144
0

మరువనే

144

ఇంట్లో ఇంత పని పెట్టుకుని ఈయన ఎక్కడికి వెళ్లారు…..

“ఏవండీ….ఏవండీ…. ఏవండోయ్ అబ్బబ్బ ఎక్కడున్నారు” .

” ఇక్కడే వున్నాను రాజ్యం…..”

” మీకు ఒంట్లో నలతగా ఉంది అన్నారని వీటిలో కోంచెం మిరియాల పొడి వేసి తెచ్చాను తీసుకోండి …. అయినా నన్ను పాలు తెమ్మని మీరు ఇక్కడేం చేస్తున్నారు “

” ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాను “

” సరిపోయింది ఇంట్లో అంత పని పెట్టుకుని మీరేంటి తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చున్నారా…. మీరు ఇలాగే ఉండండి నాకు చాలా పని ఉంది నేను వెళ్తున్నా”

” అబ్బా ఎంతలా పరిగెడతావు కాస్త నిదానించు…. ఇక్కడికి రా ఇలా కూర్చో కాసేపు “

” అది కాదండి లోపల….”

ఆ ..ఆ”అవన్నీ ఎప్పుడూ ఉండేవే కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఇదిగో ఈ పాలు తాగు”

“అయ్యో అది మీ కోసం తెచ్చింది…. నేను తర్వాత తాగుతాను మందు మీరు తాగండి”

” తాగుతావ్…. తాగుతావ్ చూస్తూనే ఉన్నాగా ఈమధ్య అసలు ఎలా అయిపోతున్నావో , సమయానికి తింటున్నావా నిన్ను నువ్వు చూసుకుంటున్నావ ఎలా ఉన్నావో…..”

“నాకేం నేను ఆరోగ్యంగానే ఉన్నాను “

” కనిపిస్తూనే ఉంది ఎంత ఆరోగ్యంగా ఉన్నావో…. నీ కళ్ళు ,నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఎంత అలసిపోతున్నావో…. వొద్దురా అంటే వినవు….
అలా కాదు రాజి అసలే ఇంటి పని అంతా చేస్తావు,ఆ పై ఉద్యోగం , ఇప్పుడు పెళ్లి పనులు……వీటన్నింటి మధ్య శారీరకంగా ఎంత నలిగి పోతున్నావ్ ఎవరి హెల్ప్ తీసుకోవు, మేము చేస్తాము అన్నా ఒప్పుకోవు, ఒక్కదానివే ఎంతని కష్ట పడతావు.

” ఒక్కదాన్ని ఏంటండీ ….మన పని అమ్మాయి ఉంది కదా”

” ఆ ….వుంది ఎందుకు ఆ అమ్మాయి ముందు పని చేసుకుంటూ పోతుంటే …. నువ్వు వెనక నుంచి అదే పని చేసుకుంటూ వెళ్తావ్” అర్థం చేసుకో రాజి…. కనీస ఉద్యోగ మైన మానరాదు పెళ్లి తర్వాత ఎలాగో మానేస్తాను అన్నావు కదా అది ఏదో ఇప్పుడే మానేస్తే అయిపోతుంది….ఏం అంటావ్ “

” ఏమంటాను…. కుదరదంటాను”

” నీ ఆరోగ్యం గురించేగా నా బాధ….నీకేందుకు అర్థం కావట్లేదు,అందరి గురించి ఆలోచిస్తావే కాని నీ గురించి నువ్వు పట్టించుకోవు”

” మీరున్నారుగా నన్ను చూసుకోడానికి….ఇక పని అంటారా మీరు, పిల్లలు నా ముందు అలా ఉంటే చాలు ఎంత పని ఐనా,ఎంత సేపు అయినా నాకు కష్టమే కాదు, ఇంకా…..హ పెళ్లి పనులు అంటారా…. మన బంగారం పెళ్లి, మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం…. అందులోనూ మన చిట్టి తల్లి కోసం చేసే ఏ పనిలో ఐనా నాకు చాలా ఆనందంగా ఉంటుంది, మీరన్నది నిజమే నేను శారీరకంగా అలసి పోతున్నానేమో కాని మానసికంగా చాలా ఆనందంగా ఉన్నాను….ఇక ఉద్యోగం అంటారా అది నాకు అసలు సమస్యే కాదు ఇక ఆ విషయంలో మాత్రం నన్ను ఇలా అడిగి ఇబ్బంది పెట్టకండి… ప్లీజ్ “

” ఎందుకు రాజి అన్ని విషయాలలో నా అభిప్రాయమే నీ అభిప్రాయంగా ,నా ఇష్టమే నీ ఇష్టంగా ఉండే నీవు ఈ విషయంలో ఎందుకు నా మాటతో ఏకీభవించవు”

” ఎప్పటికీ మీ ఇష్టమే నా ఇష్టం అండీ అది ఇప్పుడే కాదు ఎప్పుడు అలానే ఉంటుంది….కాని మీరు మా కోసం,పిల్లల సంతోషం వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంత కష్ట పడతారో నాకు తెలిసు అది తెలిసి కూడా నేను మీకు ఆర్థికంగా తోడు ఉండకూడదా …. ఐనా భార్య అంటే ఏమనుకుంటున్నారు మీ జీవితంలో ఆనందమైనా ,బాధైనా ఏదైనా కాని అందులో సగం వాటా మాదే అర్థమైందా… అయినా నేనేమీ ఎక్కువ కాలమేమి చేయనులే భయపడకండి ఏదో వేడినీళ్లకి చన్నీళ్ల తోడు “

” అది కాదు రాజి…”

” అదంత సరేగానీ ఏంటో రాజా వారు ఈ వేళలో ఇక్కడ కూర్చొని ఏమ్ ఆలోచిస్తున్నారో….అంత సీరియస్ విషయమా “

” అలాంటిది ఏమి లేదు….ఈ చల్లని గాలి,ఆ చందమామ ఉన్నాయి చూసావు మన మనసుని ఎటో తీసుకెళ్తాయి”

” అబ్బో అయితే మరి మీ మనసుని ఎటు తీసుకెళ్ళింది ఏంటీ “

” అబ్బే అలాంటిదేమీ లేదు రాజి ….ఏదో ఊరికే అలా చెప్పాను అంతే ….సరే పద లోపలికి వెళ్దాం”

” ముందు మీరు చెప్పండి …. తర్వాత వెళ్దాం”

” అది తప్పదంటావా”

” తప్పదు చెప్పాల్సిందే…. ఏంటి అంత సిగ్గు పడుతున్నారు లవ్ హ”

“లవ్ అంటే లవ్ కాదు అది ….ఎలా చెప్పాలి “

” క్రష్ హ”

” హా క్రష్ …. ఫస్ట్ క్రష్ “

“మరి నేను మొత్తం చెప్పే వరకు నువ్వు మధ్యలో మాట్లాడకూడదు సరేనా “

” సరే….సరే ” అవును మీ క్రష్ పేరు చెప్పలేదు

” తన పేరు నయనతార “

” ఏంటి సినిమా హీరోయిన్ నయనతార నా “

” కాదు ….నా హృదయ రాణి నిజానికి నాకు తన పేరు ఫలానా అని కూడా తెలీదు ….కాని తనకి ఆ పేరు సరిగ్గా సరిపోతుంది “

” సరే కాని ముందు తనని ఎక్కడ, ఎప్పుడు చూసారో చెప్పండి “

” అది నా కాలేజీ అయిపోయిన రోజుల్లో….”

“వామ్మో అంత వెనక్కి వెళ్ళారా”

“రాజి …..”

“సారీ …సారీ చెప్పండి “

“నా కాలేజీ అయిపోయాక నా ఫ్రెండ్ అదే రఘు ఉన్నాడుగా ఎప్పటి నుంచో వాళ్ళ ఊరు రమ్మని పోరు పెడుతుంటే దీపావళి పండగకి వాళ్ళ ఊరికి వెళ్ళాను…… ప్రయాణ బడలిక వల్ల ఉదయం అంతా పడుకొని సాయంత్రం ఆ ఊరి గుడిలో ఆ రోజు పూజ బాగా చేస్తారని చెప్తే నేను ,వాడు కలిసి గుడికి వేళ్ళి తిరిగి వస్తుంటే….. అప్పుడు చూసాను నా తారని నా హృదయ రాణిని …. నెమలి కంఠం రంగు లంగా వోని వేసుకుని చిన్న పిల్లలతో కలిసి తాను ఒక చిన్న పిల్లల వాళ్ళతో కలిసి చిచ్చు బుడ్డి వెలిగించి కేరింతలు కొడుతుంటే …. చెబితే నువ్వు నమ్మవు కాని తొలి ప్రేమ సినిమా చూసినప్పుడల్లా నా లైఫ్ లో జరిగిందె తొలి ప్రేమ సినిమాలో పెట్టారెమో అనిపిస్తుంది ….ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ కి , కీర్తి రెడ్డిని చూడగానే ఏమని పించిందో తెలీదు గాని…. నాకు మాత్రం నా తారని చూడంగానే నా జీవితంలో ఏదో కొత్త వెలుగు నాలో ప్రవేశించింది….అది ఏంటో కూడా తెలియని వింత అనుభూతి నన్ను ఆవహించింది….. పెద్ద పెద్ద కళ్ళు, బారు జడ,ఆ మోములో ఉన్న అమాయకత్వం,తన నవ్వు, తన అల్లరి ఎంత క్యూట్ గా అంటే అంత క్యూట్ ఉండేది….అప్పటి వరకు నేను ఎంత మందిని చూసినా కలగని ఫీలింగ్ తనని చూసిన ఆ రెండు క్షణాలలోనే కలిగింది….కాని ఆ ఫిలింగ్ కి ఏ పేరు పెట్టాలనిపించలేదు కాని నాకది నచ్చింది….

ఆ రోజు మొత్తం నాకు తన అలోచనలతోనే గడిచింది….ఆ తర్వాత కూడా రఘుకి తెలియకుండా రోజు ఆ అమ్మాయి ఇంటి దగ్గరె తిరిగేవాడిని తను కనిపిస్తే చాలు అని …….. అసలు ఒక్కో సారి తన ధైర్యం చూసి ముచ్చటేసేది…..

మొదటి సారి చూసినప్పుడు తన అల్లరి, అమాయకత్వం నచ్చాయి…. తర్వాత తన ధైర్యం కూడా నచ్చింది…..తన మీద ఇష్టం ఇంకా ఇంకా పెరిగి పోయింది……

ఎన్నో కవితలు కూడా రాసేవాడిని ….అదేంటో అంతకముందు ఒక్క లేఖ కూడా రాయడం రాని వాడిని….నా తారని చూసినప్పట్నించి కవితల మీద కవితలు పోటీపడి మరీ వచ్చేవి…..

తార ….తార నా కోసం దివి నుంచి భువికి దిగి వచ్చిన తారవా…. లేక నా జీవితంలో వెలుగులు నింపడానికి వచ్చిన తారవా…. నిన్ను ఏమని అనుకోను…..
ఏమని పిలవాలి నిన్ను….

ఇదే కాదు ఇలాంటివి చాలా రాసేవాడిని ….. అలా కొన్ని వాళ్ళ ఇంట్లో తనకి కనిపించేలా విసిరి వచ్చేవాడిని….ఒక వైపు అలా ఎందుకు చేశానా అని అనిపించేది ….. మరోవైపు తను వాటిని చదివిందా లేదా అని ఆత్రుత….. ఆ సందిగ్ధంలోనే రోజులు గడిచేవి….

ఒక రోజు నాకు ఉదయమే ఓ ఫోన్ కాల్ వచ్చింది…. ఎప్పుడో అటెండ్ అయినా ఇంటర్యూకి సెలక్ట్ అయ్యానని రెండు రోజుల్లో జాయిన్ అవ్వాలి అని దాని సారాంశం……
నా తార ….నా జీవితంలోకి వచ్చిన వేళా విశేషం అనుకుంటా లేకపోతే ఎప్పుడో అటెండ్ అయినా ఇంటర్యూ కి ఇప్పుడు సెలక్ట్ అయ్యానని కాల్ రావడం ఏంటి…..

ఇక ఆ రోజు ఎలాగైనా తన గురించి తెలుసుకుని తనతో మాట్లాడదామనుకోని వాళ్ళ ఇంటి దగ్గరకి వెళ్ళాను కానీ ఎందుకోఒక్క నిముషం అది కరెక్ట్ కాదనిపించింది….. ఉద్యోగంలో చేరి తర్వాత వెళ్ళి మాట్లాడితే వాళ్ళ అమ్మ, నాన్న కూడా నా ప్రేమని అంగీకరిస్తారేమో అని అనిపించి అక్కడినుంచి వెళ్లిపోయాను…..

ఉద్యోగంలో చేరిన కొన్ని రోజుల తర్వాత ఎన్నో ఆశలతో, ఆనందంగా ఆ ఊరికి వెళ్ళాను రఘు దగ్గరకి కూడా వెళ్లలేదు నేరుగా తార వాళ్ళ ఇంటికి వెళ్లాను కానీ అక్కడ ఖాళీ ఇల్లు దర్శనమిచ్చే సరికి ఏం చేయాలో,అసలు ఏమైందో అర్ధం కాలేదు….. వెంటనే రఘు దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్పి వాళ్ళ గురించి ఏమైనా తెలుసేమో అని అడిగా….. వాడికి తెలియదు అని చెప్పాడు…..
రఘు వాళ్ళ అమ్మగారిని అడిగాము ఆవిడ చెప్పింది విని షాక్ అయ్యాను….” సడెన్ గా వాళ్ళ నాన్న గారికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది అని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారంట”…. కనీసం వాళ్ళు ఎక్కడి వెళ్ళారో , అసలు వాళ్ళ గురించి ఎటువంటి సమాచారం ఎవరికి తెలియదంటా అది విని ఇంకా ఆశ్చర్యమేసింది…… కేవలం తన వివరాలు మాత్రమే తెలుసాయి…….చాలా బాధపడ్డాను ఏం చేయాలో అర్థం కాలేదు….. ఇక ఒక్క క్షణం కూడా ఉండాలనిపించక వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయాను….

తన వల్లే వచ్చింది అనుకున్న ఉద్యోగం కూడా సంతోషాన్ని ఇవ్వలేదు…… ఈ లోపే మా అమ్మ వాళ్ళు కూడా పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు….. వాళ్ళకి చెప్పలేను….. తను ఎక్కడుందో తెలియదు….. ఎన్ని పెళ్లి చూపులకు రమ్మని చెప్పినా నేను వేళ్ళేవాడిని కాదు….. ఏమనుకున్నారో ఏమో ఆ తర్వాత నుంచి నన్ను అడగకుండా వాళ్ళే వేళ్ళేవారు…… సడెన్ గా ఒక రోజు అమ్మాయి నచ్చింది అని …..తాంబులాలు కూడా మార్చుకున్నాం….. వచ్చే నెలలో పెళ్లి అని బాంబు పేల్చారు ….. అసలు ఒక్క మనిషికి జీవితంలో వెంట వెంటనే ఇన్ని షాకులు తగిలితే ప్రశాంతంగా ఎలా బ్రతకగలడు…… పెళ్ళి సంబంధాలేగా ఈ లోపు తన గురించి ఏమైనా తెలిస్తుందెమోనని నేను ఆ ఆలోచనల్లో ఉండగానే ….. నెల రోజుల్లో పెళ్లి అన్నారు…. పెళ్ళి అనగానే మొదట నా తారనే నా మనసులో మెదిలింది….. వేంటనే వాళ్ళ ఊరికి వెళ్ళాను…… మనసులో ఏదో చిన్న ఆశ తన గురించి ఏదైనా తెలుస్తుందెమో అని….. కాని ఎప్పటిలానే నిరాశే ఎదురయింది…..

ఇక నా తార నా జీవితంలో ఉండదేమో అని ఏంతో బాధ పడ్డాను……… అన్ని బాగుండుంటే మా అమ్మ,నాన్నలు
నా ప్రేమని అంగీకరించేవారే ….. కాని అసలు తను ఎక్కడుందో , ఎటువంటి పరిస్థితులలో ఉందో, అసలు తనకి నేను నచ్చుతానో లేదో, తన జీవితంలో వెరేవరైనా
ఉన్నారా ….. ఇలాంటివి ఏమి తేలియకుండా ఎవరికైనా ఏమని చెప్పను……. నా ఇష్టం నన్ను చేరలేదు…….కనీసం అమ్మ వాళ్ళైనా సంతోషంగా ఉంటారని ఆ పెళ్లికి ఒప్పుకున్నాను…….

ఇక తన గురించే ఆలోచిస్తు నా జీవితంలోకి ఎన్నో ఆశలతో అడుగు పెట్టబోతున్న నా జీవిత భాగస్వామిని బాధపెట్టడం భావ్యం కాదనిపించింది…….. తనని మర్చి పోవడం జరగని పని అని తెలిసిన….. కనీసం తన గురించి ఆలోచించకుండా ఉండటమే నయం అని నా మనసుకి సర్ది చెప్పుకుని నిన్ను వివాహం చేసుకున్నాను”……….

” అబ్బో….. ఎంత ప్రేమ ఉంటేనో ఇంత కాలమైనా ఇంకా మీ మనసులోనే ఉంది ఆ తార…….. అవును తన గురించి వివరాలు తెలిసాయి అన్నారు తన పేరేంటి……

“తన పేరు…… రాజ్యలక్ష్మి”

” ఓ నా పేరే …… కాని తార నే బాగుంది కదండీ “

” రాజి నీకు ఇంకా అర్థం కాలేదా….. నా తార ఎవరనేది “

” ఇది మరీ బాగుంది …. మీ తార ఎవరో నాకెలా తెలుస్తుంది…… అసలు తన గురించి తెలిసిందే ఇప్పుడైతే “

” నా తారవి…… నీ…వే రాజి “

” ఏంటి నేనా మీ తారని….. ఏం మాట్లాడుతున్నారు…… నేను మీ తారనా ….. అదెలా సాధ్యం…. అసలు మిమ్మల్ని నేను పెళ్లికి ముందు ఎప్పుడు చూడనేలేదు …. అసలు మిమ్మ….. ఆగండాగండి అంటే అప్పట్లో ఏవో పిచ్చి పిచ్చి కవితలు రాసి మా ఇంట్లో పడేసింది మీరేనా”

” అవేం పిచ్చి పిచ్చి కవితలు కాదు అది నా ప్రేమ…… నీకు ఇంకా అవి గుర్తున్నాయా”

” చదివితేనేగా గుర్తుండడానికి…… అసలైనా నేను మీతో మాట్లాడను …. మీ వల్ల నేను ఎంత బాధపడ్డానో తెలుసా”

” నా వల్లనా …. నేనేం చేసాను….. అసలేం జరిగింది “

” ఏం చేసారా….. ఏం చేసారో మీకు తెలియదా….. అసలు జరిగిందంతా మీరు వేసిన ఆ కాగితాల వల్లే ……. వాటిని మా పనమ్మాయి చూసి మా అమ్మకి ఇస్తే, మా అమ్మేమో మా నాన్నకి చూపించింది అది చదివిన మా నాన్న చాలా కోపంగా నా దగ్గరికివచ్చి నన్ను అడిగారు…… నాకేం తెలీదు అని చెప్పా….. నా గురించి తెలిసిన మా నాన్న నన్ను నమ్మారు…… కాని ఇలాంటి ఆకతాయిలు చేసిన పని వల్ల నా పెళ్లికి ఎటువంటి ఆటంకాలు వస్తాయో, పరువు పోతుంది అని….. ఇష్టం లేకపోయినా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని తీసుకెళ్లారు…….. నా స్నేహితులను కూడా కలుసుకోలేక పోయాను, కనీసం నా చివరి సంవత్సర పరీక్షలకు కూడా పంపించమన్నారు…… అప్పుడు ఆ పరీక్షలు రాయడానికి పడిన కష్టాలు అంతా ఇంతా కాదు…… నేను ఉద్యోగం మానక పోవడానికి ఒక రకంగా అదీ ఒక్క కారణమే……… అసలు మీకు నేనంటే ఇష్టమైతే ధైర్యంగా ముందుకు వచ్చి మా నాన్నతో మాట్లాడాలసింది …… అంతే కాని ఇలా చేయడం మీకైనా కరెక్ట్ అనిపించిందా…… మీదెముంది ఇష్టం వచ్చినట్లు చేస్తారు ఆ తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఎన్ని సమస్యలు ఎదుర్కొవాలో తెలుసా…… అవును ఇంత కాలం ఈ విషయం నాకెందుకు చెప్పలేదు”

” అది నేను చెబుదాం అనే అనుకున్నాను కాని………. నీకు అలాంటివి అంటే ఇష్టం ఉండవన్నావని చెప్పలేదు”

” నేనా….. నేనెప్పుడు అన్నాను “
అదేంటి ……మన పెళ్లైన కొత్తలో మా పిన్ని కూతురితో నీకు ప్రేమ, క్రష్ ఇలాంటివి నచ్చివు అలాంటి వాటి గురించి నీ దగ్గర మాట్లాడోద్దు …… అని అన్నావుగా అప్పుడు నేను అక్కడే వున్నాను “

” నేనేమీ ప్రేమకు వ్యతిరేకం కాదు……. అప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో అలా అన్నాను……. అయినా ఇక నుంచి నేను మీతో మాట్లాడట్లేదు “

” అయ్యో….. రాజి ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం”

” ఇప్పుడు కాదు ……అప్పుడు మీరు చేసిన దానికి నాకు చాలా కోపం వచ్చింది……. అప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు కదా అందుకే అప్పుడు కోపం ఎవరి మీద చూపించాలో తెలియక ఆగాను…… కాని నాకు ఇప్పుడు నిజం తెలిసిందిగా అందుకే నా కోపం తగ్గేవరకు మీతో మాట్లాడను ……… నేను వెళ్తున్నా “

“అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఇలా కోపం తెచ్చుకోని అలగడం న్యాయమా రాజి”

“ఏమయ్యా చంద్రయ్య….. నీకు ఇది న్యాయమా ఉన్నవాడివి ఉండకుండా అన్ని గుర్తు చేసి మా మధ్యలో ఎందుకు ఇలా గొడవలు పెడతావ్…….. ఇప్పుడు నా ధర్మ పత్నిని ఆ అలకపాన్పు మీద నుంచి ఎలా దింపాలో ఏంటో”
రాజి………..

Leave a Reply

Your email address will not be published.