ఏవండీ….ఎలాగూ అబ్బాయి దగ్గరికి వెళ్తున్నారు కదా..నేను చెప్పిన సంగతి వాడికి చెప్పండి
మరచిపోకుండా అన్నారు పద్మాక్షి గారు భర్త
భరద్వాజ గారితో…
“తప్పు పద్మా…నీ ఆలోచన తప్పు..అది మార్చుకో…అన్నారు” భరద్వాజ గారు…
‘ఏంటి తప్పు…కొడుక్కి పెళ్ళై ఐదేళ్లవుతోంది…
మనవడు..మనకి వంశోద్ధారకుడు కావాలనుకోవడం తప్పా…
ఇందులో అసహజమైన కోరిక ఏముంది’ అన్నారావిడ…
కోరిక ఉండటం సహజం…ఆ కోరిక తీరాలని అన్యాయంగా ఆలోచించడం తప్పు…
రెండు రోజుల క్రితమే కొడుకు మధు మురళి తండ్రికి ఫోన్ చేసి “మీతో మాట్లాడాలి ఓ రెండు రోజులు రండి నాన్నగారూ… అన్నాడు”…
ఈ విషయం భార్యకి చెప్పకుండా..హైదరాబాద్ తను పనిచేసిన ఆఫీస్ లో పని ఉందని…
స్నేహితులని కూడా కలిసి వస్తానని…
అలాగే కొడుకు కోడలిని చూసి వస్తానని బయలుదేరారు…
భార్యకి చెప్తే ‘కొడుకు ప్రత్యేకంగా ఎందుకు రమ్మన్నాడా అని ఊహించేసుకుని ఆలోచిస్తూ
ఉంటుంది’…
విషయం తెలిసాకా చెప్పొచ్చులే, అని ఆయన ఉద్దేశం…
ఆయన ఆరాత్రే కొడుకు దగ్గరికి హై టెక్ బస్ లో హైదరాబాద్ బయలుదేరారు…
కొడుకు కోడలు హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నారు…ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు…
ఇద్దరిదీ ప్రేమ వివాహం…
పెళ్లి అయ్యి ఐదేళ్లయింది…
ఎందుకో పిల్లలు ఇంకా కలగలేదు…
ఓ మూడేళ్లు పద్మాక్షి గారు కూడా ఊరుకున్నారు..
ఆ తరువాతే ఆవిడ సణుగుడు మొదలయ్యింది…
ముందు లోలోపలే వినీ వినీ వినిపించకుండా అనుకునే ఆవిడ, ఒక సంవత్సరం క్రితం గా పైకే అంటోంది…
ఇంకా కోడలు పిల్లల్ని కనడం లేదని…తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేస్తోంది…
భరద్వాజ గారు ఎప్పటికప్పుడు నచ్చ చెప్తూనే ఉన్నారు…
ఆవిడ ఆలోచన ఎంతవరకు వెళ్లిందంటే కొడుక్కి విడాకులు ఇప్పించి రెండో పెళ్లి చేయాలనేంత..
వాళ్ళకి ఇంకో కూతురు ఉంది. ..ఆ అమ్మాయి
బెంగుళూరు లో ఉంటుంది…తనకి ఒక బాబు.
తెల్లారి బస్ హైదరాబాద్ చేరాకా కొడుకు బస్ దగ్గరికి వచ్చాడు…
తండ్రి చేతిలో బాగ్ అందుకుని కార్ లో వెనక పెట్టి
తండ్రి కూర్చోగానే కారు స్టార్ట్ చేసాడు…
ఎందుకురా ఇంత దూరం వచ్చావు…నేను వచ్చేసేవాణ్ణి కదా అన్నారు కొడుకుతో ఆప్యాయంగా…
అదేంటి నాన్నగారూ… మీరు అంత దూరం నుండి నా కోసం వస్తే నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకోడానికి రాక పోవడమా అన్నాడు నవ్వుతూ…
ఇద్దరూ ఇంటికి చేరారు…
కోడలు మయూఖ ఆప్యాయంగా ఎదురొచ్చింది…’రండి మామయ్యగారూ అంటూ’…
కోడలు తమిళ బ్రాహ్మిన్…అయ్యంగార్లు…
తెలుగు బాగానే నేర్చుకుంది…
‘బావున్నారా…అత్తయ్య ఎలా ఉన్నారు అని అడిగింది’.. భరద్వాజ గారు నవ్వుతూ సమాధానం ఇచ్చారు…
ఆయన ఫ్రెష్ అయ్యి వచ్చాకా వేడి వేడి ఫిల్టర్ కాఫీ ఇచ్చింది.
ఆయన నవ్వుతూ “నీ చేతి కాఫీ తాగి ఎన్నాళ్లయ్యిందో అమ్మా…ఐ లవ్ ఇట్” అంటూ తీసుకున్నారు..
తొందరగా టిఫిన్ పెట్టేస్తాను మావయ్యా అంది మయూఖ…
పర్లేదమ్మా నెమ్మదిగా చెయ్యి…కంగారు పడకు…
‘ఇంకో విషయం ఇద్దరూ ఆఫీస్ లకి వెళ్లిపోండి…
నేనో గంట విశ్రాంతి తీసుకుని నాస్నేహితులని కలిసి వస్తాను….
నాకోసం భోజనం తయారు చెయ్యకు…నేను సాయంత్రానికి వస్తాను…నాకో ఇంటి కీ ఇవ్వండి…సాయంత్రం అందరం కలుద్దాం అని చెప్పేసారు…
రేపు, ఎల్లుండి మీకు సెలవే కదా ఎలానూ అన్నారు’ …
ఆయన అంత క్లారిటీ తో చెప్పాక సరే ఆనక తప్పలేదు ఇద్దరికీ…
మళ్లీ రాత్రి అందరూ కలిశారు…
కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నారు…
ఆ మరునాడు శనివారం…కొడుకు కోడలికి సెలవు…
ఆ రోజు పొద్దున్న కొడుకూ తండ్రీ వాకింగ్ కి వెళ్లారు…
పార్క్ లో ఒక బెంచ్ మీద కూర్చున్నాకా…
“ఇప్పుడు చెప్పరా అన్నారు భరద్వాజ గారు కొడుకుతో…
ఏంటి నాతో మాట్లాడాలన్నావు అంటూ’…
అవును నాన్నగారూ…
మేము ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాం…అది ముందు మీకు చెప్పాలని….
మాకు పెళ్లి అయ్యి ఐదేళ్లు అవుతోంది…
మీ అందరి మనసుల్లో ఉన్నట్టే మాకూ ఉంది…పిల్లల గురించి ఆలోచన…
ఇద్దరం చెక్ అప్ చేయించుకున్నాం. .
ఎవరిలో లోపం ఉంది అన్నది అప్రస్తుతం…
మందులు వాడితే భవిష్యత్తు లో పిల్లలు కలిగే అవకాశం ఉంది.. లేదు కూడా….
అయితే అలా ఎదురుచూస్తూ రిస్క్ తీసుకోవడం మాకు ఇష్టం లేదు…
అందుకని ఒక పాప ని గానీ బాబు ని గానీ దత్తత చేసుకుందామని ఆలోచన వచ్చింది….
అప్లై చేసామ్ ఒక ఎన్ జీ ఓ సంస్థ ద్వారా…
వాళ్ళు మా డీటెయిల్స్ అన్నీ విచారించి నిర్ణయిస్తారు…
అబ్బాయిని ఇవ్వొచ్చు…అమ్మాయిని ఇవ్వొచ్చు…
మా అదృష్టం బావుండి తరువాత ఎప్పుడైనా మాకు ఇంకో సంతానం కలిగితే మంచిదే…
లేక పోయినా ఒక సంతానం తో అడజస్ట్ అవుతాం…
ఈ విషయం మీకు చెప్పాలను కున్నాం….మీ ఆశీర్వాదం.. ప్రోత్సాహం..సపోర్ట్ కావాలి నాన్నగారూ… అదే మాకు కొండంత బలం…
ఇంక అమ్మకి చెప్పి ఒప్పించే బాధ్యత కూడా మీదే…
అమ్మకి ఇన్నాళ్లూ మయూఖ మీద అనుమానం…లోపం తనలో ఉందేమో అని…
ఈ విషయం కూడా చెప్పండి అమ్మకి….
అందుకే రమ్మన్నాను నాన్నగారూ…
మీ స్పందన ఏంటి…తప్పు చేస్తున్నామా…
రైట్ చేస్తున్నామా…అని అడిగాడు మురళి…
అంతా కళ్ళు మూసుకుని విన్న భరద్వాజ గారు కళ్ళు తెరచి కొడుకుని కౌగలించుకున్నారు…
ఆ తరువాత చెప్పారు…
లేదురా…మీరు మంచి పని చేస్తున్నారు… అలాగే కానివ్వండి….
మనం పెంచితే మనవాడే…..!
పాప కావొచ్చు…బాబు కావొచ్చు…!
నా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది…!
మీ అమ్మని కూడా, కన్విన్స్ చేసే బాధ్యత నాదే… మీరు నిశ్చింతగా ఉండండి…!
ఆ పనులలో ఉండండి…అని భుజం తట్టారు…!
థాంక్యూ నాన్నగారూ… నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారని…
అందుకే మీకు చెప్పాను… అన్నాడు…
ఇద్దరూ ఇంటికి వెళ్లారు…కోడలికి కూడా ధైర్యం చెప్పి, భరోసా ఇచ్చి.. ఆ రాత్రికే ఇంటికి బయలుదేరతాను అన్నారు…
కొడుకూ కోడలూ కాళ్ళకి దణ్ణం పెడుతుంటే…ఆయన కళ్ళు చెమర్చాయి…
చాలా మంచి పని చేస్తున్నారు…ఆ దేవుడి ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది అని దీవించి బయలుదేరారు….
ఆయనకి కొంచెం ఆందోళనగానే ఉంది…భార్య ఎలా తీసుకుంటుందో ఈ విషయం అని….
తెల్లారి ఉదయం ఇంటికి వెళ్లిన కాసేపటికి….
భార్య అడగనే అడిగింది ఆయన్ని…
‘తను చెప్పిన విషయం ఏమైందని’…
ఆయన నవ్వుతూ అన్నారు…నువ్వు చెప్పిన విషయం అడగాల్సిన అవసరం రాలేదు పద్మా…
ఎందుకంటే, త్వరలో నీకు మనవడో మనవరాలో రాబోతున్నారు…అని…
ఆవిడ ఆశ్చర్యంగా ‘అవునా ఇంత శుభవార్త నేను అడిగితే గానీ చెప్పరా…భలే వారండీ’ అందావిడ…
వెంటనే గాలిలో దణ్ణం పెడుతూ “దేవుడా కరుణించావా స్వామీ” అని పైకే అనేసుకున్నారు ఆవిడ…
ఆయన అన్నారు నీ పూజలు ఊరికే పోలేదు…
కలిసొచ్చే కాలం వచ్చింది…అందుకే
మనకి నడిచొచ్చే మనవడో మనవరాలో వస్తోంది అన్నారు..నవ్వుతూ…
ఆవిడ అయోమయంగా చూస్తుంటే ఆవిడని కూర్చో పెట్టి…అంతా పూస గుచ్చినట్టు చెప్పారు…
చెప్పి…
పద్మా.. కంటేనే పిల్లలు కాదు…ఒక పసిగుడ్డుని పెంచి పెద్ద చేస్తే వాడూ కన్న కొడుకు కంటే ఎక్కువే…
ఆవిడ మరి మన వంశం…అంటూ అంటూ ఉంటే…
ఆయన అన్నారు నాకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు…వాళ్ళకి మనవలు ఉన్నారు…
మన వంశానికి ఢోకా లేదు…నువ్వేమీ వంశం అంటూ ఓ బాధ పడిపొక్కరలేదు…మనదేమీ
శ్రీ కృష్ణదేవరాయల వంశం కాదు…మనం సామాన్యులం…
పోతే పసిగుడ్డుని.. ఏ సంప్రదాయంలో పెంచితే అదే సంప్రదాయం లో పెరుగుతుంది…
నీకు ఇంకో విషయం చెప్పాలి..ఇన్నాళ్లూ చెప్పలేకపోయాను…ఇప్పుడు చెప్పక తప్పడం లేదు..
“అచ్చం మా నాన్నగారి లా నేను ఉంటానని నువ్వు ఎప్పుడూ అంటూ ఉంటావు” కదా…
మా నాన్నగారు పోతూ పోతూ నాకో షాకింగ్ న్యూస్ చెప్పారు…
దిమ్మ తిరిగి పోయింది నాకు…
ఇప్పుడు నీకే చెప్తున్నా…గుండె గట్టిగా చేసుకుని విను…
నేను మా నాన్న సొంత కొడుకుని కాదట…
నాకు మూడేళ్లప్పుడు నేను జాతర లో దొరికానట…
నా తల్లితండ్రుల కోసం ఎంత ప్రయత్నించినా, లాభం లేక పోయిందట…
చివరికి ఇంటికి తెచ్చి పెంచుకున్నారట…తరువాత తమ్ముళ్లు, చెల్లెలు పుట్టారట…
అయినా నాన్నగారు నాకు పెద్ద కొడుకు స్థానమే ఇచ్చి పెంచి పెద్దచేసి చదువు చెప్పించారు…ఆస్తిలో వాటా ఇచ్చారు…
అమ్మ కూడా సొంత కొడుకులా పెంచింది….
తమ్ముళ్ళు ఎంతో గౌరవం ఇస్తారు…
ఎవ్వరికీ, కనీసం నా తోబుట్టువుల కి కూడా ఈ విషయం తెలీదు…
నేను అడిగాను… నాన్నగారూ …! మరి మీరు మీ కోడలికి చెప్పకుండా మోసం చేశారు కదా అని…
దానికేమన్నారో తెలుసా…మోసమేవిటి రా…?
నువ్వు నా కన్న కొడుకువే… కాదని ఎవరంటారో అనమను చూస్తా…..!
నీకు నా ఇంటి పేరు ఇచ్చాను..
నీకు మా గోత్రం పేరే పెట్టాను…
నేను మా సంప్రదాయం తోనే పెంచాను.
నేను పోతే ఇంకెవరికీ తెలీదు నీకు తప్ప….
నువ్వు ఇప్పుడు నీ భార్యకి పనిగట్టుకుని చెప్పక్కరలేదు అని వార్నింగ్ ఇచ్చారు….
ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం, అవసరం వచ్చింది కాబట్టి తప్పక …చెప్పాను…
నేను ఈ కుటుంబం వాడిని కాదని నేను చెప్తే గానీ తెలిసిందా నీకు…?
మరి ఇప్పుడు నన్ను వదిలేస్తావా…అనగానే…
“ఆవిడ రామ రామ అంది” అప్రయత్నంగానే…
అదేమరి…మనం పెంచిన బిడ్డ మన బిడ్డే అవుతాడు…మనం ఎలా పెంచితే అలా పెరుగుతాడు…మనం నేర్పిన సంస్కారమే, సాంప్రదాయమే వస్తుంది..
మన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డయినా… పెరిగి పెద్దయ్యి ఎలా తయారవుతాడో ఎవరికి తెలుసు…?
మన అబ్బాయి విషయం… మన అమ్మాయికి అల్లుడికి తప్ప ఎవరికీ చెప్పక్కరలేదు…
అమ్మాయి అల్లుడు తప్పక అర్ధం చేసుకుంటారు..
మన అబ్బాయి సంతానం ఎవరయినా మన వారసులే…
ఇంక కోడలు మీద ఏమైనా అసహనం ఉంటే మరచి పో…
ఇక్కడ ఆ అమ్మాయి తప్పు కూడా ఏమీ లేదు…
ఆ అమ్మాయి కూడా త్యాగం చేస్తోందని తెలుసుకో…అన్నారు…
పద్మాక్షి గారు నోరు కొంచెం తెరచి, షాక్ ల మీద షాక్ లని జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తున్నారు….
ఆవిడని అలా కొద్ది సేపు వదిలేయడమే ఉత్తమమని…
ఆయన లోపలికి వెళ్లిపోయారు.
వెళ్ళి…తండ్రి ఫోటో ముందు నిలబడి, మనసులో అనుకున్నారు….
నాన్నా…నన్ను క్షమించండి…
మీ కన్న కొడుకునైనా, కాదని అబద్ధం ఆడాను…
లేని మిమ్మల్ని, వాడుకున్నాను…తప్పలేదు…
మీ కోడలిలో, మంచి మార్పు తేవాలనే, ఇలా చేసాను నాన్నా…
నా భార్య నేను చెప్పింది నమ్మొచ్చు…నమ్మకపోవచ్చు..
తను అంత తెలివి తక్కువది కాదని తెలుసు….
కానీ ఇలా చెప్పడం వెనక నా ఉద్దేశం తప్పక అర్ధం చేసుకుంటుందని, ఏదో చిన్న ఆశ అంతే…
భవిష్యత్తు లో తన కోడలిని, చిన్న చూపు చూడకుండా ఉండి, తనకి రాబోయే మనవడికో, మనవరాలికో తన గుండెల్లో స్థానం ఇచ్చి తన ప్రేమని పంచితే అంతే చాలు అనుకున్నారు ఆయన.