ప్రస్తుతం మీరు చదువుతున్న కథ నమ్మకముగా నమ్మలేనటువంటి నమ్మవలసిన నిజమైన యదార్ధ సంఘటన కాకపోవచ్చు. కాని ఊహించని ఊహలతో ఉపిరిపోసుకొని కనిపించే కల్పితము కాదు. అప్పుడప్పుడే పట్టణముగా అభివృద్ధి చెందుతున్న పరిసర ప్రాంతములో జీవనం సాగిస్తున్న రాఘవేంద్రరావు లక్ష్మమ్మల దంపతులకు 1972 లో జన్మించి, సాక్షాత్తు దుర్గమ్మ తల్లిని తలపించే ప్రకాశంతో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన “ప్రభ”. కథలో నాయకిగా ఊహించని ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని ముందుకు సాగిపోతుంటే అలనాటి సత్యభామ చేసిన యుద్దాన్ని చూడలేకపోయామనే బాధను మన మది నుంచి దూరం చేస్తుంది. బాల్యంలో పిల్లలు చేసే సందడి అంత ఇంత కాదు. సరదాగా ఆటపాటలతో బాధలు, కష్టాలు అన్న పదాలకు అర్ధం తెలుసుకోవలసిన అవసరం కూడా లేదనిపించే అమృతమైన సమయం అది. అదే విధంగా తన జీవితం కూడా అందరి పిల్లల మాదిరిగా సాగుతుందనే భ్రమలో ఉండేది ప్రభ. కాని దేవుడు మలచిన ఆట గురించి తెలుసుకోవటానికి ఎక్కువ సమయమేమి పట్టలేదు తనకు. కాలంతో అనుగుణంగా, కాలాను గుణంగా తన ఆశలను, కోరికలను రుచులను, అభిరుచులను విడిచిపెడుతూ, వదిలిపెడుతూ ముందుకు సాగిపోతుంది ప్రభ. తన 12వ ఏట నుండే ఉదయం లేవగానే ఇల్లు, వాకిలి చక్కగా ఊడ్చి, కల్లాపు చల్లి, ముగ్గు పెట్టేది. ఇంట్లో ఉన్న ఎంగిలి పాత్రలు, ముందు రోజు రాత్రి భోజనం చేసిన పాత్రలు, వంట చేసిన పాత్రలు వంటివి అన్ని శుభ్రం చేసి, ఆ తర్వాత పళ్ళు తోముకొని, స్నానం చేసి రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు లేదా నీళ్లు పోసుకొని తిని అమ్మతో జడ వేయించుకొని పాఠశాలకు వెళ్ళేది. సాయంత్రం ఇంటికి వచ్చాక మరలా ఇల్లు, వాకిలి శుభ్రం చేసి, పాత్రలు కడిగి, స్నానం చేసి, చదువుకునేది. ఉదయం పాఠశాలకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే ప్రతి విద్యార్థి సెలవు రోజులు కోసం పండుగలు ఎప్పుడెప్పుడు వస్తాయా.! అని ఎదురు చేస్తుంటారు. కానీ ప్రభ మాత్రం పాఠశాలలో ఎక్కువ సమయం గడపటానికి ఆసక్తి చూపేది. చదువు పట్ల తనకు ఉన్న ఆసక్తి, తన క్రమశిక్షణ, తన స్ఫూర్తి చూసిన ఉపాధ్యాయులు తనను మెచ్చుకొనేవారు. అందుకే తాను ఎక్కువ సమయం పాఠశాలలో గడపటం కోసం ఇష్టపడుతుందని భావించేవారు. నిజానికి అది నిజమే అయిన దానితో పాటు మరియొక కారణం కూడా ఉందని ప్రభకు మాత్రమే తెలుసు. అది చూడటానికి చాలా చిన్న విషయమే అయిన దాని భరించిన బాధ మాత్రం అనుభవించిన ప్రభకే తెలుసు. ఇంతకు అది ఏమని అంటే తన తల్లిదండ్రులైన రాఘవేంద్రరావు, లక్ష్మమ్మల మధ్య వచ్చే అతి చిన్న అపార్దాలు, తగువులుగా మారి ఆపై అశాంతితో నిండిన వాతావరణాన్ని సృష్టించటము వలన ఏర్పడే బాధ. కాని ఆ బాధ అంత చిన్న వయసులో ప్రభ మససుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. తన మనసులోని బాధను ఇతరులకు వివరిస్తే కాస్త ఊరట కలుగుతుందన్న వయసు లేదు సరి కదా..! దానితో పాటు అర్ధం చేసుకునే స్నేహితురాళ్ళు తనకు లేకపోవటం బాధాకరం. తన తల్లిదండ్రుల అరుపులు – ఇంట, బయట, వీధిలో వారు, చుట్టుపక్కల వారు వింటే ఏమనుకుంటారో అని సిగ్గుతో ఆ పసి ప్రాణం ఎంత విలవిలలాడేదో మాటలతో వివరించలేము. భవిష్యత్తులోనైనా ఇటువంటివి జరగటం తగ్గితే బాగుండని ప్రతి రోజు తాను దేవునిని అడిగేది. సమాధానం కోసం ఎదురు చూస్తూండేది. అమావాస్య నుండి రోజులు ముందుకు జరిగే కొద్దీ పౌర్ణమికి దగ్గర అవుతున్నట్లుగా దీర్ఘకాలిక సెలవులు అనగా దసరా, సంక్రాంతి, వేసవి సెలవులకు తన తల్లితండ్రులు ప్రభను తన అమ్మమ్మ గారి ఇంటికి పంపేవారు. తన జీవితంలో సంతోషం అనే పదానికి సరైన అర్ధం చూపాలి అంటే అది ప్రభ తన అమ్మమ్మ గారి ఊరిలో గడిపిన రోజులే. ప్రభ వాళ్ళ అమ్మమ్మది, మేనత్తది, నానమ్మది ఒకే ఊరు కావటంతో, ముగ్గురికి ప్రభపై అమితమైన ప్రేమ ఉండటంతో వారు ముగ్గురు పోటీపడి మరీ ప్రభను చూసుకొనేవారు. నానమ్మ సినిమాలకు తీసుకువెళితే, అమ్మమ్మ రుచికరమైన వంటలు రుచి చూపిస్తుంటే, మేనత్త ఊరంతా తిప్పి చూపిస్తూ ప్రభకు నచ్చిన భోజనం ఏర్పాటు చేసేది. సంతోషాల జీవితకాలం తక్కువ అన్నట్లుగా సెలవులు పూర్తి కాగానే ప్రభ మరలా తన బాధా లోకంలోకి వచ్చేది. అలా రోజులు గడుస్తున్నాయి. చిన్నతనంలో మన శరీరానికి అయిన గాయాలకంటే మనసుకి అయిన గాయాలే పెద్దయ్యాక కూడా మనకు గుర్తుంటాయి. ప్రభ విషయంలో కూడా అటువంటి సంఘటనలకు అధిక ప్రాధాన్యతే ఉంది. తన బాల్యంలో ఎప్పటికి మరిచిపోలేనంతగా తనకు గుర్తుండే రెండు విషయాలు తన మనసుపై చెరగని ముద్ర వేసాయి. అందులో మొదటిది ఒకసారి తన తల్లిదండ్రులు బయటికి వెళ్ళినపుడు ఆ ఊరిలోని భోజనశాల వారు సాంబారులో మునగ కాడల నిమిత్తం ప్రభ వాళ్ళ ఇంటికి వచ్చారు. ప్రభ వాళ్ళ ఇంట్లో రెండు మునగ కాడల చెట్లు ఉన్నాయి. తల్లితండ్రులు లేకపోయినప్పటికి వారు ఏ విధంగా అయితే ములగ కాడలు విక్రయిస్తారో అదే విధముగా తాను కూడా అదే ధరకు అదే విధముగా విక్రయించింది. వచ్చిన డబ్బులలో ఒక్క రూపాయి కూడా తాను దాచుకోవటం కాని, దొంగతనం కాని చేయని ప్రభ గొప్పతనం గుర్తించని విధి తరువాతి పరిస్థితిని మరో విధంగా మార్చింది. ఇంటికి వచ్చిన తన తల్లితండ్రులకు ప్రభ ఎదురు వెళ్ళింది. తన తల్లికి ప్రభ మునగ కాడలు అమ్మిన విషయం చెప్పి తన దగ్గరి డబ్బులను తల్లికి ఇచ్చింది. తన కూతురు చేసిన మంచి పనికి లక్ష్మమ్మ మెచ్చుకోకపోయిన పరవాలేదు. కాని లక్ష్మమ్మ ఊహించని స్థాయిలో ప్రభను తిట్టింది. ఇంట్లో పెద్ద వాళ్ళు లేనపుడు ఎందుకమ్మావు? నీవు చిన్న పిల్లవి పెద్ద కాయలను సరైన ధరకు అమ్మి ఉండకపోవచ్చు అంటూ తిట్టింది. చేసిన మంచి పనికి సత్ఫలితం రాకపోయినా ఈ విధముగా అవమానం ఎదురవటం. ఆ సమయములో ప్రభ మనసులో కలిగిన వేదన ఇప్పటికి మనోవేదనగానే ఉంది. ఇక రెండవది ఒకసారి ప్రభ వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చినపుడు లక్ష్మమ్మ వంట చేసుకోవటానికి మరియు తాగటానికి నీరు తీసుకు రమ్మని ప్రభకు బిందె ఇచ్చి పంపింది. ప్రభ బయటికి వెళ్లి బిందెతో నీళ్లు తీసుకొని వచ్చి తన తల్లికి ఇచ్చే సమయంలో చుట్టాలు ఉన్నారన్న భయముతోనో, సిగ్గుతోనో చేతులు వణికి, బిందె జారి, కిందపడి, నీళ్లు పోయాయి. ఇల్లు, బడి, మేనత్త, నానమ్మ, అమ్మమ్మ వారి ఇంటిలోని వారు తప్ప మరో ప్రపంచం తెలియని ప్రభకు చుట్టాలు అయినప్పటికీ కొత్త వాళ్ళను చూసినపుడు భయము, సిగ్గు అనిపించటంలో తప్పేమి లేదు. అయితే చుట్టాలు ఉన్నారన్న ఇంగితం కూడా లేని లక్ష్మమ్మ వారి ముందే కూతురని కూడా చూడకుండా ప్రభను తిట్టింది. ఆ క్షణం ప్రభ మనసులో కలిగిన భయం, సిగ్గు సుమారు ఇప్పటికి 35 ఏళ్ళు గడిచిన అలాగే ఉండిపోయింది. ఆ రోజు ఆ క్షణం జరిగిన ఆ ఘటన ఇప్పటికి లక్ష్మమ్మకు గుర్తుండక పోవచ్చు. కాని పడిన ప్రభకు మాత్రం తన కనుల ముందు ఇంకా మెదులుతూనే ఉంది. “బాల్యం అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం. కాని చాలామందికి బాల్యం కష్టాలతో ముగిస్తే యవ్వన దశలోకి అడుగు పెట్టిన తర్వాత ఎదుగుదల మొదలై మధ్య వయసులో అభివృద్ధి చెందుతూ విశ్రాంతి తీసుకునే సమయానికి విజయ పతాకంగా నిలుస్తుంది. మరి ప్రభ జీవితం కూడా అదే రీతిలో సాగుతుందా.! ఏమో? చూడాలి”. ప్రభ తన పదవ తరగతిని మంచి ఉత్తీర్ణతతో పూర్తి చేసింది. ఆ తరువాత చదువుల వైపు పడవలసిన తన అడుగులకు సామజిక అసమానతలు అడ్డుగా నిలిచాయి. అప్పటికే యవ్వన దశలోనికి అడుగు పెట్టిన ప్రభకు వివాహం చేయాలని తన తండ్రి రాఘవేంద్రరావు నిర్ణయించారు. తండ్రి ఆలోచనలను గౌరవించిన ప్రభ తన ఆశలను కన్నీళ్లతో తుడిచి వేసింది. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం పైగా ఎటువంటి చెడు అలవాట్లు లేని వ్యక్తిని వరుడిగా ఎంచి అతనికి తన కూతురైన ప్రభను ఇచ్చి రాఘవేంద్రరావు వివాహాన్ని ఘనంగా జరిపించారు. ప్రభుత్వ ఉద్యోగం పైగా కాబోయే అల్లుడికి ఏ చెడు అలవాట్లు లేవు. కాబట్టి కూతురు తన అత్తింట్లో సుఖపడుతుందని అంచనా వేసాడు రాఘవేంద్రరావు. వివాహా సమయంలో ఎన్నో అలజడులు ఎదురైననప్పటికి గొప్ప తెలివి తేటలు ఉన్న రాఘవేంద్రరావు పరిస్థితిని చక్క పెట్టాడు. కాని ఎంత తెలివైన యోధుడైనా ఏదో ఒక పొరపాటు చేస్తాడు. ఆ నిజం రాఘవేంద్రరావుకు కూడా ఎదురయింది. వాహనం నడిపే వ్యక్తి పొరపాటు చేస్తే దాని ప్రతిఫలం తాను మాత్రమే కాదు. ఆ వాహనంలో ప్రయాణం చేసే వారు కూడా అనుభవించవలసి ఉంటుంది. మనిషి దగ్గరున్నపుడు కంటే దూరం వెళ్లినపుడే వారి విలువ తెలుస్తుంది. ఇంట్లో కూతురు ఉన్నప్పుడు తన విలువ తెలియలేదు. తను తన అత్తగారి ఇంటికి వెళ్లిన తరువాత తాను లేని లోటు రాఘవేంద్రరావు, లక్ష్మమ్మలకు తెలిసింది. ఆపై తమ ప్రేమంతా తన చిన్న కూతురి పైకి మలచుకున్నారు. వారిద్దరు తన పెద్ద కూతురు ప్రభ చాల సంతోషముగా తన అత్తగారి ఇంటి వద్ద ఉన్నదని భావిస్తున్నారు. కాని ప్రభ జీవితం ఇక్కడే ఊహించని మలుపు తిరిగింది. తన భర్తకు ఏ చెడ్డ అలవాటు లేదు. మంచి ఉద్యగం, తిండికి, బట్టకు సంతృప్తి కరమైన విధముగా తన భర్త తనను చూసుకుంటున్నాడు. కాని తన భర్త అతని అమ్మ, అక్క, అన్నావదినలపై, వాళ్ళ పిల్లలపై ఉన్న అమితమైన ప్రేమలో సగం కూడా తన వారిపై లేదని తెలుసుకునే సమయం ప్రభకు రానే వచ్చింది. అది ప్రభకు మూడవ నెల. పుట్టింటికి వెళ్ళవలసిన సమయం. తన భర్త నాగేశ్వర్ యొక్క అక్క “నాగమ్మ” ఆ పేరులో శక్తి వుంది. కాని ఈ నాగమ్మ కడుపులో కుట్ర, కుతంత్రం, మోసం, దగా ఉన్నాయి. తన తమ్ముడైన నాగేశ్వర్ కి తన కూతుర్ని ఇస్తే బాగుండేది. బయటి దాన్ని కోడలిగా ఈ ఇంటికి తెచ్చుకున్నారని తన తల్లికి నూరిపోసి లేని పోనీ అబాండాలు ప్రభపై వేసేది. కాని ప్రభకు మాత్రం ఇవేవి తెలియవు. నాగమ్మ తనకు వరసకు వదిన అయిన స్వంత అక్కలా, తన భర్త తల్లి అయిన తిరపతి వరసకు తనకు అత్త అయిన సొంత అమ్మలా చూసుకునేది ప్రభ. కూతురిని ఇంటికి తీసుకు వెళ్ళటానికి వియ్యంకుడి ఇంటికి వచ్చిన రాఘవేంద్రరావు, లక్ష్మమ్మలను చూసి రెచ్చిపోయిన నాగమ్మ గొడవలు రేపి ప్రభను తన భర్త నాగేశ్వర్ తో కొట్టించింది. తిరుపతి మరియు తన భర్త శేషం ఆద్వ్యర్యంలోనే ఇదంతా జరిగింది. తమ కళ్ళ ముందే కన్న కూతురిని అల్లుడు కొట్టినప్పుడు తన అంచనా తప్పని రాఘవేంద్రరావుకు అర్ధమయ్యింది. ఆ నాడు రాఘవేంద్ర రావు వేసుకున్న అంచనాలన్ని తారుమారు అయ్యి ఆ దుష్పరిణామాలు ప్రభపై, తన తల్లి లక్ష్మమ్మపై తీవ్ర ప్రభావం చూపి వారిని భయాందోళనలకు గురి చేసాయి. కాని అది ఆరంభం మాత్రమే అప్పటికే అది సరిదిద్దుకోలేని తప్పని రాఘవేంద్రరావుకి తెలిసింది. అలాగే ఆ ప్రభావం వారిలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. వాటికి సమాధానం చెప్పే శక్తి, బంధు బలగం ఉన్న కూతురి కాపురం ఏమవుతుందో అన్న బాధతో అణిగి మణిగి ఉండవలసిన పరిస్థితిలో రాఘవేంద్రరావు, లక్ష్మమ్మ ఉన్నారు. కాని అదే అదునుగా, అవకాశంగా మార్చుకున్న నాగమ్మ తన తల్లి అయిన తిరుపతితో కలసి ఎన్నో ముప్పులను, ప్రమాదాలను, చివరకు ప్రభ ప్రాణాలు కూడ తీసే దుస్థితికి వచ్చి ఓ మారణకాండను సృష్టించింది. ఆ మరణకాండ సెగ ప్రభ మొదటి బిడ్డ తన కడుపున పడిన మూడవ నెల నుండి ప్రారంభమై ప్రభకు 3వ బిడ్డ పుట్టి ఆ బిడ్డకు సంవత్సరం వయసు వచ్చే వరకు రగులుతూనే ఉంది. ఆ తర్వాత ప్రభ అత్త అయిన తిరుపతి కాలం చెందటంతో నాగమ్మకు పట్టు తగ్గింది. నీరసపడిన నక్క వీరత్వాన్ని పక్కన పెట్టి బొక్కల్లో, బొరియలలో తల దాచుకునట్టు నాగమ్మ చివరికి తను ఎంతగానో అవమానించిన ప్రభ పంచకే చేరింది. ముసలిదయినా నక్క తన స్వభావం మారదన్నట్లుగా అమ్మ లేకపోయిన తమ్ముడు తన మాట వింటున్నాడు అన్న ధైర్యంతో అప్పుడప్పుడు నాగమ్మ తన బుద్ధి చూపిస్తూనే ఉంది. అయిన కూడా ప్రభ – నాగమ్మ పట్ల ప్రేమను ఏ మాత్రం విడువలేదు. అదే విధముగా నాగమ్మ కూడా ప్రభ పై ఆగ్రహాన్ని, తన దురాశను విడువ లేదు. సంవత్సరాలు గడిచాయి. నాగమ్మ పిల్లలు, తన తమ్ముడు నాగేశ్వర్ పిల్లలు పెద్దవారు అయ్యారు. తన తమ్ముడి కూతుర్లని తన కొడుకులకు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తే మరల తమ్ముడు ఆస్తి కాజేయ వచ్చునని నాగమ్మ వ్యూహ, ప్రతి వ్యూహాలు చేసింది. కాని తమ్ముడి పిల్లలకు తన పిల్లలకు వయసు చాలా దూరం ఉంది. అయిన అదంతా నాగమ్మకు అనవసరం. అంతలా డబ్బు పొరలు తన కళ్ళను కమ్మేసాయి. అప్పటిదాకా ప్రభ జీవితంలోని కష్టాలను, తాను కలిగి ఉన్న ఓర్పును పొరపాటున చూసాడో ఏమో దేవుడు. ఆ ఒక్క విషయంలో ప్రభకు అన్యాయం జరగకుండా చూసాడు. ఆ కోపం నాగమ్మ తన కడుపులోనే దాచిపెట్టుకొని, దానిని పెంచుకుంటూ చేసేది లేక తన కొడుకులకు బయటి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసింది. ఉన్నట్లుండి పంట కోత కాలానికి వచ్చే సమయానికి అకాల వర్షం వచ్చి నాశనం చేసినట్లుగా ప్రభకు కొంచెం మనఃశాంతి దొరికిందని ఆశించేలోపే ప్రభకు కాస్త సుస్తి చేసింది. అది కొంచెం కొంచెంగా బలపడి తీవ్ర అనారోగ్యంగా మారింది. నాగమ్మ మరల తన నక్క వినయాలు చూపటానికి అది అవకాశంగా మారింది. తన కొడుకుల విషయంలో అక్క ప్రవర్తనపై కాస్త బాధపడిన తమ్మునికి మరల కల్లబుల్లి మాటలు చెప్పి దగ్గరయ్యింది. ప్రభకు సాయం చేస్తున్నట్లుగా నటిస్తూ తమ్ముడి దగ్గర దొరికిన మట్టుకి డబ్బులు దోచుకుంది. అంతేకాక తన కొడుకులకి కూడా ఆ విద్య నేర్పింది. ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.! అన్న సామెతకు నాగమ్మ, తన కుమారులు సరైన అర్ధం చూపారు. నాగమ్మ తన తల్లి తిరుపతి బ్రతికి ఉన్నంత కాలం తల్లి దగ్గర, తమ్ముడి దగ్గర డబ్బులు దోచుకుంది. అప్పుడు నాగేశ్వర్ అక్కే కదా.! అన్నట్లుగా పట్టించుకునే వాడు కాదు. తల్లి చనిపోయాక నాగమ్మ తన తండ్రి దగ్గర నుండి, మరల తమ్ముడి దగ్గర నుండి దొరికినంత సొమ్ము దోచుకునేది. అయిన కూడా నాగేశ్వర్ పట్టించుకునే వాడు కాదు. నాగేశ్వర్ తండ్రి శేషం కాలం చేసాడు. అనగా ప్రభకు ఆయన మామయ్య కదా.! అత్త తిరుపతి. ప్రభ కోడలిగా వారి ఇంటికి వచ్చాక తిరుపతి 22 ఏళ్ళు, మామయ్య శేషం 45 ఏళ్ళు బ్రతికారు. వారిద్దరే తన కూతురు నాగమ్మతో కలిసి ప్రభను ఎన్నో ఇబ్బందులు పెట్టిన ప్రభ మాత్రం వారిని కన్న తల్లిదండ్రుల్లా చూసుకునేది. వాళ్ళు నోటికి వచ్చిన బూతులు తిడుతుంటే చదువుకున్న కూడ ప్రభ ఆ అవమానాలను భరించింది. శేషం మరణించిన తర్వాత నాగమ్మకు పుట్టింటి సొమ్ము దోచుకోవడానికి ఎక్కువ అవకాశాలు రావటం లేదు. అందుకే తన తండ్రి ఆస్తిలో భాగం కావాలని తమ్ముణ్ణి అడిగింది. ప్రస్తుతం నాగేశ్వర్ అనుభవిస్తున్న ఆస్తి తన కష్టార్జీతం. నాగేశ్వర్ తల్లి దండ్రులు బ్రతికి ఉండగానే తమ ఆస్తిలో ఇద్దరు కొడుకులకు చిల్లి గవ్వ కూడ ఇయ్యకుండా మొత్తం కూతురి పేరునే రాసేశారు. అయిన నాగేశ్వర్ అడగక పోగా తను సంపాదించుకున్న ఆస్తిలో సగభాగం అక్కకు, అన్నయ్యకు సమానంగా పంచాడు. కానీ నాగమ్మకు అది కూడా చాల లేదు. అత్యాశతో తమ్ముణ్ణి ఇంకా కావాలని అడిగింది. అయిన కూడా నాగేశ్వర్ ఇస్తానని ఒప్పుకున్నాడు. అన్న మాట ప్రకారం మరికొంత ఆస్తిని నాగమ్మకు, తన అన్నయ్యకు మరలా సమానంగా పంచాడు. చివరిగా నాగమ్మ – ప్రభ పైన కోపాన్ని, తన పిల్లల పెళ్లిళ్ల విషయంలో తన కడుపులో దాచుకున్న ఆగ్రహాన్ని విషంగా మార్చి ప్రభపై చిమ్మింది. ప్రభ లేకుంటే తన స్థానంలో తన కూతురు ఉండేదని నాగేశ్వర్ మిగిలిన ఆస్తి కూడా తనకే వచ్చేదని భావించింది. పాపం పండే సమయం వస్తే చేసిన పాపాలకు మూల్యం చెల్లించే విషయంలో వజ్రాల వ్యాపారి అయిన వంకాయల వ్యాపారి అయిన తప్పించుకోలేరు. ఇది సృష్టి ధర్మం. ఇన్నాళ్లు ప్రాణానికి ప్రాణంగా భావించిన స్వంత అక్కే తన కుటుంబ దీపాన్ని ఆర్పుతుందని తెలుసుకున్న నాగేశ్వర్ ఇన్నాళ్లు తన భార్య – తన తల్లిదండ్రుల వలన, తన అక్క వలన ఎంత బాధ పడుతున్న పట్టించుకోలేదు. కాని చివరకు తన అక్క తన భార్య ప్రాణాలే తీసే స్థాయికి వచ్చింది. ఇప్పటికీ నేను కళ్ళు తెరవకపోతే నేను మంచి భర్తను కాలేకపోయాను సరికదా.! కనీసం మనిషిని కూడా కానని నాగేశ్వర్ భావించి తన అక్క నాగమ్మను తన ఇంటి ఛాయలలో కూడ కనపడకూడదని ఆదేశించాడు. అప్పటి వరకు తమ్ముడు తన గుప్పెట్లో ఉన్నాడని భావించిన నాగమ్మ ఊహల సామ్రాజ్యం మొత్తం పునాదులతో సహా నామ రూపాలు లేకుండా కూలిపోయింది. దాంతో నాగమ్మ మరింత ప్రమాదకరంగా తయారయ్యింది. కొడుకులు కూడా అక్కరకు వచ్చి తనకు బలమయ్యారన్న అహంకారంతో విర్ర వీగింది. అయిన నాగేశ్వర్ జంక లేదు. తన మామయ్య అనగా ప్రభ తండ్రి. అల్లుడు ఆలస్యంగా అయినా నిజం తెలుసుకున్నందుకు సంతోషించాడు. అల్లుడి పిలుపు మేరకు ఇంద్రుని చేతిలో వజ్రాయుధంలాగా నాగేశ్వర్ కి అండగా నిలిచాడు. ఇక నాగమ్మ ఆటలు సాగలేదు సరికదా.! తాను అక్రమంగా సంపాదించిన ఆస్తులు మొత్తం కొడుకులు తమ విలాసాలకు తగలేశారు. ముగింపు పలకటానికి ఇది జరిగిన కథ కాదు. ఇంకా కొనసాకుతున్న కథ సరైన కథలో ఇది ఒక అభ్యాసం మాత్రమే ఈ కథలో ప్రభ కలిగి ఉన్న బుద్ధి కుశలత, చూపిన ప్రేమ, కలిగి ఉన్న స్ఫూర్తి, పెంచుకున్న నమ్మకం, మలచిన ధైర్యం అన్నింటికీ కారణం ప్రభ పట్టిన ఓర్పు. కంటి ముందు భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తున్న జడియక ముందుకు అడుగు వేసిన ప్రభ అలనాటి సత్యభామను తలపించింది. అనటంలో అతిశయోక్తి ఏమి లేదు. తాను సాధించిన గెలుపు యొక్క విలువే తన ఓర్పు ఇచ్చిన తీర్పు. కానీ ప్రభ జీవితంలో గడ్డు కాలం ఇంకా నడుస్తూనే ఉంది. అది మరియొక నూతన అభ్యాసం ఇక అది తరువాతి అవకాశం వచ్చినట్లయితే అందులో వివరించపడుతుంది.
కథలో నీతి : “యుద్ధం గెలవటానికి ఆయుధం ఎంత అవసరమో.! జీవితంలో ఎదగటానికి ఓర్పు కూడా అంతే అవసరం.”