ఎగిలివరంగ లేవంగానే,ఎందుకో కిటికిల కేలి ఏదో ఇనిపిస్తాంది,”బూబూ బూబూ” అనుకుంట బూగలు సప్పుడు శేత్తన్నయ్,అట్లనే తెరువెంట మోటరు మీద వచ్చే నంబూద్రి మైకు శురువు చేసిండు,
ఇగ అదే అందరికి మేల్కొలుపు,”కొబ్బరి కుడ్కలకు శెక్కర,కొబ్బరి కుడ్కలకు శెక్కర,”అని పాడ్తనే వుంటంది,దినాం పొద్దుగాల ఇదే లొల్లి.
అప్పటికే అంబటాళ్ళయ్యింది,అమ్మ అల్కేత్తాంది.
తానం జేసి రాజన్నకు పబ్బతివట్టిన ఎందుకంటె
కాళిజీ ఇయ్యల్ల పరీక్ష మల్ల.రాత్రంతా ఒయిలు పట్టి చద్విన,దాన్నే మెత్త లెక్కల పెట్టుకొని పండుకున్న.
ఏమైయిద్దో ఏమో!
సైకిల్ మీద ఉర్కాలే జల్ది ఇగ.పరీక్ష రాస్న పాసైతా.
ఇయ్యల్ల జానకిని చూస్న నిజంగ దేవర్లెక్కనే ఉంది.
నవ్వుతాంటే చెంపకు సొట్టలు వడ్తయి.అజ్జూచి నా పానం జడ్తిత్తది.ఒక్కసారి మాట్లాడుదమని కోశిశ్ చేద్దామనుకున్న.పిల్సిన,
“ఒ జానకి”,
“హా చెప్పు,
“పరీక్ష మంచిగ రాస్నవ,
“హా రాస్న ,మంచిగనే అత్తయి మార్కులు.
అవును,పొద్దికీ గుడికాడికొస్తవ?
ఎందుకు?
“రేపు శివరాత్రి కదా,గుడిని సింగారిత్తాండ్రు సుడ్డానికి.
మామ్మ పంపది,రేపే అత్త ఇగ.
సర్లే,బాయ్”.
శివరాత్రి ,రేప్పొద్దికీ జాతరే ఇగ.రాజన్న పట్నం ఏత్తరు,మస్తుంటది.
ఇంటికి వోయ్న.
అమ్మ: “అక్కను సూస్కోడానికి రేపు పెండ్లోడ్లు అత్తరాటా,జర బయటికి వోకుండా ఇంట్లనే ఉండు పట్వరీ,అరేయ్ రాముగ నిన్నే శెవుమీద పేనన్న వార్తలేదా?
హా అమ్మ సర్నే ఉంటతీ.
పెండ్లోళ్ళు అచ్చిర్రు సూపులకు,పిల్లగాడు మంచిగనే ఉన్నడు.అక్కకు కూడా నచ్చిండటా.
పూలుపండ్లకు మూర్తం పెట్టుకొని చెప్తాన్నరు.
అప్పటికే,
మస్తు అల్సం అయ్యింది.నాల్గైతాంది.
తనికెళ్ల భరణి పాటలు శుర్వైనయ్,ఇదేందో గాని,శివుడేడుండే ఆడ భరణిసారు టక్కున దేల్తడు.
శివున్తోటి జౌడం వెట్టుకుంటడు,పాడ్తడు,తారీఖ్ సేస్తడు,శబ్బాష్ రా శంకరా అంటడు.
గుడికాడ ఒ మస్తు జనం.జానకి కూడా అత్తంది.
జానకి ముక్కుపుల్ల కిర్రాకున్నది,మిలమిల మెరుత్తాంది.ఎంత సక్కగుంటదో!
“అగో ఐస్క్రేటు బండికాడ,రాణి,
ఇదెందుకచ్చింది,పిల్లకి బిచ్చమెయ్యంది.
ఒ రాణి ఏందే ఈడున్నయ్,ఐస్క్రేటు కొంటన్నవా ఏంది?
లే లే కాదు గాని,యేడవోయినవ్,ఇప్పటిదాంకా?
నేనా?
హా, ఎందుకో?
జానకి నిన్ను అడిగింది.
నన్నా? పరాశ్కం ఆడుతున్నవా?సాల్గనీ తీ! పోవ్వా ఇగ.
ఓరి ,బిత్తిరోడ నివొద్దె రా.
సరే సరే సరే……. పో ఇక.
సావ్ పో నమ్మకపోతే నేనేం జేస్తా……
రాజన్న పట్నాలు ఏస్తన్నట్టున్నరు,
జగ్గులు ఒగ్గుడోళ్ళ సప్పుడయితాంది.
సాంబయ్య గూడా అచ్చిండు,ఊరుమొత్తమ్ల,
పెద్ద శివసత్తి అయ్ననే,రాయేసుని దేవర గూడా అత్తది.
ఏ పండుగైన,పబ్బమైన అచ్చిపోతాడు.గజ్జాల్లాగులు కడ్తడు,రాయేసునేశం ఏస్తడు.మస్తు పాడ్తడు…
గొంతుకెత్తుకున్నడు,పాటవాడ్తాంటే పానం ఆయి మంటది.చివరకు ఇరగోల తోని దెబ్బలేస్తడు,రంగం,దేవున్ని గూడా జెప్తడు.
అచ్చం దేవర్లెక్కనే ఉంటడు..
నేను అటే సూస్తన్నా.
ఓయ్,ఏంది ఎటువోయినవ్?ఇందాక మస్తుసేపు లెంకిన ఏడ కాన్రాలే అని జానకి అన్నది.
నువ్వా?నా కోసమా? హా ఎందుకో?
అయ్యో,సూడద్దా ఏందీ?
గట్లగాదు గాని,ఏమన్న పనా?
(జానకి మనసులో), ఈ బిత్తిరోనికి ఏమర్దం గాదు అన్ని చెప్పాలే.
జానకి : అ..అ..ఏం పన్లేదు కాని.
అవును గా కంబానికేం కట్టిర్రు అని అడ్గింది జానకి,
నాక్తెల్సింది నేన్జెప్త అన్న,చెప్పుమన్నది.
గుళ్ళె ఒ కంబమున్నది,దానికి ప్రతేడు శివుని తల్వాలు కడ్తరు,అంటే ఇప్పుడన్నయి పోయినేడు తల్వాలు అన్నట్టు అన్న అవ్నా అన్నది.హా అన్న.
ఒక్కసారి కంబమ్మీది తల్వాల ముల్లె ముడిడ్సుకొని మా మీద తల్వాలు వడ్డయి,
నాకసలేదో అన్పించింది,దేవుడే కల్పినట్టు,జానకి ఏం పట్టనట్టే ఉంది.
ఇగ శివునికి తల్వాలు వడ్తుతున్నయ్ సూడబ్బా అని నేనంటే,
ఒక్కసారి కంబమ్మీది తల్వాల ముల్లె ముడిడ్సుకొని మా మీద వడ్డది,
నీ దగ్గర మామ్మ నన్ను సూస్తే,నాకు ఇంటికెయినంక,నాగవెల్లి ,తల్వాలు అన్నైతయ్!
అయ్యో పో మళ్ళ అన్న,
అప్పుడు,జానకి ,పోతగానీ,దేవునికి బాసంతం అయ్యిందా?
హా అంటే?తెల్సుకో మనం గుడం చేస్కుందాం.
హా…ఓ పిల్లా చెప్పరాదు..
నేను వోతాన్న ఇగ.రేప్పొద్దున, తెలుగు పద్యాలు అప్పజెప్పాలే లేకుంటే శంకరయ్య సారు మట్టల మీద కొడ్తడు.
సరే.సరే..
జాగారం తర్వాతా ,పొద్దుగాల తానం జేసి ఇంట్లందరం ఒక్కపొద్దిడ్సినం.
కాళీజిల, సారు గజేంద్ర మోక్షం పద్యాలు చెప్పమనడం శురూ చేసిండు.
జానకి శురూ చేసింది,”సిరికిం జెప్పడు శంఖు చక్రమున్..”సప్పట్లు కొట్టిర్రు అందరు.
నేనేమో,”అలవైకుంఠపురంబులో …” పద్యం చెప్పిన.
కాస్ల మేమిద్దరమే జెప్పినం.
క్లాసు అయ్యింది.
నాకింకా “బాసంతం”అనే పదమే ఖ్యాలుకొస్తాంది.
సార్ని అడిగినా,తెల్సుకొని జెప్తానన్నడూ.
ఎన్నో ఒయిల్లు తిర్గేస్న, ఇంటర్నెట్ల చూస్న కాని పదముంది గాని దానర్థమైతే దొరుకతలే,ఏదో మల్లన్న పట్నాల మేల్కొలుపు పాటల్ల ఈ పదం ఇన్న,
ఒగ్గుకథ చుక్కసత్తయ్య బాపు రాసిండనుకుంట అది,
నలిమెల భాస్కరన్న పదకోశం గూడా శూశ్న,
దాని అసలర్థం మాత్రం ఇంక దొర్కలే,అట్లనే కన్నంటుకున్నది ఇగ.
రేపు పొద్దుగాల అక్క కోసం పెండ్లోళ్ళు,వస్తరటా, పూలుపండ్లు చేస్కుంటరు ఇగ.
పూలుపండ్లు అయినయ్.
బాసంతం అంటే ఏందని అయ్యగార్ని అడ్గిన,
అయ్యగారు అది పల్లెపదమని దానికర్థం పవిత్రమైన లోకకళ్యాణపు పెండ్లి అని చెప్పిండు,
అర్థం గాలే అని అన్న,దేవుళ్ళు జేస్కునే పెండ్లిని బాసంతం అంటరు అన్నడు,
మళ్ళ ఈ పదమేడలేద్గా అన్న,
కొమురెల్లి మల్లన్న దేవుడు బండారి(పసుపు)దెచ్చుకొని బాసంతమాడిండు అంటరు.
అప్పున్నాకర్థమైంది జానకి ఏమందో,
చిడ్మెల ఊపిరిబుగ్గోలే ఎగ్రింది మన్సు,
పానమస్సలాగలే,
పొద్దుగాల కాళిజీల సూస్న,
ఓయ్ జానకి అని పిల్చిన,
హా చెప్పు అంది.
బాసంతమెప్పుడాడు కుందాం అన్న,
నవ్వింది.
మొత్తనికైతే తెల్సుకున్నవా అన్నది.
హా అన్న.
అవును పెండ్లి అనచ్చుగద బాసంతం మల్లన్న సామి చేస్కున్నడంట కదా మనం మన్సులం మనకెందుకో, అయిన అర్థం గాని ఈ పదమెందుకు?
జానకి : నువు నన్ను దేవతనంగ నేనిన్న,అప్పుడు నువ్వు దేవున్వే కద నాకు.
అప్పున్నేను అవును నేననుకుంది నీకెట్ల తెల్సింది అన్న.
జానకి : నీ కీస్పిట్ట గొంతుతోని అంటే అందరికి తెల్సింది ఆరోజు.
అయ్యో అవ్నా ఇప్పుడేంది సంగతి,బాసంతమాడుకుందామా?
జానకి: కాళిజై పోని,మా నాన్న తోని చెప్తా.
మామ్మ తోని కూడా నేను మాట్లాడాలే,
అవ్ను మామ్మ సరే అనక పోతే ఏం జేస్తవ్?
జానికి: నిన్ను నేను లేప్కపోయి బాసంతమాడ్త!,
వావ్వో నీకు గింతనన్న బుగులైతలేదా?
జానకి: బుగులెందుకూ,నీ మీద నమ్మికుంది,మనమే ఆళ్ళని ఒప్పియ్యాలే.
సర్లే ఇగ దేవున్దయా.
జానకి వొయ్యింది,నేనొక్కన్నే పోతాన్నికా.
అమ్మకు జెప్తే పొర్క పొర్క జేస్తదని భయంబడతాంది.,
ఇంటికొయ్న,పక్కేశ్న జల్దే.
అయిన గిప్పుడే గీ పెండ్లెందుకు తీ,ఎట్లాగో ఇంకో మూడ్సంస్రాలు సద్వాలే గదా,జానకెట్లాగో సదువుద్ది ఆందాక అనుకున్న,ఆలోచన బందుకెట్నా.
ఇంతల అమ్మచ్చింది,అక్క లగ్గం కాయమయ్యింది బిడ్డ అన్నది.అచ్చే నెల ఇర్వైతొమ్మిత్తారిక్కూ.
మస్తనిపిచ్చింది ధూంధాం శేసుడే అన్న.అమ్మనేమో పెండ్లి పన్లు శురువు జెయ్యాలే రేపు సుక్కురారం మంచిరోజంది.
మెల్లగా కన్నంటుకుంటాంది.మొగురానికి కాళ్ళుసాచి మంచాల పండుకుంటాన్న.
బయటేదో జౌడమైతాన్నట్టుంది,బూతులు,బాసన్లెత్తేసే సప్పుడు ఇర్గమర్గొస్తాంది.ఆ సప్పుడుకు పురాగ లెస్న ఇక.బయటకచ్చిన,మొన్ననే పెళ్ళయింది శాంతత్తమ్మను ఆళ్ళాయిన ఎందుకో కొడ్తాండు.ఆన్కూకే అదే రోగం,సారబత్తాలు,కీసాలు తాగుడు,అత్తమ్మను కొట్టుడూ,ఎంత సద్వుకున్న ఏం పాయిదా?కట్టుకున్న పెండ్లాన్ని ఎప్పుడు కొడ్తనే ఉంటడు,ఆ పాటందానికి ఆయనినంక ఇల్లుటముతెచ్చుకున్నరు.అయిన ప్రతి ఆడిబిడ్డను మన గలుమ దాటి పంపల్లంటే,మనమేదో రంజిపెట్టుకుంటనే ఉండాలే,ఇన్రోజులు మన ఇంట్ల మెల్గినామెకు అత్తగారింట్ల ఎంత మంచిగున్న మనకైతే ఎప్పుడు ఏదో ఎల్తి,పురాగ పాయిదంతోటి ఇల్లుటం తెచ్చుకున్న గదె గోస.నాయ్న లొల్లంత సూస్తనే ఉన్నడూ,ఇగ వోయి ఆపిండు.పొద్దుగాల బొడ్రాయికాడ పంచాది అని అన్నాడు.అన్నవోలె ఆడికేలి అందరు వోయిర్రు,శాంతత్తమ్మ ఇయ్యల్ల అమ్మకాడ పండుకుంది.నాకిగ అదే వట్టుకుంది నాకున్నదే ఒక్కటే అక్క,దానిగ్గిట్ల పెళ్ళయితాంది,మాయక్కను ఎట్లిడ్సివెట్టాలే?అసల్నాకు ఊకదే ఖ్యాలుకత్తాంది,
ఏం జెయ్యాలే కన్నంటుకున్నది.
బొడ్రాయికాడ పంచాది శురువైంది, పెద్దమనిషులు ఎంత సమ్జాయించిన గూడా ,అసలు పంచాది తెగతట్టే లేదు.శాంతత్తమ్మోల్ల పెనిమికైతే గింతనన్న గురత్తం లేదు,పెద్దంత్రం,చిన్నంత్రం లేదు.పెద్దమన్షుల మీదికి మర్లవడుతాండు.ఇగ ఆళ్ళు అత్తమ్మను అడిగిర్రు,ఏందీ తల్లి శాంత ఇప్పున్నీకు ఏం గావాలే శెప్పు అంటే,నాకు నా పెనిమిటి కావాలే అన్నది,ఆడేమో నువ్వద్దంటాండు,నువ్వే ఆనిమీద పానం పెట్టుకున్నవ్,ఎట్లగిట్లైతే అన్నవోలే,
శాంతత్తమ్మోల్ల అయినేమో,నాకదద్దు,ఇడ్పుకాయితం గావాలే,
నాకు ఆళ్ళు కట్నం ఇయ్యకున్న గూడా ఇల్లుటం అచ్చిన,అయిన గూడా జర్రనన్న సిగ్గులేదు ఆల్లకు అన్నడు,శాంతత్తమ్మకు ఇరవైలచ్చిర్రు,అయిన అన్ని బౌరుపుల మాటలు అంత కల్లే నేనే ఉన్న,అని అన్న నేను.అత్తమ్మెంద్కో నాకీనద్దు ఇడ్పుకాయిదం గావలె అన్నది.అత్తమ్మకర్దమైంది ఈ పైస పిచ్చోని తోటి నేనేగలేను అని.
అయినాళ్ళింటికి పోయిండు.అత్తమింట్లొక్కతే కూసున్నది, ఇగ ఇంట్ల తాత గిట్లలేకపోతే నన్ను పిల్సింది,నువ్వన్నట్టు నాది గూడ బాసంతమైతే బాగుండ్రా అన్నది,ఈమెకెట్ల తెల్సింది అనుకున్న..
అక్కపిలుస్తాంది అని ఆడికెలి పోయ్న,మళ్ళ పిల్సింది నాగ్గూడా నీ అసొంటి తమ్ముడుంటే బాగుండురా అని అంది.ఎందుకత్త ఇప్పుడునేను నీ తమ్మున్నే అన్కో అన్న.అట్లగాదు రా నేనన్నది,మీ మామయ్యకు ఆల్ల, చెల్లంటే బాగిష్టం,ఆల్ల కాందాన్ల కుండమార్పిడి పెండ్లీలు అయినంట నాకేమో ఎవ్వలు అన్నదమ్ములు లేరాయే ఆల్ల చెల్లెను జేస్కోనికి.పెద్దమ్మ కొడ్కున్న ఆ పిల్ల కర్రెగున్నది నాకద్దన్నడాడు.అయిన అక్క చెల్లె మీద ఉన్న పెరిమె కట్టుకున్నదాన్మీద ఎందుకుండదో?
అయ్నకు ఆళ్ళ చెల్లంటే మస్తిష్టమే గాని నేనంటనే సేదు,ఏం జెయ్యాలే,సర్లే నా గురించి జెప్తే నీ సోదనుపిస్తది గాని రేపు నీకో అక్కుంది గదరా పైలం అన్నది.నాకిగ అస్సలే ఎట్లనో అనిపించింది.అక్కనే ఖ్యాలుకత్తాంది.అంతకన్న ముందు,అసలు జానికి గురించి అత్తమ్మకెట్ల తెల్సిందో గాని అనుకున్న.
అడగాలే ఇక జానకినే అనుకున్నా,రేపట్లగో ఐతారం గదా,బూరుమిఠాయి బాబాయి శెరువుకాడికి అత్తడు కదా అమ్మనీకే,అప్పుడు పోత,ఎట్లాగో జానికికి బూరుమీరఠాయంటే జీవి.
అట్లనే శెరువు కాడికి సైకిలెస్కోని పోయ్న.అప్పట్కే మస్తుమందచ్చిర్రు,గంత మందిల ఎట్లడగాలే అనుకున్నా.ఒక్కసారి ఉన్నట్టుండి,ఓయ్,అని సప్పుడినవడ్డది,గర్దన్ తిప్పి సూస్న,జానికికి పురాత భయం లేదు,ఇగో తీస్కో అని బూర్మీఠాయి పాకిటిచ్చింది.తీస్కున్న.సయిసు అన్న,మాట్లాడే లోపే ఆడికేలి పోయింది.ఉత్తగనన్న అచ్చిన అనిపిచ్చింది.సరే రేపు కాళీజిల సూస్కుందాం తీ అనుకున్న,బూరుమీఠాయి తిన్న ,కమ్మగుంది ,కవరు పారేద్దమనుకుంటే ,ఆ కవర్లేమో ఉంది,సూసెసరికి ఎదో జాబుంది దానికి బండారంటుంది,పూజజేపిచ్చినట్టుఉంది.తెర్సిన సూసే సరికి పేమకాయితం.వావ్వో ఈ పిల్ల వేరే అనుకున్న,కాని సద్వినంక తెల్సింది,కొన్ని తప్పులున్నయ్ పదాలు గాని ,జర్ర నవ్వొచ్చినా మస్తనుపించింది,ఆ పిల్లను పానంబోయ్న ఇడ్వద్దని,
అసలేం రాసిందంటే,
(రెండుసంస్రాల కింద రాసింది ఇప్పుడిచ్చింది…)
“నేనేప్పుడు ఎవ్వలికి రాయలే గాని నీకే రాత్తన్న ఫస్టుసారి,
ఓ రఘు,నువ్వంటే నాకు మస్తు పావురం,
మస్తుమందిన జూస్న కాని,ఎవ్వల్ని జూస్న పానం జెడ్తియ్యలే గాని, నిన్ను ఫస్టుసారి సూడంగనే ఎందుకో మస్తనిపించింది,ఊకే నిన్నే సూశెదాన్ని,నువ్వేమో సిగ్గువడేటోనిపి,ఏందినే అనుకునే దాన్ని,నువ్వు బళ్ళె ఒక్కసారి జమునతోని నవ్వుకుంట మాట్లిడిదే నాకు శిర్రెత్తింది,ఆరోజు అది నిన్ను సైకిల్మీద దింపమన్నప్పుడు,నీ సైకిల్కుకు నేనే పంపుచారు చేస్న.అప్పట్నుంచే తెల్శింది అందరికి.
నిన్ను సూస్తే ఆళ్ళ పంత పగుల్తదని తెల్సు అందరికి ఇగ అందుకే ఎవ్వల్ని మాట్లడనియ్యలే నీ తోటి,
రంజనసొంటి నీ మన్సు,
దివీట్లసోంటి నీ సొట్లబుగ్గలు,
గుళ్ళె గండదీపమసొంటి నీ నవ్వు,
చెర్ల పొంగులసోంటి నీ మాటలు,
ఓంబత్తులసోంటి నీ జుట్టు రింగులు,
కోపమచ్చినప్పుడు పోతరాజులెక్క,
సల్లగున్నప్పుడు బుద్ధున్లెక్క,
అందర్నొక్కలెక్కనే సూసె జూపు,
నన్ను నీ తాటికి లాగినయి.
రహీమ్ తోని పీర్లపండ్గకి పోయినప్పుడు,
ఊదులేసుకుంట కుడ్కలదండతీస్కునప్పుడు,
ఎలీషాతోని చెర్చికొయ్యినప్పుడు,
ఇదంత ఎందుకంటే, అందరొక్కటే అని నువ్వుచెప్పినప్పుడు నీ మీద మస్తు కాయిషయ్యింది.
చెరువుకట్టకాడ ఒగ్గుకథల నువ్వు ఆడేశం ఏస్నప్పుడు,నిజంగ నేను ఫిదా అయ్న.అప్పుడు నిజంగా ఎవ్వల్తోనైనా జౌడం వెట్టుకోనన్న సరే నిన్ను లేప్కపోవాలే అనిపించచింది.
అప్పుడే కొలిక్కొచ్చిన ఇగ నువ్వుతప్ప నాకెవ్వలద్దు అని.
నువ్వుంటే నాకు మస్తు పావురం,
మస్తు పావురం,మస్తు పావురం..
నీకేమనిపించిందో మళ్ళ రాసిపంపు ,నీకు నేను కిష్టం లేకపోతే నేనేం అనుకోన్లే ఇగ. పైలం”
ఆ జాబిచ్చినంక,నా జవాబు జల్ది జెప్పేస్న.నాకు గూడ నువ్వంటే మస్తు పావురమని.
గట్ల చిన్నగున్నప్పటి సంది,ఆమె మీద పాయిరం పెంచుకొని,కడకు బాసంతమాడుకున్నమ్.కాయిష్షు పడ్డది దక్కిదే,
మస్తనపిస్తది.ఇగ ఈ జీవితం,జిగునం,నా పాణం పొయ్యే దాకా జానకికే అని.ఇద్దరి మద్దెల ముడివడ్డ బంధం గిదే మల్ల.
రఘు అంటే రాముని పేరాట,జానకి అంటే సీతమ్మ తల్లి. అందుకేనేమో ఇద్దరం కల్సుకున్నమ్.