243
0

విరబూసిన సంధ్యారాగం

243

అసలే పొద్దు తక్కువ కాలం కావటం వలన సాయంత్రం అయిదు గంటలకే ఊరు అంత చీకటిగా కనిపిస్తుంది, పైగా వర్షం వచ్చేలా ఉండటం వలన ఆకాశం మొత్తం మేఘాలు కమ్ముకొని ఈ రోజు ఇంకా త్వరగా చీకటి పడినట్టు ఉంది.

“అవును వీడేంటి ఇంకా ఐదు అవ్వలేదు గోడ మీద గడియారం గంట కొట్టలేదు అప్పుడే లంచ్ బాక్స్ లోపల పెట్టాడు, బ్యాగ్ భుజానికి తగిలించాడు కార్ తాళం చేతిలో పట్టాడు ఏంటో సంగతి అయినా మనలో మనం మాట్లాడుకోవటం దేనికి వాన్నే అడిగితే పోలేదు” అని

“ఏంటి రా ఒక్క క్షణం కూడా వెయిట్ చేయలేవా మాకోసం, మేము ఇంటికే కదా వచ్చేది. అయినా ఎప్పుడు లేనిది ఎంటి ఇంత తొందర” అని అడిగాడు నా కొలీగ్ రవి

దానికి నేను ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే ఇంటికి వెళ్ళటానికి సిద్దం అయి క్యాబిన్ లో నుండి బయటకి వస్తున్న ఇంతలో మరో కొలీగ్ హరి

“నీకు తెలియదు కదరా వాడు కొత్త పెళ్ళికొడుకు అయితే ఆ మాత్రం తొందర ఉండదా ఎంటి” అని బదులు ఇచ్చాడు.

“ఎంటి వీడికి పెళ్లి అయిందా ఎప్పుడు రా, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు పెళ్లికి పిలవలేదు” అన్నాడు రవి.

“నీకేంటి ఎవరికీ చెప్పలేదు నిన్న నైట్ జరిగింది అంట” అన్నాడు హరి.

“అందెంటి రా నిన్న కూడా వీడు ఆఫీస్ కి వచ్చాడు, నిన్న నైట్ పెళ్లి జరగటం ఎంటి వీడికి” అని ఆశ్చర్యపోతూ అన్నాడు రవి.

” మాకు మాత్రం ఏమీ తెలుసు రా, అది కూడా బాస్ కి పదిహేను రోజులు సెలవు కావాలి అని లెటర్ పెడితే. బాస్ అడిగితే తెలిసింది వాడు మళ్ళీ కనిపించేది పదిహేను రోజులు తర్వాత అందుకే అంత వేగంగా వెళ్తున్నాడు” అన్నాడు హరి.

“రే మావా ఎవరికీ చెప్పిన చెప్పకపోయినా నాకు అయినా చెప్పాలి కదరా, అయిన నిన్న గురువారం నైట్ 11 వరకు తాగుతూనే ఉన్నాం కదరా ఇద్దరం మరి పెళ్లి ఎప్పుడు అయింది నీకు” అని రవి నా దగ్గరకి వచ్చి అన్నాడు.

“ఏంటి రా ఇద్దరు కలిసి ఏదో రహస్య సమావేశం పెట్టారు, పార్టీ మాకు కూడా ఈసారి” అన్నాడు హరి.

” తప్పకుండా నేను తిరిగి రాగానే అందరికీ కలిపి ఒక పెద్ద పార్టీ ఇస్తా సరేనా, మరి ఇప్పుడు నేను వెళ్ళతున్న బై” అని బయటకు వస్తున్నా….

“మావా నాకు కూడా చెప్పవా నువు ఇంక మన ఫ్రెండ్షిప్ ఇవ్వల్టితో లాస్ట్ గుర్తుపెట్టుకో” అన్నాడు రవి.

“నువు నీ యదవ బిల్డప్లు ఆపుతావా, అది ఒక పెద్ద కథ నీకు తర్వాత చెప్తా. ఇవ్వాళ నా శోభనం అందుకే వెళ్తున్న బై” అని వడి వడిగా అడుగులు వేస్తూ కిందకు దిగుతున్న.

” బెస్ట్ ఆఫ్ లక్ మావా”అని రవి గాడు వెనక నుండి అరవటం వినపడింది కానీ నేను వెనకకు తిరిగి చూడకుండా పార్కింగ్ లో ఉన్న నా కార్ దెగ్గరకు వచ్చి బ్యాగ్ లోపల వేసి కార్ స్టార్ట్ చేసి కొన్ని క్షణాలలోనే రోడ్డు ఎక్కేసాను.

ఇవాళ రోడ్డు ఎందుకో కొంచెం బిజీ గా ఉంది, మాములగా అయితే నేను వెళ్ళే టైం కి చాలా ఖాళీగా ఉంటుంది. బహుశ ఈ టైం లో ఇలాగే ఉంటుంది అనుకుంటా ఈ రోడ్డులో ఈ టైంలో రావటం నాకు ఇవ్వాళే కదా మొదటి సరి, ఇంక ఎలా తెలుస్తుంది లే. అయినా నాకు రోజు నలభై నిమిషాలు పడుతుంది ఇంటి నుండి ఆఫీస్కు రావటానికి అదే కొంచెం ట్రాఫిక్ ఉంటే గంట పడుతుంది. అదే ఇంక వెళ్ళటం గురించి అయితే ఏ టైం కి ఎటు నుండి ఎటు వెళ్తాను అని కూడా తెలియదు. అని ఆలోచిస్తూ ఉండగానే స్వీట్ మేజిక్ వచ్చింది కార్ ఆపి లోపలికి వెళ్ళి నాకు ఇష్టం ఆయిన కాజు బర్ఫీ ఒక కేజీ ఇంక మిగతా స్వీట్స్ అన్ని కలిపి ఒక కేజీ తీసుకోని, పక్కనే ఉన్న ఫ్రూట్ షాపులో నాలుగు రకాల ఫ్రూట్స్ తీసుకొని ఆ పక్కనే ఉన్న పూల కొట్టులో మల్లెపూలు గులాబీలు అన్ని తీస్కొని కార్ లో పెట్టుకున్న. మళ్ళీ కార్ స్టార్ట్ చేసి రోడ్డు ఎక్కాను. మెల్లగా వేగం పెంచేటప్పటికి ఇంకో ట్రాఫిక్ సిగ్నల్ మరో రెండు నిమిషాలు వెయిటింగ్ చిన్నగా మళ్ళీ వేగం పెంచుతున్న సిటీ కూడా మెల్లగా ఎల్ఇడి లైట్ల వెలుగులలోకి వస్తుంది. సిటీ లోని మనుషులలో పని ఒత్తిడిని దూరం చేయటానికి అన్నట్టు ఆకాశం మబ్బులతో కలిసి చిందులేస్తు వర్షపు చినుకులను కిందకు పంపుతుంది. దాంతో నేను కార్ అద్దం కిందకు దింపాను ఎంత హాయిగా ఉంది మళ్ళీ జన్మించినట్లు ఉంది. చల్లని గాలి మొహానికి తాకుతున్న నీటి తుంపర్లు ఎంత హాయిగా ఉంది ఇందాక అద్దాలు అన్ని లేపి ఏ.సి ఆన్ చేసుకున్నప్పుడు కూడా అనిపించలేదు. ఇంతలో మరో సిగ్నల్ ఇదే లాస్ట్ సిగ్నల్ నేను వెళ్ళే దారిలో ఇంక ఇక్కడ నుండి ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇల్లు.

నిజానికి నేను కావాలనే ఇంత దూరం లో ఇల్లు తీసుకున్న ఎందుకంటే

నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఒంటరినే నాకు నేను తప్ప ఎవరు లేని వాడిని. పుట్టగానే మా అమ్మకి బరువు దిగిపొయాను అంటా అందుకే కుప్పతొట్టిలో వేసింది. ఎవరికో బాగా ఇబ్బంది అనిపించింది అంట నా ఏడుపు అందుకే అనాధ శరణాలయం లో చేర్పించారు.

ఎవరో పాపాలు కడగటానికి నాకు చదువు చెప్పించారు, అందుకే నాకు నేను మాత్రమే మిగిలిన ప్రపంచం నాది.
బాధలు నాకు కనపడకుండా, ఏడుపులు నాకు వినపడకుండా నా కన్నీళ్లు ఎవరికీ కనపడకుండా ఉండటానికి ఇంత దూరం లో తీసుకున్న. అదే సిటీ లో అయితే లేట్ గా వస్తున్నావు, అర్థరాత్రులు తాగివస్తున్నావు అని అడగటం నేను కొత్త ఇల్లు వేత్తుకోవటం అవసరమా అని ఇంత దూరంగా తీసుకున్న.

ఇక్కడ అయితే అద్దె తక్కువ అడిగే వాళ్ళు తక్కవ పైగా ప్రకృతికి దెగ్గరగా ఉంటుంది. నాతో ఒక ప్రపంచం ఉన్నట్టు ఉంటుంది. రెండంతస్తుల భవనం ఇంటి చుట్టుపక్కల అంత పచ్చని పొలాలు అందులో నుండి పారే కాలువలు, సాయంకాలలు చెట్టు మీద వాలే పక్షులు అవి చేసే కిలకిలారావలు, సూర్యుడు కూడా తొంగి చూడకుండా అడ్డుపడే కొబ్బరి చెట్లు, ఇంటికి ఎదురుగా చల్లని గాలిని పంపే మామిడి చెట్టు, వేప చెట్టు. వెనక పెరటిలో సువాసనలు వెదజల్లే పూల మొక్కలు సన్నని నడుముని పెనవేసుకుపోయినట్టు ఉండే సన్నజాజి డాబా తో ఎగసి పడుతుంది. సూర్యుడి సంధ్య కాంతులకు పోటినిస్తు కనపడే కనకాంబరాలు, నిజానికి నాకు నేను నిర్మించుకున్న ఒక భూతల స్వర్గం అది.

రోజు రాత్రులు డాబా మీద మంచంపై పడుకొని ఆ పచ్చిని చెట్లు పంపే గాలిని పీలుస్తూ ఆ పారే నీళ్ళ సవ్వడిని వింటూ ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెడుతు పడుకోవటం నాకు అలవాటు. అలా నిద్రపోయిన నన్ను ఉదయాన్నే వినపడే గొడవ నిద్ర లేపుతుంది.

అది ఉదయించే ఆ భానుడి కోపానికి ఎదిరించి నిలిచే కొబ్బరి చెట్టుకు మధ్య జరుగుతుంది, ఆ గొడవ ఎందుకు అంటే సూర్య కిరణాలు నన్ను తాకాలి అని కొబ్బరి ఆకులు ఆపలి అని. అయినా సూర్యుడి దాటికి ఆవ్వి నన్ను ఎక్కువ సేపు కాపడలేవు అందుకే ఉదయాన్నే మెలుకువ వస్తుంది. నిజానికి ఆ సమయానికి ఎవరైనా ఒక కప్ కాఫీ ఇచ్చి నిద్ర లేపితే ఇంక బాగుంటుంది కానీ ఏమీ చేస్తాం ఎవరు లేరు కదా అందుకే నేనే వెళ్లి కాఫీ కలుపుకొని మళ్ళీ పైకి వచ్చి గాలికి ఊగుతున్న ఆ పచ్చని పైరుని చూస్తూ ఆ సూర్య కిరణాలను ముద్దాడుతూ కాఫీ ముగించి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి వెళ్ళటం, అలాగే ఆఫీస్ అయిపోయాక నా ఫ్రెండ్స్ తో కలిసి బార్ కి వెళ్ళటం తాగటం ఇంటికి చేరటం ఇదే నా రోజు వారి దినచర్య. ఇందులో నాకు తెలిసి ఎక్కువ శాతం ఎలాంటి మార్పులు ఉండవు.

కానీ అనుకోకుండా ఒక రాత్రి నా జీవితాన్ని మార్చేసింది ఒకే ఒక రాత్రి నా జీవితంలో చాలా మార్పులు తెచ్చింది నా దినచర్యను కూడా మార్చేసింది అందుకే ఇవ్వాళ ఇంత త్వరగా ఇంటికి వెళ్తున్న.

నిజమే నిన్న గురువారం ఎప్పటిలాగే నేను నా కొలీగ్ రవి, తను నా ఫ్రెండ్ కూడా అనుకోండి ఇద్దరం కలిసి ఊర్వశి బార్ లో రాత్రి పదకుండు గంటల వరకు తాగి వాడ్ని వాడి రూం దగ్గర వదిలి నేను ఇంటికి బయలు దేరాను అదిగో ఆ ఇరవై నిమిషాల ప్రయాణం నా జీవిత ప్రయాణాన్ని మార్చింది.

@@@@@@@@@

నేను తాగిన మత్తులో కార్ నీ వేగంగా నడుపుతున్న అప్పుడే సిటీ మొత్తం విద్యుత్తు దీపాల కాంతిలో మెరిసిపోతుంది అలా చూస్తున్న నాకు ఆ వెలుగుల బల్బుల ముందు ముత్యాలు నేలకు రాలినట్టు వర్షపు బిందువులు నేలను ముద్దాడుతున్నాయి, మొత్తం బంగారు వర్ణమై కనిపిస్తుంది నేను అద్దం దింపి ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూన్న. మీకు చెప్పటం మర్చిపోయా నాకు వర్షం అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడు వర్షం వచ్చిన నేను కార్ అద్దం దింపి ఆ నీటి తుంపరలు మొహానికి తగులుతుంటే అనందిస్తా. అలాగే చేస్తున్న నాకు ఎదురుగా ఉన్న బస్టాప్ దగ్గర ఒక అందమైన అమ్మాయి నెమలి కంఠం రంగు చీర కట్టుకొని పొడువైన తన జడకు పోటీగా సగం వరకు మల్లెలు పెట్టుకొని నుదిటిన సింధూరం తో వీచే గాలికి తటపటాయిస్తూ ఆగం చేస్తున్న చీర అంచును పట్టుకొని, తగిలే చిరు జల్లుకి దేహం మొత్తం తన్మయత్వంలో మునిగిపోతూ ఎవరికోసమో అన్నట్టు పెద్ద పెద్ద పెట్రోమాక్స్ లైట్స్ లాంటి కళ్ళు వేసుకొని చూస్తూ ఉంది. నిజంగా నేను కవిని కాదు కాబట్టి తనని పోల్చలేకపోతున్న కానీ అదే కవి అయితే ఇప్పటి వరకు ఉన్న వర్ణాలను దాటి ఎల్లలు దాటి మాటలు దాటి మళ్ళీ పదాలతో సరికొత్త అర్థాలతో వర్ణించేవాడ్ని. అంత అందంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలి అంటే అలాంటి అమ్మాయిని చూడని కనులు ఇంక ఎది చూసిన వ్యర్దం అనే అంత గొప్ప అందం.

అయినా నాకు బాగా తెలుసు ఈ టైం లో ఇలాంటి ప్రదేశంలో ఒక అమ్మాయి ఇలా తలనిండా పూలు పెట్టుకొని నిలబడి ఎవరికోసమో ఎదురుచూస్తుంది అంటే తను ఎలాంటి అమ్మాయి అని అందుకే నేరుగా కార్ తీసుకొని వెళ్ళి తనకి ఎదురుగా ఆపాను, తను ఇంక దిక్కులు చూస్తూనే ఉంది నేను తల బయటకు పెట్టి

“ఓ ప్రత్యేకంగా చెప్తే ఎక్కుతారా” అని అడిగా

“డబ్బులు మాట్లాడాలి గా, అందుకే” అని అన్నది నాకు ఆ స్వరం లో ఏదో బాధ ధ్వనించింది. అయినా నేను చాలా బాధలు పడ్డాను ఈ లోకంలో బాధ ఒక్కటే మనిషిని సమూలంగా నిర్మూలిస్తుంది. అందుకే నేను మళ్ళీ ఏమీ ఎక్కువ ఆలోచించకుండా

“నీకు ఎంత కావాలి అది చెప్పు, ఇష్టం అయితే తీసుకెళ్తా లేదంటే వెళ్ళిపోతాను అసలే టైం చాలా అయింది” అన్నాను

“ఐదు వేలు కావాలి ఇస్తారా ” అని అడిగింది నిజానికి అది చాలా తక్కువ తన అందానికి కానీ తను మాత్రం ఐదు వేలు మాత్రమే అడిగింది ఆ అడగటంలో కూడా తన అవసరం కనిపించింది నాకు, అందుకే ఇంక ఏమీ అడగకుండా కళ్ళతోనే తనని వచ్చి కార్లో కూర్చోమన్నా
తను నెమ్మదిగా వచ్చి కార్ ఎక్కి కూర్చుంది ఈ కొంచెం సేపటిలోనే ఆమె సగం తడిచిపోయింది, ఇప్పుడు ఆమె వంటి మీద ఏమీ లేవు వాన చినుకుల మెరుపులు తప్ప తన దేహం నుండి ఎలాంటి సుగంధ పరిమళాలు లేవు పెట్టుకున్న మల్లెపూలు గుభాలింపులు తప్ప. నేను తనని అలా చూస్తూనే కార్ ముందుకు నడిపాను. తను మాత్రం దేని గురించో ఆలోచిస్తున్నట్టు ఉంది తల డోరు వైపు పెట్టి ఆకాశం వైపే చూస్తుంది….

(తన ఆలోచనలు……
తను అప్పటికే అన్నం తిని నాలుగు రోజులు అవుతుంది, కడుపులో ఏమీ లేవు తన దగ్గర ఉన్నవి అన్ని అమ్మేసింది ఇంక అమ్మటానికి ఏమీ లేవు అయినా కడుపుకు ఆకలి లెక్కలు తప్ప ఇలాంటి లెక్కలు ఎలా తెలుస్తాయి. అందుకే అది తన లెక్కలు చెప్తూనే ఉంది తను మాత్రం నీళ్లతో వాటికి సమాధానం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అది కడుపుకు అర్థం కావటం లేదు అంతలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం అయితే వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా తన ఉంటున్న గది యజమాని, అతని చూసి తన మోము లో లేని నవ్వును అరువు తెచ్చుకుని

“మీరా బాబాయి రండి, ఈ టైం లో వచ్చారు” అని అడిగింది. తను లోపల ఏముందో తెలియని ఒక గొప్ప నవ్వును మొహం మీదకి తెచ్చుకొని

“ఎందుకు రాను అమ్మ నువు మూడు నెలల నుండి అద్దె ఇవ్వకపోతే రాకుండా ఏమీ చేయాలి అమ్మా”

“బాబాయ్ అది అది మీకు తెలుసు కదా నేను ఎందుకు పని మానేశాను అని, ఇంకో పని కోసం వెతుకుతున్న బాబాయి రాగానే ఇచ్చేస్తా”

“అయ్యె నాకు తెలుసు అమ్మా అవి అన్ని,
నువు ఎందుకు పని మానేసావు ఎంటి అని అన్ని తెలుసు, నీకు తెలియంది ఎంటి అంటే నువు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి తప్పదు అమ్మా”

“అన్ని తెలిసిన మీరే ఇలా అంటే ఎలా బాబాయి”

“అన్ని తెలుసు కనుకనే చెప్తున్న, నువు అద్దె కట్టే పని లేదు ఎక్కడికి వెళ్లి పనిచేసే పని లేదు, ఇక్కడే
ఉండు నేనే అన్ని తెచ్చి ఇస్తా కాకపతే పోతే నీకు తెలుసు కదా మీ పిన్ని తాగితే ఇంటికి రానివ్వదు, అందుకే అప్పుడప్పుడు నేను వచ్చి ఇక్కడే కొంచెం తాగుతా ఆ రోజు నువు నాకు కంపెనీ ఇవ్వు చాలు” అని ఒక వెకిలి నవ్వు ఇస్తూ మెల్లగా అతని చేతిని తన భుజం మీద వేసి రుద్దటం మొదలుపెట్టాడు.

“బాబాయి మీరు కూడా”

“బాబాయి కనుకే ఎవరికి అనుమానం రాదు అమ్మా”
అంటూ తనని ఆత్రంగా దెగ్గరకు తీసుకోబోయాడు” దానికి తను అతన్ని విదిలించుకొని దూరంగా జరిగి చిదరగా

“బాబాయి రెండు రోజులలో మీ డబ్బులు మీకు ఇచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్తాను”

“అలాగే కానివ్వు అమ్మా” అని అతను వెళ్లి పోయాడు.

తను జీవితం లో జరిగినవి అన్ని గుర్తుకు వచ్చాయి ఎక్కడికి వెళ్ళిన ఈ తడిపే చేతులు, చూసే కామపు కనులు తప్పవు అని ఆ డబ్బులు కోసమే ఏదో ఒకటి చేసే బదులు అందరికీ కావాల్సిన తన దేహన్నే పెట్టుబడిగా మార్చాలి అని వచ్చింది. అందుకే అతను అడిగితే ఐదు వేలు అనిచెప్పింది. ఇలా తను ఆలోచిస్తూ ఉండగా అతను తన చేతిని కదపగా ఆ ఆలోచనల నుండి బయటకు వచ్చింది.)

“ఎంటి ఏదో తెగ ఆలోచిస్తున్నారు” అని అడిగాను.

తన వైపు నుండి మౌనం మాత్రమే సమాధానం వచ్చింది.

“ఎందుకు అలా ఉన్నారు, నా ఇంటికే తీసుకెళ్తుంది అక్కడ రైడ్స్ లాంటివి ఏమీ ఉండవు, నేను కూడా మంచివాడినే తాగినప్పుడు” అని నవ్వేసా.

“నాకు అలాంటి భయమే ఉంటే మీరు అడగగానే కార్ ఎక్కను, అయినా మానం అమ్ముకోవాలి అనుకున్నాక ఇంక జీవితంలో నేను కోల్పోయేవి ఏముంటాయు లే” అని ఏదో వేదాంతం మాట్లాడినట్టు చెప్పింది.

నాకు ఏమీ అర్ధం కాలేదు కార్ ఇంక వేగంగా నడపటం మొదలు పెట్టా. గేర్ మారుస్తూ నా పక్కన ఉన్న కోమలాంగి లేత ముని వ్రేళ్ళను నా చేయి తాకేను. నాకు ఇన్ని రోజులు ఎంతమందిని చూసినా, చాలా మందితో గడిపిన రాని అనుభూతి తన చేతి స్పర్శ కి కలిగింది మదిలో ఎన్ని మధుర అనుభూతులు. తను మాత్రం ఏదో దెయ్యాన్ని తాకినట్టుగా తన చేతిని ఒక్కసారిగా వెనక్కి లాగేసింది. తన వైపు చూసా తను మళ్ళీ ఎదో ఆలోచనల్లోకి వెళ్ళింది.

( తన ఆలోచనలలో గతంలోకి వెళ్ళింది…

“ఎంటే ఇవ్వాళ ఇంత త్వరగా వచ్చావు నాకోసం కూడా అగకుండా” అని లత అన్నమాటలు తనకి వినిపించినా వినపడనట్టే తను తెచ్చుకున్న బాక్స్ తెరిచి తింటానికి ముద్దు తీసుకున్నది

“ఎంటే నేను ఇక్కడ చేవి కోసిన మేకల అరుస్తుంటే సమాధానం ఇవ్వవు, నిన్నే నేను అడుగుతుంది” అని లత నా భుజం మీద చై వేసి తన వైపు తిప్పి కోపంగా చూసింది. ఆ చూపుకి ఆ మాటలకు నాకు కనులలో నుండి నీరు యదపై నుండి దూకుతూ నేలను తాకుతున్నాయి, తను వాటిని వడిసి పట్టుకుంటూ

” ఏ ఎంటే అలా ఏడుస్తున్నావు, నేను ఏదో ఊరికే కోపడ్డా దానికే ఇలా ఎడవలా” అన్నది

“దానికి కాదే, నీకోసం ఆగి నీతో కలిసి రావాలి అని నాకు ఉంది కానీ…”

“కానీ ఏమైంది చెప్పు” అని అడిగింది లత, కానీ చెప్పటానికి తనకి నోటిలో నుండి మాట బయటకు రాలేదు.

“ఏమైంది చెప్పు రా” అని లత మళ్ళీ అడిగింది

“నేను రేపటి నుండి ఉద్యోగం మానేయాలి అనుకుంటున్న”

“ఏమీ మాట్లాడతున్నావు పని మానేయటం ఎంటి”

“నిజమే నేను పని మానేస్తున్నా”

“పిచ్చి పట్టిందా నీకు, నువు పని మానేస్తే ఎలా అసలే ఇప్పటికీ రెండు నెలలు ఖాళీగా ఉన్నావు. ఇంటి అద్దె ఎంటి తీసుకున్న బాకీలు సంగతి ఎంటి మర్చిపోయావా”

“అవునే నాకు పిచ్చి పట్టింది నిజంగానే పిచ్చి పట్టింది, నా చుట్టూ ఉన్న కామాంధుల నుండి ఉద్భవించిన మద పిచ్చి…

ఇక్కడకు వచ్చిన్నపటి నుండి నన్ను తాకాలి అని చూసే తప్పుడు నాకొడుకుల తప్పుడు కోరికల పిచ్చి” అని చెప్తూ తను ఏడుస్తూ ఉండిపోయింది.

“అసలు ఏమీ జరిగింది రా చెప్పు”

“ఏమీ చెప్పనే నేను రోజూ నీతో ఇక్కడికి వచ్చే వరకు చాలా హ్యాపీగా ఉంటా నీ స్నేహ మాధుర్యం లో, కానీ ఇక్కడకు రాగానే నువు నీ బ్లాక్ కి వెల్లిపోతావు నేను నా బ్లాక్ లోకి వెళ్ళగానే నన్ను ఒక్కదాన్నే చెక్ చేయటానికి మా సూపర్ వైజర్ వస్తాడు, నేను ఏ మానవ బాంబ్ పెట్టుకొని వచ్చానా అని నా దేహాన్ని మొత్తం తాకుతాడు. మళ్ళీ పని మద్యలో వస్తాడు నాకు రోజు చేసే పని కూడా రాదు అన్నట్టు నా చేతులు పట్టుకొని నేర్పిస్తాడు. అందుకే ఇవ్వాళ వాడి నుండి తప్పించుకోవటానికి ముందుగా వచ్చాను కానీ వాడు ఇవ్వాళ నన్ను తన రూమ్ కి పిలిచి నా పని గురించి కంప్లైంట్ వచ్చింది అంటూ నన్ను ఉద్యోగం లో ఉంచాలి అంటే తనకి నా పనితనం చూపించాలి అంటా, అందుకే నేను పని మానేద్దాం అనుకుంటున్న” అని చెప్పింది తను అలా చెప్తూనే తన కనులలో నీరు మాత్రం ఆగిపోలేదు….) ఆ గతంలోని కన్నీళ్లు ఇప్పుడు ఆగలేదు అందుకే అవి ఇంకా రాలి పోతూనే ఉన్నాయి అవి నా చేతిని తాకాయి.

అప్పటికే ఇల్లు రావటం తో నేను కారు ఆపి దిగాను తను అలాగే ఆలోచనలలో ఉంది

“మేడమ్ దిగండి” అన్నాను, దానితో తను కార్ డోర్ తీసి దిగి చుట్టూ చూస్తుంది నేను కార్ లాక్ చేసి వెళ్దామా లోపలికి అన్నాను.

తను ఎలాంటి సమాధానం ఇవ్వలేదు, తన పద్దతి చాలా కొత్తగా ఉంది నాకు. ఇలాంటి వాళ్ళు కొత్త కాదు కానీ తనని చూస్తే ఎందుకో అలాంటి అమ్మాయి కాదు అనిపిస్తుంది. అందుకే నేను ఇంక ఏమీ మాట్లాడకుండా లోపలికి నడవటం మొదలు పెట్టా, మీకు ముందే చెప్పాను కదా నా ఇల్లు సిటీకి చాలా దూరం గా ఉంటుంది చుట్టూ ఏమీ ఉండవు అని అందుకే కాబోలు తనకి కొత్తగా ఉంది, చుట్టూ చీకటిగా ఉంది నేను మాత్రం నాకు తెలిసిన దారే కదా అందుకే నేను వెళ్తూనే ఉన్నా తను నన్ను అనుసరిస్తుంది, నేను ఒక పది అడుగులు వేసి బయట వరండా లో లైట్స్ వేసాను ఒక్కసారిగా చీకటిని చీల్చుతు అక్కడ అంతా వెలుగుల విస్తరించాయి తనకి ఆ వెలుగలను చూసి కొంచెం దైర్యం వచ్చింది, తన అందాల వెలుగులు నా దేహం మొత్తం చిందాయి. తలుపు తాళం తీసీ లోపలికి వెళ్ళి లైట్స్ అన్ని వేసి, ఫ్యాన్ ఆన్ చేసాను, తను నెమ్మదిగా అడుగులు వేస్తూ లోపలికి వచ్చింది ఆ సీలింగ్ బల్బుల వెలుగులు తనపై పడి తను కూడా ఒక రత్నాలు పొదిగిన ఆభరణం లా వెలిగిపోతుంది. నేను తన అందాలలో నుండి తప్పించుకొని

“నేను వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తా, మీరు తడిసి పోయారు ఫ్రెష్ అవ్వాలి అంటే ఆ రూమ్ లో బాత్రూమ్ ఉంది పక్కన వార్డ్రోబ్ లో బట్టలు ఉన్నాయి వెళ్లి ఫ్రెష్ అవ్వండి” అని చెప్పి నేను పైకి వెళ్ళాను నా రూం కి ఫ్రెష్ అవటానికి.

నేను మెట్లు ఎక్కుతూ వెళ్తున్న తను మాత్రం అక్కడే అలాగే నిలబడి ఉంది నేను తనను అలా చూస్తూనే వెళ్తున్నా ఆ అందం ముందు నేను తాగింది మొత్తం దిగిపోయింది నేను అలా తనను చూస్తూ మెట్లు ఎక్కుతుంటే అందాల రాశి అందనంత ఎత్తులో ఉంటే అందుకోవటానికి పైకి ఎక్కుతున్నట్టు ఉంది. నా ఆలోచనలకు ఏమైంది అనుకుంటూ వేగంగా రూం లోకి వెళ్లి నేరుగా బాత్రూమ్ లోకి వెళ్లి షవర్ తిప్పి అలాగే బట్టలతో షవర్ కింద నిలబడిపోయాను. నీరు దారలగా కిందకు వెళ్తున్నాయి నాలో ఆలోచనలు కూడా దారి వెంట పరిగెడుతున్నాయి అసలు తను ఇలా ఎందుకు మారింది అని. తన గురించి నేను ఆలోచించటం ఏంటో నాకు అర్ధం కాలేదు అలాగే నిలబడిపోయాను ఇంతలో కింద ఎదొ అలికిడి అయితే వడివడిగా బట్టలు మార్చుకొని కిందకు దిగాను తను కనపడలేదు, చుట్టూ వేతికా లేదు బయటకు వెళ్లిందా అని తలుపు వరకు వచ్చి చూసాను అసలు ఏమైంది తను ఎక్కడికి పోయింది అని ఆలోచిస్తున్న నాకు కిచెన్ లో నుండి ఎక్కిళ్ళు వినిపించాయి వెళ్లి చూసాను తనే కిచెన్ లో అలాగే నిలబడి తింటూ ఉంది. నేను హాల్ లో ఫ్రిడ్జ్ తీసి వాటర్ బాటిల్ తీసుకెళ్ళి తల మీద తట్టి తాగించి. తన చేతిలో బాక్స్ లాగి పక్కన పెట్టి కోపంగా

“ఎంటి ఇది అడిగే పని లేదా అది నిన్నటిది, వాసన కూడా వస్తు ఉంటుంది అది తింటావా” అని అడిగా, తన కనులలో నుండి నీరు తప్ప సమాధానం లేదు.

సరే వెళ్లి అక్కడ కూర్చో పది నిమిషాలు అని చెప్పి తనను తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చో పెట్టి నేను కిచెన్ లోకి వెళ్లి తన కోసం ఉప్మా వండి తీసుకొచ్చి తన ముందు పెట్టి తినమన్నాను. తన కనులలో నీరు ఇంకిపోయింది అనుకుంటా ఎర్రని ప్రమిదలలా కనిపిస్తున్నాయి తను మెల్లగా తినటం మొదలు పెట్టింది. నేను తనని అలా చూస్తుంటే చిన్న పిల్లలా అనిపించింది కానీ తను మాత్రం ఆ ప్లేట్ వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తుంది.

(తన ఆలోచనలలో గతం తాలుకా జ్ఞాపకాలు….

తను కడుపులో కాళ్ళు దాచుకొని మంచం మీదే పడుకుంది, అప్పటికి తను సరిగ్గా అన్నం తిని ఎన్నో రోజులో కూడా గుర్తు లేదు ఆకలి కడుపు పేగుల అరుపుల లెక్కలలో ఉంటే మెదడు ఇంకేం గుర్తు పెట్టుకుంటుంది. అందుకే లెక్కలేదు కానీ తను మాత్రం ఇంక ఆ పాచి పట్టిన అన్నం తినలేకపోయింది అందుకే తను పస్తు పడుకుంటుంది, హాస్టల్ వార్డెన్ నెమ్మదిగా తన దెగ్గరకు వచ్చి పడుకున్న తన నడుము మీద చై వేసి నొక్కాడు. ఆ స్పర్శకు టక్కున లేచింది తను.
అది చూసి

“ఎంటి భయపడ్డావా నేనే, ఎంటి బుజ్జి నాలుగు రోజుల నుండి అన్నం తినటానికి రావటం లేదంట” అని అడిగాడు

“నాకు ఆ పాచి పోయిన అన్నం తింటే వాంతులు అవుతున్నాయి అంకుల్ అందుకే తినలేదు, కొంత మందికే అలా పెడుతున్నారు అంకుల్” అని చెప్పింది

“అయ్యె అవునా ఎందుకని అమ్మా” అంటూ తను చేతులు ఎక్కడ ఎక్కడో పెడుతూ

“అయ్యోయో జ్వరంగా కూడా ఉన్నట్టు ఉంది కదా అమ్మ” అన్నాడు.

“అవును అంకుల్, అందుకే ఆ అన్నం తినటం లేదు మీరు అయినా చెప్పండి అంకుల్” అని ఏడిచింది

” నీలాంటి అందమైన అమ్మాయిలు ఎడవకూడదు, అయిన నీకు పాచి పోయిన అన్నం పెట్టినవాడు ఎందుకు పెట్టారో చెప్పలేదా. నువ్వు నేను చెప్పినట్టు వింటే నీకు బిర్యానీ పెట్టిస్తా రోజు మంచి అన్నం పెడతారు. వింటావా మరి” అని అతని చేతులు రెండు అప్పటికి పెరగని తన యదను నొక్కేసాయి, ఏమీ తెలియని పాప కడుపులో అకాలి నొప్పి, రొమ్ములపై రాక్షసుడి చేతి గాటుల నొప్పి ఏమీ తెలుస్తుంది పాపం తనకి అలాగే ఏడుస్తూ నిలబడి పోయింది.)

అలా చూస్తూ వెంటనే తనని అడిగా

“ఏమైంది ఎందుకు అలా పాడైన అన్నం తిన్నావు? అడిగితే దారిలో ఏదో ఒకటి తీసుకునే వాళ్ళం కదా ” అని అన్నాను, తనలో నుండి బయటకు రావటానికి తను అనుభవించిన బాధ పురిటిలో పిల్లాడి లా ఏడుస్తుంది.
మళ్ళీ నేనే మెల్లగా తన చేతిని నిమురుతూ ఏడవకు అని ధైర్యం ఇస్తూ

” ఏమైంది అసలు ఎందుకు అలా ఏడుస్తున్నావు”అని అడిగా

” నాకు చిన్నప్పటి నుండి ఆకలి అయితే వాళ్ల ఆకలి తీర్చమన్న మొగవాళ్లను చూసాను ఇవ్వాళ మొదటిసారి
నాకు నేను అమ్ముడు పోయి వచ్చిన, నాకు ఆకలి అయి తింటుంటే పొర మారితే ప్రేమగా తట్టి, అది మంచిది కాదు అని నా కోసం వేడి వేడి గా వండి పెట్టిన మిమ్మల్ని చూసాను. డబ్బులు పెట్టి నన్ను ఇక్కడికి తెచ్చుకున్నా నా బాధని చూసి మీ కనులలో ఉద్భవించిన నీటిని చూసాను. నా జీవితం లో ఒక మంచి మొగాడు ఉంటాడు అని అనుకోలేదు. మీ రూపంలో ఇవ్వాళ ఎదురుగా చూసాను” అని అన్నది.

“మీకు అభ్యతరం లేకపోతే ఏమీ జరిగిందో చెప్తారా ” అని అడిగాను, తను తన జీవితంలో జరిగినవి అన్ని చెప్పింది తను ఎందుకు ఇలా మారాలి అనుకున్నది చెప్పింది. నిజానికి నేను తనలాగే అనాధని కానీ నేను అబ్బాయి కాబట్టి ఈ పొజిషన్ కి వచ్చాను తను అమ్మాయి కనుక ఆ పొజిషన్ కి వచ్చింది అనిపించింది. తనే నా జీవితానికి తోడు అనిపించింది భూమి మీద నాకన్నా అదృష్టవంతుడు లేడు అనిపించింది తనకి అండగా ఉండాలి అనిపించింది క్షమించాలి తనే నాకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది అనిపించింది. అందుకే తనిని అడిగేసా

” మీకు అభ్యతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా” అని.

తన కళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యంగా నా వైపు చూశాయి,

నేను మళ్ళీ తనని అడిగాను

“నేను అడిగింది నిజమే మీరు నన్ను పెళ్ళి చేసుకుంటారా”

“అసలు మీరు ఏమీ మాట్లాడతున్నారో మీకు అర్థం అవుతుందా”

“బాగా తెలుసు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని అడిగా,
ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే తాళి కడతా చెప్పండి”

“మీకు అర్థం కావటం లేదు మీ స్థాయి వేరు నేను వేరు కడుపు కోసం వళ్ళు అమ్ముకునే నేను ఎక్కడ, కోరిక కోసం కనులు తెరిచి చూసే మీరు ఎక్కడ. వద్దు అండి ఇవ్వన్ని వినటానికి బాగుంటాయి అంతే”

“నాలోని బాధలకు భావాలు వేతకలేక ఆపేసిన నా కలం పాళీనీ అడుగు నా వేదన తాలుకా రోధన చెప్తుంది. ఏమన్నావు కోరికల అస కోరికల వెనక ఉన్న కష్టాలు ఎవరికీ కనపడవు కదా. అయినా నాకు కోరికలు ముఖ్యం అయితే డబ్బులు ఇచ్చిన వాడిని మంచం మీద ఉండాల్సిన వాడిని నీ ఎదురుగా ఉండను.

నీకు ఒకటి తెలుసా నీలాగే నేను ఒక ఆనాధానే అది తెలుసుకో, పురిటి లోని నన్ను కుప్పతొట్టిలో వేస్తే అక్కడ నుండి ఎంత మంది కాళ్లను తాకి ఎంత మందికి ఎదురు నిలిచి ఈ స్టేజ్ లో ఉన్నాను,

అందుకే నువ్వు అనాధావి అని చెప్పగానే మనం ఎందుకు ఒక కుటుంబం కాకూడదు అనిపించింది. అన్నిటికన్నా ముఖ్యం నీ మీద జాలితోనో సానుభూతితోనో కాదు నిన్ను బస్టాప్ లో చూడగానే నాకు నచ్చావు కానీ నువు ఎలా అనుకుంటావు అని చెప్పలేదు. నీ గతం విన్నాక నాకు ఒక తోడు దొరికింది అనుకున్నా అందుకే అడిగా”

“నాకు ఏమీ అర్ధం కావటం లేదు కొన్ని క్షణాల ముందు వరకు కష్టాలు కన్నీళ్లు తప్ప ఏమి లేని నా జీవితం, ఒక్కసారిగా ఇన్ని వరాలు ఎలా వచ్చాయి అని నేను అసలు ఎప్పుడు ఆ దేవుడిని కూడా మొక్కలేదు. అందుకే నాకు ఏమీ అర్ధం కావటం లేదు”

నేను ఒక్క నిమిషం అని చెప్పి పైకి వెళ్లి లాకర్ లోని మా అమ్మ తాళి తీసుకొని కిందకు వచ్చి తనకు ఎదురుగా కూర్చొని

” ఇది మా అమ్మ తాళి నన్ను కుప్ప తొట్టిలో వేసినప్పుడు నా మెడలో వేసి వెళ్ళింది అంటా, నాకు నా కుటుంబం నా వాళ్ళు అనటానికి గుర్తు ఇదే, ఇప్పుడు నువ్వు నా దానివి అని నమ్ముతున్నా. చెప్పు నువు ఒప్పుకుంటే ఇప్పుడే కట్టేస్త” అన్నా

” అసలు మొక్కని దేవుడు కనపడి వరం ఇస్తే ఇంకేం చెప్పాలి, మీ ఇష్టం” అని చెప్పి తను తల వచ్చింది

నేను నా చేతిలో తాళి తన మెడలో కడుతున్న,
సమయం తెలియదు బయట మాత్రం వర్షం జోరుగా కురుస్తూనే ఉంది మా పెళ్ళికి సకల దేవతలు అక్షింతలు వేసినట్టు, గాలి హోరుగా వీస్తుంది ఈ పెళ్లికి మంగళవాయిద్యాలలా, ఉరుములు మెరుపులు పోటీగా తొంగి చూస్తున్నాయి జరిగిన పెళ్లికి ఏడు అడుగులు వేయటానికి వెలిగించిన అగ్నిలా.

బంధువులు లేరు, వేద మంత్రాలు లేవు, ముహర్తం లేదు, ఉన్నది ఒకటే పునీతమైన మా హృదయాలు.

ఆ హృదయాలు ఇప్పుడు ఒకదానికి ఒకటి హత్తుకున్నాయి, ఇంకా ఎప్పటికీ అల హత్తుకునే ఉంటాయి.

ఇంతకీ వాళ్ళ పేర్లు చెప్పలేదు కాదా, వాళ్ల పేర్లు శశాంక్, సంధ్య. వాళ్లు ప్రేమ ఎప్పటికీ అలా నిలిచిపోవాలని నేను కోరుకుంటున్న.

Leave a Reply

Your email address will not be published.