మంచి ఉద్యోగం సంపాదించడం.. పెళ్లి చేసుకోవడం.. పిల్లల్ని కనడం.. వారిని పెద్ద చేసి ప్రయోజకుల్ని చేయడం అనేది ఒక రొటీన్ లైఫ్. జీవితం ఆద్యంతం అద్భుతంగా సాగాలంటే సర్‌ప్రైజెస్ ఉండాలి. ఆ ఆలోచన ధోరణితోనే సూర్యప్రతాప్ అనే వ్యక్తి జీవితమంతా సాగింది. కానీ బంధువులందరికీ సూర్యప్రతాప్ తత్వం ఏంటో అంతుబట్టదు. అతనికి ఒక అక్క ఉంది. ఆమెకొక కూతురు ఉంది. పేరు నవీన. ప్రస్తుతం లండన్‌లోని కార్డిఫ్ యూనివర్సిటీలో థెరపెటిక్ రేడియోగ్రఫీ చేస్తోంది.
కరోనా సమయంలో ఓసారి ఇంటికి వచ్చింది. నవీన ప్రతాప్‌తో చాలా ఫ్రెండ్లీగా మెలుగుతుంది. ఎప్పట్లాగానే ఇండియాకి రాగానే నవీన అతడి ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో ప్రతాప్ తన పెరటిలో రాకింగ్ చైర్‌లో కూర్చున్నాడు. చుట్టూ మల్లె, గులాబీ, కొబ్బరి చెట్లతో ఉన్న అందమైన వాతావరణంలో స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ హాయిగా సేద తీరుతున్నాడు.
ఇంతలో చప్పుడు చేయకుండా నవీన అతడి కుర్చీ వెనక్కి వచ్చి అతని కళ్లు మూసింది. దాంతో అతడు గబుక్కున్న ఉలిక్కిపడ్డాడు. ఆ తరువాత అది నవీన పనే అయ్యుంటుందని గ్రహించాడు. కానీ గుర్తుపట్టనట్లు నటించాడు.
“నేనవరో చెప్పుకోండి, చూద్దాం” అని నవీన గొంతు మార్చి ఫన్నీగా అడిగింది.
ఆట పట్టించడానికి.. ‘పక్కింటి త్రివేణి’ అన్నాడు. దాంతో ఘల్లున నవ్వి అహ్హ! అంది. “ఎదురింటి దేవి” అన్నాడు. ఉఊ.. కాదు అంటూ మరోసారి నవ్వింది.
“ఎవరై ఉంటారబ్బా.. కొంపదీసి ఏ రాక్షసో రాలేదు కదా!” అని పైకి వినిపించేలా మాట్లాడాడు. ఆ మాటలకు చిర్రుబుర్రులాడుతూ.. “మావయ్యా, నేను నవీనాని” అని ప్రతాప్ కూర్చున్న కుర్చీ ముందుకు వచ్చి నిలబడింది నవీన.
*సంభాషణ*“హేయ్, వాట్ ఎ సర్‌ప్రైజ్.. ఎప్పుడొచ్చావ్.. ఎలా ఉన్నావ్”
“ఈరోజు మధ్యాహ్నమే వచ్చా. మిమల్ని సర్‌ప్రైజ్ చేద్దామనే, నేనొస్తున్నట్లు మీకు చెప్పలేదు”
“గడుసు దానివే. లండన్ నుంచి నాకోసం ఏం తెచ్చావ్?”
“నేను రావడమే ఎక్కువ” అని తేలిగ్గా ఫేస్ పెడుతూనే.. ఐఫోన్ 11 ప్రొ ప్రతాప్ చేతిలో పెట్టి అతని రియాక్షన్ కోసం తీక్షణంగా చూసింది నవీన.
ఫోన్ చూడగానే ప్రతాప్ భావోద్వేగానికి గురి అయ్యాడు. “నాకు పిల్లలు లేకపోయినా.. ఆ లోటు నువ్వే తీరుస్తున్నావ్ తల్లీ..” అంటూ కంటతడి పెట్టకున్నాడు.
నవీన సైతం భావోద్వేగానికి లోనై కన్నీరు కార్చింది.
–కాసేపు నిశ్శబ్దం–
నిశ్శబ్దాన్ని చీలుస్తూ.. “మావయ్యా మీరు తలుచుకుంటే.. మీ హోదాకు తగిన అమ్మాయిని పెళ్లి చేసుకోగలరు. ఇంట్లో వాళ్లు కూడా బలవంతం చేశారు కదా.. మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు.” అని అడిగింది.
ప్రతాప్ అవివాహితుడిగా ఉండిపోవడానికి గల కారణం ఇప్పటికీ ఎవరికీ చెప్పలేదు. కానీ ఎందుకో తన అక్క బిడ్డకు చెప్పాలనుకున్నాడు.
చెప్తానమ్మా.. అంటూ ప్రతాప్ తన ఫ్లాష్‌బ్యాక్ చెప్పడం ప్రారంభించాడు.
*ఫ్లాష్‌బ్యాక్*<——–గమనిక: పఠనా సౌలభ్యం కోసం ప్రతాప్ వాయిస్‌కి బదులు ‘నా’ అనే ఏకవచనం వాడుతున్నాం————>
అందరిలా పెళ్లి చేసుకోవాలనే కోరిక నాలో అస్సలు ఉండేది కాదు. ప్రపంచం మొత్తం ట్రావెల్ చేయాలి. వేలాది ప్రజలతో పరిచయాలు పెంచుకోవాలి. వరల్డ్ మొత్తాన్ని ఒకేసారి చుట్టేసి.. అన్ని రకాల ప్రజల మనస్తత్వాలు తెలుసుకోవాలి. ప్రకృతి అందాలను వీక్షిస్తూ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించాలి… లాంటి కోరికలు నాకు ఉండేవి. అందుకే, చదువు పూర్తికాగానే మొదటగా లండన్ బయల్దేరాను. వాటర్లూ వంతెన నుంచి అందమైన సూర్యాస్తమయం చూసాను.
లండన్ బ్రిడ్జి, మ్యూజియం, సెయింట్ పాల్ కేథడ్రల్ అందాలను చూసి అబ్బురపడ్డాను. తరువాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చూద్దామనే ఆశ కలిగింది. వెంటనే ట్రైన్ ఎక్కాను. 100 కిలోమీటర్ల ప్రయాణమది. ట్రైన్ లో ప్రయాణికులు తక్కువగానే ఉన్నారు. టైం పాస్ కావడానికి “వుథరింగ్ హైట్స్” అనే ఓ హార్ట్ బ్రేకింగ్ నవల చదవడం ప్రారంభించాను.
ట్రైన్ స్టార్ట్ అవుతుందనంగా.. ఒక యువతి నేనున్న భోగిలోనే హుడావుడిగా ఎక్కింది. నేను కూర్చున్న పక్క సీట్లోనే కూర్చుంది. ఆ అమ్మాయి వైట్ కలర్ లేస్ & ఫ్లోరల్ ప్రింట్ గౌను ధరించి దేవతలా కనిపించింది. బూడిద రంగు షూస్, పింక్ లిప్ స్టిక్, నీలి రంగు కళ్లు, లూజ్ గా వదిలేసిన పొడవాటి జట్టు ఆమె అందాన్ని మరింత పెంచేసాయి.
నేను ఆమె వైపు అలా చూస్తూనే ఉండిపోయా (నవ్వుతూ). బహుశా లవ్ ఎట్ ఫస్ట్ టైమ్ ఏమో అనిపించింది. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి నా వైపు చూసి కనిపించి కనిపించినట్లుగా స్మైల్ ఇచ్చింది. నాలో కాస్త టెన్షన్ పుట్టింది. సంభాషణ ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు.
అంతలోనే.. ‘ఆర్ యూ బ్రిట్? యు డోంట్ లుక్ లైక్ ఎ బ్రిట్? వేర్ ఆర్ యూ ఫ్రమ్?’ అని ఆ అమ్మాయే కన్వర్జేషన్ స్టార్ట్ చేయగానే నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యా!
*సంభాషణ*ప్రతాప్: అవును, మీరు ఉహించింది నిజమే. నేను బ్రిటిష్ వ్యక్తిని కాదు. ఐయమ్ ఫ్రమ్ ఇండియా. నా పేరు ప్రతాప్. లండన్ చూద్దామని వచ్చాను. మీరు ఇక్కడి వారేనా?
క్యాథరిన్: ఎస్, నేను బర్మింగ్‌హామ్‌లో పుట్టి పెరిగాను. నా పేరు క్యాథరిన్ రోస్. ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను. రచయిత కావాలనేదే నా ధ్యేయం.
ప్రతాప్: ఓహ్, అవునా. రచయితలు అంటే నాకు చాలా ఇష్టం. వారు కోట్లాది ప్రజలను సైతం అక్షరాలతో కదిలించగలరు. కాబోయే బ్రిటిష్ కవయిత్రిని కలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.
క్యాథరిన్: (చిన్న నవ్వుతో) ఎస్, యూ ఆర్ రైట్. గ్రేట్ రైటర్స్ కెన్ మూవ్ పీపుల్ విత్ థెర్ వర్డ్స్. ఎనీ రైటర్ కెన్ హెల్ప్ పీపుల్ ఫార్గెట్ థెర్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్.. అండ్ అల్సొ ఎంపవర్ థెమ్. ఇఫ్ యు నీడ్ ఎంటర్ టైన్, ఎన్లైటనింగ్, ఇన్స్పిరేషన్.. బుక్స్ కుడ్ గివ్ థట్. ఐ వాంట్ టు ఎంపవర్ ఎస్పెషల్లి విమెన్.
ప్రతాప్: అవును.. విరక్తి, విషాదం, నిరాశలలో మునిగితేలుతున్న వేళల్లో పుస్తకాలే మంచి స్నేహితులవుతాయి. మీరు మహిళల కోసమే రచయిత అవ్వాలంటున్నారా.. థట్స్ రియల్లీ గ్రేట్.
క్యాథరిన్: యా! మీరేం చదువుకున్నారు?
ప్రతాప్: నేను కోల్కతా యూనివర్సిటీలో బీ.ఏ చేశాను. నాకు జాబ్ చేయాలనే ఇంటరెస్ట్ లేదు. ప్రపంచం మొత్తం చుట్టేసి రావాలని ఉంది. అందుకే ఇప్పుడు ఇలా ఇక్కడున్నాను.
క్యాథరిన్: నిజంగానా, వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ స్టే చేయనున్నారు?
ప్రతాప్: నేను లండన్‌లోని చూడదగిన ప్రదేశాలు చూసేసి.. నేరుగా ఇంటికి వెళ్తాను.
క్యాథరిన్: అయ్యో.. అదేంటి? ఇక్కడ తెలిసిన వారు ఎవరూ లేరా??
ప్రతాప్: (నవ్వుతూ) లేరు.
క్యాథరిన్: సరే, రేపు మీరు ఒక దగ్గరికి వస్తే.. నేను మీకు ఒక అందమైన ప్రదేశాన్ని చూపిస్తాను. అది లండన్‌లోనే అత్యంత అద్భుతంగా ఉంటుంది. మీకు కచ్చితంగా నచ్చుతుంది.
ప్రతాప్: నిజంగా అద్భుతంగా ఉంటుందా.. మీకు ఇబ్బంది లేదంటే నేను మీరు చూపించాలనుకుంటున్న ప్రదేశానికి వచ్చేస్తాను.
“నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. రేపు కలుద్దాం.” అని క్యాథరిన్ ట్రైన్ దిగి కాలేజీకి వెళ్ళిపోయింది.
*మరుసటి రోజు*క్యాథరిన్ చెప్పినట్లుగానే నేను ఒక అడ్రస్‌కు వెళ్లాను. తర్వాత ఆమె నన్ను పికప్ చేసుకుంది. విక్టోరియా స్క్వేర్, సిటీసెంటర్‌లో మేమిద్దరం నడుచుకుంటూ వెళ్ళాం. క్యాథరిన్ అక్కడ ప్రదేశాల ప్రత్యేకతల గురించి చాలా కవితాత్మకంగా, వివరంగా చెప్పింది. సిటీలో ఒక రోజంతా తిరిగాం. వెచ్చటి కాఫీ తాగుతూ ఎంజాయ్ చేశాం.
ప్రేమ, మరణం, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, తల్లిదండ్రులు, పునర్జన్మ, రొమాన్స్, మ్యారేజ్, డివోర్స్ ఇలా చాలా అంశాల గురించి మా సంభాషణ సాగింది. ప్రేమ, పెళ్లి, కెరీర్ పట్ల నాకున్న అవగాహన గురించి ఆమె తెలుసుకుని ఆశ్చర్యపడింది. ప్రేమ అనేది లేకపోతే మనం బతకలేమని నేను చెప్పిన మాటలు విని ఆమె అలానే చూస్తుండి పోయింది.
నేను చెప్తున్న ప్రతీ విషయాన్ని ఆమె శ్రద్ధగా వింటుంటే నాకూ చాలా ముచ్చటేసింది. ఇక తాను, నేను విడిపోయి ఎవరి దారిన వాళ్లం వెళ్లిపోయే సమయం వచ్చేసరికి.. నాలో ఏదో తెలియని బాధ ఉత్పన్నమైంది. ఆమె నవ్వు, చూపు, మాట తీరు, నడక, జట్టును సవరించుకునే స్టయిల్ నాకు తెగ నచ్చేసాయ్. మళ్ళీ ఆమెను చూడలేనేమోననే భయం నన్ను ఆవహించింది. ఇంకాస్త టైమ్ గడపాలనిపించింది. ఇంతలోనే ఆమె అన్నయ్య ఓ పెద్ద కారులో వచ్చాడు. దాంతో ఇక బై చెప్పాల్సిన సమయం వచ్చిందని నేను నిరుత్సాహపడ్డా.
అప్పుడే.. లెట్స్ గో అని క్యాథరిన్ నాతో అనేసరికి నాకు సంతోషంతో పాటు ఆశ్చర్యమేసింది. వేర్ ఆర్ వీ హెడ్డింగ్ నౌ? అని ఎగ్జైటింగ్ గా అడిగాను.
వీ ఆర్ హెడ్డింగ్ హోం అని ఆమె చెప్పేసరికి.. ఎలా స్పందించాలో అర్థం కాలేదు. మీ ఇంటికి వచ్చి మిమల్ని ఇబ్బంది పెట్టలేనని చాలా సుత్తిమెత్తగా చెప్పా. అందుకు ఆమె చిన్ని నవ్వు నవ్వి.. నన్ను కారు ఎక్కించేసింది.
సరిగ్గా 20 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాం. మిరిమిట్లు గొలుపుతున్న లైట్స్ తో ఆ ఇళ్లు ఓ ఇంద్ర భవనంలా కనిపించింది. లోలోపల ‘వావ్.. ఇళ్లు ఇంత బాగుందేంటి!’ అని అనుకున్నాను. నాకొక స్పెషల్ రూమ్ తో పాటు డిన్నర్ కి ఫిష్, చిప్స్ అందించారు.
డిన్నర్ అయ్యాక.. హేయ్ ప్రతాప్! అంటూ క్యాథరిన్ నా రూమ్ లోపలికి వచ్చింది. అప్పటికే ఫ్రెష్ గా స్నానం చేసి.. సాఫ్ట్ పింక్ ఎంబ్రాయిడరీ కోటు ధరించి అందానికి ప్రతిరూపంగా క్యాథరిన్ కనిపించింది. నేను ఆమె పాదపద్మాల నుంచి నుదుటి వరకూ చాలా నెమ్మదిగా చూస్తూ పరవశించిపోయా! నేను తనని చూస్తున్న సంగతి ఆమె కనిపెట్టేసిందనిపించింది. ఆమె కళ్లలోకి నేరుగా చూస్తూ.. ‘నువ్వు చాలా అందంగా ఉన్నావ’ని చెప్పేసాను.
ఆ క్షణంలో నా గుండె నిమిషానికి వేయిసార్లు కొట్టుకుందనిపించింది. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోయేసరికి కాస్త ఆందోళనగా ఫీల్ అయ్యా! అప్పుడే క్యాథరిన్ గ్రామఫోన్ లో “కాంట్ టేక్ మై అయిస్ ఆఫ్ యు” అనే సాంగ్ ప్లే చేసింది. నేను అలానే నిల్చుండిపోయాను.
నావైపు చూసి డాన్స్? అని అడిగింది. నేను సరేననట్లు తల ఊపాను. దాంతో తన మృధువైన చేతులు నా చేతికందించింది. ఆ రొమాంటిక్ సాంగుకి ఎలా కాలు కదపాలో నాకు తెలియలేదు. క్యాథరిన్ మాత్రం క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ నా కళ్లను తన కళ్ళతో లాక్ చేసేసింది. తనని అనుసరిస్తూ నేను డాన్స్ చేయడం స్టార్ట్ చేశాను.
నా హాండ్స్ తన నడుము చుట్టూ పెనవేసుకొని.. తన హాండ్స్ నా ఛాతిపై పెట్టి.. అదర చుంబనం కోసం అడిగినట్లు చూసింది. తన నగ్న పెదాలు చూడగానే నాకు మత్తు ఎక్కింది. ఆ మత్తులోనే మెల్లిగా చుంబనం ఇచ్చేసాను. ఆమె మాత్రం తిరిగి గాఢమైన ముద్దు ఇచ్చి నాకో మధురానుభూతిని మిగిల్చింది. బరువైన ఎమోషన్స్ లో గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు.
మర్నాడు ఉదయం ఏం జరగనట్టుగా మాట్లాడింది. తన రిలే-ఆర్ఎమ్ఎఫ్ కారులో ఎక్కించుకొని యార్క్‌షైర్ కౌంటీకి తీసుకెళ్ళింది. మూడు గంటల రోడ్డు ట్రిప్ అది. ఆ రహదారి గ్రీన్, పింక్ కలర్ చెట్లతో చాలా అద్భుతంగా కనిపించింది. స్వర్గమంటే ఇదేనేమోననే అనుభూతిని కల్పించింది.
ఈ మూడు గంటల ప్రయాణంలో నా కళ్ళు చాలాసార్లు క్యాథరిన్ మీదకు మళ్ళాయి. తను కూడా నాకు తెలియకుండా నన్ను చాలాసార్లు చూసేసింది. యార్క్‌షైర్ ప్రకృతి అందాలకంటే.. క్యాథరిన్ అందాలే నన్ను మైమరిపించాయి.
ఈ సమయంలో ఆమె గురించి మరిన్ని విషయాలు తెలిసాయి. పెద్ద కారు ఉన్నప్పటికీ ట్రైన్ లోనే ఎందుకు ప్రయాణిస్తున్నావ్ అని అడిగితే.. తనకి సింపుల్ గా ఉండడమే ఇష్టమని జవాబిచ్చింది. ఒక రైటర్ గా ప్రజల జీవితాలను చాలా దగ్గరగా చూడాల్సిన అవసరముందంది.
సిటీకి చేరుకున్నాక అక్కడి పేద ప్రజలతో ఆమె ప్రవర్తించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. అలాగే మూగ జంతువుల పట్ల ఆమె చూపిన ప్రేమ నన్ను ఫిదా చేసింది. ఎలాంటి కల్మషం లేకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమగా పలకరించే ఆమె గొప్ప మనసు నన్ను మరింత ఆకట్టుకుంది.
ఇక సాయంత్రం వేళలో ‘రోస్ బెర్రీ టాపింగ్’ అనే ఓ ఎత్తయిన పర్వతం మీదకు తీసుకెళ్ళింది. నీలి ఆకాశం చూస్తూ ఈరోజు రాత్రి ఇక్కడే గడిపేద్దాం అని క్యాథరిన్ అంది. మేమిద్దరం తప్ప అక్కడ మరెవరూ లేరు.
దాంతో… ఏంటి, ఇక్కడ? అని నేను సంభ్రమాశ్చర్యంతో అడిగాను.
యా, ఇక్కడే అని క్యాథరిన్ అంది.
లాంగ్ ట్రిప్ తరువాత అలిసిపోయానని చెప్పింది.
నేను సరేనని పచ్చికపై కూర్చున్నాను. తను నా పక్కనే అలా పడుకుంది.
నిన్న రాత్రి జరిగిందాని గురించి నువ్వేం అనుకుంటున్నావ్, ప్రతాప్?? అని చాలా క్యూరియస్ గా అడిగింది.
అప్పుడు నాకేం చెప్పాలో అర్థం కాలేదు. కొంత సమయం తర్వాత నేను పెదవి విప్పాను.
“నిన్న నువ్వు చాలా అందంగా ఉన్నావ్. నేను ఇప్పటి వరకూ ఏ అమ్మాయితో ఇంత చనువుగా ఉండలేదు. ఎవరినీ ఇష్టపడలేదు. కానీ నీపై రెండ్రోజుల్లోనే ఇష్టం పెరిగిపోయింది. నిన్ను విడిచి వెళ్లిపోవాలనే ఆలోచన నన్ను చాలా డిస్టర్బ్ చేస్తోంది” అని అన్నాను.
వాట్.. రియల్లీ?? అని సిగ్గుతో చాలా అందంగా నవ్వేసింది.
పండు వెన్నెలలో ఆమె ఒక ఏంజెల్ లా కనిపించింది. తనవైపే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోవాలి అనిపించింది.
తాను మాట్లాడుతూ… “ప్రతాప్, ఇప్పటివరకు నేను చూసిన అబ్బాయిలలో నువ్వే చాలా డిఫరెంట్ గా ఉన్నావ్. జీవితాన్ని నువ్వు చాలా స్పెషల్ గా చూస్తావ్. అలాగే నీ అందమైన కళ్ళు, పింక్ పెదవులు, జిడ్డైన నీ జుట్టు, ఎత్తు నాకు తెగ నచ్చేసాయి. నిన్న రాత్రి నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్న తీరు కూడా భలే బాగా నచ్చింది. నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా లక్కీ” అని డ్రీమీ అయిస్ తో క్యాథరిన్ చెప్పింది.
“హహహ, మీరు అంటున్నట్లు నేనేం గొప్పడిని కాదు” అని నేను కాస్త బిగ్గరగా నవ్వాను.
“ఈ కొద్దిరోజుల సమయంలోనే నీ మనస్తత్వం ఏంటో నాకు తెలిసింది. ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో నీకు తెలుసు. నీలో ఎలాంటి అహంకారం కూడా నాకు కనిపించలేదు. నాతో ఉన్నంత సేపు ఒక సంరక్షకుడిగా వ్యవహరించావు. యువర్ ట్రూలీ ఎ జెంటిల్ మ్యాన్. అమ్మాయిలు జెంటిల్మెన్లే మెచ్చుతారు. సిగ్గు వీడి అందులో నేనూ ఒక దానినని చెబుతున్నాను” అని క్యాథరిన్ కుండ బద్దలు కొట్టింది.
ఆ మాటలు విని నేను పులకరించిపోయాను. ఒక అందమైన, తెలివైన అమ్మాయి హార్ట్ గెలుచుకున్నానని గర్వంగా ఫీల్ అయ్యాను.
నా పక్కనే పడుకున్న ఆమెను లేపి కూర్చోబెట్టాను. మొదటిసారిగా తనను నేనెంతట నేనే టచ్ చేయడంతో క్యాథరిన్ నమ్మలేక ఆసక్తిగా చూసింది. నేనేం చెప్పబోతున్నానో తెలుసుకునేందుకు పూర్తిగా సైలెంట్ అయిపోయింది.
నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అని నేను వణుకుతున్న కంఠంతో అడిగాను.
నా ప్రశ్నతో ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఎస్ అని చెప్పే సమయానికి ఆమె కన్నీటి చుక్క నా చేతిపై పడింది. ఆమె నాకు ఎంతగా అటాచ్ అయ్యిందో ఆ కన్నీటి బొట్టుతో అర్థమైంది.
“నువ్వంటే ఇష్టమే. నీతో ఉన్నంతసేపు ఎంత సంతోషంగా ఉంటుంది. నువ్వు నా పక్కనే ఉంటే నాకు ఎలాంటి హానీ కలగదనిపిస్తుంది. నీ నుంచి నాకు విడిపోవాలని లేదు. నీతోనే ముసలిదాన్ని కావాలనిపిస్తుంది” అని క్యాథరిన్ చాలా ఎమోషనల్‌గా చెబుతూ నా చేతిపై ముద్దు పెట్టుకుంది.
దాంతో నేను కూడా కాస్త భావోద్వేగానికి లోనయ్యాను. “ట్రైన్ లో నిన్ను చూసిన మొదటి రోజే నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను.” అని నేనన్నాను.
కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిజంగానా అని హస్కీ వాయిస్‌తో అడిగింది. తర్వాత నా ఒళ్ళో వచ్చి పడుకుంది. పెళ్లి చేసుకుందామా? అని అడిగింది. నేనేం చెప్పలేకపోయాను. అదంతా ఒక కలలా అనిపించింది. సమాధానం చెప్పే లోపు తను గాఢ నిద్రలోకి జారుకుంది.
తెల్లవారగానే నిద్ర లేచింది. “ప్రతాప్, నేను ఇలా చెప్పడం నీకు సిల్లీగా అనిపించవచ్చు. కానీ కొందరు వ్యక్తులు మంచివారని తెలుసుకోవడానికి ఏళ్లకొద్దీ పరిశీలించాల్సిన అవసరం లేదు. ఏ ఆధారాలూ అవసరం లేదు” అని నిక్కచ్చిగా చెప్పింది.
నేను కూడా ఆమె మాటలనే రిపీట్ చేశాను. త్వరలోనే పెళ్లి చేసుకుందామని నేను చెప్పగానే ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె మొహంపై కనిపించిన ఆనందం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇద్దరం కలసి తిరిగి ఇంటికి వచ్చేసాం. తన చదువు మూడేళ్ల పూర్తవుతుందని ఆ తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ సాగిద్దామని ఆమె చెప్పింది. ఆర్నెల్లపాటు లండన్‌లోనే ఉండి డేటింగ్ చేయాలని కోరింది. అందుకే నేను సరేనని తల ఊపాను.
ఈ ఆరు నెలల కాలంలో అధికారికంగా పెళ్లి జరక్కపోయినా.. మేము భార్యాభర్తల్లాగా కలిసిపోయాం. ఆ తర్వాత నేను ఇంటికి తిరిగి వచ్చాను. క్యాథరిన్ గురించి నా తల్లిదండ్రులకు చెబుదామనుకున్నాను. ఇల్లు చేరుకోగానే మొదటగా క్యాథరిన్ కి ఫోన్ చేశాను. కానీ ఫోన్ రింగ్ అవ్వలేదు. ఇంటికి ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. దాంతో హుటాహుటిన మళ్ళీ లండన్‌కు బయలుదేరాను.
బర్మింగ్‌హామ్ వెళ్ళిన తర్వాత ఒక కారు యాక్సిడెంట్ జరిగిందనే దుర్వార్త దావానలంలా వ్యాప్తి చెందడం గ్రహించాను. ఒక ట్రక్కు, కారు ఢీకొనడంతో ఒక యువతి మరణించిందని స్థానికులు అనుకుంటుండగా విన్నాను. కానీ అవేమీ పట్టించుకోకుండా నేరుగా క్యాథరిన్ ఇంటికి వెళ్లాను. అప్పటికే చాలామంది అక్కడికి చేరుకొని గట్టిగా హాహాకారాలు పెడుతున్నారు. ఆ దృశ్యాన్ని చూడగానే నా గుండె పిండేసినట్లు అనిపించింది. క్యాథరిన్ కి ఏమైనా అయి ఉంటుందా అనే ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. గుండె రాయి చేసుకుని ఇంటి గేటు దాటి లోపలికి వెళ్ళాను. క్యాథరిన్ నిర్జీవంగా కనిపించగా.. తన అన్నయ్య పక్కనే కూర్చుని ఏడవడం కనిపించింది. ఆ క్షణంలో నా గుండె వెయ్యి ముక్కలయింది. ప్రాణంగా ప్రేమించిన క్యాథరిన్ ఇక తిరిగి రాదనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయాను.
ఆ తర్వాత తాను నన్ను కలుసుకోవడానికి కారులో వేగంగా విమానాశ్రయానికి బయలుదేరిందని తెలిసింది. తన ఫొటోలు నా తల్లిదండ్రులకు చూపించాలని నన్ను అడగాలనుకుంది. అందుకే ఫొటోలు నాకు ఇచ్చేందుకు హడావుడిగా డ్రైవ్ చేసింది. ఆ సమయంలో ఒక భారీ ట్రక్కు అడ్డంగా రావడంతో.. దాని కిందకు కారు వెళ్ళిపోయిందని తెలిసింది. ఈ నిజాలు నన్ను మరింత బాధించాయి. మళ్లీ సాధారణ స్థితికి వచ్చేందుకు నాకు ఐదేళ్లు పట్టింది. తనని తప్ప మరెవరినీ భార్యలాగా ఊహించకోలేకపోయాను.. అందుకే అవివాహితుడిగానే మిగిలిపోయాను.
*ప్రస్తుతం*ప్రతాప్ చెప్పిన కథ విని నవీన కన్నీటి పర్యంతమవుతుంది. ఇంత చేదు నిజాన్ని గుండెలో పెట్టుకొని నువ్వు ఒక్కడివే బాధపడుతున్నావా? అని నవీన ప్రతాప్ ని గట్టిగా కౌగలించుకుని ఏడ్చేస్తుంది.
ఆ తర్వాత తనను లండన్‌కు తీసుకు వెళ్లాల్సిందిగా నవీనను ప్రతాప్ కోరతాడు. దాంతో మంచి సమయం చూసుకొని నవీన తన మావయ్యను తీసుకెళుతుంది. తర్వాత ప్రతాప్ స్మశానానికి వెళ్లి క్యాథరిన్ సమాధిపై తలవాల్చి కాసేపు బాగా ఏడుస్తాడు. కొంతసేపటికి విలపించడం మానేస్తాడు. ఉలుకూ పలుకూ లేకుండా ప్రతాప్ అలానే ఉండిపోవడంతో నవీన ఒక్కసారిగా షాక్ అవుతుంది.
తన మామయ్య చనిపోయాడని తెలిసి కన్నీరుమున్నీరవుతుంది. బరువెక్కిన గుండెతో క్యాథరిన్ సమాధి పక్కనే ప్రతాప్ ను ఖననం చేయిస్తుంది. యాక్సిడెంట్ జరగకపోతే తన మామయ్య, అత్తయ్య జీవితాలు ఎంత బాగుండేయోననే ఆలోచనతో తిరుగుముఖం పడుతుంది.
Well written script