178
0

మగువ మనసు

178

భూదేవి వంటి సహనం.
సముద్రము వంటి వాత్సల్యం.
భూకంపం వంటి ప్రళయం.
సకల గుణముల సమ్మిళిత రూపం “స్త్రీ”.
…..

కనకానికి నీలిమ ఒక్కత్తే ఆడపిల్ల.
కనకం చాలా కష్ట,సుఖాలు తెలిసిన మనిషి.
సహనం,ఓర్పు,మంచితనం,
మానవత్వం,
తన దగ్గర ఉన్నది నలుగురికి పెట్టే గుణం,
వంటి గొప్ప లక్షణాలున్న మంచి సంస్కారవంతురాలు.
తన కూతురు నీలిమని కూడా…
ఉన్నంతలో బాగానే చూసుకుంటూ,
మంచి కథలు,నీతి వాక్యాలు,పురాణ విశేషాలు చెప్తూ,సులక్షణాలను బోధించేది.
తండ్రి లేని పిల్ల కావడంతో కాస్త తండ్రి ప్రేమను నోచుకోలేకపోయింది.
అమ్మతో పాటు చిన్నప్పటి నుంచే చిన్న చిన్న పనులు సాయం చేస్తూ, తన కన్నా చిన్న పిల్లలకి చదువు నేర్పుతూ,ఎంతో కష్టపడేతత్వం అలవర్చుకుంటూ…నీలిమ పెరుగుతూ ఉండేది
వాళ్ల ఇంటి పక్కనే నాగమణి,నీలకంఠం..ఇల్లు ఉండేది.
వాళ్ళకి ముగ్గురు పిల్లలు.
రమణి,గోపి,రేవతి…
కాస్త ధనవంతులే కావడంతో పిల్లలకి ఏ లోటూ లేకుండా,అన్ని సమకూర్చేవాడు నీలకంఠం.
ఆ పిల్లలు ఆడుకోవడం చూసి నీలిమ కూడా వాళ్ళతో కలిసి ఆడుకునేది,వాళ్ళతో బాగా కలిసిపోయేది.
ఒకరోజు ఆ ముగ్గురు పిల్లలు నీలిమని వాళ్ల ఇంటికి రమ్మన్నారు.
అమ్మో.. మా అమ్మ కోప్పడుతుంది.
రాను అన్నది నీలిమ.
మీ అమ్మ పనికి వెళ్ళింది కదా…
సాయంత్రం వస్తుంది.
ఈలోపు వెళ్లిపోవచ్చులే…రా… అంటూ పిలిచారు.
సరేలే అని నీలిమ వాళ్ళు అంతగా అడగటంతో,
వాళ్ల ఇంటికి వెళ్ళింది.
వాళ్ళింట్లో రకరకాల ఆట వస్తువులు ఉన్నాయి.
బొమ్మలు ఉన్నాయి.
పన్నెండేళ్ళ చిన్నారి నీలిమకి వాళ్ళ ఇంట్లో ఆట వస్తువులు భలే నచ్చాయి.
అప్పుడే బయటి నించీ వచ్చాడు నీలకంఠం.
….
ఎవరీ అమ్మాయి అని పిల్లల్ని అడిగాడు.
మా ఫ్రెండ్ నాన్న… వాళ్ల ఇల్లు ఇక్కడే..
మాతో ఆడుకుంటుంది అని మేమే తీసుకువచ్చాం అన్నారు ముగ్గురూ…
మరి వాళ్ల అమ్మ, నాన్న ఏం చేస్తుంటారు?
అడిగాడు పిల్లల్ని.
వాళ్ల నాన్న లేరు.
వాళ్ల అమ్మ పనికి వెళ్తుంది అని చెప్పారు పిల్లలు నీలకంఠానికి…
ఓ అలాగా..సరే సరే…అంటూ…
చక్కని వదనారవిందముతో,ముద్దులొలికే కన్నులు కలిగి చూడచక్కని చిన్నారి నీలిమని అలా చూస్తూ…వెళ్ళాడు లోపలికి.
నీలిమని రోజూ వాళ్ళు రమ్మని పిలిచేవారు.
బడి అయిపోగానే,ఆడుకుని ఇంటికి వచ్చేది.
ఒకరోజు మామూలుగానే ఆడుకోవడానికి ఆ పిల్లల ఇంటికి వెళ్ళింది.
భార్యా,పిల్లలు లేరు…నీలకంఠం ఒక్కడే ఉన్నాడు.
రేవతి వాళ్ళు లేరా అంది నీలిమ తలుపు చాటున దాక్కుంటూ…
హా… వచ్చేస్తారులే..
ఇలా రా..అన్నాడు చేత్తో రమ్మని పిలుస్తూ…
భయం భయంగా అడుగులు వేసుకుంటూ,
లోపలికి వెళ్ళింది నీలిమ.
….
నీ పేరేంటి అన్నాడు భుజంపై చేతిని వేస్తూ,
నీలిమ అంది కాస్త వెన్నక్కి జరుగుతూ,
ఓ..పేరు బాగుందే…
రా…ఇలా కూర్చో అంటూ…
పక్కన కూర్చోమన్నాడు.
నేను వెళ్ళిపోతాను మా అమ్మ వచ్చే టైమ్ అయింది అంటూ కంగారు కంగారుగా పరుగు పెట్టింది నీలిమ.

ఆ తరువాత ఆ పిల్లలు రమ్మన్నా కానీ,
వాళ్ల ఇంటికి వెళ్ళేది కాదు.
ఎందుకంటే వాళ్ల అమ్మ చెప్పే నీతి కథలు,
కొన్ని కొన్ని మంచి మాటల్లో ఒకసారి చెప్పింది.
నాన్న కాకుండా ఎవరు నిన్ను తాకిన అది చాలా తప్పమ్మా…
నీకు ఎలా ఎప్పుడైనా అనిపిస్తే..
ఆ ప్రదేశం నించి బయటికి వచ్చేయాలి.
అమ్మ ..నీతో ఎప్పుడూ పక్కనే ఉండలేదు కదా…
నీ అంతట నువ్వే అన్నీ తెలుసుకోవాలి,
అన్నీ నేర్చుకోవాలి.
నీకు నువ్వే జాగ్రత్త పడాలి నాన్నా సరేనా ..
అంది ఆ మాటల్లో ఆంతర్యం అప్పుడు అర్ధం కాలేదు.
ఇప్పుడు అర్థమైంది.
నీలకంఠం తన భుజంపై చేయి వేసినప్పుడు ఏదో తెలియని భయం వెంటాడింది.
ఇంతలో కనకం రానే వచ్చింది.
పరుగున వెళ్ళి అమ్మని కౌగిలించుకుంది నీలిమ.
ఏంటమ్మా…ఏమైంది.
ఎందుకు భయపడుతున్నావ్?
అంటూ కూతురి తలపై నిమురుతూ అడిగింది అమ్మ.
ఆ భయాన్ని ఎలా వర్ణించాలో తెలియక నీలిమ అలా బిక్క మొహం వేసుకుని ఉండిపోయింది.
….
నీలకంఠానికి …నీలిమ బాగా నచ్చింది.
తన కనుముక్కు తీరు,
నడవడిక ఎంతో నచ్చాయి.
అతనిలో కామజ్వాలలు అలుముకున్నాయి.
రోజూ…
నీలిమ రాకకు ఎదురు చూసేవాడు…తన పనిని కూడా మానుకుని.
కానీ నీలిమ రావట్లేదు.
పిల్లల్ని అడిగాడు ఆ అమ్మాయి రావట్లేదేంటని?
ఏమో తెలియదు నాన్న అన్నారు పిల్లలు.

ఒకరోజు బడి వదిలేయగానే ఇంటికి వస్తోంది నీలిమ.
ఎదురుగా నీలకంఠం నిలబడ్డాడు.
అతన్ని చూసి చాలా జంకింది నీలిమ.
ఇంటికేనా…రా వెళ్దాం అంటూ…చేతిని పట్టుకున్నాడు.
ఆ స్పర్శలో ఏదో తేడాను గమనించింది నీలిమ…
ఈలోపు తోటి స్నేహితులు పిలిచారు అదే అదనుగా వదిలించుకుని ఇల్లు చేరింది నీలిమ.
అప్పటి నుంచి నీలిమకి తెలియకుండా మనసులో భయంతో కూడినటువంటి అలజడి మొదలైంది.
అప్పటి దాకా ఎవరికీ భయపడని పిల్ల… ఏది చూసినా ఒక విధమైన భయభ్రాంతులకు గురి అవుతూ ఉంది.
తన మానసిక ఉల్లాసం కోల్పోయింది.
ఎప్పుడూ ఏదో భయభీతులతో ఉండటం మొదలైంది.

పసి ప్రాయం నుంచే ఒక దిగులుగా మనసులో భయం నాటుకుపోయింది.

ఆ తరువాత కొన్ని రోజులకు కనకం ఇంట్లో నలుగురు ఆడవాళ్ళు ఉన్నారు.
దూరం నించీ చూస్తున్న నీలకంఠం…
అటుగా కనకం ఇంటికి వెళ్ళే ఒక ఆవిడని అడిగాడు… ఏంటమ్మా…ఏమైంది ఆ ఇంట్లో హడావిడి ఏంటి అని…
కనకం గారి అమ్మాయి పుష్పవతి అయిందండీ ఆశీర్వదించడానికి వెళ్తున్నాం అని చెప్పింది ఆవిడ.
హా.. సరేనమ్మా..అంటూ కపటినవ్వుతో లోపలికి వెళ్లాడు నీలకంఠం.
అప్పుడు చెప్పింది నీలిమతో వాళ్ళమ్మ…
చూడు తల్లీ…
మొన్నటి దాకా అంటే నువ్వు చిన్నపిల్లవి.
కానీ ఇప్పుడు నువ్వు పెద్దదానివి అవుతున్నావు.
ఇంకా జాగ్రత్తగా ఉండాలి సరేనామ్మా…
అంది కూతురితో…
అలాగే అమ్మా అంది నీలిమ అమ్మతో.

కొన్ని రోజుల తరువాత కనకం పనికి వెళ్ళాక…
నీలిమ ఒక్కత్తే ఉండటం గమనించిన నీలకంఠం నెమ్మదిగా నీలిమ ఇంట్లోకి వెళ్ళాడు..
నీలిమ తన చదువుకు సంబంధించిన పనులు ఏవో చేసుకుంటూ కూర్చుంది.
ఇంతలో తలుపు శబ్ధం వినిపించింది.
తల పైకెత్తి చూసింది.
చూస్తే నీలకంఠం ఉన్నాడు.
మంచంపై ఉన్న చున్నీని తీసి శరీరంపై వేసుకుంది.
గబగబా లేచి నిలుచుంది.
హా…భయపడకు…భయపడకు.
అంటూ…మంచంపై కూర్చుని,ఏదో కబుర్లు చెప్పడం మొదలు పెట్టాడు.
అసభ్య పదజాలంతో ఇబ్బందికర మాటలని పలకడం మొదలు పెట్టాడు.
నీలిమపై చేతులు వేయబోయాడు.
అతన్నించీ దూరంగా,జరిగి..
పుస్తకాల ముందు కూర్చుంది మౌనంగా,
ఇంతలో కనకం రాకను గమనించిన నీలకంఠం..
నక్కి నక్కి ఇంటికి వెళ్లిపోయాడు.
….
అసలు ఏం జరుగుతుందో ఏమి అర్ధం కావటం లేదు పదిహేనేళ్ల నీలిమకి.
మనసులో బాధ,మరొకవైపు వాడిపై కోపం రెండు
ఉన్నాయి.
అమ్మకి చెప్పి..
తనకున్న కష్టాలు చాలవన్నట్టు,మరో బాధని చెప్పి కష్టపెట్టడం ఇష్టం లేక అలానే మౌనంగా బాధను భరిస్తూ…కాలం వెళ్లదీస్తోంది నీలిమ.

పది పూర్తి అయింది.మంచి మార్కులు తెచ్చుకుంది. అనంతరం కాలేజీ చదువుకు వెళ్లాల్సి ఉంటుంది.బస్సుల్లో పడి వెళ్ళడం…
దూరం వెళ్ళాలి.
జాగ్రత్త తల్లీ అన్నది అమ్మ నీలిమతో..
సరే అమ్మా…అంటూ గుడికి వెళ్లొచ్చి..కాలేజీకి బయల్దేరింది నీలిమ.
నీలిమ వెళ్ళడం చూసిన నీలకంఠం గబగబా ఆమెను వెంబడించసాగాడు.
ఆమె ఎక్కిన బస్ ఎక్కి ఆమెను తాకడానికి ప్రయత్నించసాగాడు.
ఒక్కసారిగా నీలకంఠాన్ని చూసి ఉల్లిక్కిపడింది నీలిమ.
ముందుకు వెళ్ళి నిలుచుంది.
అతను కూడా ముందుకు జరిగి వెళ్లబోతున్నాడు.
నీలిమకి చాలా భయం వేసింది.
ఇలా చాలా రోజులు అదే విధంగా భయపడుతూ…కాలేజీకి వెళ్ళేది.. వాడిని తప్పించుకుంటూ…

ఇలా కాదు వాళ్ళది పేద కుటుంబం కదా ఆదుకున్నట్టు నటించి నీలిమని దక్కించుకుందాం అని ఒకరోజు కనకం ఉన్నప్పుడు వెళ్ళాడు నీలకంఠం. ఇంట్లోకి ఏమన్నా సరుకులో,
నిత్యావసర వస్తువులతో కావాలంటే చెప్పండమ్మా నేను ఇప్పిస్తానని చెప్పాడు కనకంతో..
మరేం పరవాలేదండీ… ఆయన మావారు బ్రతికి ఉండగా బాగానే చూసుకునేవారు.ఆయన లేకపోయినప్పటికీ నేను కూడా బాగానే చూసుకుంటున్నాను బాబు.. మీ మంచి మనసుకు నమస్కారాలు మాకు సాయం ఏం వద్దండీ అంది కనకం వినయంతో…
తన ప్రయత్నం బెడిసి కొట్టడంతో నీలకంఠంలో ఆవేశం చెలరేగింది.
….
నీలిమ చదువు పూర్తయింది.
నీలకంఠం ఇంకా అలా కుటిల ఆలోచనలతోనే కాలం వెళ్లదీస్తున్నాడు. ఇంతలో ఆరోగ్యం మందగించి మంచాన పడింది కనకం.
ఇంటి బాధ్యత నీలిమపై పడింది. మళ్లీ వచ్చాడు
నీలకంఠం.సానుభూతి ఒలకబోస్తూ,కపటి నాటకాలు వేస్తూ,ఇంక నీలిమకి ఎవరు పెళ్లి చేస్తారు,ఎవరు చూసుకుంటారు అంటూ కనకం ముందు మొసలి కన్నీరు కారుస్తున్నాడు.
ఏం తక్కువ బాబు నా కూతురు చదువుకోలేదా?
తెలివి తేటలు లేవా? మంచి ఉద్యోగం తెచ్చుకోగలదు అంటూ కన్ను మూసింది కనకం.
పరిస్థితిని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుని… తల్లి మరణంతో భోరున దుఃఖిస్తున్న నీలిమ భుజంపై చెయ్యి వేయబోయాడు నీలకంఠం…
చింత నిప్పులాంటి కళ్ళతో, ఆవేశపూరితమై..
ఉగ్ర స్వరూపం దాల్చి…నీచుడా…నీ కామానికి అంతం లేదురా…పన్నెండేళ్ళ నించీ..పాతికేళ్ల దాకా రగిలిపోతూ వచ్చావ్…
నీ పెళ్ళాం…పిల్లలు…నువ్వే లోకం అనుకుంటున్నారు.
నీ పిల్లల వయసున్న నన్ను వక్ర దృష్టితో చూస్తావా…
కడుపుకు అన్నం తింటున్నవా లేక ఇంకేమైనా తింటున్నావా…
అంటూ…నీలకంఠం గొంతుపై కాలును వేసి గట్టిగా అదిమి పెట్టింది.
పశువుల కన్నా దారుణంగా ఉన్నావు.. దుర్మార్గుగుడా…ఇది నేను పెట్టిన భిక్ష నీకు.. పోయి బతుకు అంటూ తన కాలిని తీసింది అతని కంఠం పైనించీ…బతుకు జీవుడా అనుకుంటూ వెళ్లిపోయాడు నీలకంఠం.
….
కొన్నాళ్ళకి నీలకంఠానికి అతను చేసిన పాపానికి శిక్షగా..అతనికి అంతు చిక్కని వ్యాధి వచ్చింది.
నరకయాతన అనుభవిస్తూనే ఉన్నాడు మంచాన పడి…పాపం పండితే…ప్రతిఫలం అనుభవించక తప్పదు కదా మరి.

నిజమే మరి స్త్రీ శక్తి స్వరూపం.
సముద్రమంత ప్రేమనూ పంచుతుంది.
కాలకూట విషాన్నీ విరజిమ్ముతుంది.
పుడమి లాంటి ఓర్పునూ కలిగి ఉంటుంది.
భయంకరమైన ప్రళయాన్ని సృష్టిస్తుంది.
….
ఇలానే నీలిమలా ఎంతో మంది బయట మనకి తెలియకుండా మనసులో బాధ అనుభవిస్తూ,
మనోవేదన చెందుతూ, ఎదగలేక,అకృత్యాలకు బలి ఐపోతున్నారు.
వారందరినీ కాపాడలేకపోయినా,
అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని గమనించి కాస్త తోడు నిలుద్దాం… ధైర్యాన్నిద్దాం.
ఎవరో ఒక మగవాడు సరిగా లేడు కదా అని అందరినీ తప్పబట్టడం సరి కాదు.
🙏మంచి మనసు కలిగి ఆడవారిని గౌరవించి,
పూజించే మగవారు కూడా ఉన్నారు.🙏
వారందరికీ శతకోటి వందనాలు…
నీలకంఠం లాంటి నికృష్టులూ ఉన్నారు.
కానీ అందరం గుర్తుంచుకోవల్సినది ఒకటే…
“యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః”

Leave a Reply

Your email address will not be published.