358
0

రంగుల శబ్ధం

358

రాజమండ్రి పక్కనే ఉన్న గోకవరం గ్రామంలో గున్న సోమరాజు అనే పెద్దాయన ఉండేవాడు, అతడు వృత్తిపరంగా బడి పంతులు కావడంతో ఊరిలో అందరూ చనువుతో పంతులు గారు అని అతన్ని  పిలిచేవారు.సోమరాజు తన వృత్తి వదిలేసి చాలా కాలమైనా ఊరి జనం ఇంకా తనని పంతులుగారు అనే పిలిచేవారు.బడి పంతులుగా అతడి గుర్తింపు అలాంటిది మరి, మాములు ఘనతా,మొత్తం తన ఉపాధ్యాయ జీవిత కాలంలో ఒక్క విద్యార్థి మీద కూడా చెయ్యి వెయ్యకుండా అందరిని ప్రయోజకులని చేసాడు మరి అతగాడు.పోనీ మనిషి ఏమైనా బలహీన వంతుడో లేక పిరికోడా అంటే నీటి బుడగ పేలకుండా ఆ ఊరి చెరువులో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఈదేస్తాడు అది కూడా అరవై ఏళ్ల వయసులో అది చాలదూ అతగాడి గుండె ధైర్యం,కంఢ భలం తేల్చిచెప్పడానికి.ఎన్నో ఏళ్లుగా పంతులు గారు ఆ ఊరిలోని ఉన్నప్పటికీ అతగాడి ఆలోచనా శైలి,నడవడికా ఎవ్వరికి అంతు పట్టేది కాదు,ఎంత దగ్గర వాళ్ళు ఐనప్పటికీ అతగాడి ప్రవర్తనకు ఎప్పటికప్పుడు కంగు తినక తప్పదనుకోండి.పళ్ళున్న చెట్టుకె రాళ్లు పడతాయి అన్నట్టు,పంతులు గారికి కూడా ఊరిలో అవసరంలేని శత్రువు ఒకడు ఉండేవాడు.పంతులయ్యని రోజూ ఎదో ఒక మాటతో ఎత్తి పొడవకపోతే అతడికి  నిద్రపట్టదు అనుకోండి,ఎంత ఆలస్యమైనా పంతులు గారు మట్టి రోడ్డు దిగి తన గుడిసె సందుకి వెళ్లే వరకు ఆ రావి చెట్టు అరుగు దగ్గర కూర్చొని కపుకాసి మరీ హేళనగా ఒక మాట అనే వాడంటే నమ్మరనుకోండి.పాపం పంతులయ్య ఏనాడు తిరిగి ఒక్క మాటైనా అనకపోగా ‘ఎం వీరయ్య ఆకలి తీరిందా లేదా?’అని ఒక ద్వంద్వార్ధ మాటను నొప్పించకుండా అనేసి వెళ్లిపోయేవాడు.పంతులయ్య మంచి వాడు అని ఊరి జనం అందరికి తెలిసినప్పటికి అతడు చేసే పనులు చూసి అందరూ అతడిని ఒక పిచ్చివాడిగానే చూసేవారు.

పంతులుగారు రోజు పొదున్నే లేచి ఊరి చివర ఉన్న చెరువులో స్నానం చేస్తూ,అప్పుడే ఉదయిస్తున్న ఆ సూర్యుడి ముందు నమస్కారాలు చేసి.ఒంటికి మంచి మెత్తగా తగిలే ఖద్దరు పంచి ఒకటి చుట్టుకొని,బాపనోడిలా మెడలో ఒక ఎర్రని తుండువా వేసుకొని కాసేపు మౌనంగా ఆ రావి చెట్టుకింద కూర్చొని,ఆ చెట్టు నుంచి రాలిన ఆకుల్ని శబ్దాన్ని వింటూ వాటిని లెక్కపెట్టి,పిచ్చోడిలా ఆ రాలిన ఆకులతో ఏదేదో మాట్లాడేవాడు.అలా కాసేపు గడిచాక ఇంటికి నడక మొదలు పెట్టేవాడు, వచ్చే దారిలో రోజు ఒక పొలం గట్టున నించొని దూరంగా వెళ్లిపోతున్న రైలుబండి చప్పుడు విని చేతులు ఊపుతూ విచిత్రంగా కనపడని జనానికి క్షేమంగా వెళ్ళిరమ్మని అంపకాలు చేసేవాడు.అలా ముందుకు నడుస్తూ రాములోరి మండపం దగ్గర పూల కొట్టు ముందు ఆగి చామంతి పూల దండలు గుచ్చుతున్న లింగడు తో ‘ఎరా లింగా,నీ అన్న బాలడు ఇంటికి వచ్చాడా? నాకు రెండు గోళీలు బాకీ ఉన్నాడ్రా’ అని అనేవాడు,దానికి లింగడు ‘ఊరుకోండి పంతులయ్య,ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన వాడు బాకీ ఉన్నాడని రోజు ఎం అడుగుతావ్ లె’ అని అనేవాడు,ఇది విన్న పంతులు పక్క వీధిలో అన్నం తింటున్న రాములమ్మ పొలమారే  అంత గట్టిగా నవ్వుతూ ‘ఎక్కడికి పోతాడులె,ఎదో నా మీద అలిగి అలా వెళ్ళాడు అంతే,వచ్చాక చొక్కా పట్టుకొని నా గోళీలు వసూలు చెయ్యనూ’ అనేవాడు.రాములోరి గుడి తీసే సమయానికి ఏమాత్రం అటూఇటూ కాకుండా గుడికి వెళ్లి అక్కడ మెట్లమీద పడుకొని ఉండే పిచ్చివాడికి తెలియకుండా వాడి కంచంలో తాను దారిలో కోసుకొచ్చిన ఒక గుప్పెడు రేగిపళ్ళు పెట్టేవాడు,ఎంత నెమ్మదిగా పెట్టేవాడంటే కొన్ని ఏళ్ల నుంచి అలానే పెడుతున్న ఆ పిచ్చి వాడికి పెడుతున్నది పంతులయ్య అని ఇప్పటికి తెలిదు.అటుగా నడుస్తూ సాకలమ్మ భావి దగ్గరకు వెళ్ళేవాడు,కాసేపు ఆమెతో ముచ్చట్లు చెప్పి ఒక రెండు బిందెలు నీళ్లు తొడిచ్చేవాడు.’ఎందుకులే పంతులయ్య నీకు కష్టం’అని సాకలమ్మ అంటుంటే ‘కష్టం ఏముందిలె అక్కాయ్,మా బట్టలు తలతలలాదొద్దా ఏంటి’ అని ఒక సుత్తి సాకు చెప్పేసి ఎదో కూని రాగం తీస్తూ వెళ్లిపోయేవాడు.ఆ కూని రాగం విని రోజంతా ఏడుస్తుంటే మంగ చిన్న కూతురు పకెలు మని నవ్వేది,ఒక అరగంట పాటు ఆ శృతి లేని పిచ్చి పాటను గుర్తుచేసుకుంటూ నవ్వి నవ్వి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకునేది,అబ్బా నిజంగా ఆ పాటలు వినలేం అనుకోండి.అలా ఊరంతా తిరిగి ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం అయిపోయేది,కాస్త కూడు తిని మంచి నిద్ర చేసేవాడు.సాయంత్రం లేచి ఇంటి మీద చల్లగాలికి వెళ్లి గుమగుమలాడే మంచి అల్లం టీ ఒకటి చేతిలో పట్టుకొని,మరో చేతితో కాగితాల మీద బొగ్గు పెంకులతో గీతాలు గీస్తూ ఏవో పిచ్చి బొమ్మలు గీసేవాడు.చీకటి పడ్డాక చుట్టూ మేడలు ఎక్కే జనాన్ని పిలిచి ‘ఏమండోయ్ మీ మేడ మీద చుక్కలు ఎక్కువ ఉన్నాయా? నా మీద ఎక్కువ ఉన్నాయా?’ అని అర్థంలేని ప్రశ్నను అందరిని అడిగేవాడు,ఇది విన్న జనం పాపం పిచ్చి పంతులయ్య అనుకుంటూ ‘ఏంటో పంతులయ్య మా ఇంటి మీద ఒక్క చుక్క కూడా రాను అంటుంది,నీ మేడ మీదకు అన్ని చుక్కలు ఎలా వస్తున్నాయో ఏంటో’ అని వ్యంగ్యంగా అనేవారు.రాత్రి ఏడు ఎనిమిది అవుతున్నా ఇంటికి చేరేవాడే కాదు,ఎక్కడెక్కడో తిరిగి వచ్చి వాళ్ళ వాళ్ళ సొంత గుడారాలకు వెళ్తున్న పక్షి బృందాల పలుకులు వింటూ కాలం గడిపేవాడు.

ఒక నాడు పంతులయ్య ని శత్రువుగా చూసే వీరయ్య అనుకోకుండా హటాత్తుగా కాలం చేసాడు.ఊరంతా ఆఖరి చూపుకి చేరారు,పంతులయ్య వస్తాడని ఎవ్వరూ ఊహించలేదు వారి విరోధం అలాంటిది మరి,కానీ ఆశ్చర్యంగా పంతులయ్య ఈ విషయం తెలియగానే పరుగులు పెడుతూ వచ్చాడు.అందరూ వింటుండగా ‘ఎం వీరయ్య ఆకలి తీరిందా లేదా? పంతుల్ని వచ్చాను ఎం అనకుండా పడుకున్నావ్ ఏంట్రా? లేచి ఎదొటి అను’ అని అరుస్తూ బోరున ఏడ్చేశాడు.పంతులయ్య ఏడవడం ఇది రెండోసారి ఎప్పుడో యాభై ఏళ్ళ క్రిందట ఏడ్చాడు మళ్ళీ ఇప్పుడు ఎదుస్తున్నాడు.బతికున్నంత కాలం పంతులయ్యని రోజు మాటలతో వేపుకుతినే వీరయ్య చావుకు కూడా ఆ పంతులయ్య బాధపడటం చూసి ఊరి జనం ఆశ్చర్యపోయారు.పంతులయ్య పద్దతి, నడవడిక అలాంటిది మరి.

అలా కొన్నాలకి వయసు మీద పడి పంతులయ్య మంచం పట్టాడు,అతగాడి పరిస్థితి రేపో మాపో అనేలా తయారయింది.ఊరి జనం అంతా పాలకరింపుకి వస్తున్నారు,ఒకరోజు తన దగ్గరకి  ఒక పాతికేళ్ళ శివా అనే కుర్రోడు వచ్చాడు.అతడు పంతులు గారి పాత విద్యార్థి అంట.పంతులయ్యని చూస్తూ అలా బాధలో ‘గురువుగారు నాకు ఎప్పటినుంచో ఒక సందేహం ఉంది అడగొచ్చా?’ అన్నాడంట.అప్పుడు పంతులయ్య ‘ఊరి బడవా నీ సందేహాలకు సమాధానాలు చెప్పకుండానే నువ్వు ఇంత పెద్దోడివి అయ్యవా’ అని వెటకారంగా అన్నాడు.’ఎన్నో ఏళ్ళు మీకు విద్యార్థిగా ఉన్నాను,కానీ మీ పద్దతెంటో ఎప్పుడు నాకు అర్ధం కాలేదు,జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు,అసలు ఈ పిచ్చి ప్రవర్తన వెనుక అర్ధం ఏంటి గురువుగారు?’ అని అడిగాడు,అప్పుడు పంతులయ్య ‘జీవితం అబద్ధం చెప్పని ఒక అద్దం రా,ధైర్యంగా నవ్వుతూ దాని ముందు నిలపడితే నువ్వు కూడా ఊహించని అంత అందంగా నిన్ను చూపిస్తది’ అని చెప్పాడు.నవ్వు,ఆనందం,ధైర్యం సరే కానీ శత్రువుని కూడా అంతలా ప్రేమించడం ఎలా సాధ్యం.’శత్రువా…అసలు మన మనుషులు చేసే తప్పు ఎంటో తెలుసా అన్నింటినీ కళ్ళతోనే చూడటం.ఈ కోపాలు,ద్వేషాలు ఇవన్నీ కంటికి మాత్రమే కనిపిస్తాయిరా ఒక్క సారి నువ్వు కళ్ళు మూసుకుని మనస్సుతో చూడు అవతల వ్యక్తిలో నీకు కనిపించేది నీలాంటి ఓ సాదార మనిషి మాత్రమే’ అని పంతులయ్య ఎదో ఉపన్యాసం ఇస్తుంటే కుర్రోడు శివా ‘మిమ్మల్ని శత్రువుగా భావించే వీరయ్య చావుకి కూడా కంటతడి పెట్టడానికి కారణం ఇదేనా గురువు గారు’అని అన్నాడు.’వీరయ్యకి నేను శత్రువునే, నన్ను రోజు రాత్రి ఎంత ఆలశ్యమైనా కపుకాసి మరి నన్ను ఒక మాట అనేవాడు,ఇవన్నీ నిజమే కానీ జనం అందరూ కళ్ళతో చూడలేనిది నేను మనసుతో చూసింది ఏంటి అంటే వీరయ్య నాకు పెద్ద శ్రేయోభిలాషి,ఇంట్లో ఉండే కన్న తండ్రి ఎప్పుడు వస్తాడో కూడా పట్టించుకోని కొడుకులు ఉన్న ఈ కాలంలో,రోజు నాకోసం కపుకాసి నాకోసం కూడా ఒకడు వేచి చూస్తున్నాడు అన్న భావన నాలో కలిగించిన ఓ ఆప్తుడు,తనకి కూడా తెలియకుండా శత్రువు అన్న ముసుగు కప్పుకున్న ఓ మంచి మిత్రుడు’.ఏంటో గురువుగారు మీ అంత గొప్పగా ఆలోచించేలా మాకు పెద్దవాళ్ళు ఎవ్వరు నేర్పలేదు.’ఎవరో నేర్పడం ఎందుకురా,నిజానికి నేను ఆ పెద్ద వాడి దగ్గర నేర్చుకోలేదు,నేను ఇవి తెలుసుకుంది ఒక ఎనిమిది ఏళ్ల పిల్లోడు దగ్గర’ అంటాడు పంతులయ్య.ఎనిమిదేళ్ల పిల్లోడు నేర్పడా? అదేంటి గురువు గారు అసలు ఆ వయసులో జీవితం,ప్రపంచం గురించి ఏం తెలుస్తుంది? అంటూ శివ పంతులయ్యాని ప్రశ్నించాడు.’మన ఊరి బడి గ్రంథాలయంలో అటక మీద రాజు అనే కుర్రాడు రాసుకున్న ఒక చిన్న పుస్తకం ఉంటుంది అది చదువు నీ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతుంది’ అన్నాడు పంతులయ్య. అతడి మాటలు విన్న శివ వెంటనే ఊరి గ్రంథాలయంలోకి వెళ్లి ఆ అటక మీద ఉన్న ఆ చిన్న పుస్తకాన్ని వెతికి చదవడం మొదలు పెట్టాడు.

నా పెరు రాజు,నేను మీ అందరిలా కాదు చాలా ప్రత్యేక లక్షణాలు ఉన్న వాడిని,ఎంత ప్రత్యేకం అంటే నా లక్షణాలకు నా రెండోవ ఏటలొనే మా తల్లిదండ్రులు నన్ను రోడ్డున పడేసి పోయారు.నాలో లోపం ఏంటో నాకు తెలీదు కానీ జనం అంతా నాతో ఎదో సానుభూతితో మాట్లాడేవారు,అలా ఎందుకు చేస్తున్నారో తెలియక నాకు అర్ధమయ్యేది కాదు చాలా కోపం వచ్చేది.అందరిలో వేరుగా కాకుండా నన్ను నాల పాలకిరించింది ఒక్కడే,వాడే బాలడు.మేమిద్దరం రోజు పొద్దునే లేచి చెరువు పక్కన ఉన్న రావి చెట్టుకింద ఆడుకునే వాళ్ళం,ఆ చెట్టుకి రాలుతున్న ఆకుల చప్పుడు నన్ను  చాలా బాధ పెట్టేది,ఒకరోజు అలా బాధతో ఆ చప్పుడు వింటుండగా బాలడు వచ్చి ఎరా రాజు ఏమైంది? ఎందుకు అంత నీరసంగా ఉన్నావ్? అని అడిగాడు అప్పుడు నేను ఆ రాలిపోతున్న ఆకుల్ని తలచుకుంటే నాకు బాధగా ఉంది అని బాలడు తో చెప్పాను,దానికి బాలడు ‘రాలిపోతున్న ఆకులని తలచుకొని బాధపడతావ్ ఏంట్రా పిచ్చోడా,ఒక్కసారి తలెత్తి పైనున్న ఆ కొమ్మల్ని ఊహించుకో కొత్త చిగురులతో ఎంత అందంగా ఉన్నాయో.ఆకులు రాలితే చెట్టు బోడి అవ్వదురా రేపో మాపో బోల్డంత కొత్త చిగురుతో పచ్చగా అవుద్ది.నిజానికి చెట్టు ఆకుల్ని వెళ్లొద్దు వెళ్లొద్దు అంటుంది అంట కానీ ఆకులె చెట్టు మాట వినకుండా,నేను వచ్చిన పని అయిపోయింది అంటూ చేతులు దులుపుకుంటూ వెళ్లిపోతాయి అంట,పోనీ నా మాట నమ్మకపోతే అదిగో ఆ రాలిన ఆకుల్నే ఆగడు’ అని చెప్పాడు.అప్పుడే అనిపించింది నా చుట్టూ గాలిలో నేను చూడలేకపోతుంది ఎదో నా బాలడు చూస్తున్నాడని.పాఠశాల లేని రోజుల్లో పొదున్న మేము గోళీల ఆట ఆడేవాళ్ళం,ఒక్కరోజు కూడా నేను కొట్టగలిగే వాడిని కాదు నా చెయ్యి పట్టుకొనిమరీ నాతో కొట్టించేవాడు,అలా నేను గెలిచిన గోళీలు వాడు తీసుకునే వాడు,తరువాత మా ఊరి పొలం గట్లమీద బురదలో పరుగు పంద్యాలు పెట్టుకునే వాళ్ళం,పాపం బాలడు చివరి గీత దాకా వెళ్లి మళ్ళీ రెండు అడుగులు వెనక్కి వేసి నా చెయ్యి పట్టుకొని గీత దాటించేవాడు.అలా చేస్తే నువ్వెప్పుడు గెలుస్తావ్ రా అని ఆడిగినవాళ్ళకి ‘నేను గెలుస్తానని నాకు ఎలాగో తెలుసు కానీ రాజు గాడు కూడా గెలవగలడు అని నమ్మకం వాడికి రావాలి కదా’ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పేవాడు.అప్పుడప్పుడు అటుగా పోతున్న రైలు చప్పుడు విని ‘రాజు రైలు బండి పోతుంది అందరికి వెళ్ళిరమ్మని టాటా చెప్పు’ అనే వాడు,మేము కనీసం కంటికి కూడా కనపడని వాళ్ళకి మేము ఎందుకు చేతులు ఊపాలో నాకు ఎప్పుడు అర్ధం అయ్యేది కాదు.ఆదివారాలు పొదున్నే నన్ను లేపి బలవంతంగా చేరులోకి నెట్టేవాడు,నాకేమో ఈత రాకపోయే,అరిచి గీపెట్టే వాడిని.’నేను నిన్ను కాపాడనురా దమ్ముంటే నువ్వే బయటకి వచ్చి చూపించు’ అనేవాడు.అన్నీటింటి కన్నా భయం గొప్పది ఏమో మెల్లగా కొన్నాలకి నేనె ఈదుకుంటూ వచ్చేసేవాడిని.పక్క వీధిలో సాకలమ్మ,గుడిలో పూజారయ్య,కళ్ళం చేసే పాపమ్మ అందరూ బాలడికి స్నేహితులే,అంత స్నేహం ఎంటో మరి వీడు వల్ల పనిలో చిన్న చేతి సాయం,నవ్వుతూ ఒక మాట తప్ప డబ్బులు సాయం కూడా ఎప్పుడూ చెయ్యలేదు.సాయంత్రం ఐతే చాలు వాళ్ళ ఇంటి డాబా మీదకు తీసుకెళ్లి ‘ఒరేయ్ రాజు చుక్కలన్ని మన మీదనే ఉన్నాయిరా పక్కన ఎవ్వరి మీద లేవు’అనే వాడు.నేనేమో అదేంటి అలా ఎందుకు ఉన్నాయి అంటే ‘మనం దేవుడికి చాలా ఇష్టమైన వాళ్ళం కదా అందుకే కేవలం మనమీదనే అన్ని చుక్కలు పెట్టాడు’ అని పిచ్చి మాటలు చెప్పేవాడు.బాలడకి ఈత అంటే మహా ఇష్టం ఒక వర్షం పడుతున్న రోజు నేను,బాలడు  సరదాగా అలా చిన్న కాలువా దగ్గరకు వెళ్ళాం.బాలడు అలా ఈత కొట్టి వస్తా అని కాలువా లొపలికి దిగాడు.వర్షంపాతం ఎక్కువ అయ్యి పైన పాయ లో నీరు ఎక్కువవ్వడంతో ఆనకట్టలో జల మట్టం పెరగింది,ఇంకా పెరిగితే ఆనకట్ట కూలిపోతుంది అని ఉన్నపాళ్లుగా ఆనకట్ట గేట్లు ఎత్తివేశారు.ఆ కొట్టుకొచ్చిన నీటికి మా ఊరి చిన్న కాలువ మొత్తం నిండి నీరు వేగంగా పారింది.ఈత కొడుతున్న బాలడు ఒక్కసారిగా ఆ వరద నీళ్ళలో చిక్కుకున్నాడు.ఊపిరి అందక రాజు..రాజు అని కేకలు పెట్టాడు.ఎంత ప్రయతించిన బాలడు ఎక్కడున్నాడో నాకు తెలియడంలేదు.కొద్ది క్షేణాల్లోనే బాలడి పిలుపు ఆగిపోయింది,ఆ వరదల్లో వాడు కొట్టుకెళ్లాడు.అప్పుడు మొదటి సారిగా నేను గుడ్డి వాడిని అయినందుకు బాధ పడ్డాను.నాకే అందరిలా కళ్ళు ఉంటే నేను నా బాలడిని కాపాడుకునే వాడిని అనిపించింది.నా అవలక్షణం కారణంగా నా జీవితంలో ఏ రోజు నేను బాధ పడకుండా నన్ను నడిపిస్తూ,గెలిపిస్తూ వచ్చిన నా బాలడు ఇక నాతో లేడు.మనం ప్రేమించిన మనుషులకు చావు ఉంటుంది ఏమో కాని వాళ్ళు మనలో విడిచిన అలవాట్లు,ఆలోచనలకు చావు ఉండదు.

బాలడు అందరిలాంటి మనిషి కాదు,అందరికీ ఒకటే ఐన సూర్యోదయంలో కూడా ఆ సమయంలో ప్రాంచంలో కొంతమందికి వెలుగుని చూసే అవకాశం లేదు కానీ వాడికి మాత్రం ఉందనుకోని ఆనంద పడేవాడు.ప్రతి సాయంత్రం చీకటి పడ్డాక పక్షుల పలుకులు వింటూ అవి ఎక్కడ వాలాలో వాడినే అడుగుతున్నాయి అని,ఎవరిని అడగకుండా వాడినే అగుతున్నాయి అంటే వాడు అంత తెలివైన వాడిని అని చెప్పుకుంటూ మురిసిపోయేవాడు.దూరంగా వెళ్లే రైలులో జనాలకి వాడు చెయ్యి ఊపడం వల్లనే వాళ్ళు క్షేమంగా ఇళ్లకు చేరుతున్నారని తాను అంత శక్తివంతుడని చెప్పెవాడు.నింగిలో తరాలకి కూడా వాడు అంటే మహా ఇష్టం అని తాను అంత అదృష్టవంతుడ్ని అని ఎగిరి గంతులు వేసేవాడు.తరాలు తిన్నా తరగని ధనం ఉన్నా సంతృప్తి చెందని మనుషులు ఉన్న ఈ రోజుల్లో ప్రతి చీకట్లో తనకోసం ఒక వెలుగు వెత్తుకొని,ప్రతి చిన్న విషయంలో తనకు అనుకూలంగా ఎదో జరుగుతుందని నమ్మి నమ్మకంతో ముందుకు నడిచే ఒక అసాధారణ మనిషి వాడు.’

ఈ పుస్తకం చదివిన శివ పంతులయ్య ఈ రాజు జీవితం చూసి అలా మారాడు అనుకుని,ఆ పుస్తకం తీసుకొని పంతులయ్య దగ్గరకు వెళ్లి ‘పంతులయ్య ఈ రాజు పుస్తకం మీకు ఎక్కడ దొరికింది,ఇప్పుడు రాజు ఎక్కడ ఉన్నాడు?’ అని అడిగాడు.దానికి పంతులయ్య నిదరలోనే ఒక చిన్న నవ్వునవ్వి శాశ్వతంగా నిద్రపోయాడు.బాధతో కన్నీరు పెట్టుకున్న శివ గురువు పాదాలకు నమస్కారం చేసి లేస్తూ ఆ పుస్తకం అట్ట మీద ‘సోమరాజు’ అనే పేరు చూసాడు.ఆ పుస్తకంలో ఉన్న రాజు ఎవరో కాదని తన గురువు సోమరాజే అని తెలుసుడుకున్నాడు.గుడ్డి వాడైన పంతులయ్య రోజు రావి చెట్టు ఆకులతో మాట్లాడే ఆ పిచ్చి మాటలు,రైలు శబ్ధం విని చేతులు ఊపే పిచ్చి చేష్టలు,మేడలు ఎక్కే పొరుగు వారిని అడిగే పిచ్చి ప్రశ్నలు అన్ని తన స్నేహితుడు బాలడు నేర్పినవే అందుకే రోజు ఆ రామాలయం పక్కన ఉన్న పూల కొట్టు దగ్గర మల్లె పూలు వాసనకు ఆగి బాలడు అన్న లింగడుతో తన చిరకాల స్నేహితుడిని గుర్తుచేసుకుంటూ ఒక మాట అనేవాడు.ఇదంతా తెలుసుకున్న శివడు పంతులయ్య ఎప్పుడూ పిచ్చి గీతాలు గీసే కాగితాలు తీసి చూసాడు అందులో తన ఊరు,ఆ ఊరిలో రావి చెట్టు,తన మిత్రుడు బాలుడు,తను పలకరించే పక్షులు,తనకోసం వచ్చే తారలు ఇలా అన్నింటినీ ఊహించుకొని పంతులయ్య గీసిన అందమైన చిత్రాలు ఉన్నాయి.అది చూసిన శివడు అలా ఒక్కసారి కళ్ళు మూసుకొని ‘నిజమే గురువుగారు కళ్ళు మూసుకొని మనసుతో ఈ ప్రపంచాన్ని చూస్తుంటే ఎంత అందంగా ఉందొ’

ఈ కధలో పంతులయ్య తన జీవితంలో ఒక్క రంగుని కూడా చూడలేదు కానీ ఎండిన ఆకుల శబ్ధం,రైలు శబ్ధం,పక్షుల శబ్ధం ఇలా తన చుట్టూ ఉన్న అన్ని శబ్ధాలలో దాగిన అందమైన రంగులని అశ్వాదించాడు.ప్రతి మనిషి పంతులయ్య లాగానే మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాలకు కూడా సంతృప్తి చెంది అందులో మంచి కోణాన్ని వెతుకుతూ ఆనందం పొందగలిగితే ఈ ప్రపంచంలో అన్ని ‘రంగుల శబ్ధాలె’

               _________ సాగర్ బళ్ల

Leave a Reply

Your email address will not be published.