192
0

జ్యోతి

192

కొందరు పుడుతూనే అదృష్టాన్ని మోసుకువస్తే ఇంకొందరు కష్టాన్ని ఉగ్గిపాలుగా చేసుకుని బతకడానికి పుడతారేమో. అటువంటి రెండో కోవకు చెందినదే మన కథానాయక జ్యోతి.

పుట్టిన వెంటనే తల్లిని దూరం చేసుకుంది. పురిటి నొప్పులకు తాళలేక తల్లి చచ్చిపోతే, మూఢ నమ్మకాలను బలంగా నమ్మిన తండ్రి బొడ్డు పేగు కొయ్యని జ్యోతిను నష్ట జాతకురాలని ముద్ర వేసి, పని మనిషికి రమనమ్మకు అప్పగించేసి దేశాలు పట్టుకుపోయాడు. పోతూ పోతూ అతని స్థిరాస్తులను అమ్మకానికి పెట్టేసి, వచ్చిన పైకం లో కొంత రమణమ్మ మోహన పడేసి, మరో సారి కొత్త పెళ్లి కొడుకు అవ్వడానికి వేరే దేశం పోయాడు.

చదువులేని రమణమ్మ లోనూ ఏదో భయం. పిల్లా నిజంగా నష్ట జాతకురాలేమో అని. అదే భయంతో ఆ పసి కందును ఇంటికి పట్టుకు పోయింది. తల్లి పాల కోసం గుక్క పెట్టీ ఏడుస్తున్న పసి కందు నోటిలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఆకలి తీర్చింది. గుండెలకు హత్తుకుని లాలించింది. ఆ పిల్ల చిట్టి చేతులు ఆమె పయ్యేదలను తాకుతుంటే అమ్మతనం మొగ్గ తొడిగింది.

సాదా సీదాగా గడిచిన కొన్ని రాత్రుల తర్వాత ఒక భయంకరమైన కాల రాత్రి వారి జీవితాల్ని తలకిందులు చేసింది. కష్ట కాలంలో తోడుగా నిలిచుండే రమణమ్మ మొగుడు ఏక్సిడెంట్ లో చనిపోయాడు. ఇరుగు పొరుగువారంతా ఈ పిల్లను ఇంటికి తెచ్చుకున్నందుకే ఇలా అయ్యింది అని ఆమె బుర్ర కెక్కించేసరికి, జ్వరంతో ఉన్న చిట్టి తల్లిని దూరంగా ఉన్న పెంట కుప్పలో వదిలేసి వచ్చింది.

అటుగా కాపు కాస్తూ ఉన్న ఊర కుక్కలు భీకరంగా అరుస్తూ ఆ చిన్నారి జ్యోతిను నోట కరిచి పట్టుకున్నాయి.

రోజుల గుడ్డు..పాపం కుక్క నోట కరిచి పట్టుకుంటే కెవ్వు కెవ్వుమని ఎందుకు బ్రహ్మయ్య నన్ను పుట్టించావు? ఏ జన్మ పాపాలను అయ్యా నా నుదుటిన దిద్దావు అని ఆకాశం దద్దరిల్లెలా ఆ పసిది ఏడుస్తూ ఉంటే రమణమ్మ వెనక్కి తిరిగి చూసింది. ఆ ఏడుపుకు కుక్క పసిదాన్ని కిందకు పడేసి, బిడ్డ బుగ్గలను నాకుతుంటే రమణమ్మ కుక్క మీదకు రాయి విసిరింది. ఆ పసిదాన్నీ ఇంటికి తీసుకు పోదామా? అనే మీమాంసలో పడి ఆలోచిస్తూ ఉంది రమణమ్మ. అమ్మో ఇంకేదైనా ఘోరం జరిగితే.. నా బిడ్డల గతి ఏం కావాలి? మొగుడు యేటూ లేడు. నా బిడ్డలనైనా సక్కంగా చూసుకోవాలి. ఈ నష్ట జాతకురాల్ని ఇంటికి తెచ్చి పెట్టుకుంటే, ఎన్ని అనర్థాలు జరుగుతాయో.. నాకు నా కుటుంబమే ముఖ్యం అనుకుంటూ స్వార్ధపు కోరల్లో భయం ముంగిట చిక్కుకుపోయింది.

చిట్టిది ఇంకా గుక్క పెట్టీ ఏడుస్తూ ఉంది. రమణమ్మ కదలకుండా చీకట్లో నించుని ఆ బిడ్డ వైపే చూస్తూ ఉంది.

“ఏస్.. ఎవడ్రా అది.. నోర్ముయ్..మాయదారి గోల..” అనుకుంటూ ఒక తాగుబోతు అటువైపుగా వస్తూ, రోడ్డు మీద పడి ఉన్న జ్యోతి మీద కాలు వెయ్యబోయి తమాయించుకున్నాడు.

రమణమ్మ ఆ తాగుబోతు పసిదాన్ని తొక్కేస్తాడేమో అని భయంతో గట్టిగా అరిచింది. తాగుబోతు చుట్టూ చూసాడు. చీకట్లో నిల్చున్న రమణమ్మ వాడికి కనిపించలేదు. వాడు బిడ్డ వైపే చూస్తూ ఆ బిడ్డ పక్కనే రోడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చున్నాడు. బిడ్డను తదేకంగా చూస్తూ ఉన్నాడు.

బిడ్డ..వచ్చేసావా..నా దగ్గరకు మళ్లీ వచ్చేశావా ఆంటూ ఆర్తిగా బిడ్డను ఎత్తుకుని గుండెలకు హత్తుకుని చుట్టూ చూసి పరుగు పెట్టాడు.

ఆ తాగుబోతు ఆ పసిదాన్ని అలా ఎత్తుకుని పారిపోతూ ఉంటే, రమణమ్మ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. అమ్మో..తాగుబోతు సచ్చినోడ..మాయదారి మూకలకు ఆడబిడ్డ ను అమ్మేస్తాడో ఏంటో. చూస్తూ చూస్తూ ఆడ కూతురి జీవితం నాశనం అయిపోతాదే.. ఓరి నాయనో..ఆంటూ వాడి వెనకాలే వెర్రిగా పరుగులు తీసింది.

వాడు రెండు మూడు వీధులు దాటి, ఒక వలస కూలీలు ఉండే గుడారాల లోకి పరుగెత్తాడు. రమణమ్మ అతడినే అనుసరిస్తూ, గుడిసె చాటున నక్కి చూసింది.

“ఎందయ్యో..ఏంది ఆయాసం ..మళ్లీ తాగావా..ఎవరీ బిడ్డ..ఏడ నుండి పట్టుకు వచ్చావ్..పోలీసులు పట్టుకుపోతారు. మొన్ననే జైలు తిండి తిన్నవ్..అయినా బుద్ది రాలేదా..ఎందయ్య.. మూగోడిలా అట్టా నించొక పోతే ..సెప్పయ్య…ఈసారి ఎవరి బిడ్డను ఎత్తుకుని వచ్చావ్..సెప్పయ్యా..” ఆంటూ ఒక ఆడమనిషి అతడ్ని పట్టుకుని ఉపుతూ అడుగుతూ ఉంది. ఆమె మాటల ద్వారా ఆ తాగుబోతు గతంలో జైలుకి వెళ్ళాడని, ఇలాగే బిడ్డలను ఎత్తుకు వచ్చేశాడు అని రమణమ్మ కు అర్థం అయ్యి గుండె గుభేల్ మంది.

వెంటనే వెళ్ళి బిడ్డను తెచ్చేసుకోవాలి అని అనుకుంది. కానీ ఏదో మూల ఏదో భయం

” రత్తాలు..మన బిడ్డే..మన బిడ్డే మళ్లీ మనకు దక్కింది. నీకు నాలుగు కడుపులు పోయాయి అని ఆ బగవంతుడే ..దయుంచి ఈ బిడ్డను రోడ్డు మీద పెట్టాడు..నేను పట్టుకొచ్చేసా. మన బిడ్డే రత్తాలు..ఇది మన బిడ్డ.” ఆ తాగుబోతు రత్తాలు అనే అతడి భార్యతో చెబుతుంటే విషయం అర్ధం అయ్యింది రమణమ్మ కు.

“ఈ బిడ్డ నిజంగా రోడ్డు మీద దొరికిందా మావా?” రత్తాలు మొహంలో చిన్న నవ్వు.

“అవునే .. రోడ్డు మీదే.. ఏ బలుపెక్కిన ఆడదో పారేసింది..మనలాంటి బిడ్డల కోసం ఏడ్చే వోరి దగ్గరకు వచ్చి చేరింది..” బిడ్డను ముద్దాడుతూ చెప్పాడు .

“బిడ్డ ఏడ్వట్లేదు ఏంది మావా..సఛ్చిపోయిందా ఏంది?” రత్తాలు మొహంలో నవ్వు మాయం అయ్యింది.

రమణమ్మ కు కూడా అదే అనుమానంతో n లేక బాధతోనో బిగుసుకుని పోయింది.

“లేదే..నేనే పరిగెట్టినంత సేపు ఏడుస్తా ఉంది..ఇప్పుడే కల్లు తెలిసింది. దేవుడా..ఏంది సామి ఇది..”అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ కన్నీటి చుక్క ఆ పసిదాని బుగ్గ మీద జారి కెయ్ మని ఏడుపు లంకించింది.

ముగ్గురి కళ్ళల్లో ఏదో తెలియని తృప్తి. “బిడ్డ బతికి బట్ట కట్టింది.. నేను కొలిచే నా ఇష్ట దైవం పేరు పెడతా.. జ్యోతి…జ్యోతిమ్మ..ఈ బిడ్డ పేరు” ఇంకా బాలింతరాలు అయిన రత్తాలు ముద్దుపెట్టుకుని తన చనుబాలు బిడ్డ నోటికి అందించింది.

“జ్యోతి..జ్యోతిా..మంచి పేరు” అని రమణమ్మ మనసులో అనుకుంది.

“ఒసేయ్ రత్తాలు.. మరి బిడ్డను మన బిడ్డగానే పెంచుకుందామా” అతడు జ్యోతి తల నిమురుతూ అడిగాడు.

“మరి నువ్వు ఆ తాగుడు మానేస్తా అంటేనే” రత్తాలు మురిపెంగా చెప్పింది.

“బిడ్డ మీదొట్టు..ఇంకెప్పుడు చుక్క ముట్టను.” అతడు ఒట్టేసాడు.

వీరిని చూసి ఆ పసిదానికి మంచి జీవితం దొరికింది అని అనుకుని వెనుతిరిగే లోపు..

“శివ..రేయ్..శివ..” అంటూ కొందరు మనుషులు అటువైపు గా రావడం చూసి, చీకట్లో దాక్కుంది రమణమ్మ.

” రేయ్ శివా..ఎక్కడి నుండి ఎత్తుకు వచ్చావు రా?” ఆ మనుషులు ఆ తాగుబోతు ను అడిగారు. అతని పేరు శివా..అని అనుకుంది రమణమ్మ.

“పై నుండి దేవుడు పిల్చి ,ఇదిగో ఈ బిడ్డను తీసుకుపో అని ఇచ్చాడు.. నీకెందుకు?” శివ నవ్వుతూ చెబుతుంటే, రత్తాలు పల్లికలించింది. “ఏందన్న.. సూసేసావా.. ఈడికి దొరికింది ఈ బిడ్డ. ఏ తల్లో రోడ్డు మీద ఇసిరేస్తే ఈడు పట్టుకొచ్చాడు. బా ముద్దుగా ఉంది కదూ” రత్తాలు బిడ్డను చూపిస్తూ చెప్పింది.

“ఆడ బిడ్డ దొరికిందా…సరే తీ.. గా పోలిసొల్లకు దొరికినావంటే ఈపు ఇమానం మోతే.. బిడ్డను తీసుకుని ఏడికేనా పొండి. ” సలహా ఇచ్చాడు ఒకడు.

“నువు సెప్తే గానీ తెల్వదు మరి.” పరాచకాలాడాడు శివ.

రమణమ్మ ఊపిరి పీల్చుకుంది. హమ్మయ్య ఏదైతే అది..ఈ బిడ్డ కూటికి గటిలేకున్నా, మంచి మనసున్న మంచొల్ల చేతికే చిక్కింది. ఇక దీని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆ దేవుడే చెప్పాలి. అనుకుంటూ వెనుతిరిగింది.


రత్తాలు కు మాట ఇచ్చినట్టే తాగుడు మానేశాడు శివ. కల్లో గంజో తాగుతూ ఉందామని, ఆ ఊరు వదిలి తన ఊరు బాట పట్టారు మొగుడూ పెళ్ళాలు. ఊరి వారికి కూడా ఈ బిడ్డ తమకు పుట్టిందే అని చెప్పుకుంటూ పెంచుకోసాగారు.

తెల్లగా వెన్నెల భరినిలా ముద్దు ముద్దుగా ఉన్న జ్యోతింటే వాళ్ళ ఊరిలో జనాలకు ఒక పెద్ద ఆట విడుపు. కూలీ నాలీ చేసుకుని అలసొచ్చి, ఈ జ్యోతితో ఆడుకోవడం వాళ్ళకి ఓ సరదా. ముద్దు ముద్దుగా పెరుగుతూ, అందరి లాలన పాలన లో బంగారు బొమ్మలా పెరిగింది జ్యోతి. ఆమె చెప్పే ఆరింద కబుర్లు వింటూ చిన్నా పెద్దా అందరూ చుట్టూ చేరి , ఆ పిల్లతో ఏదో ఒకటి మాట్లాడిస్తా ఉండేవారు. ఆడుకుంటూ ఉండేవారు.

కాలం మెల్లగా కదిలిపోతూ ఉంది. జ్యోతికు మూడేళ్లు నిండుకున్నాయి. ఓ రోజు ఆ పసిదాన్ని స్కూల్లో చేర్పించేందుకు , శివ జ్యోతిను పిలిచాడు. ఒక్క కేకకే ఏంది నానారు అని వచ్చేసే జ్యోతి ఆరోజెందుకో శివ ఎంత పిలిచినా రాలేదు. రత్తాలు కూడా కేకలేస్తూ బయట అంతా వెతికింది. ఏదీ ఈ పిల్ల కనిపిస్తేనా..

ఏ మాయదారి మొహాలు నా బిడ్డను ఎత్తుకు పోయారో తల్లో అని రత్తాలు రాగాలు తీస్తుంటే చుట్టూ పక్కల వారందరూ చుట్టూ చేరి, వాల్లునూ వెతకడం మొదలుపెట్టారు. ఎంత వెతికినా జ్యోతి దొరకలేదు. గంట గడిచింది. పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం అని అందరూ అనుకున్నారు.

పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు ఊర్లల్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు గానీ ఎత్తుకు పోయారా ఏంటి అని ఒకరు అనుమానం వ్యక్తం చేసేసరికి రత్తాలు పెద్దగా రాగాలు తీసింది. ముద్దు ముద్దుగా చిలకలా మాట్లాడే పిల్లను ఎవరైనా ఎత్తుకుపోయి దేశాలు పట్టుకు పోయారేమో.. అంటూ కొందరు అంటుంటే

“అయ్యో..లేకలేక కలిగిన బిడ్డ దేవుడా…ఏడకి పోయింది నాయనా….జ్యోతిమ్మ ఏడ బోయావు తల్లి. నిన్నెత్తుకు పోయినొల్ల కాళ్ళు పడిపోను.. ఆల్లు ఏట్లో పడి సావ.. అయ్యో బగవంతుడా నా బిడ్డ దొరికితే పొర్లి దండాలు పెడతాం. మా మావా నేను గుండు కొట్టించుకుంటాం.” అని రత్తాలు శోకాలు తీస్తుంటే,

“అమ్మా..నీకు అయ్యకు గుండు బాగోదే…” అంటూ తలుపు చాటునుంచి వచ్చింది జ్యోతి.

అందరూ తెల్ల మొహాలు వేసి చూసారు. రత్తాలు నోట మాట రాక అట్టే చూస్తూ కూర్చుంది. జనాల్లో కొందరు జ్యోతిను పట్టుకుని ఏడకు బోయావే అని అడుగుతుంటే,

“ఏడకీ బోలే.. ఈడనే గీ తలుపు సంది నించున్న..”అంటూ తలుపు చూపించింది జ్యోతి. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మలక్కలు నవ్వుకున్నారు..చిట్టిదాని హాస్య కేళిని చూసి.

రత్తాలు చివాలున లేచి ఒక్కటిచ్చింది పిల్ల వీపు పై. కొందరు ఆడవాళ్ళు ఆమెను ఆపారు. జ్యోతి ఏడుపు లంకించుకుంది. జ్యోతిను వెతికి వెతికి వచ్చిన శివ కూడా జ్యోతి కనబడేసరికి ఎత్తుకుని ముద్దులు కుమ్మరించాడు.

“ఆ ముద్దులు పెట్టుదువు గానీ, నీ కూతురు చేసిన పని తెలుసా” అంటు అంతా చెప్పింది రత్తాలు.

“ఎందుకు బంగారి ఇలా దాక్కున్నావ్.” శివ ప్రేమగా అడిగాడు జ్యోతిను.

” మరే..నేను ఇస్కూల్ పోను నానా… నువు ఈరోజు పట్టుకు పోతావ్ అన్నావ్ గా..నాకొద్దు.. ఆడ పెద్ద పెద్ద కర్రలతో సారోల్లు కొడతరట..అల్లరి చేసేటాలను చీకటి గదిలో పెట్టేసి, అడవుల్లో వదిలేస్తారట… నే పోను నానా..” జ్యోతి బెక్కుతూ చెప్పింది.

“అట్టేం ఉండదు తల్లి..పోనీ నేనూ కూసుంటాలే నీతో పాటు.. ఇద్దరం పోదామా బడికి. అప్పుడోస్తావా..” శివ జ్యోతి బుగ్గలను చేతిలో తీసుకుని అడిగాడు.

వస్తానంటూ తలూపింది జ్యోతి. అందరూ హాయిగా నవ్వుకున్నారు.
రత్తాలు కూడా జ్యోతిను కొట్టినందుకు బాధ పడుతూ జ్యోతిను అందివ్వమని శివ దగ్గర చేతులు చాచి, జ్యోతిను అందుకోబోయింది. జ్యోతి ఉడుకుమోతుగా మొహం తిప్పుకుంది.

“అమ్మా దగ్గరకు రావా బంగారి” రత్తాలు జ్యోతిను అడిగింది.

“కొట్టావుగా..నీతో రాను..పో..” అంటూ చిన్నగా తోసింది జ్యోతి.

రత్తాలు నవ్వుతూ గుడిసెలోకి వెళ్లిపోయిందల్లా ఒక్కసారిగా గుమ్మం ముందు కూలబడిపోయింది.

“రత్తాలూ..” అంటూ అరుస్తూ శివ జ్యోతిను కిందకు దించి రత్తాలు దగ్గరకు వెళ్లి లేవదీశాడు. రత్తాలు..ఒసేయ్ రత్తాలు కళ్ళు తెరవ్వె.. శివ తో పాటు ఆడొల్లు కొందరు అరుస్తూ రత్తాలు లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టారు.

” రత్తాలు.. ఏమయ్యిందే.. లెవ్వే.. ఎవరైనా ఆసుపత్రికి తీసుకు పోండయ్య..” ఆడాళ్ళు అరుస్తా రత్తాలు చుట్టూ చేరారు. రత్తాలు కళ్ళు తేలేసి పడివుంది. శివకు ఏం చెయ్యాలో అర్దం కాక.. నోట మాట రాక రత్తాలు నే చూస్తా ఉండిపోయాడు. జ్యోతి ఈ హడావిడికి ఏడుపు లంకిస్తుంటే కొద్దిగా వయసున్న ఆడపిల్లలు దాన్ని ఎత్తుకుని ఆడిస్తూ ఉన్నారు.

ఆ ఊరికి ఉన్నదల్లా ఓ గవర్నమెంటు ఆసుపత్రి. అదీ పేరుకు మాత్రమే ధర్మాసుపత్రి. అక్కడ పేదోడి బతుక్కి విలువే ఉండదు. ఇక చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడే మనిషికి, సరైన వైద్య సదుపాయం, ఏమర్జన్స్ ఆపరేషన్ అంటూ ఏమీ లేవు. బతికితే బతుకు లేదంటే చావు. నీ బతుక్కి విలువే లేనప్పుడు నీ చావుకి మాత్రం ఏం విలువ అన్నట్టు ఉంటుంది అక్కడి పరిస్థితి. అటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు రత్తాలు ను.

“అబ్బే ..ప్రాణం ఉన్నట్టు లేదయ్య.. పెద్ద సారు వచ్చేసరికి మధ్యాహ్నం దాటుతుంది. మనిషి ఊపిరి పీల్చడం లేదు..” అని కంపొండర్ చెప్పుకొచ్చాడు.
“ఇటు చూసావా .. నాడి కూడా కొట్టుకోవట్లేదు. నీ పెళ్ళాం సఛ్చిపోయింది.. తీసుకుపో.. ఇక్కడుంచి లాభం లేదు” అని అతను చెప్పేసరికి శివ కుప్ప కూలిపోయాడు.

ఒరేయ్..శివ..లేరా అంటూ పక్కనున్న అతని గ్రామ వాసులు అతన్ని లేపి, కూర్చోబెట్టి నీళ్లు తాగించారు.

ప్రాణం కన్నా మిన్నగా చూసుకున్న భార్య ..ఏం రోగం వచ్చిందో తెలియకుండానే అతన్ని ఒంటరిని చేసి పోయె సరికి మూగబోయి అట్ట చూస్తూ ఉండిపోయాడు. కదిలిస్తే కదల్తలేడు.. మాటాడించినా ఉలుకూ పలుకూ లేకుండా ఉన్న శివను చూసి అతని దోస్తులు రత్తాలు సవం తీసుకుని ఊరి వైపు కదిలారు. వారి వెనుకే శివ కూడా జీవచ్ఛవంలా అడుగులు వేస్తూ వెళ్ళాడు.

ఊర్లో వారంతా తమ దగ్గరున్న పదో పరకో తెచ్చి కట్టెలు అమర్చి రత్తలును పడుకో బెట్టారు. ఆ స్మశాన వాటికలోనూ చిక్కటి నిశ్శబ్దం పాటించాడు శివ. ఒక ఏడుపూ లేదు. ఏ మాత్రం బాధ లేకుండా కట్టెల మీద హాయిగా నిదొరోతున్నట్టు ఉన్న రత్తలును అలా చూస్తా ఉన్నాడు.

ఒరేయ్ శివా ఏడ్చే రా..నీ బాధ కక్కే రా..అంటూ సాటి వాళ్ళు ఎంత చెప్పినా వాడు అట్టానే కూర్చుని ఉన్నాడు.

దహనం చేసే వేళ అయ్యింది. అంటించిన కట్టెను తీసుకుపోయి శివ చేతికి ఇచ్చారు కొందరు. దుఖం బిగపెట్టుకుని ఉన్న శివ ఆ కట్టే నందుకుని రత్తాలు శవానికి నిప్పంటించాడు. కాలుతున్న శవం చూస్తూ కూడా ఏడ్వట్లేదు వాడు. అలా చూస్తూ ఉన్న శివ
గట్టిగా “రత్తాలు ” అని కేక వేసి మంటల్లో దూకే యత్నం చేశాడు. పక్కనున్న జనం వాడ్ని పట్టుకున్నారు.

” రత్తాలు …రత్తాలు..బతికే ఉంది..చూడండి..” ఆడు అరుస్తా కాలుతున్న రత్తాలు ను చూపించాడు. అక్కడున్న వారికి నోట మాట రాలేదు. రత్తాలు నిజంగానే చేతులు కదిలిస్తోంది. కాలుతున్న రత్తాలు నిజంగానే లేచి కూర్చుంది. వాడు పిచ్చొడిలా ఆమెను అందుకోడానికి అటువైపు పరుగులు తీసేలా, ఆమెను అందుకునేలా కొట్టు మిట్టాడుతుంటే చూసే వారి మనస్సు తరుక్కు మంది. వాడ్ని అలాగే గట్టిగా పట్టుకుని కొందరుంటే, ఇంకొందరు రత్తాలు మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇసుక తెచ్చి పోస్తున్నారు.

మంటలు అదుపులోకి వచ్చినా రత్తాలు సగం కన్నా ఎక్కువ కాలిపోయింది. వాడు దిక్కులు పెక్కటిల్లెలా ఏడుస్తూ, రత్తాలు…బతికుండగానే కాల బెట్టేసానే..నిన్ను చంపేశా..అయ్యో దేవుడా..నన్ను చంపెయ్యవే.. నే సఛ్చి పోతా అంటూ తలను నెలకు బాదుకుంటూ ఏడుస్తుంటే అక్కడున్న వారంతా కంట తడి పెట్టుకున్నారు.

కోన ఊపిరితో నేల మీద పడి ఉన్న రత్తాలు వాడ్ని దగ్గరకు పిలుస్తా సైగ చేసింది.
ఏడుస్తున్న పాపాయి అమ్మ పిలవగానే పోయినట్టు వాడు కళ్ళు తుడుసుకుంటూ రత్తాలు ను ఒడిలోకి తీసుకున్నాడు. నిప్పు రవ్వలా ఉన్న రత్తాలు వేడి అతడి తొడని కాలుస్తున్నా బాధను బిగపట్టి దాని మొహాన్ని ఆర్తిగా తడిమాడు.

” జ్యోతి జాగ్ర.. త్త..మా..వా..” ఒక్కో అక్షరం కూడా బలుక్కుని చెప్పి వాడి ఒడిలోనే శాశ్వత నిద్రలోకి జారుకుంది రత్తాలు. తాను చనిపోతున్నా బిడ్డనే కలవరిస్తున్న ఆ తల్లిని చూసి అందరూ గుండె బరువు చేసుకుని ఏడుపులు మొదలెట్టారు.

ఈసారి శివ మూగగా ఏడ్వలేదు. ఆకాశంలో ఈ వింతను చూస్తున్న ఆ పైవాడు అదిరి పడేలా ఏడ్చాడు. వాడిని ఆపడం ఎవ్వరీ తరం కాలేదు. రత్తాలుకి ఈ సారి అంతిమ వీడ్కోలు చెప్పి, దహన సంస్కారాలు పూర్తి చేసి, చావలేక బతికి ఉన్న శివను గుడిసె కాడికి తీసుకు పోయారు.

“ఒరేయ్ ఆ కంపోండర్ మోసం చేశాడు రా.. బతికున్న దానిని సఛ్చిందని చెప్పి మనల్ని ఎదవల్ని చేశాడు. రేయ్..ప్రతీకారం తీర్చుకోవాలిరా..పోయి పోలిసొల్లకి చెబుదాం” అంటూ శివను రెచ్చగొట్టారు ఊరోళ్ళు.

శివ కూడా కోపంతో వెళ్లి ఆ కంపోండర్ గాడిని ఊరోల్లతో కలిసి ఉతికి పడేశాడు. అంతలో పోలీసులు వచ్చి ఈ గొడవ పడుతున్న వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. శివను కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళి, విచారించారు.

విషయం అంతా తెలుసుకున్నాక , వాలకు ముట్టల్సింది ముట్టిందేమో , “కంపొందేర్ తప్పేమీ లేదు. ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా రోగి సఛ్చాడు అన్నాక కూడా బతికినొల్లు ఉంటారు. ఇప్పుడీ విషయం పెద్దది చేస్తే, బతికున్న మనిషిని కాల్చి చంపారని మిమ్మల్ని బొక్కలో వేస్తారు. అందుకే ఎంతో కొంత తీసుకుని వదిలేవయ్య.. పిల్లలు కలవాడివి.. తల్లెట్టా పోయింది.. ఇప్పుడు నువ్వు జైలుకు పోతే దాన్నేవరు చూస్తారు.. నా మాట విని వదిలేసే..” అంటూ పోలీసులు చెబుతుంటే, తన చేత కానీ తనానికి , పేదరికాన్ని తిట్టుకుంటూ మౌనంగా బయటకి నడిచాడు శివ. చదువుకుని ఉండుంటే, చట్టాన్ని తెలుసుకుంటే ఈ ఎదవలు ఇట్టా మాటాడేవారా.. అని అనుకున్నాడు.

” ఒరేయ్ శివ.. మనల్ని జైల్లో ఏసినా ఎస్తారు రా..ఈ మాయగాల్లు.. వదిలేసే రా.. వదిలేసి…వాల్లిచ్చిందేదో తీసుకుని పోదాం రా..” అంటూ ఒకడు శివకు నచ్చజెప్పాడు

” ఒరేయ్..ఇప్పుడే ధైర్యంగా ఉండాలి. నీ జ్యోతిమ్మను మంచిగా చూసుకో.. ఆ డబ్బు దానికి ఉంచి, దాన్ని చదివించు..ఈడ ఉండకురా..పో..పట్నం పోయి పని చూసుకో.. నీకేం కాదురా..రత్తాలు నీ పక్కన లేకున్నా..దాని ఆత్మ నీతోనే ఉంటుంది. నీకంతా మంచే జరుగుతుంది రా.. ఒగ్గేసెయ్ రా..ఈ గొడవలెందుకు..ఒగ్గేసే…” ఇంకోడు ధైర్యం చెప్పాడు.

ఆలోచిస్తూ నీరసంగా ఇంటికి చేరాడు శివ. చిట్టి జ్యోతి మట్టిలో ఆడుకుంటూ ఉంది. “దానికి బువ్వ పెట్టేసాను. నువ్వు కూడా ఇంత ఎంగిలి పడు” అని పక్కింటి సీతాలు గిన్నెలో అన్నం తీసుకుని వచ్చింది. శివకి తినాలని లేదు. ఆ గిన్నె అందుకుని పక్కన పెట్టేశాడు.

“తినకుండా ఎన్నాల్లిలా ఉంటావు? కాస్త తిను ఓపిక ఉండాలి కదా. రేపు పనికి పోవాలి. బంగారి ని స్కూల్లో యెయ్యలి. రత్తాలు చెప్పింది గ్యాపకం లేదెంటి?” సీతాలు మొగుడు రంగయ్య అడిగాడు.

“గ్యాపకం ఏందయ్య… రకతం మరిగిపోతోంది.. చీ ఆడయ్య..నా పెళ్ళాన్ని బతికుండగానే నాచేత నిప్పంటించాడు. వాడ్ని ఊరికే ఒగ్గేది లేదు. పథకం ఏసి ఆడ్ని కూడా అట్టానె కాలబెట్టలే. అంతవరకూ నా ప్రాణం సల్లబడదు. ” శివ అంతవరకూ ఆపుకున్న దుఖాన్ని, బాధను, కోపాన్ని ఎల్లగొట్టాడు. మళ్లీ అంతలోనే ఎక్కి ఎక్కి ఏడ్చాడు.

” ఏం పాపం సేసాం అయ్యా..మనమేం పాపం సేశాం. కూలోడిగా పుట్టడమా పేదొడిగా బతకడమా.. ఏ పాపం సెయ్యని మన బతుకులిట్టా.. పాపాలు మూటగట్టి వాళ్ళ బతుకులు దర్జాగా . మంచికి ఇలువ లేదురా ఈ భూమ్మీద. గా పోలీసోల్లు నాయం సేస్తారంటే ఆళ్లూ ఆ మోసగాళ్లతో కలిసి పోయారు. ఇక నిమ్మళంగా కూర్సుంటే పని గాదు. అన్నల్లో కలుస్తా.. ఆ పోలీసోడను..ఆ డాక్టరును..ఆ నా కొడుకు ఆ కపొండర్ గాడిని సంపి పాతిపెడటా…” అంటూ విసురుగా లేచి నిల్చున్నాడు శివ.

వాడి అరుపులకి బెంబేలెత్తి జ్యోతి వాడి కాళ్ళను చుట్టుకుని ఏడుపు లంకించింది. వాడు ఆ పసిదాన్ని అట్టా చూస్తా నిల్చున్నాడు.

“ఒరేయ్..ఆవేశం వద్దురా..పోయినదాన్ని యెట్టాగు పట్టుకు రాలేవు. కనీసం ఈ బంగారి కోసమైనా ఓర్సుకొరా. కోపం పక్కన పెట్టేసి నింపాదిగా ఆలోచించు.. ఈ పసిదానికీ అమ్మ యెట్టాగూ దూరం అయ్యింది. నాన్నవు నువ్వు కూడా దూరం అవుతావు అట్ట అన్నళ్లో కలిసావంటే. పైన భగవంతుడు ఉంటాడు అన్నీ సూస్తాడు. ఎవరికి యెట్టా బుద్ది చెప్పాలో ఆయనకి వదిలేసే.. ముందు నీ కాళ్ళ దగ్గర ఏడుస్తున్న ఆ పసిదాన్ని చూడు. అమ్మా ఏడకు పోయిందో తెలియదు. నాన్న ఎందుకు అరుస్తున్నాడో అర్థం ఆడుకోవలసిన బాల్యం ఎట్టా అయిపోయిందో చూడు “అని సీతాలు చెపుతుంటే , జ్యోతిను చూసాడు శివ. అతడిలో కరుణ ఉప్పొంగింది. పిల్లను చంకబెట్టుకుని ఊరుకోబెట్టాడు.

“నా మాట విని వాళ్ళు ఇస్తారన్న పైసలు తీసుకుని, ఏడకైనా బోయి మంచిగా బతుకు రా ” రంగయ్య అనునాయంగా చెప్పాడు.

” చీ..తూ..ఎవడికి కావాలి రా..నా పెళ్ళాం శవం మీద ఇసిరేసిన పైసలు. నా మట్టుకు నేను బతుకుతా.. నా బిడ్డను నేను చూసుకుంటా.. ఎవ్వడి ముష్టి నాకు అక్కర్లేదు. ” దృఢంగా చెప్పాడు శివ.


జ్యోతిను తీసుకుని పోయి, జ్యోతి దొరికిన ఊరికే వచ్చాడు శివ. తన దగ్గర ఉన్న కాసిన్ని పైసలతో కూరగాయలు కొని అమ్మడం మొదలు పెట్టాడు. అద్దెకు తోపుడు బండి తీసుకున్న శివ అనతికాలంలోనే బండిని కొనుక్కున్నాడు. జ్యోతి కూడా పెద్దది అయ్యింది. బంగారు బొమ్మలా పెరిగింది. చదువులోనే కాదు నడవడికలోనూ మంచి పేరు తెచ్చుకుంది. తండ్రికి ఆసరాగా ఉంటుంది అని చదువుకుంటూనే నాలుగిళ్ళల్లో పాచి పనికి కుదిరింది.

అదేం మాయో..ఆమె పని చేస్తున్న ఇంట్లో ఇంకో పని మనిషిగా రమణమ్మ కుదిరింది. రమణమ్మ కు తానోదిలొచ్చిన బిడ్డే జ్యోతి అని తెలియదు. జ్యోతికు కూడా రమణమ్మే తన కన్న తండ్రి దగ్గర పనిచేసిన మనిషి అని తెలియదు. విధి విలాసం ఇద్దరూ కొద్ది రోజుల్లోనే మచ్చిక అయిపోయారు. కబుర్లు, ఏకసెక్కాలు చెప్పుకుంటూ కలిసి పని చేసుకునే వారు. పాపం తల్లి లేని పిల్ల అని జ్యోతి అంటే రమణమ్మకు జాలి. ఆ కరుణ తోనే జ్యోతికు ఇంకో రెండు ఇళ్ళల్లో పని ఇప్పించింది. జ్యోతి డబ్బులిలా దాస్తుందనీ ఆమెకు తెలుసు. ఇంట్లో తండ్రికి చెప్పకుండా పనికి కుదిరింది అని తెలుసు. ఒక తల్లిలా ఆమె అన్నీ కడుపులో దాచుకుంటే, జ్యోతి ఆమెనే తల్లి అనుకుంటా మనసులో మాటలు చెప్పుకునేది. చాలా సార్లు జ్యోతి ఇంటికి రమణమ్మ వెళ్ళింది. కానీ శివను చూడలేదు.

తను ఇలా ఇళ్ళల్లో పని చేస్తున్నట్టు శివకు తెలియనివ్వలేదు జ్యోతి. తండ్రి వచ్చేసరికి చీకటి పడుతుంది. అంతలోపు పని చేసుకు వచ్చేసేది. అలా సంపాదించిన డబ్బును పొదుపు చేస్తూ , ఏనాటికైనా ఉపయోగ పడుతుంది అని తండ్రికి చెప్పకుండా దాచుకుంది. కానీ ఆ డబ్బే తన జీవితాన్ని మలుపు తిప్పింది.

ఓ రోజు శివకు మంచి గిరాకీ పెరిగింది. కూరగాయల న్నీ మధ్యాహ్నానికి అమ్ముడాయిపోయాయి. జ్యోతిను బజారుకు పట్టుకెళ్ళి ఏదైనా కొనిద్దామని పెందలాడే ఇంటి బాట పట్టాడు. ఆ సమయానికి స్కూల్ వదిలేసి ఉంటారు కాబట్టి జ్యోతి ఇంట్లోనే ఉంటుందనుకుని వచ్చిన శివకు తాళం వేసిన తలుపులు ఆశాభంగం చేస్తూ కనిపించాయి. ఎవరో స్నేహితుల ఇంటికి పోయుంటుంటుందిలే అనుకుని మారు తాళం చెవితో తలుపులు తెరిచి ఇంటిలోకి వెళ్ళాడు.

తాటాకులతో కప్పబడి, మట్టి గోడలతో నిల్చున్న ఇల్లైనా నాది అని గర్వంగా చెప్పుకోడానికి స్వంత ఇల్లైతే సంపాదించగలిగాడు. చాలా రోజుల తర్వాత దొరికిన ఈ తీరుబడిలో ఇల్లంతా ఓ మారు చూసాడు. పేరుకి గుడిసిల్లే అయినా అన్నీ సామాన్లు పొద్దికగా అమర్చి ఉన్నాయి. నా బిడ్డ బంగారం. అచ్చం దాని తల్లి లాగే.. అనుకుంటూ దేవుడి పటం పక్కనే ఉన్న రత్తాలు ఫోటో , చేతిలో తీసుకుని “చూసావే రత్తాలు…మన బంగారి ఎంత పెద్దది అయ్యిందో. ఇంటినెట్టా కాపాడుతోందో. నా పెంపకమే..నా పెంపకం.. దాన్ని నువ్వడిగినట్టే జాగరత్తగా చూసుకున్నా. దాన్ని బాగా చదివించి పెద్ద అఫిసరమ్మ ను చేస్తా.. చూస్తా ఉండు..” అంటూ సంబరంగా చెప్తూ ఫోటోను యధావిధిగా పెట్టబోయాడు. అక్కడో చిన్న సంచిలా కనిపించింది. ఎంటా అన్నట్టు తీసి చూసాడు. నోట్ల కట్ట.. 500..2000 ఉన్న నోట్ల కట్ట చూసి నోట మాట రాలేదు శివకి.

“ఇంత డబ్బు..ఇంత డబ్బు ..ఎక్కడిది దానికి..” అంటూ ఆ సంచిని చేతిలో తీసుకుని, అలా బొమ్మలా నవారు మంచం మీద కూలబడ్డాడు.
“ఏం చేసి సంపాదించింది. అయినా నాకొక్క మాట కూడా సెప్పలేదు. ఇంతగనం సంపాయియ్యాలంటే ఏం చేయాలి.. లేక్కేడితే యాభై వేలకు తక్కువ లేదు. ఇంత డబ్బు ఏ పాడు పనులు చేసి ఒట్టుకొచ్చిందది. ” అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది.

“ఛీ..ఎంత సక్కగా పెంచినా ఊరి కుక్క ఊరి కుక్కే.. ఏ ఆడది కనిందో.. ఆ పాడు రక్తం తో ఇది కూడా పాడు మని షే.. “అతడిలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ఇన్నేళ్ళు పెంచిన బిడ్డను నమ్మలేక పోతున్నాడు. తన రక్తం కాదుగా అందుకే మలినం అంట గట్టేస్తూ, కోపం చేత ఆలోచించే శక్తి కోల్పోయాడు.

జ్యోతి ఎప్పుడు వస్తుందా అని చూస్తా ఉన్నాడు. ఓ గంట సేపటికి జ్యోతి వచ్చింది. ఏదో వస్తువు కావాలని ఈసారి రమణమ్మ కూడా తోడుగా వచ్చింది. తలుపులు తీసి ఉన్నాయెంటి అనుకుంటూ, జ్యోతి రమణమ్మడగిందేదో ఇవ్వడానికి, ఆమెను బయటే ఉంచి లోపలికి వెళ్ళింది.

“నాన్న అప్పుడే వచ్చెసావా?” ఆనందంగా అడిగింది జ్యోతి.

“హా..వచ్చాను కాబట్టే నీ యవ్వారాలు బయట పడ్డాయి. ఏడ నుండి వస్తున్నావే?” కోపంగా అడిగాడు శివ.

“అదీ.. అదీ…నా ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి వస్తున్నా..” జ్యోతి మెల్లగా చెప్పింది.

“ఏ ఫ్రెండ్.. ఆడదా.. మగోడా..” జ్యోతి దగ్గరకు వచ్చి సూటిగా అడిగాడు.

ఆ గుడిసెలో పరుచుకున్న చీకటిలో అతడి మొహం చింత నిప్పులా కనిపిస్తోంది.

“చెప్పవే… రంకు నేర్చింది బొంకు నేర్చదా అన్నట్టు చెప్పు.. ఏదో..ఇంకేదో అబద్దం చెప్పే. నమ్మడానికి నీ నాన్న ఉన్నాడుగా..చెప్పే.. ” కోపంగా అడిగాడు.

“నాన్న..” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

“యాభై వేలు.. ఎక్కడిదే ఇంత డబ్బు.. ఏ కంపు పనులు చేసి సంపాదించావు. ” డబ్బును చూపిస్తూ అడిగాడు శివ.

“అదీ.. అదీ..నాన్నా..మరీ..” జ్యోతి చెప్పలేక మూగగా రోదిస్తూ ఉండిపోయింది.

“చెప్తావా… కోసి ముక్కలు చేసెయ్యనా నిన్ను..” అంటూ జ్యోతిపై చెయ్యెత్త బోయాడు.

“ఆగవయ్య.. అదేం తప్పు చేసిందనీ అట్టా ఇరుచుకు పడుతున్నావు. ” వీళ్ల సంభాషణ అంతా వింటున్న రమణమ్మ, జ్యోతిను కొట్టబోతున్న శివ చెయ్యి పట్టుకుని వెనక్కి లాగింది.

అతడు మంచం మీద కూలబడ్డాడు. అతడి మొహంలోకి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది రమణమ్మ. దాదాపు పదహారేళ్ళయినా ఇంకా అతడ్ని మర్చిపోలేదు.

“నువ్వు…శివ…శివ కదా..నీ భార్య రత్తాలు కదా..” ఇంకా నమ్మనట్టు అడిగింది రమణమ్మ.

జ్యోతి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఎందుకంటే ఇంతవరకూ రమణమ్మ కు ఆమెప్పుడూ తన తల్లి , తండ్రుల విషయాలేవీ చెప్పలేదు. ఏదో పరిచయం ఉన్నదానిలా అడుగుతుంటే శివ, జ్యోతిలు అలా వింతగా చూస్తూ ఉన్నారు.

“హా..అవును.. ఏం..” భ్రుకుటి ముడిచి అడిగాడు శివ.

“అంటే ఆ రోజు నువ్వెత్తుకొచ్చిన బిడ్డ..జ్యోతి..ఈ జ్యోతి ఒక్కరేనా..” ఆనందమో, ఆశ్చర్యమో తెలియని భావనతో అడిగింది.

అతడు అవునన్నట్టు తల ఊపాడు. తన గతం తెలియని జ్యోతి నమ్మనట్టు చూసింది.

రమణమ్మ చిట్టి జ్యోతిను తండ్రి ఎలా దూరం చేసుకున్నాడో, తనెట్లా రోడ్డు మీద వదిలేసిందో, శివ రత్తాలు తమ కన్న బిడ్డలా ఎలా సాకారో..అన్నీ అన్నీ వివరంగా చెప్పేసరికి , జ్యోతి ఏడుస్తూ కూలబడింది.

“అంటే..నేను..అనాధ బిడ్డనా నాన్న..” జ్యోతి బేలగా చూస్తూ శివను అడిగింది.
“నేనుండగా నువు అనాధవు ఎట్టా అవుతావు తల్లీ..” శివ జ్యోతిను ఒడిలోకి తీసుకుని లాలించాడు. వాళ్లను చూసి రమణమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంది.

“నేను దురదృష్టవంతురాలు నాన్న.. పుట్టినప్పుడు నా కన్నా తల్లిని పోగొట్టుకున్నాను. తర్వాత అమ్మను పోగొట్టుకున్నాను. నన్ను సంపెయ్ నాన్న..నాలాంటి నష్ట జాతకురాలు బతక్కుడదు..సంపే నాన్న..” జ్యోతి తలబాదుకుంటూ ఏడ్చింది.

“లేదే బంగారి..నువ్వు బంగారివే..మా అదృష్టానివి.. నువ్వొచ్చాకే మాకు ఆనందం అంటూ తెలిసింది. ఆడేవడో చేసిన మోసానికి మీ అమ్మ సఛ్చిపోటే నీ తప్పేముందే..నా చిట్టి తల్లివి కదూ..ఇట్ట చూడు..నువ్వు ఏడుస్తుంటే నాకూ ఏడుపు వస్తోంది..ఏడవకు బంగారి..నువ్వు నా బిడ్డ వే..నా రక్తం చిందించి పెంచుకున్న బిడ్డవి. నా బిడ్డవి..” శివ ప్రేమగా ముద్దాడాడు.

రమణమ్మ జ్యోతి ఎంత కష్టం చేస్తూ ఆ డబ్బు సంపాదించిందో వివరంగా చెప్పింది. శివ బాధ పడ్డాడు. ఎంత అనుమానించాడు ..ఎంత అవమానించాడు.. రోషం కల బంగారి ఎంత బాధ పడి ఉంటుం దోనని.. ” నన్ను సమించు బిడ్డా ” అని మొహం చాటేసి ఏడుస్తా అడిగాడు. జ్యోతి వెంటనే అతన్ని కావలించుకుంది.

“నీకు చెప్తే తిడతావేమో అని చెప్పలేదు నాన్న.. ఆ డబ్బు అంత కష్టం చేసి కూడా బెట్టింది నీ కోసమే. మండే ఎండల్లో నువ్వు బండి మీద కూరగాయలు వేసుకుని అమ్మడానికి పోతుంటే నా ప్రాణం విల విల లాడుతోంది. అందుకే మార్కెట్లో నీకంటూ ఒక షాపు కొనియ్యాలని ఆ డబ్బులు జమ చేశాను. అందరిళ్ళల్లో పని చేస్తూ కూడ బెట్టాను. ” జ్యోతి రోదిస్తూ చెప్పింది.

” నా తల్లే..నాయమ్మే మళ్లీ పుట్టింది..ఈ నాకొడుకు కష్టాన్ని అర్థం చేసుకుని ఇంతలా పని చేసావా…నిన్ను ఎంత అనుమానించానే..నన్ను కొట్టవే బంగారి..నాన్నని కొట్టవె..” అంటూ ఆమె చేతులు తీసుకుని చెంపల మీద వాయించుకున్నాడు.

“నాన్నా..” అంటూ అతడ్ని వాటేసుకుంది బంగారి.

వాళ్ళిద్దరినీ చూస్తూ రమణమ్మ బ్రహ్మానందపడింది

ఇక వాళ్లకేం పరీక్షలు వద్దనుకున్నాడమో ఆ భగవంతుడు, జ్యోతి కోరుకున్నట్టే శివ మంచి కూరగాయల షాపు కొనుక్కున్నాడు. అంచెలంచలుగా ఎదిగి, గుడిసె నుండి మంచి మిద్దె కట్టుకున్నాడు. జ్యోతి కూడా పట్టుదలగా చదివి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో మంచి రాంకు సంపాదించి, అడిషనల్ కమిషనర్గా ఉన్నత పదవిని అధిరోహించి, తన తండ్రికి మరో కానుక ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published.