310
0

"అనగనగా అమ్మ"

310

ఈ ప్రపంచంలో పుట్టె ప్రతి మనిషి తన జీవితంలో ఎంతెత్తు ఎదిగినా ఒక వ్యక్తికి మాత్రం ఎప్పుడూ ఋణపడే ఉంటాడు. ఆ వ్యక్తె తన తల్లి. అమ్మ అనే పదం ఎన్ని వేల సార్లు పలికిన  దానిలో ఉండే ఆ తియ్యదనం ఎప్పటికీ పోదు. ఎందుకంటే మనకి నడక నేర్పే అప్పటి నుంచి తను నడవలేని స్థితికి చేరే అప్పటి దాక నిరంతరం మన నీడలా మనల్ని కాచి ఉండేది అమ్మ ఒక్కర్తే గనుక.

     అమ్మ అనే పదం ఒక వ్యక్తికి మనం ఇచ్చే పేరు కాదు. అది ఒక వ్యక్తి  నిస్వార్ధంగా మన మీద చూపించే ప్రేమకు పెట్టే బిరుదు.

  చిన్నప్పుడు మనమందరం అమ్మ చెప్పే కథలు వినే ఉంటాం కానీ ఇప్పుడు నేను చెప్పేది ఓ అమ్మ కథ.. కన్న కొడుకు ఆశయాలకోసం తన ఆయువు సైతం కర్చు చేసి త్యాగానికి అర్ధం తిరగరాసిన ఓ సాధారణ తల్లి కథ…ఓ సర్వసాధారణ తల్లి కథ.

అనగనగా ఓ అమ్మ… తన ప్రపంచమంతా తన కొడుకు ఒక్కడే. చిన్నతనం లోనే తండ్రిని కోల్పోయిన ఆ కుర్రాడికి అమ్మే అన్నీ అయ్యింది. వరమో శాపమో తెలియదు ఆ కొడుక్కి సంగీతం అంటే మహా పిచ్చి కానీ తన కలల్ని నిజం చేసే మార్గంలో నడిచేందుకు కావలసిన డబ్బు ఖర్చు చేసే స్థోమత ఆ తల్లికి లేదు. అయినా సరే మనసుంటే మార్గం ఉంటుంది అంటూ తన తల్లి మాత్రం ఏనాడు తనని నిరుత్సాహపరచలేదు. కష్టం కొడుకు కోసం అయితే కొండంత భారమయిన నవ్వుతూ  తన భుజాన మోస్తుంది తల్లి. అలానే ఈ తల్లి కూడా రోజు కూలి చేసుకుంటూ, రోజుకి ఏడు కిలోమీటర్లు నెత్తిన కట్టెలతో నడుస్తూ కొడుకుని పోషించించేది. తన నడక ఎంత కష్టం అవుతున్న  కొడుక్కి మాత్రం సుఖాల బాట పరిచింది. కొడుకు మార్గంలో వచ్చే బాధలన్నీ తాను భరిస్తూ తన ప్రతి ఓటమికి తాను ఓడిపోతూ తన ఆశలకు ఆయువు పోసింది.

ఆ తల్లి ప్రేమతో చేసిన కృషికి కాలం సైతం కరిగిపోయింది ఏమో. మంచి రోజులు రానే వచ్చాయి. కొడుకు మెల్లగా తన ఆశయాల అంచులదాకా వెళ్ళాడు. నిజానికి విజయానికి అర అంగుళం దూరం మాత్రమే ఉంది. కానీ ఆ కాస్త దూరం ఈదడానికి సప్తసముద్రాలు దాటేంత సమయం పట్టింది. తనని అక్కడిదాక తీసుకొచ్చే ప్రయత్నంలో తన తల్లి శక్తి పూర్తిగా కర్చు అయిపొయింది, తల్లి మంచం పట్టక తప్పలేదు. నిండా ప్రయత్నంలో మునిగి ఉన్న కొడుకు ఆ కాలంలో తన తల్లిని మెల్లగ మర్చిపోయాడు, తన బాగోగులు పట్టనేలేదు. ఇది చూసిన కర్మకి కడుపుమండి ఆ కొడుకు గెలుపుని ఆపేస్తూ తనని తీవ్ర అనారోగ్యం పాలు చేసింది. తల్లి ప్రేమ నిష్ఖళం, నిస్వార్ధం అయింది కదా, కొడుకు మీద బెంగతో పరుగులు తీసింది ఈ పిచ్చి తల్లి. ఒంట్లో శక్తిలేకున్న కొడుకు ఆరోగ్యం కుదుటపడేదాకా సేవలు చేసుకొచ్చింది. అప్పుడు ఆ కొడుక్కి తాను ఏమి మరిచాడో తెలిసింది, విధి తనకు ఈరకంగా అమ్మ విలువ తెలిపింది అనుకున్నాడు. తరువాత అమ్మ ఆశీస్సులతో గొప్ప స్థాయికి చేరుకున్నాడు, కానీ అంతస్తులు చూపే సమయానికి అమ్మ తన కళ్ళముందు లేదు, వెంట విజయం ఎంతున్నా వినిపించి చెప్పేందుకు తల్లి లేదని కుమిలిపోయాడు, ఏ చోట ఉన్న అమ్మ దీవెనలు మన వెంటే ఉంటాయి అంటూ కాలంతో ముందుకు సాగాడు. చివరికి వేల మంది గుర్తించే గొప్ప సంగీత దర్శకుడు అయ్యాడు.

     ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించాడు, ప్రతి బహుమతి తన తల్లి త్యాగానికి అంకితం ఇస్తూ వచ్చాడు కానీ కొంత కాలం తన తల్లిని విడిచిన తప్పుకి తనలో తాను కుమిలిపోతూనే ఉన్నాడు.

               ఓ నాడు ఒక పెద్ద సభకి తనని  ముఖ్యఅతిథిగా పిలిచారు. అక్కడ తనని మాట్లాడవలసిందిగా ప్రేక్షకులు కోరగా ఆ మాటల్లో అతడు తాను ఎలా ఈ స్థాయికి వచ్చాడు, తన కోసం తన తల్లి చేసిన త్యాగాలు వివరిస్తూ తన తల్లి గురించి గొప్పగా చెప్పాడు. అతని మాటలు విన్న ఓ పెద్దాయన లేచి ‘మీరు జీవితంలో మీ తల్లి గర్వపడేలా ఉన్నత స్థాయికి ఎదిగి తన రుణం కాస్తో కూస్తో తీర్చుకున్నారు. ఇంక  ఇంతకన్న జీవితంలో మీరు సాధించాలీ అనుకునేది, కోరుకునేది ఇంకేమైనా ఉందా?’ అని అడిగాడు. అప్పుడు ఆ కొడుకు “నిజమే నేను నా తల్లి కోరిక మేరా అంతా సాధించాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు, ఆస్తి అంతస్తులు అన్ని ఉన్నాయి. కానీ ఇవన్నీ కలిగించలేని ఆనందాన్ని ఇచ్చే ఒక్కటి మాత్రం నేను కోల్పోతున్నాను. ఇన్ని వేల మంది మనసులకి నచ్చే సంగీతం చేయగలుగుతున్న నేను నా తల్లి ప్రేమగా పాడే ఆ జోలపాటకి బదులుగా ఏ సంగీత స్వరాల సరళిని సృష్టించుకోలేకపోతున్న. నేనే కాదు ఈ ప్రపంచంలో ఎవరూ దాన్ని భర్తీ చేయలేరు. కనుక ప్రతి మనిషి తన ఆసయాలతో పాటు తన తల్లి ఆనందాన్ని కూడా కాపాడుకుంటూ రావాలి లేదంటే మన విజయాలకు విలువ ఉండదు”. ఇది విన్న ప్రేక్షకులు ఒక్కసారిగా తమ తమ తల్లుల్ని గుర్తుచేసూకోని కన్నీరు పెట్టుకున్నారు. ఈ మాటలు ముగియకనే పెద్ద గాలి వాన వచ్చింది.

     ఆ వర్షం చూసిన అక్కడి ప్రజలు ‘పులకించిన ప్రక్రుతి తాను కూడా విన్నానని పలుకుతూ పెద్ధ వాన కురిపించింది’ అని కొంతమంది అనుకుంటుండగా “ఈ మాటలు పైనున్న ఆ తల్లి కూడా విని కన్నీళ్లు పెట్టుకుందంట, అందుకే ఈ వాన” అని ఓ ముసలి మామ్మ తన మనవరాళ్లతో చెప్పుకొచ్చింది.

“అమ్మని మించిన దైవం లేదు,
అమ్మ దీవెన మించిన బలం ఇంకేమి లేదు!”


continue reading

follow us on social media

Leave a Reply

Your email address will not be published.