర వాతావరణ శేఖ వెల్లడించింది,ముందస్తు జాగ్రత్త చర్యలుగా జాలర్లు ఎవ్వరిని వేటకు వెళ్లొద్దు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
తీరప్రాంతాల ప్ర..జ.జ..లు అ..అప్ర..మత్తం జ్….జ్…..జ్….”

నాన టి.వి లో బొమ్మ రాడంలేదు ఎల్లి టి.వి పుల్ల తిప్పవా..
గాలి ఎక్కువ వస్తుందికద రవనమ్మ ఈ రాత్రికి ఇంక బొమ్మ రాదు,
హ అదే నాన తూఫాను వస్తుందట నువ్వు కూడా యాటకు ఎల్లకూడదట.
‘అలాగే నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను’ అని రవనమ్మ ని భుజాన ఎత్తుకొని రాత్రంతా జోకొడుతూ గుడిసెకి కపుకాసాడు గంగడు.

                         – సాగర్ బళ్ల


CONTINUE READING

Follow Us On Social Media

Leave a Reply

Your email address will not be published.