255
0

బిచ్చగాళ్లు

255

శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశ గోవిందా భక్తవత్సల గోవిందా…..అంటూ గోవింద నామాలు లీలగా వినిపించడంతో నిద్ర లేచి ..ఏంటి రా బాబు అప్పుడే సుప్రభాతం అయిపోయిందా వెంకీ మామా కి అప్పుడే నామాల్లోకి వచ్చాడు…అన్నాడు ఎప్పుడు సరదాగా మాట్లాడే శేషగిరి….
ఇంకాసేపు పడుకొని అలా కలలు కంటూ ఉండు మధ్యాహ్నం హారతి పాట కూడా పాడుకుంటాడు అంటూ ఒక ఛలోక్తి విసిరింది విజయలక్ష్మి….
ఏ పూట ఐతే వాడికేలేం విజయా మనం ఏమైనా పొద్దున్నే లేచి ఆఫీసుకి వెళ్ళాలా కాపీలు వ్రాయలా అన్నాడు అందరిలోకి పెద్దవాడైనా నారాయణరావు..
ఆ మాటా కి ముగ్గురు కాసేపు నవ్వుకుని ఒకరికొకరు శుభోదయాలు చెప్పుకుంటు పక్కనే ఉన్న గుడికి వెళ్ళడానికి సిద్ధం అయ్యారు…రేయ్ శేషం త్వరగా తెములు అసలే ఇవాళ శనివారం..ఆలస్యం చేసాం అంటే దర్శనం కాదు కదా శేషమే మిగులుతుంది మనకి..ఇదిగో స్వామి వస్తున్న అంటూ క్షణం లో తయారయ్యి గుడికి చేరుకున్నారు…
ఇంత పొద్దున్నే నిష్ఠగా గుడికి వెళ్తున్నారు వీళ్ళు మహా భక్తులు అనుకునేరు అంత..నిజానికి వాళ్ళు భక్తులు కాదండీ.గుడి మెట్లమీద పదో పరకో అడుక్కునే బిచ్చగాళ్లు….

చ చ జనాలకి దేవుడు అంటే భయం భక్తి లేకుండా పోయింది నారాయణ అన్నా,మీ పాపాలు మా ధర్మాలతో కడిగేస్తాం అన్నా ఎవ్వడు పట్టించుకోవడం లేదు……లేజి పీపుల్……ఇప్పుడు ఏమైంది రా ఎవడన్నా చిల్లి నొటో చల్లని నాణేమో వేశాడా…అలా వేసినా బాగుండు కనీసం చిల్లి నోటికి చిల్లి పోగా చిల్లరన్నా వచ్చేది..పొద్దుటి నుంచి ఎండ లో కూర్చుని గొంతు పోయే లా అరస్తున్నా ఒక్కడు కనీసం దయతో కూడా పది రూపాయలు ఇవ్వలేదు..అసలు ఇవాళ మన రోజు గడవడానికి మనం అనుకున్నది జరగడానికి సరిపడా చిల్లర వస్తుందా అని ….దేనికైనా సహనం ఉండాలి శేషయ్య గొంతు మంట గా ఉంది అని ఫైర్ స్టేషన్ కి కాల్ చేస్తావా…మనం బిచ్చగాళ్ళం,ఇచ్చింది పుచ్చుకోవాలి తప్ప,కోరుకున్నది అడగకూడదు బెగ్గర్ కి ఆప్షన్ వుండదు…ఫీల్ ఇన్ ది బ్లాంక్స్ మాత్రమే వుంటాయి అది కూడా బిక్షం వేసే మాస్టర్ నీ బట్టి ఆధారపడి వుంటుంది… ఛా సందు దొరికితే చాలు క్లాస్ మొదలెడుతుంది,అందుకే అన్నా మన సంఘంలో టీచర్స్ వద్దు అన్నాను,సర్లే రా ఇప్పుడు ఏమైంది విజయ చెప్పినది కూడా నిజమే కదా,అడుక్కునే వాడికి కోపం వుంటే బిక్షం వేసే వాడికి పొగరు వుంటుంది..అలాంటి అర్థం లేని ఆవేశాలకు లోబడే ఇంకా ఇక్కడే వున్నాం ……చూడు చూడు కస్టమర్స్ వస్తున్నారు…లెట్స్ స్టార్ట్….అమ్మా తల్లి బాబు ధర్మం చెయ్యండి తల్లి…..అలా అరుస్తునే ఇలా రోజు గడిచిపోయింది…

ఇంటికి చేరుకున్నాకా మొత్తం కలెక్షన్ ఎంత అని అడిగాడు నారాయణ..నాది 504 రూపాయలు అన్నాడు శేషగిరి…నాది 456 అన్నది విజయ లక్ష్మి,సర్లే ఇటివ్వండి డిబ్బిలో వేస్తాను…అందరినీ అడిగి నీ సంగతి చెప్పరేం నారాయణ్ గారు అన్నాడు శేషగిరి..చెప్పేది ఏమి వుంది రా అబ్బాయి ,ఎంత వున్నా ఖర్చులు పోను మిగిలింది డిబ్బి లోకేగా,అదే ఎంత అని ఆడుతున్నాం సార్…ఎంత రా బాబు 1000 కి 50 తక్కువ ,అబ్బో పర్లేదే అన్నగారు ముందజ లో వున్నారు అనుకుంటూ తినడానికి బయటికి వెళ్లారు ముగ్గురు…రోజు రాత్రి ఒక రెండు చపాతీ ఒక అల్లం టీ త్రాగి పడుకోవడం వాళ్ళకి అలవాటు…

ప్రతి రోజూ లానే తెల్లార గానే లేచి తయారయ్యి మళ్లీ గుడికి వెళ్ళారు ముగ్గురు.ఆ రోజు ప్రసాదం పెట్టె సమయంలో ఒక చిన్న పిల్లాడు గుడిలోంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు,వెనకాల ఒక పది మంది వాడ్ని తరుముతూ వస్తున్నారు,అది చూసి నారాయణ పిల్లాడిని పట్టుక్కని తరుముకుంటు వస్తున్న వాళ్ళని ఆపి విషయం ఏంటి అని ఆరా తీసాడు. పది ఏళ్ళు కూడా లేవు ఈ వెధవకి అప్పుడే దొంగతనాలు మొదలుపెట్టాడయ్యా,ఈ పెద్దమనిషి పర్సు కాజేసి పరిగెత్తాడు అన్నాడు ఆ గుంపులో ఒకడు,నారాయణ పిల్లాడి వైపు చూసాడు,వాడి ఒంటి మీద చిరిగిపోయిన చొక్క ఒకటి,జరిపోతున్నా నిక్కర్ ఉన్నాయి,వాడ్ని చూస్తే ఎవరికైనా జాలి వేసే విధంగా ఉన్నాడు.ఏదో తేలిక చేసి ఉంటాడు వదిలెయ్యండి అయ్యా పాపం చిన్న పిల్లాడు అన్నాడు నారాయణ,ఏంటయ్యా వాడ్ని వెనకేసుకు వస్తున్నావ్ మీరంతా ఒక ముఠా నా ఏంటి అన్నాడు అసలు పర్సు యజమాని.బిచ్చగాళ్లు అందరూ దొంగలైతే ఈ పాటికి గుడిలో దేవుడు కూడా మిగిలేవాడు కాదు సార్.మనం చూసిందల్లా నిజం కాదు,చేసేవన్ని మంచి కాదు,మీ సొమ్ము మీకు దొరికింది కదా ఇంకెందుకు గొడవ చేస్తారు,వెళ్ళండి సార్ పిల్లాడని కూడా చూడకుండా కొట్టడానికి సిద్ధం అయ్యారు,వెళ్ళండి వెళ్ళండి అంటూ గట్టిగా చెప్పాడు,ఆ మాటకి వచ్చిన వారు వెనుతిరిగారు.

వాళ్ళు వెళ్ళాక నారాయణ పిల్లాడికేసి చూసాడు,అప్పటికే విజయ వాడ్ని దెగ్గరకు తీసుకొని కళ్ళు తుడిచి,ఏమి తిన్నాడో ఏమో అని తన దెగ్గర ఉన్న ప్రసాదం ముద్దలు చేసి పెడుతోంది.నారాయణ ,శేషగిరి పిల్లాడి దెగ్గరకు వచ్చారు..వాడు ఇంకా భయపడుతూనే వున్నాడు,నారాయణ వాడ్ని ఒళ్లో కూర్చోబెట్టుకొని నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు..దొంగతనం తప్పు నాన్న…ఇస్తే తీసుకోవాలి,అవసరం ఉంటే అడిగాలి అంతే కాని దొంగతనం గా తీసుకోకూడదు అంటూ హితవు చెప్పాడు… లేదు తాత నేను కావాలని చెయ్యలేదు అంటూ ఏడుస్తూ చెప్పాడు పిల్లాడు..మా అమ్మ నేను నిన్నటి నుంచి ఏమి తినలేదు,గుడిలో ప్రసాదం పెడతారు అది తీసుకొని అమ్మకు పెట్టి నేను తిందాం అని గుడికి వచ్చాను,లైన్లో నిల్చుంటే నన్ను తోసేశారు,అందకే ఒక పది రూపాయలు ధర్మం చెయ్యమని అడిగాను,ఎవరు ఇవ్వలేదు సరికదా అందరూ నేను అబద్ధం చెప్తునట్టు చూసారు.ఆకలికి ఆగలేక ఒక పెద్దాయన పర్సు కింద పడితే తీసుకొని పరిగెత్తాను అన్నాడు…పిల్లాడు చెప్పిన మాటలకి ముగ్గురికి కళ్ళు చమర్చాయి….

విజయ వాడ్ని దెగ్గరకు తీసుకొని ముద్దుపెట్టుకొని చిన్ని నాన్న అమ్మ కోసం దొంగతనం చేసావ,పిచ్చి నాన్న అంటూ గుండెకు హత్తుకొని ఏడ్చింది..శేషగిరి వాడ్ని చూస్తూ కారణం ఏదైనా దొంగే అంటారు రా అబ్బాయి ,అయినా అమ్మ నువ్వు అంటున్నావు మీ నాన్న లేడా ,ఎక్కడుంటారు మీరు అని అడిగాడు,
నాన్న నన్ను అమ్మను వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయాడు అంకుల్,అమ్మకి జ్వరం వస్తూ ఉంటుంది,అది తగ్గాలంటే చాలా ఎక్కువ ఖర్చవుతుందట అందుకే నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు..అమ్మ మొన్నటి నుంచి ఏమి తినలేదు అందుకే కనీసం బ్రేడ్ అయినా తీసుకుందాం అని దొంగతనం చేసాను…నారాయణ పిల్లాడిని దెగ్గరకు తీసుకొని ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకొని అమ్మకి బ్రేడ్ కొను నువ్వు కూడా ఏమైనా తిను,ఆకలి వేసినా దొంగతనం మాత్రం చెయ్యకూడదు అంటూ చెప్పి పంపించాడు….పిల్లాడు డబ్బులు తీసుకొని నవ్వుతూ వెళ్ళాడు..ఇదంతా ఒక అమ్మాయి దూరంగా నిల్చొని చూస్తూ ఉంది..బిచ్చగాళ్ళు ఎవరైనా ఫ్రీగా వస్తే వద్దనుకోరు కానీ వీళ్ళ ముగ్గురు దానికి విరుద్ధంగా వున్నారు,బిచ్చం ఎత్తుకుంటారు కానీ పిల్లికి కూడా బిచ్చం పెట్టారు ఏకంగా పిల్లాడిని సమర్ధించి,డబ్బులిచ్చి మరి పంపుతున్నారు అంటే వీళ్ళ గురించి తెలుసుకోవాలి అనుకుంది..

రోజు ముగ్గురు కలసి రావడం కలసి పోవడం, వాళ్ళ చమత్కారాలు, ఛలోక్తులు,దయాగుణం చూసి బిచ్చగాళ్ల కి అంత జ్ఞానం,నుడికారం ఎలా వుంటుందో అర్థం కాలేదు ఆమెకి…. వాళ్ళ గురించి ఎలా అయినా తెల్సుకోవాలి అని రోజు వాళ్ళని ఫోలో అవడం మొదలుపెట్టింది..ఒక రోజు ఎందుకో అనుమానం వచ్చింది ముగ్గురికి,వెనక్కి తిరిగి చూసే సరికి ఎవరు కనపడలేదు..ఎవరికి కనిపించకుండా జాగ్రత్త పడింది అమ్మాయి..ఒక బుధవారం రోజు సాయంత్రం వాళ్ళ కోసమని గుడికి వచ్చింది,కానీ ఎవరూ కనిపించలేదు ఆమెకి,గుడి మెట్ల మీద వున్న వేరే బిచ్చగాళ్ల ని వాళ్ళ గురించి అడిగింది,ప్రతి నెల రెండో బుధవారం వాళ్ళు ముగ్గురు ఇక్కడి రారు అని తెలుసుకుంది,మేటర్ బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఆమెకి..వాళ్ళ గురించి ఎలా అయినా తెలుసుకోవాలి అని ఈ సారి ఫాలో అవ్వడం కాదు ఏకంగా వారినే అడుగుదాం అని వారు వుంటున్న చోటుకి వెళ్ళింది.చూడడానికి ఆ చోటు చాలా ప్రశాంతంగా వాళ్ళు మొహాలు బాగా ప్రసన్నంగా వున్నాయి.అసలు వారు బిచ్చగాళ్లు అంటే ఎవరు నమ్మరు అలా వున్నారు వారు ముగ్గురు.ఆమెకి ఆశ్చర్యం వేసి వారితో మాట్లాడడం మొదలు పెట్టింది…

నమస్తే అండి నా పేరు వినీల.ఒక నెల రోజులుగా మిమ్మల్ని గమనిస్తున్నా,మీరు ఎవరు,చూస్తుంటే బిచ్చగాళ్ల లా అనిపించడం లేదు.ఇక్కడ పరిస్థితిని చూస్తే,బిచ్చమెత్తి బతకాల్సిన అవసరం లేదనిపిస్తోంది.. మీ గురించి తెల్సుకుందాం అని వచ్చానండి అన్నది ఎంతో వినయంగా ,ఆమె అంత సేపు మాట్లాడినా ఒక్కరూ పెదవి విప్పలేదు,కన్ను ఎత్తలేదు…మౌనంగా ఉండిపోయారు…చాలా సేపు ఆ అమ్మాయి అడిగి వెళ్ళిపోతూ…మీరేదో పనికోసం ఇలా చేస్తున్నారు అన్నది నాకు అర్ధం అవుతోంది..నేను మళ్ళీ రేపు వస్తా ,మీరు చెప్పే దాకా వస్తూనే వుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది…

ఆ అమ్మాయి వెళ్ళిపోయాక శేషగిరి మాట్లాడడం మొదలు పెట్టాడు.ఏంటి ఈ అమ్మాయి మనని గమినిస్తోందా నాకు ఇప్పటి దాకా తెలియలేదు…ఏమి చేద్దాం అన్నా ఇప్పుడు అంటూ కంగారుగా అడిగాడు,విజయలక్ష్మి అడగలేదు కానీ అంత కంగారు తన మొహంలోంచి తొంగి చూస్తోంది నారాయణ వైపు..అప్పుడు నారాయణ మెల్లగా ఆ అమ్మాయి మనల్ని గమనిస్తున్న విషయం నాకు ఒక వారం క్రితమే తెల్సు అని చెప్పాడు మెల్లగా…ఆ మాట విన్న మిగిలిన ఇద్దరు ఒక్కసారి అదిరిపడ్డారు.. అదేంటి అన్నా తెలిసి కూడా మాకు ఎందుకు చెప్పలేదు అని ఆదుర్దా గా అడిగాడు శేషం…మనము ఎవరు అనేది మన ముగ్గురికి తప్ప ఇంకా ఎవరికి తెలీదు..తెలియాల్సిన అవసరము ఏమి లేదు,మనం దేనికి ఇలా ఉన్నాం ఎవరికోసం చేస్తున్నాం అనేది దైవానికి ఎరుక ..ఇంతకు ముందు కూడా మనల్ని చాలా మంది అడిగారు ఇలా ,కానీ ఎవరూ మన ఇంటి దాకా వచ్చే ధైర్యం చెయ్యలేదు.. ఈ అమ్మాయి కూడా అందరి లాగానే అడిగి వదిలేస్తుందని ఊరుకున్నా కానీ ఇలా ఇంటికి ముందుకు వచ్చి ఆరా అడుగుతుందని అనుకోలేదు…ఇప్పుడంటే ఇంటికి దాకా వచ్చింది,ఆ అమ్మాయిని చూస్తుంటే మనల్ని అంత తేలికగా వదిలేసేలా లేదు నారాయణ గారు అని అనేసింది విజయ… అదే కదా నా భయం కూడా అని అన్నాడు శేషం…సరే లే రేపు వచ్చినప్పుడు చూద్దాంలే ఇప్పుడు ఐతే ప్రశాంతంగా పడుకోండి అన్నాడు నారాయణ… నిద్ర కళ్ళ మీదకి వచ్చినా మనసు మీదకు రాలేదు…అందరూ వారి గతం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు…..

ఎప్పుడు తెల్లారిందో మరి వెంకన్న దొర గోవింద నామాలు కూడా పూర్తి చేసుకున్నాడు..రోజూ లాగే గుడికి వెళ్లారు ముగ్గురు కానీ ఆలోచనలు అమ్మాయి అడిగిన ప్రశ్నల మీద గతం మిగిల్చిన అనుభవాల మీద టాస్ వేస్తూ ఉన్నాయి…ప్రస్తుతం లోకి వచ్చేసరికి అమ్మాయి వినీల ఎదురుగా నిల్చొని ఉంది… తనని చూసి చూడనట్టు వచ్చేసారు ముగ్గురు ,ఆమె అంత తేలికగా వదల్లేదు..వెంబడిస్తూ వెంట వచ్చింది..మళ్ళీ అంతా మౌనం…ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు ,మౌనాన్ని చేదిస్తూ విజయ మొదలెట్టింది నువ్వు ఎవరో మాకు తెలీదు ,మా గతంతో నీకు పని లేదు,మా భవిష్యత్తు తో నీకు ఉపయోగం లేదు అనవసరం గా నీ కాలాన్ని మా సహనాన్ని వృధా చెయ్యద్దు….అని నేలను చూస్తూ నేరుగా చెప్పింది….అయినా వినీల వెళ్ళలేదు..శేషం కోపంగా చెప్తే వినరు విజయా మాములు మాటలు ఎక్కవు మాములు జనాలకి అని అన్నాడు…నారాయణ మాత్రం ఏమి మాట్లాడడం లేదు..అమ్మాయిని చూస్తూ నిలబడి పోయాడు..వినీల విజయ చెయ్యి పట్టుకొని ఇలా అన్నది …ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి అంటే ముందు వాళ్ళ గతం తెలియాలి…గతాన్ని చూసుకుంటూనే భవిష్యత్తు ని ఆహ్వానిస్తారు ఎవరైనా…మీ భవిష్యత్తుతో మీకు అవసరం లేకపోవచ్చు కానీ మీ గతంతో నాకు పని ఉంది…చెప్పు తాతయ్యా ఎందుకు ఇంటి నుంచి వచ్చేశావ్..వీళ్లిద్దరూ ఎవరు,ఎందుకు గుడి ముందు బిచ్చగాడిలా వుంటున్నావు…ఆ మాటా వినేసరికి నారాయణ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు…శేషగిరి ఆశ్చర్యంలో వున్నాడు,విజయ స్తబ్దుగా నిలబడిపోయింది…..

తాతయ్య ఏంటమ్మా ,ఎవరు నువ్వు ,ఇల్లెంటి,తాతయ్య ఏంటి …ఎవర్ని చూసి ఎవరు అనుకుంటున్నావో నాకు ఎవరు లేరు,అన్నాడు భయపడుతూ…ఆ మాత్రం పోల్చుకోలేని దాన్ని కాను తాతయ్య మొన్న నిన్ను గుడిలో చూసాక ఇంటికి వెళ్లి పాత ఫోటులు అన్ని వెతికి చూసాను.. అక్కడ ఫొటోలో ఉన్నది ఇక్కడ నా ముందు ఉన్నది నువ్వే,చెప్పు అడుక్కోవాల్సిన ఖర్మ ఏమొచ్చింది నీకు ,వీళ్లు ఎవరు,అని గట్టిగా నిలదీసింది…ఆ మాటకి అందరూ ఒక్కసారి అదిరిపడ్డారు,నారాయణ కళ్ళ వెంట నీరు ఆగడం లేదు..అమ్మాయిని చూస్తూ ఉన్న చోటే కూల బడ్డాడు..వెంటనే శేషగిరి నారాయణను ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు అక్కడ డాక్టర్ సెలైన్ ఎక్కించి నారాయణను వార్డులో బెడ్ మీదకు షిఫ్ట్ చేశారు….

నారాయణ రావు మీ తాతగారా మాకు కూడా ఎప్పుడూ చెప్పలేదమ్మ..మాకు ఆయన పరిచయం అయ్యి రెండేళ్లు అవుతుంది..ఈమె పేరు విజయలక్ష్మి నా పేరు శేషగిరి…ఇంటి నుంచి బయటకు వచ్చి దిక్కు తోచక తిరుగుతుంటే నారాయణరావు గారు దేవుడిలా కనిపించారు మాకు..మా వివరాలు అడిగి చేరదీసి మాతోనే వుంటున్నారు,తనకి ఒక కుటుంబం ఉందని కానీ తను ఎవరని కానీ నేను ఎన్ని సార్లు అడిగినా చెప్పలేదు….అని ఆపాడు శేషగిరి…అదే కదా శేషగిరి గారు నేను కూడా అడిగేది ..మా నాయనమ్మ చనిపోయేంతవరకు మా దెగ్గరే వున్నారు అప్పటికి నాకు ఐదేళ్లు వుంటాయేమో…సడన్ గా ఏమైందో ఏమో ఇంటి నుంచి వెళ్లిపోయారు.. మా నాన్న ని అడిగితే చిన్నపిల్లవి నీకెందుకు అని మాట దాటేశారు..అది కనుక్కుందామనే మీ వెంట తిరుగుతూన్నా అని అన్నది…
తాతయ్య స్పృహలోకి వచ్చాక ఆయన గురించి అడుగుతాను కానీ ముందు మీ గురించి చెప్పండి మీరు ఎవరు ఇంటి నుంచి బయటకు ఎందుకు వచ్చారు ..అసలు కథ ఏంటి అని అడిగింది

శేషగిరి మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు…మాది కృష్ణ జిల్లా నందిగామ అనే ఊరు..ఉద్యోగరీత్యా నేను పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో ఒక చిన్న క్లర్క్ ని ..నా భార్య పేరు పద్మావతి..మాకు పెళ్ళై పదేళ్లు అయినా పిల్లలు లేరు..దానికి తోడుగా మా ఆవిడ అనారోగ్యంతో ఉంటుంది..ఎప్పుడు తల నొప్పి అంటూ ఉంటుంది..ఎంతో మంది డాక్టర్లకి చూపించాను ఎక్కడా ఫలితం లేకుండాపోయింది…ఒక రోజు అర్ధరాత్రి సడన్ గా ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకుంది,నోటి నుండి నురగ కారుతుంది అప్పుడు పరిస్థితి చూస్తే భయంకరంగా అనిపించింది.వెంటనే దెగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకు వెళ్ళాను..ఎంఆర్ఐ తీయించాలి అన్నారు..బుర్రలో ఎదో ప్రాబ్లెమ్ ఉంది అది స్కాన్ చేస్తే కానీ చెప్పలేం అన్నారు..చేతిలో చిల్లి గవ్వలేదు పిల్లలు ఉంటే కనీసం సేవింగ్స్ అన్నా చేసే వాళ్ళం..నెలాఖరున జేబులో డబ్బులు ఎండాకాలం లో.వర్షంలాగా ఉంటాయి..తెలిసిన వాళ్ళని చుట్టాలని అందర్నీ ఆర్ధిక సహాయం కోసం అడిగాను.సర్దుబాటు అయిన కొంత డబ్బుతో స్కానింగ్ వరకు తీయించాను.బుర్రలో ఒక భాగంలో నరం చిట్లి బ్లీడింగ్ అవుతోంది అందుకే తరచు తల నొప్పి అని తేల్చారు డాక్టర్లు… నయం అవ్వాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాను ..సుమారుగా పది లకారాలు అని చెప్పారు..మధ్య తరగతి మాములు మనిషికి లక్ష అంటేనే గుండెల్లో లక్ష రైళ్లు పరిగెత్తినట్టు అవుతుంది అలాంటివి పది అంటే జపాన్ బుల్లెట్ రైళ్లు తరుముతునట్టు అనిపిస్తుంది..జీవిత భాగస్వామిని కాపాడుకోవాలి అనే ఆశ డబ్బులు లేవనే బాధ..ఎవరికి చెప్పుకున్నా తరగదు. సిగ్గు విడిచి అభిమానం చంపుకుని మా భార్య తరపు వాళ్ళని అడగదామని వెళ్ళాను,మాది ప్రేమ వివాహము అవ్వడం మూలాన ఎవ్వరు నన్ను దెగ్గరకు కూడా రానివ్వలేదు పైగా నా వల్లనే పద్మకు రోగం వచ్చిందని,నన్ను కాకుండా వాళ్ళ బావ ని చేసుకొని ఉంటే హాయిగా ఉండేది అని నన్ను అవమానించారు..రోజు రోజుకు పద్మ ఆరోగ్యం క్షిణిస్తోంది.. నా మొహంలో బాధ కనిపించకుండా పద్మ దెగ్గర మాములుగా ఉండడానికి ప్రయత్నం చేసాను కానీ నిజమైన ప్రేమంటే భార్యాభర్తలది…మనం ఎలా వున్నా మనల్ని ప్రేమించిన వాళ్ళకి తెలిసిపోతుంది..పద్మ ఒకరోజు నాతో ఇలా అన్నది..ఎందుకండి అంత ప్రయాస పడతారు..అనవసరంగా మా వాళ్ళ దెగ్గరికి వెళ్లి మాటలు పడ్డారు…నాకు మీరు తప్ప ఏది ముఖ్యం కాదు..పిల్లలు ఉంటే వాళ్ళ మీద ప్రేమతో అయినా బ్రతకాలి అనిపించేది..ఇప్పుడు మంచాన పడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే బ్రతికుండి ఏమి లాభం అనిపిస్తోంది…మీతో వందేళ్లు ఉండాలని ప్రమాణం చేసాను పెళ్లి రోజు.ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా మిమ్మల్ని విడిచి వెళ్తున్నందుకు నా మీద నాకే ఒకరకంగా ఉంది..నన్ను బ్రతికించుకునే ప్రయత్నం లో మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు…నేను వున్నా లేకపోయినా మీరు ఒకే లా ఉండాలి ఎప్పుడు సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి అదే నా చివరి కోరిక ,మనకి డబ్బులేదనే కానీ ఇంక ఏమి తక్కువండి..సముద్రమంత మీ ప్రేమ చాలు నాకు .వచ్చే జన్మలో అయినా మీకు మంచి భార్యగా కలకాలం మీతో ఉండాలని కోరుకుంటాను అంటూ నా ఒళ్లో వాలిపోయింది…
కాలం ఎంత మాయ చేస్తుందంటే మనకి కావాల్సినప్పుడు ఆలస్యంగా ,అవసరంలేనప్పుడు అతివేగం గా సాగిపోతుంది.. నా బాధకే గొంతు ఉంటే దిక్కులు పిక్కటిల్లేలా అరిచే వాడిని..కానీ బాధ పడకూడదు అని మాట ఇచ్చాను నా పద్మకి అందుకే ఎలా వున్నా నవ్వుతూ నవ్విస్తూ ఉండడం అలవాటు చేసుకున్నా..పద్మ లేని ఇంట్లో నా కలలు లేవు అనిపించింది అందుకే రోడ్డున పడ్డాను.ఇదిగో ఇలా నారాయణ గారితో నా గోడు చెప్పుకొని ఆయన బాటలో నడుస్తున్నాను…..

శేషగిరి మాటలు విన్నాక అందరూ స్తబ్దుగా నిల్చుండి పోయారు.. అప్పటిదాకా శేషగిరి మీద గౌరవం మాత్రమే వుండే విజయకు ఆ క్షణం నుండి అతనంటే అభిమానం పెరిగింది..తన సొంత మనిషి లా తన తొడబుట్టిన వాడిలా అనిపించింది…అంతా నిశ్శబ్దం..ఎవర్రు మాట్లాడడం లేదు..ఎవరి శ్వాస వారికే వినిపించేంత నిశ్శబ్దంగా వుంది.. దాన్ని చేదిస్తూ మళ్ళీ శేషగిరి అందుకున్నాడు..ఏంటి అందరూ అలా అయిపోయారు..కధ వింటే బాగుందని చెప్పాలి..బాధ వింటే తగ్గిపోతుందని చెప్పాలి..గాధ వింటే గొప్పగా ఉందని చెప్పాలి ఈ మూడింటిలో నాది ఏది కాదు కాస్త ఎడబాటు నా గ్రహపాటు అని అన్నాడు నవ్వుతూ…ఆ మాటకి కళ్లలో నీళ్లు, పెదాల మీద నవ్వు ఒకేసారి వచ్చేసాయి విజయకి వినీల కి…

ఇంక మీరు చెప్పండి విజయ గారు ,మీరు ఎలా పరిచయం అయ్యారు వీళ్ళకి అని అన్నది వినీల..విజయ చెప్పడానికి కాస్త తటపటాయిస్తోంది..అది చూసి ఆమెది కూడా నా పరిచయం తో నే మొదలైంది తల్లి..నేను నందిగామ వదిలి బెజవాడ రైల్వేస్టేషన్ లో తిరుగుతున్నప్పుడు ఈమె నాకు కనిపించింది..ఎవరో ముగ్గురు కుర్ర వెధవలు ఈమె చుట్టూ చేరి అల్లరి పెడుతున్నారు..చుట్టూ వున్న వాళ్ళు వినోదం చూస్తుంటే నేను అడ్డుపడి వాళ్ళని వెళ్లగొట్టాను..ఈమె స్థితి చూస్తే ఇవిడదీ మన బాపతులగానే ఉందని అర్ధం అయ్యింది.. స్టేషన్ నుంచి బయటికి వచ్చి కాస్త ఇడ్లి తినిపించి వివరం కనుక్కున్నాను..అని ఆపాడు..అప్పుడు ఇంక విజయ చెప్పడం మొదలు పెట్టింది..

ఆ రోజు శేషగిరి ,నారాయణ గారు లేకుంటే ఈ రోజు నీ ముందు నేను నిలబడి ఇలా మాట్లాడే దాన్ని కాదు వినీల..మాది మందడం,గుంటూరు జిల్లా దెగ్గర చిన్న పల్లెటూరు.ఆ ఊళ్ళో ఉన్న ప్రాధమిక పాఠశాల టీచర్ ని నేను.నాకు ఒక కూతురు,మా వారు పిల్ల పుట్టిన ఏడాదికి కాలం చేశారు..అప్పటి నుంచి నా కూతురే నాకు సర్వస్వం..పేరు మంజుల.. నాకు వచ్చే జీతంతోనే ఇల్లు గడవడం నా కూతుర్ని పోషించడం చేసేదాన్ని .మాకు ఒక ఎకరం పొలం ఉండేది.దాన్ని కవులకు ఇచ్చి వచ్చే ధాన్యంతో తినేవాళ్ళం.పిల్ల పెద్దదైంది..ఖర్చులు పెరిగాయి.మగదిక్కు లేని సంసారం అంటే సదరు సమాజానికి ఆశ ఎక్కువ.అన్ని తట్టుకొని అమ్మాయిని ఎంఎస్సి చదివించాను..కాలేజి ప్లేస్మెంట్స్లో మంచి ఉద్యోగం కూడా వచ్చింది..గుజరాత్ రాష్ట్రంలో జాంనగర్ అనే ఊర్లో ఉద్యోగం..మంచి జీతం మంచి పొజిషన్.. అంత దూరం నిన్ను వదిలి వెళ్లాలిగా అమ్మ ,నువ్వు కూడా నాతో వచ్చేయి అని అన్నది.పర్లేదు తల్లి నాకు ఇక్కడ స్కూలు ఉంది ఇంకా సర్వీస్ ఉంది ఇంకో రెండేళ్లలో రిటైర్ అయ్యి నీ దెగ్గర కే వస్తాను గా అప్పటి దాకా పండగలకి పబ్బాలకి కలుస్తూ ఉంటాము కదా అని సర్ది చెప్పి ప్రయాణానికి సిద్ధం చేసాను..తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందన్నట్టు..ఉద్యోగం కొత్తల్లో బాగానే మాట్లాడేది అడపాదడపా వస్తూ ఉండేది..వచ్చినప్పుడల్లా నన్ను తనతో రమ్మని గొడవ చేస్తూ ఉండేది..అప్పుడు వెళ్లినా పోయేది..ప్రారబ్దం కాకపోతే మనకి మంచి ఎప్పుడు ముందుగా తట్టదు… కొన్నాళ్ళకి అసలు ఫోన్లు చెయ్యడమే మానేసింది..నాకు అనుమానం వచ్చి వాళ్ళ colleagues ని అడిగాను …వాళ్లు కూడా నాతో ఏమి చెప్పలేదు… లాభం లేదని నేనె అడ్రస్ తీసుకొని తను వుండే దెగ్గరకు వెళ్ళాను…నన్ను చూసి ఆనంద పడుతుంది అనుకుంటే ఎందుకు వచ్చావు అంటూ కసురుకుంది… చిన్న పిల్ల అనుకున్నాను…నాతో కంటే ఫోన్లో ఎక్కువ మాట్లాడుతోంది…అనుమానం వచ్చి ఎవరు అని అడిగాను..పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ ఆలోచనల్ని కనలేం కదా..ఎవరు లేరు లే ఆఫీస్ విషయాలు అని చెప్పి మాట దాటేసింది…ఒకరోజు ఏడుస్తూ రూమ్ కి వచ్చింది ఏంటని ఎంత అడిగినా చెప్పలేదు..చివరికి మెల్లగా సర్ది చెప్పాను సమస్య ఎలాంటిదైన ముందు మనకంటూ ఒక ఆలోచన ఉండాలి…నా అనుకున్న వాళ్ళతో చెప్పుకుంటే పరిష్కారం వస్తుందని నమ్మకం ఉండాలి.ఏంటో చెప్పు ఏమైనా నేను చూసుకుంటా అని చెప్పాను..అప్పుడు చెప్పడం మొదలు పెట్టింది.రవి అని వాళ్ళ ఆఫీసులో తన తో పాటు పని చేసే ఒక అబ్బాయిని ఇష్టపడుతునట్టు చెప్పింది.. నీకు చెప్తే తిడతావు ఏమో అని నీతో కోపంగా మాట్లాడాను.. నువ్వు ఏమి అంటావు తెలియక నీతో ఉక్రోషంగా ప్రవర్తించాను అని ఏడుస్తూ చెప్పింది… సరే ఈ మాత్రం దానికే ఇంత ఏడవాలా ఇప్పుడు ఏమైంది..రవి ని పెళ్లి చేసుకోవాలి దానికి నేను ఒప్పుకోవాలి..అంతే నా అన్నాను..అంతే కాని ఇక్కడ ఇంకో సమస్య వచ్చిందమ్మ రవిని కంపెనీ వాళ్ళు అమెరికా పంపిస్తున్నారు ఎదో ప్రాజెక్ట్ కోసం 3 ఏళ్ళు పడుతుందట,అంతా సిద్ధం అయ్యాక అప్పుడు చెప్తున్నాడు..సరే పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా అతనితో వెళ్లచ్చు కదా అన్నాను…లేదు వచ్చాక పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అని పెద్దగా ఏడ్చింది. సరే నాన్న రేపు రవిని ఇంటికి పిలు నేను మాట్లాడతాను,వాళ్ళ పెద్ద వాళ్లతో ఫోన్లో మాట్లాడదాం అన్నాను.మరుసటి రోజు రవి ఇంటికి వచ్చాడు నేను అతనితో మాట్లాడాను…మంజు అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ కానీ ఇప్పుడే పెళ్లి చేసుకొని అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియకుండా నేను తనని ఇబ్బంది పెట్టలేను ముందు నేను వెళ్లి అక్కడ స్థితి గతి చూసుకొని వచ్చాక చేసుకుంటాను అని చెప్పాడు వినయంగా ,ఆ అబ్బాయి చెప్పిన దానిలో కూడా నిజం లేకపోలేదు..చాలా బాధ్యత గా వున్నాడు అనిపించింది.మరి మీ వాళ్ళు ఏమంటారో అని అడిగాను.వాళ్ళకి కూడా మంజు సంగతి చెప్పాను ఆంటి వాళ్లకు ఎలాంటి అభ్యంతరం లేదు ,మంజు ను మా వాళ్ళు నా కన్నా ఎక్కువ గా అభిమానిస్తారు.. అని చెప్పాడు.అతని మాటలకి నాకు ధైర్యం వచ్చింది….అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసాము…..

తర్వాత కొన్ని రోజులకి మంజు నుంచి ఫోన్ వచ్చింది రవి లేకుండా ఆఫీసులో పని చెయ్యలేకపోతున్నా అంటూ ఏడుస్తూ చెప్పింది.. ఫోన్లు మాట్లాడచ్చు కదా నానా అని సర్ది చెప్పాను.లేదమ్మా ఇక్కడ పగలు ఐతే అక్కడ రాత్రి కదా పని ఒత్తిడి వల్ల రవి కూడా సరిగా మాట్లాడడం లేదు,నేను ఇక్కడ వుండలేకపోతున్నా అని చెప్పింది. సరే వుండలేకపోతే ఇంటికి వచ్చేయి మనకి ఉన్నదానిలో తిందాము, ఇప్పుడు ఏమైంది అని బుజ్జగించాను… తర్వాత వారానికి మంజు ఉద్యోగం వదిలేసి వచ్చేసింది.వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తూ కూర్చునేది..రవి వస్తాడు లే అంత ఆలోచించకు అని చెప్పేదాన్ని..కానీ ఒక రోజు రాత్రి తల అంత నొప్పి అంటూ పెద్దగా అరవడం మొదలు పెట్టింది..నాకు కాలు చెయ్యి ఆడలేదు..ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు…మందడం లో ప్రాధమిక ఆసుపత్రి తప్ప పెద్దాసుపత్రి లేదు…పెద్ద ఆసుపత్రి కి వెళ్లాలంటే గుంటూరు వెళ్ళాలి అంత రాత్రి పూట ఇద్దరు ఆడవాళ్లు ఊరు దాటడం అంటే అది కూడా పిల్ల ని ఆ స్థితిలో ……చుట్టు పక్కన వాళ్ళ సహాయంతో గుంటూరు వచ్చాము..డ్యూటీ డాక్టర్ రౌండ్స్ లో వున్నాడు వచ్చకా చూస్తాడంటూ నిర్లక్ష్యంగా చెప్పింది అక్కడ ఉన్న నర్స్ ఒకతి… అరగంట అయ్యాక డాక్టర్ వచ్చాడు…చూసి స్కానింగ్ తీయాలి అన్నాడు..వెంటనే చేయించాను…మెదడులో ఒక మూల రక్తకణాలన్ని బ్లాక్ అయ్యాయి అని చెప్పారు… సరి చెయ్యాలి అంటే ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పాడు.వెంటనే చెయ్యమని చెప్పాను..15 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు…సిద్ధం చెయ్యండి నేను డబ్బులు తీసుకు వస్తా అంటూ పిల్లని ఆసుపత్రిలో చేర్పించి పొలం అమ్మకానికి పెట్టాను…కవులు చేసుకునే రైతులకే అమ్మేసి డబ్బులు తీసుకు వచ్చాను..ఆపరేషన్ చేసే ముందు రోజు డాక్టర్ నన్ను పిలిచి చూడండి ఇప్పుడు ఆపరేషన్ చేస్తాము కానీ మళ్ళీ రావు అని గ్యారెంటీ గా చెప్పలేము..మళ్ళీ ఏడాదికి అయినా రావచ్చు,ఎందుకంటే మీ అమ్మాయికి ఇమ్మ్యూనిటి లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి ,కొద్దిగా స్ట్రెయిన్ అయినా మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉందని చెప్పాడు… నాకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు.. ఇప్పటికైతే చెయ్యండి పిల్ల కళ్ళ ముందు ఉంటుంది కదా అని చెప్పాను..ఆపరేషన్ జరిగింది..మంజు అంతకు ముందులా లేదు చూస్తుంటే నాకే బాధ వేసింది అంత నొప్పి పిచ్చి తల్లి ఎలా భరించిందో.. ఇక్కడికి వచ్చాక తలనొప్పి అన్నదా లేక అక్కడ జామనగర్ లో ఉన్నప్పటి నుంచే ఉన్నదా అనుకోని మంజు వాళ్ళ రూమేట్ హేమ అని ఆ అమ్మాయికి కాల్ చేసాను ,అప్పుడు తెలిసింది అసలు విషయం రవి వెళ్ళిపోయాక మంజు మాతో కూడా సరిగా మాట్లాడేది కాదు ఆంటీ ఎప్పుడు ఎదో పోగొట్టుకున్న దానిలా కూర్చొని ఉండేది ఒక రాత్రి వేళ లేచి తలనొప్పి అని ఏడ్చేది..ఏమిటి ఎందుకు అం అడిగితే చెప్పేది కాదు పోనీ డాక్టర్ దెగ్గరకు వెళ్దాం అంటే వచ్చేది కాదు ఎప్పుడు రవి గురించే ఆలోచిస్తూ ఉండేది అని చెప్పింది..అప్పుడు అర్ధం అయ్యింది నాకు బుర్రలో రోగానికి కారణం..ఏదైనా మనది అనుకుంటే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము అది మన దెగ్గర వున్నా దూరంగా ఉన్న అసలు ఆలోచనలు మాత్రం ఎగిరిపోవు..కావాల్సింది దక్కకుండా దూరం అవుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నేను నా తోడు పోయినప్పుడు అనుభవించాను ఇప్పుడు ఇలా నా బిడ్డ అనుభవిస్తుంటే చూస్తూ తట్టుకోలేకపోయాను….మంజుని ఇంటికి తీసుకు వెళ్లచ్చు అని చెప్పారు..దేవుడి దయ ఉంది అనుకోని ఇంటికి తీసుకు వచ్చాను ..డాక్టర్ ఇచ్చిన మందులతో ఒక సంవత్సరం బాగానే వుంది..అంత నయమైనది అనుకున్నాను…గుంటూరు ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేస్తాను ఇంట్లో బోర్ కొడుతోంది అంటే సరే అన్నాను..రవి ధ్యాస మీద నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది అనుకున్నాను…అంతా బాగానే వుంది అనుకుంటున్న సమయం లో ఒక రోజు ఇంటికి వస్తూనే నీరసంగా వుందమ్మా అంటూ మంచం మీద పడిపోయింది..ప్రయాణ బడలిక వల్ల అలా ఉన్నదేమో అనుకుని పండ్ల రసం తీసి ఇచ్చాను..కొన్ని రోజులకి కుడి చెయ్ పట్టు కోల్పోయిందమ్మా బోర్డ్ పైన ఏమి వ్రాయలేకపోతున్నా అని చెప్పింది,ఒంట్లో ఓపిక లేక అనుకున్నాను..కొన్ని రోజులకి కాలు తడబడడం గమనించాను.ఏంటి ఇట్లా నడుస్తోంది అని అనుకున్నాను…ఒక్కసారిగా నడుస్తున్నది కాస్తా పట్టు కోల్పోయి నేల మీద కుప్పకూలిపోయింది….భయం వేసి వెంటనే బండి కట్టుకొని గుంటూరు పెద్దాసుపత్రికి తీసుకు వెళ్ళాను…స్కానింగ్ ఇప్పుడు ఇక్కడ లేదని వేరే చోటుకు మార్చారని తెల్సి అక్కడి నుంచి స్కానింగ్ కి వెళ్ళాము అది వచ్చే సరికి రెండు గంటలు పట్టింది….రిపోర్టులు అన్ని చూసి డాక్టర్ ఇందులో సరిగా తెలియడం లేదు బెజవాడ లో మంచి స్కానింగ్ యూనిట్ ఉంది అక్కడ తీయించి తీసుకు రండి నేను సిఫార్సు చేస్తాను అని చెప్పాడు..పరుగు పరుగున బెజవాడ వెళ్ళాము ,వెళ్లే సరికి చీకటి పడింది ,ఇప్పుడు తియ్యడం కుదరదు మళ్ళీ తెల్లారి రమ్మని చెప్పారు…అప్పటికే మంజు స్థితి చాలా బాధాకరంగా ఉంది..మరుసటి రోజు వరుకు ఆగి రిపోర్ట్ తీసుకొని వచ్చాను…అది చూసి రోగం చాలా అడ్వాన్స్ స్టేజి లో ఉందని ఆపరేషన్ చెయ్యడానికి మంజు శారీరకంగా సహకరించే శక్తి కోల్పోయిందని రేడియేషన్ ద్వారా నయమయ్యే మార్గం ఉందని చెప్పాడు….ఖర్చు గురించి అడిగాను…5 లకారం అవుతుందని చెప్పారు..వెంటనే హాస్పిటల్ లో చేర్పించి …ఇంటికి వచ్చాను ఇప్పుడు అంత డబ్బంటే ఎలా సర్దుబాటు చెయ్యాలో అర్ధం కాలేదు.. నా అనుకున్న వాళ్ళు ఎవరు నాకు లేరు…. స్కూల్ హెడ్ మాస్టర్ కి ఫోన్ చేసాను..వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కొంత డబ్బు వస్తుందని సలహా చెప్పారు…సర్వం అనుకున్న కూతురు కన్నా సర్వీస్ ఎక్కువ కాదు అని విఆర్ఎస్ కి అప్లై చేసాను…మాస్టర్ దయ వల్ల పని అంత ఒక వారం లో అయిపోయింది….. మంజుకి రోజు రేడియేషన్ పెడుతున్నారు…ఎప్పుడు జుట్టు చూసి మురిసిపోయేది.. ఇప్పుడు వేడి దెబ్బకి తల పై ఒక్క వెంట్రుక ముక్క కూడా లేకుండా మంచం మీద అలా ఉన్న నా చిట్టి తల్లిని చూస్తుంటే గుండె తరుక్కుపోయింది….జరుగుతున్నది అంతా రవి కి ఫోన్ చేసి ఎప్పటికపుడు చెప్తూ వుండే దాన్ని ఆ అబ్బాయి కూడా పాపం చాలా సహాయం చేసాడు..నేను డబ్బులు కోసం తిరుగుతున్నప్పుడు రవి అమ్మగారు మంజు దెగ్గర ఉండి చూసుకునేది… వాళ్ళ మేలు ఎప్పటికి మర్చిపోలేను…రేడియేషన్ కోర్స్ అయిపోయింది ఇంక టాబ్లెట్స్ మీద బ్రతకాల్సిందే అని చెప్పి మంజు ని డిశ్చార్జ్ చేశారు..ఇంటికి వచ్చాము..

ఇంటికి వచ్చినప్పటి నుంచి మంజు ఆరోగ్యం ఇంకా క్షిణించసాగింది….టాబ్లెట్స్ వాడను,ఎక్కడో గుహల్లో ఆయుర్వేద మందులు ఇస్తారు అంటే అవి వాడి చూసాను.అయినా ఫలితం లేకపోయింది… ఎప్పుడు రవి రవి అని కలవరిస్తూ ఉండేది..తట్టుకోలేక వాళ్ళ అమ్మ నాన్నతో రవికి కబురు పెట్టాను…. అన్ని కుదిరి రావడానికి రవికి నాలుగు రోజులు పట్టింది..రావడమే మా ఇంటికి వచ్చేసాడు..వస్తూనే మంజు దెగ్గరికి వెళ్ళాడు….మంజుని ఆ స్థితిలో చూసి ఆశ్చర్యపోయాడు…గుండెలో ప్రేమ కళ్ళలో కనిపిస్తుందంటారు..రవి పిలుపుకు ఒక్కసారిగా లేచింది మంజు…రవి కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. రవి గట్టిగా హత్తుకున్నాడు…అంతే రవిని చూస్తూ అతని గుండెల మీద వాలిపోయింది…కన్న కలలు కట్టుకున్న ఆశలు అన్ని గాల్లో కలిసిపోయాయి…. అంతా నిశ్శబ్దం….రవి కళ్ళు సూర్యుడి కంటే ఎర్రగా అయిపోయాయి……ఎలాంటి సంబంధం లేకపోయినా ప్రేమించిన పాపానికి అంత్యక్రియలు అన్ని రవి దెగ్గరుండి చేసాడు…..అంతా పది రోజుల్లో అయిపోయింది
నా సర్వసం అనుకున్నది నాశనం అయిపోయింది
నా ప్రాణం అనుకున్నది ఒంటరి చేసి వెళ్ళిపోయింది
నా కన్నీరు కూడా కాటికే అంకితమైపోయింది…
మంజు లేని ఇల్లు నాకు స్మశానం లా తోచింది
ఎవరు లేని జీవితం వృధా అనిపించింది
గమ్యం లేని గమనం మొదలు పెట్టాను
ఏ తీరం చేరాలనో ఈ పయనం అనుకుంటూ సాగాను
చాలా సార్లు నా మంజు దెగ్గరకే నేను కూడా వెళ్ళాలి అంటూ ఆత్మ హత్య ప్రయత్నాలు చేసాను,బెజవాడ రైల్వేస్టేషన్ చేరుకున్నాను,ఏదొక రైలు కింద పడి చద్దామనుకున్నాను…కానీ కుదరలేదు,అప్పుడే శేషగిరి నన్ను అల్లరి చేస్తున్న వాళ్ళని చెదరగొట్టి నన్ను కాపాడాడు..పేగు తెంచుకు పుట్టినప్పుడు నొప్పి వున్నా సహించాను కానీ కన్న పేగు కళ్ళ ముందు దూరం అయ్యేసరికి తట్టుకోలేకపోయాను…ఇదిగో ఇలా నారాయణ రావుగారి దయ వల్ల ఇంకా బ్రతికి వున్నాను…..

ఎప్పుడు స్పృహ వచ్చిందో తెలీదు కానీ నారాయణ రావు అంతా వింటూనే వున్నాడు…..మంచం పక్కనే ఉన్న వినీల చేతిని పట్టుకున్నాడు…. ఆ స్పర్శకి వినీల వెంటనే నారాయణరావు పక్కన కూర్చుంది….ఏలా ఉంది తాతయ్య ఇప్పుడు అని అడిగింది మెల్లగా….బాగానే వుందన్నట్టు తలవూపాడు…. శేషం ఎక్కడ అని అడిగాడు…నేను ఇక్కడే వున్నా మాస్టరు…. మీరు లేస్తారా లెవరా అని టీవీ9 కి డిబేట్ కి వెళదాం అనుకుంటున్న ఇదుగో ఇప్పుడే లేచావు నువ్వు..చ్చా నేను పాపులర్ అయ్యే ఛాన్స్ మిస్ చేశావ్ అన్నా అన్నాడు…ఆ మాటకి అందరూ నవ్వారు…..

డాక్టర్ వచ్చి నారాయణ ని చూసి మందులు వ్రాసి ఇచ్చాడు….ఇంటికి తీసుకు వెళ్లచ్చు అని చెప్పాడు..వినీల రా తాతయ్య మన ఇంటికి వెళ్దాం అన్నది…ఆ ఇంటికి నేను రాలేను తల్లి అన్నాడు గట్టిగా, నాన్నతో నేను మాట్లాడతాను తాతయ్య అన్నది అమాయకంగా…మీ నాన్న వినేవాడు ఐతే నేను ఇలా ఎందుకు ఉంటాను పిచ్చి తల్లి…వాడు కొడుకు కాదమ్మా కనీసం తలకొరివి కూడా పెట్టని కొయ్య అమ్మా వాడు….ఆ మాటకి వినీల ఒక్కసారిగా ఉలిక్కిపడింది…ఎంతో గారభంగా చూసే నాన్న గురించి ఇలా చెప్తున్నాడు ఏంటి అనిపించింది.. నాన్న నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు తాతయ్యా…నేను ఏమి అడిగినా కాదనరు…. కన్న కూతురు వి కాబట్టి అలా చూస్తాడు తల్లి… కన్న తల్లి అయ్యి ఉంటే అప్పుడు తెలిసేది నీకు మా బాధా.అసలు ఏమి.జరిగింది తాతయ్య ఎందుకు నాన్న అంటే అంత కోపం నీకు…అని అడిగింది

శేషగిరి కి డబ్బు లేదు..అందకే అతని భార్యని కాపాడుకోలేకపోయాడు…విజయకి నా అనే వారు లేరు ఖర్చు పెట్టినా కన్న కూతురుని పోగొట్టుకుంది.. కానీ నేను డబ్బు ఉండి సమయం ఉండి నా అనే వారు అందరూ ఉండి నా జీవితాన్ని సంపూర్ణం చేసుకోలేకపోయాను..నా శారదని పోగొట్టుకున్నాను….అంతటికీ కారణం మీ నాన్నే…
ఒక్కగాను ఒక్క కొడుకు ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసాను..అడుగు కందకుండా పువ్వులా చూసుకున్నాను.ఆడిగిందల్లా అరచేతిలో పెట్టాను….అంగరంగ వైభవంగా ప్రేమించిన పిల్లనిచ్చి పెళ్లి చేసాను….ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న హోదాలు ,వైభోగాలు అన్ని నేను సంపాదించి ఇచ్చినవే….రేసులు క్లబ్బులు అంటూ మీ నాన్న వున్నా ఆస్తి తగలేస్తున్నాడు అని తెలిసి మందలించాను… వ్యాపారం చూసుకోకుండా డబ్బు తగలేస్తే ఇక మీద పైసా ఇచ్చేది లేదని ససేమిరా చెప్పాను….ఆస్తి మొత్తం నా శారద పేరున వ్రాసాను..
అది తట్టుకోలేకపోయారు మీ అమ్మా నాన్నా..ముసలి దానికి ఆస్తి అవసరమా అంటూ నాతో గొడవ పడ్డారు…మీరు సరిగా ఉంటే మీకే చెందుతుంది లేదంటే ఆస్తి మొత్తం అనాధ శరణాలయం కి వ్రాస్తాను అని హెచ్చరించాను….

నేను లేని సమయం చూసి శారదని బెదిరించి ఆస్తి వాళ్ళ పేరు మీద వ్రాయించుకోవాలి అనుకున్నారు.బలవంతంగా సంతకం చేయించుకున్నారు..నేను అడ్డు పడేసరికి పెద్ద గొడవ చేశారు ఆ సంఘర్షణ లో శారద అదుపు తప్పి తలుపుకి గుద్దుకుంది… తలుపుకున్న కొక్కెం శారద తలకి బలంగా తగిలింది….ఒకటే రక్తం వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాను..దెబ్బ లోతుగా తగిలింది ….స్కానింగ్ చేయించమని చెప్పాడు డాక్టర్ ….రిపోర్ట్ చూసి బాగా లోతుగా తగిలింది..దాని వలన మెదడులో కొన్ని భాగాలు పని చేయడం ఆగిపోతాయని చెప్పాడు…అంటే ఏంటో అర్థంకాక వివరంగా చెప్పమని అడిగాను…మెదడు కొన్ని సిగ్నల్స్ మనం రోజూ చేసే పనులకు ఇస్తూ ఉంటుంది..అందులో చెప్పాలి అంటే స్పర్శ ఒకటి,వేడి తగిలితే వెంటనే చెయ్యి వెనక్కి తీసేస్తాం… ఆలోచన ఒకటి …ఏమి చేస్తున్నాము,ఎందుకు చేస్తున్నాము అనే విచక్షణా జ్ఞానం ఇలాంటివి ఆవిడ మెల్లగా కోల్పోతారు అని చెప్పాడు….ఆపరేషన్ చేసి సరి చెయ్యచ్చు ఏమో అని అడిగాను..ఆపరేషన్ కి రేడియేషన్ కి తట్టుకునే వయసు కాదు అవిడది మందులతో మాత్రమే నయం అయ్యే అవకాశం ఉంది అన్నట్టు చెప్పారు ….చేసేది ఏమి లేక ఇంటికి తీసుకు వచ్చాను….వచ్చేసరికి మా సామాను బయటపడేసి ఉన్నాయి….కన్న తల్లి తండ్రులు అన్న కనికరం కూడా లేకుండా బయటికి తరిమేశారు…శారదని తీసుకుని బయటికి వచ్చాను…

ఆస్తి అన్యాయంగా లాక్కున్నందుకు కోర్టులో కేసు వేసాను…రోజు గడవడానికి ఒక కార్ షెడ్డులో మెకానిక్ గా చేరాను…నేను పెట్టుకున్న లాయర్ని కూడా మీ నాన్న కొనేసి కేసు వాడికి అనుకూలంగా తిప్పుకున్నాడు…శారద ఆరోగ్యం రోజుకి ఒక పరీక్ష పెట్టింది..ఒక రోజుకి స్పర్శ పోయింది…ఇంకో రోజుకి కాళ్ళు చేతులు పని చేయడం మానేసాయి..ఇంకో రోజుకి తిండి లోపలికి వెళ్లడం ఆగిపోయింది…మాట పోయే ముందు రోజు నన్ను దెగ్గరికి పిలిచి అబ్బాయిని చూడలనివుంది ఒక్కసారి పిలుస్తారు కాదు అన్నది….అభిమానం చంపుకుని మీ నాన్న దెగ్గరకు వెళ్లి ప్రాధేయపడ్డాను..బ్రతిమిలాడాను..చివరకి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాను.అయినా వాడి మనసు కొంచెం కూడా కరగలేదు…అవసరానికి అమ్మని కూడా అమ్ముకునే వాడికి పేగు బంధం విలువ ఎలా తెలుస్తుంది..పాపం పిచ్చింది మీ బామ్మా ఇంకా వాడు వస్తాడు అనుకుంటూనే ఉండేది…చివరికి నోరు చూపు కూడా కోల్పోయింది… కానీ ఆలోచనలు అన్నీ కన్న కొడుకు మీద నే తిరుగుతూ ఉన్నాయి…బుర్రకు తెలుసు రోగం ఉందని కానీ గుండెకి తెలీదు రోగం వచ్చిందని అందకే కన్నవారి కోసం కొట్టుకుంటూ ఉంటుంది.
అందుకే పోయే ముందు వరుకు వాడినే తలచుకుంటూ పోయింది…శారద లేని జీవితం వృధా అనుకున్నాను…చేస్తున్న పని వదిలేసి ఉంటున్న చోటు వదిలేసి లోకాన పడ్డాను..ఏమి చెయ్యాలో తెలీదు ఎందుకు బ్రతుకున్నానో తెలీదు…బ్రతికే ధైర్యం లేక చావు రాక నరకం అనుభవించాను…..

ఒకసారి ఒక రోడ్డు సిగ్నల్ దెగ్గర ఒక అడుక్కునే వాడిని చూసాను..వాడికి వయసు పదహారేళ్ళ …అన్నీ బాగున్నాయి కానీ అడుక్కుంటున్నాడు.. ఎందుకో అర్ధం కాలేదు…రోజంతా వాడినే గమనిస్తూ వున్నాను..సాయంత్రం వెళ్లే సమయానికి వాడి దెగ్గరకు వెళ్లి విషయం ఆరా తీసాను…మొదట పోలీసు అనుకోని భయపడ్డాడు..నా వేషం చూసి స్థిమిత పడ్డాడు..ఏంటి విషయం ఎందుకు అడుక్కుంటున్నావు అని అడిగాను…
నెమ్మదిగా చెప్పడం మొదలు పెట్టాడు…నా పేరు చరణ్ రాజ్ సార్ ,ఇంటర్ వరకు చదువుకున్నాను…నేను ఇంటర్లో ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు ..మా అమ్మ ,నేను పుట్టినప్పుడే చనిపోయింది.అప్పటి నుంచి మా నాన్నే నాకు అన్నీ కానీ కాలం ఎవర్ని వదలదు సార్..ఎవరు ఎలా వున్నా పెద్ద వాళ్ళైనా చిన్న వాళ్ళైనా ఎవరైనా తన కసి చూపించి మనలో కసి పెంచుతుంది….నాకు ఇంటర్లో 95 శాతం వచ్చాయి సార్..కానీ ఏం చేస్తాం సంపాదించే నాన్న లేరు… బాగోగులు చూసుకునే అమ్మ లేదు,చదువుకునే ఆశ చావలేదు.. అందుకే పొద్దునంత ఇలా అడుక్కుంటా రాత్రి అంతా అడుక్కోగా వచ్చిన డబ్బులతో పుస్తకాలు కొని చదువుకుంటా…ఇదే పని గౌరవంగా ఏదైనా పని చేస్తూ చదువుకొవ్వొచ్చుగా అని అన్నాను…

ఎక్కడ వున్నారు సార్ మీరు ఇంకా ,మెరిట్ స్టూడెంట్స్ కి పిలిచి విద్య నేర్పే రోజులు పోయి.మెరిట్ లేకుండా రిజర్వేషన్లు చేసుకొని మరి చదువు కొనే రోజులు వచ్చాయి సార్…చేసే పనిలో గౌరవం ఉందని అనుకుంటాం సార్ కానీ పని చేసే వాళ్ళకన్న పని చేస్తున్నట్టు నటించే వాళ్ళకే ఎక్కువ గౌరవం ఉంటుంది సార్..అందుకే అవి అన్ని చూసి చిరాకు వచ్చి ఇలా అభిమానం వదులుకొని అడుక్కుంటున్నాను…అలా అని ఇంత కావాలి అని అడగను సార్ ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను…విధి ఏమి ఇచ్చినా తీసుకుంటాం కదా సార్..ఈ ప్రపంచంలో ప్రతి వాడు బిచ్చగాడే సార్ కాకపోతే ఒకొక్కడు వాడి అవసరాన్ని బట్టి అడుక్కుంటు ఉంటాడు…కన్న వాళ్ళు లేరని కట్టుకున్న వాళ్ళు పోయారని కలలు వీడకూడదు సార్..ఎలా అయినా బ్రతకాలి బ్రతికి అనుకున్నది సాధించాలి….

ఆ అబ్బాయి మాటలు నా మీద ఎంతో ప్రభావం చూపాయి…ఒక గుడి బయట కూర్చొని ఎదో ఆలోచిస్తూ వున్నాను…గుడి నుంచి వచ్చే భక్తుడు ఒకడు ఒక రూపాయి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు… ఆ క్షణం నిర్ణయం తీసుకున్నాను..బ్రతికి సాధించాలి అని…చిన్నప్పటి నుంచి ఒక కల ఉండేది నాకు..ఎంతో మంది కాన్సర్ బాధితులు సరైన వైద్యం లేక సరైన సహాయం లేక చనిపోతున్నారు…వాళ్ళకి ఒక కాన్సర్ యూనిట్ అన్ని రకాల వైద్య సదుపాయాలతో నిర్మించాలి అనుకున్నాను..పట్టుదల తో రియల్ ఎస్టేట్ లో డబ్బు సంపాదించాను… కాన్సర్ యూనిట్ కోసం అన్ని ప్లాన్లు వేసుకున్నాను..అంత సిద్ధం చేసుకున్నాను.. ఈలోగా ఇలా మీ నాన్న వలన ఇలా అయ్యాను.అయినా నా కలను వదులుకోలేదు..ఆ అబ్బాయి ఇచ్చిన స్పూర్తితో ఇప్పటికి కష్టపడుతూనే వున్నాను…నాకు తోడుగా శేషం విజయ కలిశారు…నా లానే అయిన వారిని పోగొట్టుకొని బాధ పడ్తూ ఉంటే ధైర్యం చెప్పి కలను సాధించాలి అని చెప్పాను..ఇద్దరు నా బాటలో నడవడానికి సిద్ద పడ్డారు…ఇప్పటి దాకా ముగ్గురు కలిసి దాచిన సొమ్ము 5లక్షలు అయ్యింది…కానీ సరిపోదు ఇంకా కావాలి ,పర్లేదు కష్ట పడతాం,కష్టం తెలిసిన వాడికి నష్టంతో పనిలేదు..ఎన్ని అడ్డంకులు వచ్చిన అనుకున్నది సాధిస్తాం…ఖచ్చితంగా కాన్సర్ యూనిట్ కట్టి తీరుతాం……

కానీ ……అని ఆపాడు….ఏమైంది తాతయ్య ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మీ అందరిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది…నాకు కూడా మీతో కలిసి నడవాలని ఉంది….నేను కూడా మెడిసిన్ చేసాను…ms కోసం us వెళ్ళాలి అనుకున్నాను వీసా ప్రాబ్లెమ్ వచ్చి ఆగిపోయాను..ఇంక వెళ్ళను.. మీతో నే ఉంటాను నా స్నేహితులతో కూడా కలిసి మీకు సహాయం గా ఉంటాను….మీరు ఎందుకు ఆగిపోయారు అది నాకు తెలియాలి…

ఏముంది వినీల ప్రపంచం లో చెడు చెయ్య కుండా ఉండడానికి శూరిటీ అవసరంలేదు కానీ మంచి చెయ్యాలి అనుకునప్పుడే రూల్స్ రేగులాషన్స్ అంటూ అన్ని అడ్డు వస్తాయి అన్నాడు శేషగిరి…మేము ప్రతి రెండో బుధవారం వెళ్ళేది బ్యాంకు కి ఎంత డబ్బు వున్నా మొత్తం సొంతంగా కట్టలేం అందుకే బ్యాంక్ లోన్ కోసం అప్లై చేసాం..శూరిటీ ఏమి ఇస్తారు అని అడిగారు…దానికి వెనక్కిరాక తప్పలేదు…నా పొలం నా కూతురి కోసం అమ్మాను లేదంటే అదే పెట్టేసే దాన్ని అన్నది విజయ..నాకంటూ ఏమి లేదమ్మా ఉన్న ఒక్క ఇల్లు లాక్కుని తరిమేశారు మా వాళ్ళు…ఉండుంటే ఇంత మంచి పనికి తప్పకుండా దాన్నే అడ్డు పెట్టె వాడిని…

మీరెవరు దాని గురించి బాధ పడకండి,ఆ సంగతి నేను చూసుకుంటా అన్నది..ఆ మాటకి నారాయణ ఒక్కసారి లేచి అంత శూరిటీ నికేక్కడి తల్లి అన్నాడు…నా ప్రతి పుట్టిన రోజుకు నాన్న నా పేరు మీద ఒక ప్రాపర్టీ కొంటు ఉంటారూ అవి నా చేతికి ఇచ్చి ఉంచమని చెప్తాడు…వాటిల్లో ఒకటి పెట్టి లోన్ తీసుకుందాం సింపుల్ అంది …మీ నాన్నకు తెలిస్తే ఊరుకుంటాడు అనుకుంటున్నవా పెద్ద గొడవ చేస్తాడు…అసలు నన్ను కలిసావు అని తెలిస్తేనే నిన్ను ఊరుకోడు అలాంటిది అంత విలువ గల ఆస్తి ఎలా ఇస్తారు అనుకున్నావు పిచ్చి తల్లి..అని అన్నాడు నారాయణ రావు…ఆలోచనలో పడింది వినీల కూడా.ఇంతలో పక్కనుంచి ఒక వ్యక్తి వచ్చి లోన్ ఏముంది నారాయణ గారు నేను సహాయం చేస్తాను మీకు…మీరు చెయ్యాలి అనుకుంటున్న దానికి నా వంతు సహాయం అనుకోండి…అన్నాడు..అతను ఎవరు అనేది అర్ధం కాలేదు ఎవరికి….గొంతు విని ఒక్కసారి అతని వైపు చూసింది విజయ.ఎదురుగా రవి నిల్చొని వున్నాడు…అతన్ని చూడగానే ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది విజయకి ..దెగ్గరకు వెళ్లి గట్టిగా హత్తుకుంది…రవి నువ్వు ఇక్కడ ఎలా అని అడిగింది…మంజు నా జీవితం అనుకున్నాను ఆంటీ తను లేని జీవితం ఎందుకు అని అనుకున్నాను కానీ అమెరికా లో ఇలాంటి వారిని ఎంతో మందిని చూసాను..మన దేశంలోనే సరైన వైద్యం లేక ఇలా అర్ధంతర చావులు అని తెలుసుకున్నాను…అమ్మకి సీరియస్ ఐతే ఇక్కడికి వచ్చాను.. ఇప్పటి దాకా మీ కధ విన్నాను…పది మందికి ఉపయోగ పడే పని చేస్తే నా మంజు నా తో నే ఉన్నట్టు అనిపిస్తుంది…తను కన్ను మూసినా మీరు కన్న కలలు ముసుకుపోకూడదు…ఎంత కావాలన్నా నేను సహాయం చేస్తాను..
నారాయణ గారు
ఒకరు కంటే కల అవుతుంది
అందరూ అనుకుంటే సంకల్పం అవుతుంది
నేను మీ సంకల్పానికి సహాయంగా ఉంటాను…
నారాయణ కళ్ళలో నీరు ఆగడం లేదు….
మంచి పని కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ అసలు అవకుండా పోదు…
దేవుడు ధర్మానికి సహనాన్ని సహాయానికి మనీషి ని ఇస్తాడంటారు..నాకు మీరు ఇప్పుడు నిజంగా దేవుడిలా కనిపిస్తున్నారు..అన్నాడు నారాయణ కళ్ళు తుడుచుకుంటు…
నన్ను మీరు అంటూ దూరంగా పెట్టద్దు నారాయణ గారు నువ్వు అనండి చాలు..మీరు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరువ చేసే సాధనాన్ని మాత్రామే నేను, ఎలా వెళ్ళాలి ,ఏమి చెయ్యాలి అని సూచించే సారధి మీరు…అంటూ…రెండు చేతుల్తో దణ్ణం పెడ్తూ నారాయణను కౌగిలించుకున్నాడు..రవి చొరవతో దేవుఉడి6 దయ తో అంత సవ్యంగా జరిగింది…కాన్సర్ ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయ్యింది….
నిజాలు నిష్ఠురంగా వున్నా
అవమానాలు అడ్డుకున్నా
ఆశలు నిరాశ పరిచినా
కలలు కంటే నిజం చేసుకోకుండా ఉండకూడదు…

ఈ ప్రపంచంలో ప్రతి వాడు బిచ్చగాడే కాకపోతే ఒకొక్కడు వాడి అవసరాన్ని బట్టి అడుక్కుంటు ఉంటాడు.కన్న వారు లేరని,కట్టుకున్న వారు దూరం అయ్యారు అని కన్న కలల్ని వదలకూడదు…ఎలా అయినా బ్రతకాలి బ్రతికి కలను సాధించాలి……..

ధర్మో రక్షతి రక్షితః……….

Leave a Reply

Your email address will not be published.