122
0

సిగ్నల్

122

“ఏమైందని అందరూ అలా పరిగెడుతున్నారు” భర్తతో అంది సుజిత.
“ఏమో నాకేం తెలుసు….ఏదైనా ఆక్సిడెంట్ అయ్యి ఉంటుంది.. సిగ్నల్ దగ్గర చాలామంది గుమికూడారు “బైక్ ఆపి అన్నాడు మనోహర్ .
“అయ్యో ,పదండి వెళ్ళి చూద్దాం…”
“ఏమక్కర్లేదు..నోరుమూసుకుని కూర్చో…వెళ్ళి ఏం చేస్తావు..ఎవడో ఓవర్ స్పీడ్ గా వెళ్తూ గుద్దేసి ఉంటాడు”
“నేను వెళ్ళి చూసొస్తాను” అంటూ అతని పర్మిషన్ కోసం ఆగకుండా జనాలను తప్పుకోమంటూ దారిచేసుకుని ముందుకు వెళ్ళింది.

అక్కడి దృశ్యం చూసి కళ్ళు తిరిగినట్లు అయ్యింది… యాక్సిడెంట్… మామూలుగా కాదు..
ఆ అబ్బాయికి ఇరవైఐదేళ్ళుండొచ్చు…కాళ్ళు విరిగిపోయి ,ఒకచేయి సగానికి తెగి వేళ్ళాడుతూ ,రూపు తెలియనంతగా మొహం అంతా రక్తం కమ్మేసింది…

దానికంటే కూడా మనసుని మెలిపెట్టిన విషయం, ఆ అబ్బాయి మాటలు…
” దయచేసి ఎవరైనా నన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి… నేనెలాగూ బ్రతకను ,కనీసం నా అవయవాలు దానం చేస్తే అయినా మరికొంతమంది ఆయుష్షు పెరుగుతుంది… నేనెక్కువసేపు బ్రతికి ఉండను…నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళి మరికొంతమంది జీవితాలకు వెలుగునివ్వండి..మీకు పుణ్యం ఉంటుంది” అంటూ హృదయవిదారకంగా ఏడుస్తున్న అతన్ని చూసి కన్నీళ్ళు ఏరులై పారాయి సుజితకి..

చనిపోతూ కూడా మరికొంతమంది భవిష్యత్తు గురించి ఆలోచించిన ఆ మంచి మనసుకు మనసులోనే పాదాభివందనం చేసి ,చుట్టూ నిలబడి సినిమా చూస్తున్నట్లుగా నిలబడ్డ జనాన్ని చూసి ఛీ కొట్టింది మనసులోనే..

అక్కడ నిలబడి ఉన్న ఆటో అతన్ని బ్రతిమాలి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళింది,భర్త అక్కడే ఉన్న విషయాన్ని కూడా మరిచిపోయింది… ఆ పది నిమిషాల ప్రయాణంలో అతను నాలుగు సార్లు “మీ రుణం తీర్చుకోలేనమ్మా “అన్నాడు. అంతకంటే మాట్లాడే ఓపిక కూడా లేదతనికి..ఈ నిమిషమో ,మరునిమిషమో అన్నట్లు ఉన్నాడు.

హాస్పిటల్ లో, మానవత్వం ఉన్న ఆ డాక్టర్ అతని పరిస్థితి చూసి అనవసర ప్రశ్నలతో కాలయాపన చేయకుండా తన పక్కన ఉన్నవారికి పోలీసులకి తెలియచేయమని చెప్తూ ,ఆపరేషన్కి ఏం కావాలో సూచనలు ఇస్తూ ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకుని వెళ్ళిపోయాడు…

ఈలోగా సుజిత మొబైల్ రింగ్ అయ్యింది..

భర్త కాల్ చూసి లిఫ్ట్ చేసి “హాస్పిటల్ లో ఉన్నాను..ఆ యాక్సిడెంట్ అయిన అబ్బాయిని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకుని వెళ్ళారు..సాయంత్రం నేనే వస్తాను ఇంటికి.. ఈ పరిస్థితుల్లో ఇంటికి రాలేను…మీకు తెలుసు కదా నా గురించి.. ఏమైనా తిట్టాలనుకుంటే ఇంటికి వచ్చాక తిట్టండి..ఇప్పుడు మాత్రం వదిలేయండి.. బాయ్” అంటూ అతని సమాధానం వినకుండా ఫోన్ పెట్టేసింది..

ఏమనుకున్నాడో మరి ఇక ఫోన్ చేయలేదు అతను.

ఓ అరగంటకి పోలీసులు వచ్చారు… హాస్పిటల్ రిసెప్షన్ వద్ద వివరాలు కనుక్కుని తమ డ్యూటీ తాము చేశారు..

తర్వాత సుజిత దగ్గరకు వచ్చి “అతను మీకు తెలుసా!? “అనడిగారు.

“లేదు ,అక్కడ అతని పరిస్థితి చూస్తూ ఊరుకోలేక ఇక్కడకు తీసుకుని వచ్చాను” అంది.

“ఎవరికీ లేని దయ మీకెందుకో…, తెలియని మనిషి మీద..” ఓ కానిస్టేబుల్ వెటకారంగా అడిగాడు..

“మనిషి ఎవరో తెలిస్తేనే సాయం చేయాలని నాకు తెలీదండీ…. అందరూ తాము మనుషులమని ,మానవత్వం అనేది మనిషి సహజలక్షణం అని మరిచిపోయారు.

ఆపదలో ఉన్న మనిషికి కనీస సాయం చేయాలనే ఇంగితజ్ఞానం కూడా కరువైపోయింది నేటికాలంలో..

నేను మనిషిగానే బ్రతుకుతున్నాను…అందుకే సాటి మనిషి అనే స్వార్థంతో తీసుకొచ్చాను…ఎంతైనా నేనూ మనిషినేగా” ఘాటుగా సమాధానమిచ్చింది సుజిత…

ఆమె జవాబుకు తలకొట్టేసినట్లయ్యింది ఆ కానిస్టేబుల్ కి..

కానిస్టేబుల్ వంక కోపంగా చూశాడు ఎస్సై.. ఆ కోపాన్ని తట్టుకోలేక తలదించుకున్నాడతను..

“చాలా మంచిపని చేశారు మేడమ్..మీరన్నది నిజం “అన్నాడు ఎస్సై.

“సర్ ,మీరేమీ అనుకోనంటే ఓ చిన్నమాట..ఆ యాక్సిడెంట్ ఫుటేజ్ నేను చూడవచ్చా”అడిగింది.

“ఎందుకు?” ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై.

“తన తొందరపాటుతో ఒక మనిషికి జీవితాన్ని లేకుండా చేసి, తర్వాత కనీసం అతను ఏమయ్యాడో కూడా చూడకుండా వెళ్ళిపోయిన ఆ మహానుభావులను చూద్దామని!!” స్వరంలో బాధ ధ్వనిస్తుండగా అంది.

మాటల్లో,చేతల్లో ఆమె మనసు ఏమిటో అర్థం చేసుకున్న ఎస్సై అంగీకరించాడు..

“తప్పకుండా… ఇక్కడికే తీసుకుని రమ్మని చెప్పాను మావాళ్ళని. రాగానే చూద్దురు” అంటున్నంతలోనే ఆ ఫుటేజ్ వచ్చింది..

అక్కడున్న విజిటింగ్ ఛైర్స్ లో కూర్చుని లాప్టాప్ కి కనెక్ట్ చేసి చూడసాగారు…

యెల్లో సిగ్నల్ పడగానే ముందుకు కదిలించారు వెహికల్స్ ని గ్రీన్ సిగ్నల్ పడకుండానే ….ఈలోగా మరోవైపు నుండి రెడ్ సిగ్నల్ పడబోతుందని ఎలా అయినా ముందే వెళ్ళిపోవాలని ఓ కార్ మామూలు స్పీడ్ కి రెట్టింపు వేగంతో దూసుకొచ్చింది…

అదేసమయంలో ముందుకు కదిలిన ఈ అబ్బాయి బైక్ ని గుద్దేసి ఆగకుండా వెళ్ళిపోయింది.
అది చూసి ఇంకా బాధనిపించింది సుజితకి..

ఇటువంటివి ఎన్నో చూసిన ఎస్సై తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

ఏదో అనుమానం వచ్చినట్లుగా “సర్ ,ఒకసారి ఆ కార్ ని చూపించండి మళ్ళీ ” అంది.

చూపించాడు ఎస్సై.. ఆ కార్ ని అన్ని కోణాల్లో ఓ పదినిమిషాలు చూసి ,కళ్ళు మూసుకుని దీర్ఘంగా నిట్టూర్చింది ఓసారి..

ఆమె ముఖకవళికలు చూసి అనుమానం వచ్చిన ఎస్సై “మీకు తెలిసిన వాళ్ళదా ఆ కార్? ” అనడిగాడు..

అవునన్నట్లుగా తలూపింది..
వెంటనే “ఎవరు వాళ్ళు?” అనడిగాడు ఉత్సాహంగా, ఎక్కువ కష్టపడకుండా వివరాలు తెలుస్తున్నందుకు.

వివరాలు చెప్పింది సుజిత..

విని ఒక్క క్షణం నివ్వెరపోయినా వెంటనే తేరుకుని అక్కడ ఓ కానిస్టేబుల్ ని ఉంచి బయటికి వెళ్ళిపోయాడు మిగతా వారిని తీసుకుని.

అప్పటికి గంటన్నర అయ్యింది హాస్పిటల్ కి వచ్చి…. మరో మూడు గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చిన డాక్టర్ దగ్గరకు వెళ్ళింది ఆత్రుతగా..

అక్కడ ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు డాక్టర్… ఆపదలో ఉన్నవారిని కాపాడాలనుకోవడమే గొప్ప అనుకుంటే ,ఇప్పటివరకు ఆమె వేచి,ఏం జరిగిందో తెలుసుకోవాలనుకోవడం మానవత్వానికి మరోపేరులా అనిపించింది.

“అతని గుండె , కిడ్నీ ,కళ్ళు ముగ్గురికి జీవితాన్ని ఇచ్చాయమ్మా…అతనికి ఆ ముగ్గురూ ఎంతో రుణపడి ఉన్నారు.. అలాగే నీకు కూడా… అతన్ని తీసుకుని రావడం మరో ఇరవై నిమిషాలు లేటయితే ఆ అవయవాలు ఎందుకూ ఉపయోగపడేవి కావు..అతనికి ఎలాగూ మరణం తప్పదు, మరణానంతరం కూడా అతను జీవించేలా చేశావు.. నిజంగా ఎలా అభినందించాలో కూడా తెలియడంలేదు!!” అన్నాడు..

“లేదు డాక్టర్! ఇందులో నా గొప్పతనం ఏమీలేదు!! అంత భయంకరమైన పరిస్థితిలో ఉండి కూడా మరొకరికి ఉపయోగపడాలి అనుకున్న అతని మనోబలం వల్లే ఇది సాధ్యం అయ్యింది… అంతేకాదు, తీసుకుని రాగానే అనవసర ప్రశ్నలవర్షం కురిపించకుండా వెంటనే స్పందించిన మీరూ నిజంగా చాలా గొప్పవారు!!” అంది కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ…

ఇంతలో టీవీలో న్యూస్ చూసి వివరాలు తెలుసుకున్న ఆ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారు ఏడుస్తూ..

సుజిత మౌనంగా బయటికి వచ్చేసింది…ఆటోలో ఇంటికి వెళ్తూ ఆలోచిస్తోంది…

‘ఆ యాక్సిడెంట్ చేసిన కారు ,స్వయానా తన బాబాయ్ కొడుకు అయిన నీరవ్ దే.. ..వాడెప్పుడూ డ్రైవింగ్ చాలా నిర్లక్ష్యంగా చేస్తాడు..ఓవర్ స్పీడ్..
నిదానం అనేది మచ్చుకైనా లేదు..ఎన్నోసార్లు చెప్పినా ,తిట్టినా తన పద్ధతి మార్చుకోలేదు…ఇప్పుడు అతని నిర్లక్ష్యం ఓ నిండు జీవితాన్ని బలితీసుకుంది.

థియేటర్ లో సినిమా చూడడం కోసం గంటలు గంటలు వెయిట్ చేస్తారు, ప్రేమించిన అమ్మాయిలు /అబ్బాయిల కోసం పార్కుల్లో ఎంతసేపైనా నిరీక్షిస్తూనే ఉంటారు…
ఎన్నింటికో అనవసరమైన వాటికి కూడా అవసరమైన సమయాన్ని వెచ్చించి ఎదురుచూస్తారు..
కానీ సిగ్నల్ దగ్గర కొన్ని నిమిషాలు కూడా ఆగలేరా?….అంత తొందరెందుకు…., ఆ తొందర ఎన్ని జీవితాలను ఎన్ని మలుపులు తిప్పుతుంది…, ఎన్ని ఆశలసౌధాలను నేలకూలుస్తుంది…
అందరినీ తాను మార్చలేదు కానీ, తన పరిధిలో తన చుట్టూ ఉన్నవారు ఈ తప్పు చేయకుండా చూసుకోవాలి’ అని బలంగా నిశ్చయించుకుంది మనసులో.

ఈలోగా ఆటో సడెన్ గా ఆగేసరికి ఆలోచనల నుంచి తేరుకుంది. రెడ్ సిగ్నల్ పడింది…తర్వాత యెల్లో సిగ్నల్ పడగానే ముందుకు కదులుతున్న ఆటో అతన్ని “భయ్యా గ్రీన్ సిగ్నల్ వచ్చాకనే కదలండి..ఇంకెప్పుడూ యెల్లో సిగ్నల్ ఉన్నప్పుడు వెళ్ళొద్దు భయ్యా!! “అంటూ జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పింది దారిలో…

“ఇంకెప్పుడూ ఇలా చేయనమ్మా..కరెక్ట్ గానే వెళతాను ” అంటూ కళ్ళనీళ్ళని తుడుచుకున్నాడు.
ఓ వ్యక్తిలో అయినా మార్పు మొదలయినందుకు తృప్తిగా అనిపించింది సుజితకి.

ఇంటికి వెళ్ళిన తర్వాత ఉగ్రరూపుడైన భర్తని శాంతపరిచి జరిగిన విషయాలన్నీ చెప్పింది…

స్వంత బాబాయ్ కొడుకని కూడా చూడకుండా తప్పు చేశాడని పోలీసులకు పట్టిచ్చిన ఆమెని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు..

బెయిల్ మీద రిలీజయిన నీరవ్ సుజిత దగ్గరకు వచ్చి కోపంగా “తమ్ముడ్ని అని కూడా చూడకుండా పోలీసులకు పట్టిస్తావా..! తప్పంతా నాదేనా..?
వాడూ నా కార్ కి అడ్డం వచ్చినట్లే కదా.., అయినా ఒకడు నా చేతిలో చచ్చాడంటున్నావు కానీ, వాడివల్ల ముగ్గురుకి మంచి జీవితం దొరికింది కదా…!
అలా ఎందుకు ఆలోచించవూ!? “అన్నాడు..
తప్పు చేసి కూడా తన తప్పును కవర్ చేసుకుంటూ ,తనవల్ల ఓ నిండు ప్రాణం పోయిందన్న బాధ లేకుండా మాట్లాడుతున్న నీరవ్ని చూసి ఆవేశం పట్టలేక లాగిపెట్టి కొట్టింది…

“ఎంత ధైర్యం నన్నే కొడతావా?” అంటూ దూకుడుగా మీదకు రాబోయాడు నీరవ్..

“ఛీ ,నువ్వసలు మనిషివే కాదు,అన్యాయంగా ఓ ప్రాణాన్ని బలితీసుకుంది కాకుండా మళ్ళీ కవర్ చేసుకుంటున్నావా సిగ్గులేకుండా… ప్రాణం విలువ తెలిస్తే కదరా నీకు… ఆ పరిస్థితిలో నువ్వుంటే తెలిసేది ఆ నరకం ఎలా ఉంటుందో…ఇంకెప్పుడూ నీ మొహం నాకు చూపించకు..ఫో ఇక్కడినుండి ” అనరిచింది గట్టిగా..

“తమ్ముడ్ని పోలీసులకు పట్టించిన నీకు ఉంది మరి మానవత్వం.. అయినా వాడి ఆయుష్షు అయిపోయింది, అందుకే పోయాడు.. కాకపోతే వాడి ఆయుష్షు నా చేతిలో తీరిపోయింది.. అంతే!!” కొంచెం వెటకారం, మరికొంత ఆవేశం కలగలిపి అని
విసురుగా బయటికి వచ్చి తన బైక్ స్టార్ట్ చేసి కంటికి కనిపించనంత వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు నీరవ్..
వెళుతున్న నీరవ్ ని చూసి అసహ్యించుకుంది సుజిత.
ఆవేశంగా స్పీడ్ గా వెళుతున్న నీరవ్, ఎదురుగా రెడ్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా వెళ్తూ, లారీని ఓవర్టేక్ చేయబోయి ఆ లారీ చక్రాల క్రిందే పడి నుజ్జునుజ్జయ్యాడు..చనిపోయే ఆఖరి క్షణంలో అక్క మాటలు మదిలో మెదిలాయి నీరవ్ కి.

Leave a Reply

Your email address will not be published.