460
0

సముద్రం

460

ఉదయం ఏడు గంటలు.. చల్లటి సముద్రం పై లేలేత సూర్య కిరణాలు పడుతుంటే ఆ నీళ్లలో అవి ప్రతిబింబించి ఆ సముద్రపు ఒడ్డు మీదే కూర్చున్న కృష్ణ మొహం పై పడుతున్నాయి. చిన్నగా నవ్వుతూ ఆ సముద్రాన్ని చూస్తూ గంట నుంచి అలాగే కూర్చున్నాడు కృష్ణ..

ఒక్కసారిగా తన ఇరవై ఏళ్ళ క్రితం జ్ఞాపకాలలోకి వెళ్ళాడు . తనకి ఆరు సంవత్సరాలప్పుడు వాళ్ళ అమ్మతో చివరి సారిగా ఇదే సముద్రపు ఒడ్డు మీద మాట్లాడాడు. కృష్ణకి వాళ్ళ అమ్మ చెప్పిన చివరి మాటలు గుర్తొచ్చాయి. నేను ఉన్నా లేకున్నా నీకు ఈ సముద్రమే బెస్ట్ ఫ్రెండ్. నీకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా అన్నీ ఈ సముద్రంతోనే పంచుకో అని చెప్పింది. ఆ మాటలు చెప్పిన డేట్ జూన్ ఎనిమిది. అదే చివరిసారిగా వాళ్ళ అమ్మ మాట్లాడిన డేట్. అప్పటి నుంచి అతని నేస్తం ఈ సముద్రమే. అతని బాధలు, అతని సంతోషాలు అన్నీ ఈ సముద్రపు ఒడ్డు మీదే. అతని ఆటలు, అతని పాటలు అన్ని ఈ సముద్రం తోటే. అతని ప్రేమ పుట్టింది కుడా ఈ సముద్రపు ఒడ్డు మీదే..

…………………

ఇరవై ఏళ్ళ ముందటి గతం గుర్తొచ్చి కృష్ణ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కానీ ఆ సముద్రపు అలల సవ్వడిని చూసి తన పెదాలపై చిరునవ్వు వచ్చింది. ఆ సముద్రపు ఒడ్డు మీద ఆ చల్లటి ఇసుకలో పక్కనే ఒక శుభలేఖ పెట్టుకొని ఆ సముద్రాన్ని, శుభలేఖని చూస్తూ కూర్చున్నాడు. ఆ శుభలేఖని చూసి ఒక సంవత్సరం క్రితపు జ్ఞాపకాలలోకి వెళ్ళాడు.              

………………..

 కృష్ణకి రోజూ పొద్దున్నే ఈ సముద్రపు అలల సవ్వడి వింటూ జాగింగ్ చేయకపోతే అతని రోజు మొదలవ్వదు. ఒక సంవత్సరం క్రితం ఆ రోజు వరల్డ్ ఓషన్ డే జూన్ ఎనిమిది కృష్ణకి బాగా గుర్తుండి పోయిన డేట్ అది. ఆ రోజు కూడా పొద్దున్నే జాగింగ్ చేస్తున్నాడు. ఎందుకో ఉన్నట్టు ఉండి సముద్రం ప్రతి రోజు కంటే ఆ రోజు ఇంకా ఎక్కువ అందంగా, ఆహ్లాదంగా కనపడింది. అప్పుడు తను ఎదురొచ్చింది.

ఆ అమ్మాయి తనకి ఎదురుగుండా జాగింగ్ చేస్తూ వస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే కృష్ణ మనసు అల్లకల్లోలం అయిపోయింది. కానీ ఆ అమ్మాయి కృష్ణని దాటేసి వెళ్ళిపోతుంది. కృష్ణ ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత వెనక్కి తిరిగి కొంచెం ఫాస్ట్ గా వెళ్లి ఆ అమ్మాయి ముందు ఆగుతాడు. ఆ అమ్మాయి కొంచెం భయపడి ఆగుతుంది. కృష్ణ ఆయాసంతో ఒక శ్వాస తీసుకొని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పడం మొదలు పెడతాడు.

 ” నాకు ఆరు సంవత్సరాలు ఉన్నప్పట్నుంచి ఈ సముద్రంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా. ఇరవై సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ సముద్రం చాలా అందంగా కనిపిస్తుంది. అంతకు ముందు మా అమ్మ వల్ల. ఇప్పుడు అది మీ వల్లే అని నాకు అనిపిస్తుంది.  మీరు నా సముద్రం కంటే అందంగా కనిపిస్తున్నారు. ఇది మీ ముఖం చూసి చెప్పట్లేదు. నా మనసులో వచ్చిన భావోద్వేగాన్ని చూసుకొని చెప్తున్నా. నేను ఎప్పుడూ ఇలా ఎవరికీ చెప్పలేదు నా సముద్రం సాక్షిగా మీకే ఫస్ట్ చెప్తున్నా.. విల్ యు మ్యారి మీ.. ”  అని చెప్పి ఆ అమ్మాయి వైపు సమాధానం కోసం ఆశగా చూస్తాడు. కానీ ఆ అమ్మాయి పక్కకి తప్పుకొని వెళ్ళిపోతుంది. కృష్ణ ఆ అమ్మాయినే చూస్తూ ఉంటాడు.

తర్వాతి రోజు మళ్లీ అదే సముద్రం అదే సముద్రపు ఒడ్డు అదే జాగింగ్. కృష్ణ జాగింగ్ చేస్తున్నాడు. ఈ సారి ఆ అమ్మాయే కృష్ణకి ఎదురు వచ్చి నించుంది. కృష్ణ ఆ అమ్మాయే తన దగ్గరకి రావడం చూసి చాలా ఆనందించాడు. ఆ అమ్మాయిని  ఏమైనా చెప్పాలా అని అడిగాడు.

అమ్మాయి ఒక శ్వాస తీసుకొని కృష్ణ కళ్ళల్లోకి చూస్తూ మీరు కొంచెం లేట్.. చాలా మంది సముద్రాన్ని తిట్టుకుంటారు అప్పుడప్పుడు సునామి లాంటివి ఇస్తుందని. కొంతమంది మీ లాంటి వాళ్ళు సముద్రాన్ని ప్రేమిస్తారు ఎప్పుడూ అందంగా అలలు పంపిస్తుంది అని. కాని ఎవ్వరూ సముద్రం లోతు గురించి ఆలోచించరు. ఒక్కసారి సముద్రం లోతు చూడగలిగితే ఈ సమాజం సముద్రంలో వేసే చెత్త లాంటి కష్టాల్ని, తనలో తిరిగే జల జీవరాశుల సంతోషాలు కనిపిస్తాయి. ఆ రెండిటిని తనలోనే చాలా ఒద్దికగా మోస్తుంది నాలాగా అని చెప్పి ఇది నా శుభలేఖ కరెక్ట్ గా వారం రోజుల్లో నా పెళ్లి అంటూ తన వెంట తెచ్చిన శుభలేఖ ఇచ్చి చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతుంది. కృష్ణ హలో అని పిలవగానే ఒక్కసారి వెనక్కి తిరిగి ఎప్పుడన్నా ఆ శుభలేఖ చింపాల్సి వస్తే అప్పుడు నీ దగ్గరికే వస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. కృష్ణ తను వెళ్లిన వైపే చూస్తూ ఉంటాడు. తను కళ్లకి కనపడకుండా వెళ్లిపోయిన తర్వాత చేతిలో ఉన్న శుభలేఖే కళ్ళ ముందు మిగిలింది.  

……………………….

తన కాళ్ళకి సముద్రపు అలలు తాకడంతో ఈ లోకంలోకి వచ్చాడు కృష్ణ. పక్కనే ఉన్న శుభలేఖ వైపు చూస్తాడు. ఆ సముద్రపు అలలకి శుభలేఖ కొంచెం తడిసింది. ఆ శుభలేఖని చేతిలోకి తీసుకొని సముద్రంతో మాట్లాడతాడు. ఈ శుభలేఖ ఇచ్చి one year అవుతుంది. దీన్ని ఆ రోజే చింపేయాలి అనుకున్నా. పెళ్లి కాక ముందే శుభలేఖలు చింపకూడదు అని చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆగిపోయా.. కాని ఇన్ని రోజులు అవుతున్నా దీన్ని చింపలేకపోతున్నా ఎందుకో తెలియటం లేదు నీకేమన్నా తెలుసా సముద్రమా అని సముద్రం వైపు దీనంగా చూస్తూ ఉన్నాడు కృష్ణ.  

అప్పుడే ఆ అమ్మాయి వచ్చి అబ్బాయి పక్కన కూర్చుంటుంది. కృష్ణ తల తిప్పి చూసాడు. మనసులో చాలా ఆనందం వేసినా, ఆశ్చర్యపోయినా అవన్నీ ముఖంలో కనపడకుండా చిన్న స్మైల్ ఇచ్చాడు. ఆ అమ్మాయి కృష్ణ చేతిలోని శుభలేఖని తీసుకొని కొన్ని నెలల క్రితమే ఈ శుభలేఖని, దాని తాలుకు గుర్తుల్ని, ఆ చేదు జ్ఞాపకాలని నా జీవితం లోంచి తీసేసాను.. తీసేయాల్సి వచ్చింది అంటూ ఆ శుభలేఖని చించేస్తుంది.. కృష్ణ అలాగే చిన్న నవ్వుతో ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉంటాడు.

వాళ్లిద్దరూ మాట్లాడుకోవాలని వాళ్ల మనసులు అనుకున్నాయి. అనుకున్నదే తడవు వాళ్ళ పెదాలు నాలికతో కలిసి మాట్లాడటం మొదలు పెట్టాయి.

 జీవితం కూడా సముద్రం లాంటిదే ఎప్పుడు ఎలాంటి ఆటు పోట్లు వస్తాయో ఎవరికీ తెలిదు.. కాని ఒక సునామి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నా జీవితం కూడా అంతే ఒక పెద్ద సునామిని దాటి వచ్చాను అని చెప్పి కృష్ణ వైపు చూస్తుంది. ఎప్పుడూ సముద్రాన్ని ఇష్టంగా చూసే కృష్ణ ఇవాళ తన వైపే చూస్తుండటంతో ఏమనాలో తెలియక తను కూడా కృష్ణ వైపు చూడటం మొదలు పెట్టింది. ఆ కళ్ళల్లో తాను ఇన్నాళ్లు దూరం చేసుకున్న ప్రేమ కనపడేసరికి కళ్ళు దించేసుకుంది. తనే తేరుకొని హలో బాబు అని పిలిచింది. అప్పటికి కానీ కృష్ణ ఈ లోకంలోకి వచ్చాడు. ఇంతకీ నీ పేరు చెప్పలేదు అని అడిగింది. చిన్నగా నవ్వి కృష్ణ అని చెప్పాడు. నా పేరేంటో తెలుసా అని ఆ అమ్మాయి అడిగింది. తెలుసుకోవాలి కదా చెప్పు అన్నాడు. ఆ అమ్మాయి రుక్మిణి అని చెప్పింది. కృష్ణ ఆశ్చర్యంగా చూస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి అంత ఆశ్చర్యంగా చూడకు.. సత్యభామ, రాధ ఇలా చాలా మంది కోసం కృష్ణుడు అది చేసాడు, ఇది చేసాడు అని చెప్తారు. కానీ రుక్మిణి కృష్ణుడి కోసం చేసింది ఎవరూ చెప్పరు. అంతేలే ఈ లోకంలో ప్రేమ కోసం నాశనమైపోయిన దేవదాసుని, ప్రేమ కోసం తాజ్ మహల్ కట్టిన షాజహాన్ ని గుర్తు పెట్టుకున్నారు కానీ పురాణాల్లో భర్తల కోసం ఎన్నో చేసిన భార్యల్ని మాత్రం గుర్తు పెట్టుకోరు. అందుకే రుక్మిణిలా వచ్చా ఈ కృష్ణుడి కౌగిట్లో కరగటానికి అని చెప్పి కృష్ణ భుజంపై తల వాల్చుతుంది. ఇవాళ డేట్ ఎంత అని అడుగుతుంది. కృష్ణ  జూన్ ఎనిమిది అని చెప్తాడు. రుక్మిణి కృష్ణ కళ్ళల్లోకి చూసి ఇవాళ వరల్డ్ ఓషన్ డే అంతే కాక నీకు బాగా గుర్తుండిపోయే రోజు అని చెప్పి సముద్రం వైపు చూస్తూ ఉంటుంది. కృష్ణ అయోమయం గా రుక్మిణి కళ్ళల్లోకి చూస్తాడు. రుక్మిణి సముద్రం వైపు చూస్తూ ఇరవై ఏళ్ళ క్రితం మీ అమ్మ ఇదే రోజున సాయంత్రం పూట బజారుకి వెళ్ళింది. కానీ రక్తపు మడులలో తిరిగి వచ్చింది అని చెప్పి ఏడుస్తూ ఆగిపోతుంది. కృష్ణ చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. కృష్ణ ఇదంతా నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. రుక్మిణి ఇంకా ఏడుస్తూ కృష్ణ చేతిని ఇంకా గట్టిగా పట్టుకొని ఆ రోజు మీ అమ్మతో పాటు మా అమ్మ కూడా అదే రక్తపు మడులలో తిరిగి వచ్చింది అని చెప్పి కృష్ణని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. కృష్ణకి అప్పుడు గుర్తొస్తుంది తన నుంచి దూరమైన తన చిన్నప్పటి  స్నేహితురాలు రుక్మిణి. కృష్ణ ప్రేమగా రుక్మిణి తలని పైకి లేపి రుక్మిణి అని పిలుస్తాడు. రుక్మిణి అవును అని తల ఊపుతుంది. కృష్ణ ఇంకా గట్టిగా హత్తుకుంటాడు రుక్మిణి ని. కొన్ని క్షణాలు ఆ సముద్రపు అలల హోరు కంటే కూడా వీళ్ళ ఏడుపే ఎక్కువ హోరులా తోచింది అక్కడున్న ఆ ప్రకృతికి.                                                   

ఇరవై ఏళ్ళ క్రితం ఈ చేయి దాటి వెళ్ళిపోయావు. ఇంకో 80 ఏళ్ళు ఈ చేయిని వదలను. ఈ డేట్ లో మా అమ్మ నన్ను, మీ అమ్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఇవాళ వాళ్ళు ఎక్కడ ఉన్నా మనల్ని వదిలేసి వెళ్లిపోయిన రోజే మనల్ని కలిపారు. మన ఈ జీవితం వాళ్ల జ్ఞాపకం అని అంటాడు. వెంటనే రుక్మిణి మిగిలిన ఈ జీవితం ఇద్దరం కలిసి ఈ సముద్రంతో స్నేహం చేద్దాం అని అంటుంది. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకొని నవ్వుతూ సముద్రాన్ని చూస్తారు. వాళ్ళ ఆనందానికి తోడుగా సముద్రం కుడా తన ఆనందాన్ని వాళ్ళతో పంచుకోవాలని తన అలలతో వాళ్ళ పాదాలని తాకింది.    

Leave a Reply

Your email address will not be published.