205
0

పగ తీరింది, కానీ!

205

ఒక అద్భుతమైన ఊరు పచ్చని చెట్లు, అందమైన ప్రదేశాలు, జల జల పారే సెలయేరు. ఉదయాన్నే ఆ ఊరు అందాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఆ అందాలు ఎవరినైనా ఆకర్షించుకుంటాయ్. ఆ ఊరు మొత్తం చెట్లతో కప్పేసి ఉంటుంది. ఆ ప్రకృతిని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆ ఊరిలో ఉన్న ప్రజలంతా చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు.

అయితే ఇంత అందంగా ఉన్న ఊరిలో ప్రజలంతా సాయంత్రం 6 గంటలలోపే ఇంటికి వచ్చేసేవారు. ఎందుకంటే ఆ ఊరిని ఒక ఆత్మ పట్టి పీడిస్తుంది. ఎవరైనా చీకటి పడిన తర్వాత ఊర్లోకి వస్తే వాళ్ళని అతి క్రూరంగా చంపేస్తుంది. అయినా తన పగ తీరకపోవడంతో ఎవరైతే చీకటి దాటిన తర్వాత వస్తున్నారో అందర్నీ చంపుతూ వచ్చింది. ఊరి పెద్దలు, ప్రజలు పరిష్కారం ఏంటిది అని చర్చించుకుంటున్నారు. కానీ పరిష్కారం దొరకట్లేదు. అలాగే ఒకరోజు ఒక వ్యక్తికి ఆఫీసులో చాలా పని ఉండేసరికి కొంచం లేట్ అయ్యింది. ఆఫీస్ వాళ్ళతో ఈ రోజు ఇక్కడే పడుకుంటాడని చెప్పాడు. కానీ అక్కడ బిల్డింగ్ పనులు జరుగుతుండడంతో ఇప్పుడు వద్దు ఇంకెప్పుడైన చూద్దాం అని ఆఫీస్ హెడ్ చెప్పాడు. దాంతో ఇంటికి భయంగా బయలుదేరిన ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళేదారిలో ఏడుపు శబ్దాలు, అరుపులు, ఆర్తనాదాలు వినపడ్డాయి. అది విన్న అతనికి వెన్నులో వణుకు మొదలయ్యింది. త్వరగా వెళ్లిపొదాం అనే తొందర్లో బైక్ని చెట్టుకి గుద్దాడు. కానీ ఆ నవ్వులు, ఏడుపు వినపడి భయంతో ఎవరైనా ఉన్నారా అని మొత్తం చూసాడు కానీ అక్కడ ఎవ్వరూ లేరు కానీ ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇంక భయంతో పరిగెత్తడం మొదలు పెట్టాడు. కానీ ఎంతసేపు పరిగెత్తినా ఆ చెట్టు దగ్గరికే వస్తున్నాడు. వెంటనే వాళ్ళ నాన్న పిలిచాడు. “ఇంతసేపు ఉన్నవే లేట్ అయ్యింది పద ఇంటికి వెళ్దాం” అన్నాడు. భయంతో “నాన్న నువ్వేంటి ఇక్కడ ఇక్కడ ఏదో ఉంది నాన్న” అన్నాడు. వాళ్ల నాన్న సమాధానం ఇవ్వకపోవడంతో ఏం ఆలోచించకుండా వాళ్ళ నాన్నతో వెళ్తున్నాడు. ఆ ఏడుపు శబ్దాలు చాలా దగ్గరగా వినిపిస్తున్నాయి. వాళ్ల నాన్నని తనకు వినిపిస్తున్నాయా అని అడిగాడు. వాళ్ల నాన్న “నాకేం వినిపించట్లేదు” అని ఏడుస్తూ చెప్తాడు. “నాన్న నీకేమైంది ఎందుకు ఏడుస్తున్నావు” అని భయంతో అడిగాడు. వెంటనే వాళ్ళ నాన్న వెనక్కి తిరిగి “మీ నాన్నని నేను కాదు. ఈ ఊరి ప్రజలంతా ఇక్కడే కదా నన్ను కాల్చేసింది. నేను ఎవ్వరినీ వదలను” అంటూ గట్టిగా రోదిస్తూ వెనక్కి తిరిగింది. తన ముఖం మొత్తం కాలిపోయింది. కళ్ళల్లో నుంచి రక్తం కారుతోంది. అది చూసిన ఆ వ్యక్తి భయంతో పరుగులు తీశాడు. అతను పరిగెత్తడం చూసి ఆ దయ్యం బిగ్గరగా నవ్వుతూ “నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు” అని అరిచింది. ఆ వ్యక్తి పరిగెడుతుండగా తన ముందు వచ్చి నిల్చుంది. ఆ వ్యక్తి “నన్ను చంపొద్దు” అని అడుగుతున్నాడు. అయినా వినకుండా చంపేసింది. తన పగని అతని మీద తీర్చుకుంది.

ఉదయం అయ్యింది అందరూ ఏడుస్తున్నారు. అంతలో ఆ ఊరికి కొత్తగా వచ్చిన రమేష్ చూసి ఏమైంది అని అడిగాడు. “ఈ ఊరిని పట్టి ఒక దెయ్యం తిరుగుతుంది. అదే ఇలా చేసింది ఈ ఊరిలో ఎవ్వర్ని బతకనివ్వదు” అని ఒక పెద్దాయన బాధపడుతూ చెప్పి వెళ్ళిపోయాడు. ఇలాంటివి నమ్మని రమేష్ “ఈ పల్లెటూరి వాళ్లంతా అంతే మూడ నమ్మకాలు నమ్ముతూ ఉంటారు” అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. “ఊరు చూసి వస్తా” అని ఇంట్లో చెప్పి బయటికి వెళ్తాడు. అన్ని ప్రదేశాలు తిరుగుతూ అన్ని తన దగ్గర ఉన్న ఫోన్తో ఫోటోలు తీసుకుంటాడు.

సాయంత్రం అయ్యింది ఇంకా రమేష్ ఇంటికి వెళ్ళలేదు. అటువైపు వెళ్తున్న ఒక పెద్దాయన రమేష్ని పిలిచి “ఇక్కడేం చేస్తున్నావ్ త్వరగా ఇంటికి వెళ్లు” అని గసిరాడు. అది ఏం వినకుండా తన పని అతను చేసుకుంటున్నాడు. అది చూసిన పెద్దాయన కోపంగా “నువ్వు ఇక్కడే ఉంటే నీ ప్రాణాలు పోతాయ్” అని చెప్పి వెళ్ళిపోతాడు. అది విన్న రమేష్ “నేను చూస్తా ఎలా పోతాయో” అని నవ్వుకుంటాడు. చీకటి పడింది ఆ వెన్నెల వెలుగుకి ఆ ప్రదేశం చాలా అందంగా ఉంది. ఆ అందాన్ని చూస్తూ మైమరచిపోయిన రమేష్కి ఒక అమ్మాయి నవ్వు వినిపిస్తుంది అది విన్న రమేష్ “ఎక్కడ నుండి అమ్మాయి నవ్వు వినిపిస్తుంది” అనుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయిని చూసిన రమేష్ ఆశ్చర్యపోతాడు. “ఎవరు నువ్వు ఏం చేస్తున్నావ్ ఇక్కడ ఒంటరిగా చెట్టు దగ్గర కూర్చొని” అని అడిగాడు రమేష్. “అసలు నువ్వు ఎవరు ఈ ఊరిలో కొత్తగా కనిపిస్తున్నావ్?” అని అడిగింది. “నేను సిటీ నుంచి వచ్చాను. ఈ ఊరిలో ఇల్లు కొనుక్కొని వచ్చాము” అని అన్నాడు. “ఇంతకీ నువ్వు ఎవరు ఇంత అందంగా ఉన్నావు ఇక్కడ ఏం చేస్తున్నావ్? ఎదైనా సమస్యా?” అని అడిగాడు. “నేను తర్వాత చెప్తాను ఒక్కసారి దగ్గరకు రా” అని పిలిచింది. ఆ దారిలో వెళ్తున్న ఒక వృద్ధుడు రమేష్ని చూసి “ఎవరు బాబు నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావ్?” అని అడుగుతూ కంగారుగా అరిచాడు. అతని మాటలు విన్న ఆ దయ్యం రమేష్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. దాంతో రమేష్ గట్టిగా అరుస్తాడు. వచ్చి చూస్తే ఆ దయ్యం రమేష్ని చంపాబోతుంది. ఆ వృద్ధుడు రమేష్ని కాపాడి “వెంటనే వెళ్ళిపో ఇక్కడ ఉండొద్దు” అని కోపంగా రమేష్ని అరిచాడు. ఆ దయ్యం నిజ స్వరూపం బయటికి వచ్చింది. దయ్యం ఆ వృద్ధుడిని చూస్తూ “నేను ఈ ఊరుని వదిలి వెళ్ళను. ఈ ఊరిని నాశనం చేస్తాను. ఈ ఊరు నాకు అన్యాయం చేసింది. ఎవ్వరినీ వదలను. అందర్నీ చంపేస్తాను” అని అరుచుకుంటూ వెళ్ళిపోయింది.

వెంటనే ఆ వృద్ధుడు రమేష్ని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్తున్న దారిలో రమేష్ వృద్ధుడిని “తాత ఎవరు తను? ఏమైంది ఈ ఊరుకి? అసలు నువ్వు ఎవరు? నిన్ను ఏం చేయలేదేంటి?” అని భయంతో అడిగాడు.

వృద్ధుడు బాధతో “తను ఎవరో కాదు బాబు నా కూతురు” అని చెప్పి ఏడ్చాడు. రమేష్ ఆశ్చర్యంతో “మీ కూతురా? అసలు ఏమైంది తాత ఎందుకు ఇలా అయ్యింది?” అని అడిగాడు. వృద్ధుడు ఏడుస్తూ “అది 1969. నా కూతురు పుట్టింది. నా కూతురి పేరు లక్ష్మీ. పేరుకి తగ్గట్టుగానే లక్షణంగా ఉండేది. ఈ ఊరి మొత్తం మీద నా కూతురే అందంగా ఉండేది. ఎంత అందంగా ఉన్న అణకువగా, పద్ధతిగా ఉండేది. కానీ కొంచం మొండిది. తను చిన్నపిల్లగ ఉండేటప్పుడు ఈ ఊరిలో ఉన్న అందరితో కలిసిమెలిసి ఉండేది. అల్లరి చేస్తూ ఉండేది. చిన్నపిల్ల కదా అని నేను ఏం పట్టించుకోలేదు. అందరూ నా కూతుర్ని మంచిగా చూసుకునేవారు. తన మంచితనానికి అందరూ మెచ్చుకునేవారు. తను పెద్ద అయ్యే సమయానికి ఈ ఊరి ఆచారాలను, మూఢనమ్మకాలను చూసి భయపడేది. ఆ భయం తన వయసులాగే పెరుగుతూ వచ్చింది. అది చూసిన నాకు తనను చూస్తే దిగులుగా ఉండేది. ఎలా ఉండిద్ది ఈ ఊర్లో అని. ఆ ఆచారాలని, మూఢనమ్మకాలని పెద్దమనుషుల ఎదురు నేనే జరిపించేవాడిని. నా కూతురు నా దగ్గరకి కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఈ ఊరిలో అందమైన కన్య పిల్లలని బలి ఇస్తే మంచి జరుగుతుంది అనే మూఢనమ్మకం ఉండేది. అది చూసిన నా కూతురు ఎప్పుడూ నన్ను అడుగుతూ ఉండేది “నాన్న నన్ను కూడా అలా చంపేస్తారా” అని నా వైపు దీనంగా చూసేది. తన భయం పోగొట్టాలి అని “లేదమ్మా అలాంటిది ఏమీ జరగదు” అని చెప్పేవాడిని. అయితే ఒకానొక సమయంలో మా ఊరికి కరువు వచ్చింది. మా గ్రామ పెద్దమనుషులు బలి కోరారు. ఆ సమయంలో నా కూతురే కుందనపు బొమ్మలా ఉండేది. అప్పటి దాకా ఎవరినైనా బలి ఇస్తుంటే నాకు ఏమి అనిపించేది కాదు. కానీ నా కూతురి దగ్గరికి వచ్చాక నాకు మనసు రాలేదు. ఏం చేయాలో తెలియలేదు. నా కూతుర్ని బలి ఇవ్వొద్దు అని వాళ్ల కాళ్ళ మీద పడి ప్రాధేయ పడ్డాను కానీ వాళ్ళు వినలేదు. ఊరి మంచి కన్న నీ కూతురు గొప్ప కాదు అని మూర్ఖత్వంతో నన్ను కొట్టి నా కూతుర్ని బలవంతంగా బయటికి లాక్కొచ్చారు. నా కూతురు వద్దు వద్దు అని ఎంత చెప్తున్న వినలేదు బాబు ఈ మూర్కులు. నా కూతుర్ని బలి ఇచ్చేటప్పుడు ఈ ఊరిని మిమ్మల్ని వదలను అని అరుస్తూ చనిపోయింది. తను చనిపోయిన రెండు రోజుల తరువాత నేను కూడా నిర్ణయించుకున్న నా కూతుర్ని చంపిన ఈ ఊరిలో నేను ఉండకూడదు అని ఊరి నుంచి వచ్చేసా. తను చనిపోయిన వారం తర్వాత నుంచి ఊరిలో వింత శబ్దాలు, ఏడుపులు, వింత సంఘటనలు జరిగేవి. ఎవరైనా 6 దాటిన తర్వాత ఈ ఊరికి వస్తే వారిని చంపేస్తుంది. ఎందుకంటే తనను 6 గంటలకు దారుణంగా చంపేశారు. అందుకే పగ తీర్చుకుంటుంది. తను ఎప్పుడైతే పగ తీర్చుకోవడం మొదలు పెట్టిందో అప్పటి నుండి తన చావుకు కారణం అయిన అందర్నీ చంపింది. ఇంకా అప్పటినుండి ఎవ్వరూ బలి ఇవ్వలేదు, బలి కోరలేదు. తన చావుకు కారణమైన అందర్నీ చంపినా తన పగ తీరలేదు. అందుకే ఈ ఊరందరి మీద పగ తీర్చుకుంటుంది. నేను వచ్చాను కాబట్టి నువ్వు బ్రతికి బయట పడ్డవ్. ఇంక ఎప్పుడు ఇక్కడికి రావద్దు. వెళ్ళిపో. ఈసారి నువ్వు వచ్చినా నేను రాను అన్యాయంగా తనకు బలి అయిపోతావు వెళ్ళిపో” అని చెప్పి వృద్ధుడు వెళ్ళిపోతాడు.

ఆ సంఘటన జరిగిన తర్వాత, లక్ష్మీ గురించి విన్న రమేష్కీ చాలా బాధ కలిగింది. తన గురించే ఆలోచించాడు. తనకు నిజంగానే అన్యాయం జరిగిందని బాధ పడి తనని కలవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఒక పక్క భయం ఏమైనా చేస్తుందా అని. “ఏదైతే అదే అయ్యింది వెళ్లి అడుగుతా ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని?” అని బలంగా అనుకుని వెళ్తాడు.

లక్ష్మిని కలవడానికి ముందు వాళ్ల నాన్న దగ్గరకు రమేష్ వెళ్తాడు. వెళ్లి “తాత ఏంటి ఇది? అందరినీ చంపినా తర్వాత కూడా వెళ్ళాట్లేదు అంటే ఇంకా తనకు ఏదో తీరని కోరిక ఉంది. అది ఏంటో చెప్పు తాత” అని అడిగాడు రమేష్. “అదే నాకు తెలియట్లేదు బాబు. నా కూతురు బాగా మొండిది. ఏం చెప్పినా వినదు” అని చెప్పాడు. “సరే నేను తన దగ్గరకి వెళ్తున్న నువ్వు కూడా వస్తే నువ్వు కూడా తెలుసుకోవచ్చు వస్తావా?” అని రమేష్ అడిగాడు. సరే వెళ్దాం అని ఇద్దరు తన దగ్గరకి వెళ్ళారు

రాత్రి 7 అయ్యింది. తను వస్తుంది అని రమేష్కి అర్థం అవుతుంది. తనను చూసి రమేష్ “నేను నీతో మాట్లాడాలి నాకు కొంచం సహకరించు” అని అన్నాడు. కోపంతో ఉన్న దయ్యం రమేష్ దగ్గరకి వచ్చి చంపడానికి ప్రయత్నించింది. అయిన రమేష్ వినలేదు “నేను ఎలా అయిన నీతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత నువ్వు నన్ను చంపినా పర్లేదు. మీ నాన్నతో నిన్న మాట్లాడాను. ఆయన నీ గురించి చాలా బాధ పడుతున్నారు” అని అంటాడు. తన తండ్రి గురించి విన్న తర్వాత ఆగిపోతుంది. నువ్వు ఇక్కడే ఎందుకు ఉన్నావు వెళ్లిపోవచ్చు కదా. నువ్వు సంతోషంగా లేవు. నీ ఆత్మ శాంతించలంటే. నువ్వు సంతోషంగా ఉండాలి. ఏమైంది నువ్వు చంపాలనుకున్న అందర్నీ చంపేసావు కదా. మరి వెళ్లిపోవచ్చు కదా. ఇక్కడ అందరికీ నువ్వు ఇష్టమే అంటగ. ఇంకేం కావాలి ఈ ఊరి నుంచి. నిన్ను ప్రేమించే మనుషులు ఈ ఊరిలో చాలా మంది ఉన్నారు. ఏ ఊరు అయితే నిన్ను ప్రేమించిందో అదే ఊరు నిన్ను చూసి భయపడుతుంది. ఇది సంతిషమా నీకు. ఇలా అయితే నీ ఆత్మ శాంతించదు లక్ష్మీ” అని తనని పంపించడానికి ప్రయత్నించాడు. కానీ లక్ష్మీ వినలేదు “నీకేం తెలుసు ఈ ఊరి గురించి వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారా? నన్ను ఇష్టపడుతున్నారా? అదంతా అబద్ధం. నన్ను బలి ఇస్తుంటే ఒక్కరూ కూడా ఆపలేదు గొర్రెల మందలు చూసినట్టు చూశారు. వేడుకున్న వదిలెయ్యండి నన్ను అని. అయిన ఒక్కరు కూడా స్పందించలేదు. వీళ్ళ గురించి నాకు చెప్పకు.” అని రమేష్తో రోదిస్తూ చెప్పింది. తర్వాత రమేష్ “నీకు ఇంకా ఏం కావాలో చెప్పు. ఇంత మందిని చంపడం నీకు పరిష్కారం కాదు. నీకు ఇంకా ఎదో తీరని కోరిక ఉంది చెప్పు” అని రమేష్ లక్ష్మిని అడిగాడు. దానికి సమాధానంగా లక్ష్మీ “నేను ఇక్కడ ఉన్నది మా నాన్న గురించి ఆయన నాతో ఉండాలి. నాకు తల్లి లేని లోటు తీర్చిన ఆయనని విడిచి నేను వెళ్ళలేను. వెళ్తే మా నాన్నతోనే విడిచి వెళ్తా” అని చెప్పింది. అక్కడే ఉన్న లక్ష్మీ నాన్న ఆ మాట విన్న తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కూతురి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అది చూసిన రమేష్ కన్నీరు పెట్టుకొని కుమిలిపోయాడు. చనిపోయిన తండ్రి ఆత్మ “నా కూతురిని నాకు మళ్ళీ ఇచ్చావ్ బాబు” అని కృతజ్ఞతలు చెప్పాడు. లక్ష్మీ తన తండ్రితో కలిసి వెళ్తూ ఇంక ఈ ఊరిలో బలులు జరపకూడదు అని అందరికీ చెప్పు. అలాంటివి మళ్ళీ జరిగితే నేను మళ్ళీ వస్తాను అని రమేష్కి చెప్పి వాళ్ల నాన్నతో కలిసి వెళ్ళిపోయింది.

Leave a Reply

Your email address will not be published.